Egg Vs Chicken
Egg Vs Chicken కోడి ముందా? గుడ్డు ముందా?.. శాస్త్రవేత్తల సమాధానం ఏమిటంటే.
న్యూయార్క్, అక్టోబర్ 14: కోడి ముందా? గుడ్డు ముందా? స్కూల్ పిల్లల నుంచి మొదలుపెడితే ప్రఖ్యాత శాస్త్రవేత్తల వరకు యావత్తు మానవాళిని వేధించే ప్రశ్న ఇది.
ఈ ప్రశ్నకు శాస్త్రవేత్తలు ఎట్టకేలకు సమాధానం కనుగొన్నారు. కోడి కంటే గుడ్లే ముందు తయారయ్యాయని, భూమిపై జీవం ఆవిర్భవించిన సమయంలోనే గుడ్లు సైతం ఏర్పడ్డాయని చెప్పారు. అయితే, ఇవి కోడి గుడ్లు కావట. 60 కోట్ల సంవత్సరాల క్రితం మొదటిసారి గుడ్లు ఏర్పడ్డాయని, అప్పట్లో పాలిచ్చే జంతువులు మినహా అన్ని జంతువులూ గుడ్లు పెట్టేవని చెప్తున్నారు.
ఇప్పటి గుడ్లతో పోలిస్తే అప్పటి గుడ్లు చాలా భిన్నంగా ఉండేవని, చాలా చిన్నగా, మనిషి వెంట్రుకల కంటే తక్కువ మందంగా ఉండేవని భావిస్తున్నారు. ఇక కోళ్ల సంగతికి వస్తే.. దాదాపు 5 కోట్ల ఏండ్ల క్రితం గల్లస్ గల్లస్ అనే ఎర్ర అడవి జాతి పక్షుల నుంచి రూపాంతరం చెందాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు.
ఇప్పుడు ఉన్న దేశీయ కోళ్లు మాత్రం దాదాపు 10 వేల ఏండ్ల క్రితం ఉద్భవించాయని గతంలో శాస్త్రవేత్తలు ఓ పరిశోధన ద్వారా గుర్తించారు. కాబట్టి, కోడి ముందా? గుడ్డు ముందా ? అని అడిగితే గుడ్డే ముందని చెప్పవచ్చని, కానీ కోడిగుడ్డు కంటే మాత్రం కోడి ముందు అని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఎర్ర అడవి జాతి పక్షి పెట్టిన గుడ్ల నుంచి ఇప్పుడున్న కోళ్లు పుట్టాయి. ఆ తర్వాత కోళ్లు గుడ్లు పెట్టాయి. కాబట్టి ఇప్పటి గుడ్ల కంటే ముందే కోడి జన్మించినట్టు అర్థం చేసుకోవచ్చని అభిప్రాయపడుతున్నారు.
0 Response to "Egg Vs Chicken"
Post a Comment