Alampur" Sri Jogulamba Temple - Shakti Peetha
అలంపూర్" శ్రీ జోగుళాంబ ఆలయం -శక్తి పీఠం.
శక్తికి ప్రతిరూపమైన అమ్మవారి రూపాలు అనేకం. ఆదిశక్తిగా, పరాశక్తిగా, జగన్మాతగా, లోకేశ్వరిగా విభిన్న రూపాల్లో పూజలందుకునే ఆ తల్లి మహాశక్తి స్వరూపిణి. శక్తికి రూపమైన ఆ తల్లి కొలువైన పరమ పవిత్ర దివ్యధామాలు అష్టాదశ శక్తి పీఠాలు.
మహామహిమాన్వితమైన ఆ శక్తిపీఠాల్లో ఒకటి మహబూబ్ నగర్ జిల్లాలోని ఆలంపూర్. జోగులాంబ ఇక్కడ కొలువైన అమ్మవారు భక్తులకు దర్శనిమస్తుంటారు.
ఈ గ్రామం పేరు హలంపుర, హతంపురంగా ఉండగా కాలక్రమంలో అలంపూర్ పేరువచ్చింది.
విష్ణుమూర్తి సుదర్శన చక్రంతో సతీదేవి శరీరాన్ని పద్దెనిమిది ఖండాలుగా విభజించాడట. ఆ పద్దెనిమిది భాగాలు వేర్వేరు ప్రాంతాల్లో పడ్డాయని, వాటిని ఆది శంకరాచార్యులు పద్దెనిమిది పీఠాలుగా గుర్తించి ప్రాణ ప్రతిష్ఠ చేశాడని చెబుతారు. ఇందులో దంత పంక్తి భాగం అలంపూర్‌లో పడ్డట్లు, దాంతో ఇక్కడ జోగులమ్మ వారు వెలసినట్లు పురాణాల ద్వారా తెలుస్తున్నది.
ఉత్తర భారతంలోని కాశీ విశ్వేశ్వరుని దర్శిస్తే ఎంతటి పుణ్యఫలం దక్కుతుందో అలంపూర్‌లోని ‘బాల బ్రహ్మేశ్వరున్ని దర్శించినా అంతే మహా పుణ్యం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. . కాశీలో 64 స్నాన ఘట్టాలు (మణి కర్ణిక) ఉండగా, అలంపూర్‌లో 64 స్నాన ఘట్టాలున్నాయి. అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటైన కాశీ విశాలాక్షి అమ్మావారు అక్కడ వెలిస్తే అయిదవ శక్తి పీఠంగా జోగులాంబ అమ్మవారు వెలిశారు.
కాశీక్షేత్రంలో ఉత్తర వాహిని గంగానది, అలాగే అలంపురంలో ఉత్తర వాహిని తుంగభద్ర. కాశీకి అటు, ఇటు వరుణ, అసి నదులున్నాయి. అదే విధంగా అలంపురానికి వేదవతి, నాగావళీ నదులున్నాయి. కాశీ అధిదేవతలు విశాలాక్షీ, విశ్వేశ్వరుడు. అలంపురానికి అధిదేవతలు జోగులాంబా, బాలబ్రహ్మేశ్వరుడు. ఈ అలంపురం శక్తిక్షేత్రం శ్రీశైలానికి పశ్చిమ ద్వారమై వెలసింది.
కావున ఈ అలంపురాన్ని “దక్షిణ కాశి” అంటారు.
అలంపురం శక్తి జోగులాంబా, బాలబ్రహ్మేశ్వరాలయాలకు అటూ ఇటూ కుమార బ్రహ్మ, అర్కబ్రహ్మ, వీరబ్రహ్మ, తారకబ్రహ్మ, గరుడ బ్రహ్మ, స్వర్గబ్రహ్మ, పద్మబ్రహ్మ అనే నవబ్రహ్మ ఆకారాలు లింగ రూపంలోనే ఉంటాయి. బాలబ్రహ్మేశ్వరుని తలపై మాత్రం చిన్నచిన్న గుంటలుంటాయి.
ఈ లింగం చుట్టూ నారాయణ సాలగ్రామాలుంటాయి.
ఈ బాలబ్రహ్మేశ్వర లింగంపై ఎన్ని నీళ్లు పోసినా ఆ నీళ్లు ఎటు పోతాయో తెలియదు. ఇసుకతో రూపుదిద్దిన “రససిద్ది వినాయకుడు” అనే పేరుతో గుడిలోని ఒక వినాయకుని తాకితే గరుకుగా ఉంటాడు. గట్టిగా అరగదీస్తే ఇసుక రాలుతుంది.
పరమపావనమైన ఆలంపూర్ క్షేత్రంలో జోగులాంబ అమ్మవారు పీఠాసన రూపంలో మహా తేజోవంతమై దర్శనమిస్తారు. కేశాలు గాలిలో తేలుతున్నట్లు ఉండి, వాటిలో బల్లి, తేలు, గబ్బిలం, కపాలం వంటివి కనిపిస్తాయి.
ఎవరి ఇంట్లో అయినా జీవకళ తగ్గితే అక్కడ బల్లుల సంఖ్య పెరుగుతుందని, ఆ కళ మరింత క్షీణిస్తే అక్కడికి తేళ్లు చేరుతాయని, దీని సారాంశం. ఆ తర్వాతి దశ అక్కడికి గబ్బిలాలు చేరండం, ఆ జీవ కళ మరింత క్షీణిస్తే ఆ ఇంట్లో మరణం సంభవిస్తుందని చెప్పడానికి అమ్మవారి తలలో ఉన్న కపాలం ఓ ఉదాహరణ అని ఐతిహ్యం.
ఇంట్లో జరిగే శుభాశుభాలకు అమ్మవారు ప్రతిరూపం అని, అందుకే జోగులాంబ అమ్మవారిని గృహచండిగా పేర్కొనడం అనాదిగా వస్తోంది. వాస్తుదోష నివారణలకు కూడా అమ్మవారిని మొక్కితే త్వరితగతిన ఫలితం లభిస్తుందని భక్తుల నమ్మకం.
జోగులాంబ మహాదేవి, రౌద్ర వీక్షణ లోచన, అలంపురం స్థితమాత, సర్వార్థ ఫల సిద్ధిద అని జోగులాంబ దేవిని ప్రార్థిస్తారు. అమ్మవారు ఉగ్రరూపంతో ఉన్నప్పటికీ, ఆలయంలో గల కోనేరు ఈ ప్రాంతంలో వాతావరణాన్ని చల్లబరుస్తూ ఉంటుందని స్థానికుల విశ్వాసం.
ఇక్కడ అమ్మవారి అసలు విగ్రహం భయంకరంగా ఉంటుంది. జోగులాంబ అంటే యోగుల అమ్మ అని అర్ధం. అంటే జగన్మాత అన్నమాట. ఇది జమదగ్ని మహర్షి, రేణుకాదేవులు నివసించిన ప్రదేశం అని ఒక స్థలపురాణం చెబుతున్నది. శివుని కోసం బ్రహ్మ తపస్సు చేసిన ప్రదేశం అని ఇంకో పురాణం అంటుంది.
ఛిన్నమస్త, రేణుక, భైరవి, ఎల్లమ్మ - ఇవన్నీ ఈమె పేర్లు. శ్రీవత్సగోత్రం వారికి ఈమె కులదేవత అవుతుంది. వారిలో ఆమె రక్తమే ప్రవహిస్తున్నది. సరియైన సిద్ధుల వద్ద గ్రహించి ఈమె ఉపాసన గావిస్తే, మహత్తరమైన యోగసిద్ధిని అచిరకాలంలో కలిగించి, మానవజీవితపు పొలిమేరలు దాటిస్తుంది.
ఇక్కడ కార్తీకమాసం పూజలు, శివరాత్రి పర్వదినాన్ని కన్నుల పండుగగా నిర్వహిస్తారు. ఇక్కడ జరిగే నవ వర్ణార్చన, కన్య పూజల కోసం మహిళలు అధిక సంఖ్యలో అమ్మవారిని దర్శించుకుంటారు.
కర్నూలుకి 17 కి.మీ.దూరంలో ఉంది (మహబూబ్ నగర్ జిల్లా).. స్వస్తి.
0 Response to "Alampur" Sri Jogulamba Temple - Shakti Peetha"
Post a Comment