Vaikunta Ekadashi
Vaikunta Ekadashi : రేపే వైకుంఠ ఏకాదశి.. ఈరోజు చేయాల్సిన, చేయకూడని పనుల వివరాలు.
హిందువులు ప్రతి నెలలో వచ్చే పౌర్ణమి, అమావాస్యలను విశిష్టమైనవిగా భావిస్తారు. పెద్ద పండుగలన్నీ ఇలాంటి తిథుల్లోనే వస్తుంటాయి. హిందూ క్యాలెండర్ ప్రకారం, రేపే వైకుంఠ ఏకాదశి గడియలు ప్రారంభమవుతాయి.
ఈ సంవత్సరం వైకుంఠ ఏకాదశి జనవరి 9న మధ్యాహ్నం 12:22 గంటలకు ప్రారంభమై, జనవరి 10న ఉదయం 10:19 గంటలకు ముగుస్తుంది. సూర్యోదయ సమయాన్ని బట్టి జనవరి 10న వైకుంఠ ఏకాదశి వ్రతాన్ని ఆచరించాలి. ఈ రోజున శ్రీమహావిష్ణువును పూజించడం, ఉపవాసం ఉండటం, దానధర్మాలు చేయడం అత్యంత పుణ్యంగా భావిస్తారు. వైకుంఠ ఏకాదశి నాడు చేయాల్సిన పనులు, దానధర్మాలు, చేయకూడని పనులేవో తెలుసుకోండి.
చేయాల్సిన పనులు
వైకుంఠ ఏకాదశి రోజున విష్ణు పూజ చేయాలి. భక్తులు ఉపవాసం ఉన్నా, చేయకపోయినా విష్ణువు గుడికి వెళ్లాలి. ఆలయానికి వెళ్లలేకపోతే, మీ ఇంట్లో శ్రీకృష్ణుని విగ్రహాన్ని పెట్టి దీపారాధన చేయండి.
వైకుంఠ ఏకాదశి నాడు భక్తులు రోజంతా ఉపవాసం ఉండాలి. దీనివల్ల విష్ణువు అనుగ్రహం లభిస్తుందని పండితులు చెబుతున్నారు. ఈ సమయంలో పవిత్ర గ్రంథాలు చదవాలి. ముఖ్యమైన మంత్రాలను పఠించడం మహా పవిత్రమైనదిగా భావిస్తారు. మంత్రాల జపం మనసును శుద్ధి చేస్తుంది, ఆధ్యాత్మిక పరిపూర్ణతను సాధించేందుకు కృషి చేస్తుంది.
శాస్త్రాల ప్రకారం, ఈ రోజున భగవద్గీత చదవడం అత్యంత శుభప్రదం. ఈ గ్రంథంలో పేర్కొన్న శ్లోకాలను పఠిస్తూ, దైవారాధన చేస్తే పుణ్యఫలం లభిస్తుంది.
ఈ పర్వదినాన దానధర్మాలు చేస్తే విష్ణువు కరుణిస్తాడని నమ్ముతారు. అందుకే పేద ప్రజలకు ఆహారం, దుస్తులు దానం చేయడం మంచిది.
ఏం దానం చేయాలి?
వైకుంఠ ఏకాదశి నాడు పేదలకు అన్నదానం, దుస్తులు, అవసరమైన వారికి ధనం దానం చేయడం శుభప్రదంగా భావిస్తారు. ఈ రోజున గోవులను దానం చేసే సంప్రదాయం ఉంది. దీనివల్ల సమాజంలో గౌరవం లభిస్తుందని, శ్రేయస్సు వరిస్తుందని నమ్ముతారు. తులసి మొక్కలు, దుప్పట్లు, ధాన్యాలు దానం చేసినా మంచి ఫలితాలు ఉంటాయి.
చేయకూడని పనులు
వైకుంఠ ఏకాదశి నాడు అన్నం తినకూడదు, ఉపవాస దీక్ష పాటిస్తూ దైవ స్మరణ చేయాలి. ఉపవాసం చేయని వారు ఉల్లి, వెల్లుల్లి, మాంసాహారానికి దూరంగా ఉండాలి. ఉపవాస దీక్ష ఆచరించే భక్తులు పారణ సమయానికి ముందు ఉపవాసం విరమించకూడదు. ఈ రోజు అందరితో మర్యాదగా ప్రవర్తించాలి, ప్రశాంతంగా ఉండాలి. అబద్ధం చెప్పకూడదు, కోపం తెచ్చుకోవద్దు, మనుసులో నెగిటివ్ ఆలోచనలు వదిలేయాలి.
వైకుంఠ ఏకాదశి ప్రాధాన్యత
హిందూ క్యాలెండర్ ప్రకారం.. మార్గశిర మాసంలో వచ్చే శుక్ల పక్ష ఏకాదశిని వైకుంఠ ఏకాదశి, ముక్కోటి ఏకాదశి అని పిలుస్తారు. ఈ రోజు హిందువులు విష్ణువును పూజిస్తారు. ఈ పర్వదినం మూడు కోట్ల ఏకాదశి తిథులకు సమానమని, అంత పవిత్రమైనదని పండితులు చెబుతున్నారు. ఈ పర్వదినాన వైకుంఠ ద్వారాలు తెరచుకుంటాయని, శ్రీమహావిష్ణువు గరుడ వాహనంపై 3 కోట్ల దేవతలతో కలిసి భూలోకానికి దిగివచ్చి భక్తులకు దర్శనం ఇస్తాడని పురాణాల్లో ఉంది. అందుకే వైష్ణవాలయాల్లో ముక్కోటి ఏకాదశిన వైకుంఠాన్ని తలపించేలా ఉత్తర ద్వారాలను తెరుస్తారు. భక్తులు తెల్లవారుజామున ఆ మార్గం నుంచి వెళ్లి దేవున్ని దర్శించుకుంటారు.
0 Response to "Vaikunta Ekadashi"
Post a Comment