2020 ఏప్రిల్ 1 నుంచి జనగణన
కేంద్ర ప్రభుత్వ నిర్ణయం
రాష్ట్ర ప్రభుత్వ నోటిఫికేషన్
మాన్యువల్ పద్ధతికి చెల్లుచీటీ
ట్యాబ్‌ల ద్వారా వివరాల సేకరణ
పదేండ్లకోసారి నిర్వహించే జనాభా లెక్కలకు కేంద్ర ప్రభుత్వం సమాయత్తమవుతున్నది. 2021 జనాభా లెక్కల కోసం 2020 ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి సెప్టెంబర్ 30 వరకు ఇంటింటా సమగ్ర జనాభా గణన చేపట్టనున్నట్టు కేంద్ర హోంశాఖ ఆధీనంలోని రిజిస్ట్రార్ జనరల్ అండ్ సెన్సస్ కమిషనర్ వెల్లడించారు. ఒక్క అసోం మినహా దేశంలోని అన్ని రాష్ర్టాల్లో ప్రతి వ్యక్తి వివరాలను సేకరిస్తారని తెలిపారు.
ఇంటింటా జనగణనకు ముందు పశుగణన, ఇండ్ల సంఖ్యపై సర్వే ఉంటుందని అధికారులు తెలిపారు. ఈసారి మాన్యువల్ పద్ధతిలో కాకుండా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి, పకడ్బందీగా జనగణనకు ఏర్పాట్లు జరుగుతున్నాయని చెప్పారు. ఇందులో టాప్ వ్యూ పర్సన్ ఐడెంటిఫికేషన్ (టీవీపీఆర్) పద్ధతి ఒకటని అంటున్నారు. జనగణనలో పాల్గొనే వారికి ట్యాబ్‌లు ఇవ్వనున్నారు. వీటిద్వారా జనగణనపై త్వరలో ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు శిక్షణనివ్వనున్నారు. ఇంటింటా జనగణన ద్వారా నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ (ఎన్పీఆర్)ను సమగ్రంగా రూపొందిస్తారు. ఈ దఫా మొదటిసారి స్మార్ట్‌ఫోన్లు, డీటీహెచ్/కేబుల్‌టీవీ, ఇంటర్నెట్ సదుపాయం, మొబైల్ ఫోన్ నంబర్, ఇంట్లో ఎంతమందికి బ్యాంకు ఖాతాలు ఉన్నాయి.. అనే అంశాలతోపాటు సొంత ఇంటిలో ఉంటున్నారా? లేక అద్దె ఇంటిలోనా? అనే వివరాలను కూడా సేకరించనున్నారు. మొత్తంగా 34 అంశాలపై వివరాలు సేకరిస్తారు. కేంద్ర హోంశాఖ ఆదేశాలకు అనుగుణంగా తెలంగాణ గవర్నర్ ఉత్తర్వులను జారీచేశారు.
ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ సాధారణ పరిపాలనాశాఖ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అధర్‌సిన్హా నోటిఫికేషన్ విడుదలచేశారు. దేశవ్యాప్తంగా జనగణన సెప్టెంబర్‌లో పూర్తిచేసి, 2021 మార్చి ఒకటి నుంచి ఐదో తేదీ వరకు రివిజన్ చేస్తారు. అనంతరం 2021 మార్చి 1 నాటికి తుది జనాభా లెక్కలను సిద్ధంచేస్తారు. ఈ భారీ ప్రక్రియలో దేశవ్యాప్తంగా దాదాపు 31 లక్షల మంది ఎన్యూమరేటర్లు పాల్గొనే అవకాశం ఉన్నదని ఒక అధికారి చెప్పారు. 2011 జనాభా లెక్కల సేకరణ ప్రక్రియలో 27 లక్షల మంది పాల్గొన్నారు.
0 Response to " "
Post a Comment