JEE Main 2025
JEE Main 2025 : జేఈఈ మెయిన్ నుంచి కీలక అప్‌డేట్.. దరఖాస్తుల ప్రక్రియ వివరాలు.
2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి జేఈఈ మెయిన్ పరీక్ష షెడ్యూల్‌ను నవంబర్‌లో ప్రకటించే అవకాశం ఉంది. మరో పది రోజుల్లో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడించనున్నారు.
జాతీయ విద్యాసంస్థల్లో బీటెక్ సీట్లను భర్తీ చేయడానికి ఏటా రెండు విడతలుగా ఆన్‌లైన్ విధానంలో జేఈఈ పరీక్షలు నిర్వహిస్తున్నారు.
తొలి విడత జనవరిలో..
తొలి విడత పరీక్షలు జనవరిలో మొదలవుతాయి. గత రెండేళ్లుగా జనవరి 24వ తేదీ నుంచి తొలి విడత పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఈసారి కూడా జనవరి 24 నుంచే పరీక్షలు మొదలుకావొచ్చని తెలుస్తోంది. సీబీఎస్‌ఈ పరీక్షలు కూడా గత రెండేళ్ల నుంచి ఫిబ్రవరి 15న ప్రారంభమవుతున్నాయి. అందువల్ల ఆ పరీక్షలకు కూడా సన్నద్ధం అయ్యేందుకు వీలుగా.. జేఈఈ మెయిన్ మొదటి విడత తేదీలను ఖరారు చేయనున్నట్టు సమాచారం.
రెండో విడత..
రెండో విడత పరీక్షలు ఏప్రిల్ మొదటి వారంలో ప్రారంభించనున్నారు. జేఈఈ మెయిన్‌కు దేశవ్యాప్తంగా దాదాపు 12 లక్షల మందికి పైగా విద్యార్థులు దరఖాస్తు చేస్తారని ఎన్‌టీఏ అంచనా వేస్తోంది. అధికారికంగా ఎన్‌టీఏ వివరాలు వెల్లడించలేదు కానీ.. క్యాలెండర్ ప్రకారం షెడ్యూల్ ప్రకటిస్తామని గతంలో ఎన్‌టీఏ స్పష్టం చేసింది. దీంతో సెషన్ 1 ప్రక్రియ నవంబర్ ప్రారంభం అవుతుందని చెబుతున్నారు.
ఎక్కువ మార్కుల కోసం..
సెషన్ 1 పరీక్షలు రాసిన విద్యార్థులు.. ఎక్కువ మార్కులు సాధించడం కోసం సెషన్ 2 పరీక్షలకు ప్రిపేర్ అవుతారు. సెషన్ 1 కోసం చేసిన ప్రాక్టీస్.. సెషన్ 2లో ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ (పీసీఎం) సబ్జెక్టులతో 12వ తరగతి ఉత్తీర్ణత లేదా తత్సమాన విద్యార్హత కలిగిన విద్యార్థులు దీనికి అప్లై చేసుకోవచ్చు.
పరీక్షలు ఇలా..
పరీక్షలు రెండు దశల్లో ఉంటాయి. జనవరి, ఏప్రిల్‌లో పరీక్షలు నిర్వహిస్తారు. పేపర్ 1లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ ప్రశ్నలు అడుగుతారు. మొత్తం 90 ప్రశ్నలకు 300 మార్కులు ఉంటాయి. పేపర్ 2లో గణితం, డ్రాయింగ్, జనరల్ ఆప్టిట్యూడ్‌పై ప్రశ్నలు ఉంటాయి. పేపర్ 1 కి 3 గంటల సమయం, పేపర్ 2కి రెండు గంటల సమయం ఇస్తారు.
0 Response to "JEE Main 2025"
Post a Comment