Hydra Warning: Don't buy those lands in these areas in Hyderabad.
Hydra Warning: హైదరాబాద్‌లో ఈ ప్రాంతాల్లో ఆ భూములు కొనవద్దు, హైడ్రా హెచ్చరిక.
దేశంలో అత్యంత వేగంగా రియల్ ఎస్టేట్ విస్తరిస్తున్న నగరాల్లో హైదరాబాద్ ఒకటి. ఖాళీ స్థలాలు, ఇళ్లు, విల్లా, అపార్ట్‌మెంట్ల అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి.
ధరలు మాత్రం ఆకాశాన్ని అంటుతున్నాయి. ఈ క్రమంలో నగర శివారు ప్రాంతాల్లో తక్కువ ధరకు అందుబాటులో ఉన్నాయనే కారణంతో ప్రజలు అటువైపు ఆసక్తి చూపిస్తున్నారు. కానీ హైడ్రా ఆ భూములు కొనవద్దంటోంది. ఏయే ప్రాంతాల్లో భూములు కొనకూడదో తెలుసుకుందాం.
రియల్ ఎస్టేట్ ఇప్పుడు నగర శివార్లకు విస్తరించింది. కొత్తగా ఫామ్ ల్యాండ్స్ పేరుతో అమ్మకాలు జరుగుతున్నాయి. వీకెండ్స్‌లో వ్యవసాయం చేసుకోవచ్చంటూ ప్రజల్ని ఆకర్షిస్తున్నారు. దీనిపై హైడ్రా చేపట్టిన ప్రజావాణికి భారీగా ఫిర్యాదులు రావడంతో వీటిపై దృష్టి పెట్టింది. హైదరాబాద్ నగర శివార్లలో జరుగుతున్న ఫామ్ ల్యాండ్స్ అమ్మకాలపై ఆంక్షలు విధించింది. నగర శివార్లలో ఇలాంటి భూములు కొనే ముందు ప్రజలు ఆలోచించుకోవాలని హైడ్రా సూచిస్తోంది. ఎందుకంటే చట్ట ప్రకారం ఫామ్ ల్యాండ్స్ విక్రయాలు చేయకూడదు. తెలంగాణ మున్సిపల్ చట్టం 2019, తెలంగాణ పంచాయితీ రాజ్ చట్టం 2018 ప్రకారం ఫామ్ ల్యాండ్ క్రయ విక్రయాలపై నిషేధం ఉందని హైడ్రా కమీషనర్ రంగనాథ్ స్పష్టం చేశారు. 2 వేల చదరపు మీటర్లు లేదా 20 గుంటల స్థలం ఉంటేనే ఫామ్ ల్యాండ్ పరిధిలో వస్తుందని, వాటినే రిజిస్ట్రేషన్ చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి.
ఇక 2020 ఆగస్టు 31న తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన 131 జీవో ప్రకారం అనుమతి లేని లే అవుట్స్‌లో ఇళ్ల నిర్మాణానికి అనుమతి ఉండదు. చాలా ప్రాంతాల్లో నిబంధనలు పాటించకుండా పార్కులు, రోడ్లకు స్థలం కేటాయించడం లేదు. ఈ తరహా ప్లాట్లు కొంటే తరువాత జరిగే పరిణామాలకు ప్రభుత్వం లేదా అధికారులు బాధ్యత వహించరని హైడ్రా హెచ్చరిస్తోంది.
రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండల పరిధిలోని లక్ష్మీగూడ విలేజ్ సర్వే నెంబర్ 50లో ఫామ్ ప్లాట్ల పేరుతో లే అవుట్స్ వేసి విక్రయాలు జరుపుతున్నట్టు ఫిర్యాదులు అందాయి. అందుకే శివారు ప్రాంతాల్లో ఫామ్ ప్లాట్లు లేదా లే అవుట్ ప్లాట్లు కొనే ముందు సంబంధిత అధికారులతో వివరాలు తెలుసుకోవాలని హైడ్రా స్పష్టం చేసింది.
0 Response to "Hydra Warning: Don't buy those lands in these areas in Hyderabad."
Post a Comment