Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

  • AP Teachers Latest InfoIMP
  • More

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

ANDHRAKESARI TANGUTURI PRAKASAM PANTULUGARU

టంగుటూరి ప్రకాశం' పంతులు
 (ఆగష్టు 23, 1872 – మే 20, 1957) సుప్రసిద్ధ స్వాతంత్ర్య సమర యోధుడు మరియు ఆంధ్ర రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రి. నిరుపేద కుటుంబంలో పుట్టి, వారాలు చేసుకుంటూ చదువుకుని, ఆంధ్ర రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి అయిన ధీరోదాత్తుడు, టంగుటూరి ప్రకాశం పంతులు. 1940, 50లలోని ఆంధ్ర రాజకీయాల్లో ప్రముఖంగా వెలుగొందిన వ్యక్తుల్లో ప్రకాశం ఒకడు. ప్రత్యేకాంధ్ర రాష్ట్ర సాధనలో నిర్ణాయక పాత్ర పోషించాడు. మద్రాసులో సైమన్ కమిషన్ వ్యతిరేక ప్రదర్శనలో తుపాకి కెదురుగా గుండెనుంచి ఆంధ్రకేసరి అని పేరు పొందినవాడు

జననం  23.08.1872
               మరణం   20.05.1957
ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి పదవీ కాలము
01.10.1953 నుండి 15.11.1954 వరకు

రండిరా,దమ్ముంటే కాల్చు అంటూ తెల్ల వాడి బల్లెట్లుకు గుండెలు ఎదురు పెట్టిన ధైర్య శాలి, తన ఆస్తి పాస్తులు యావత్తూ  స్వాతంత్ర ఉద్యమం కోసం ఖర్చు పెట్టిన త్యాగశీలి,తన పిల్లలకు రాజకీయ పదవులు ఇవ్వని నిజమైన స్వాతంత్ర యోధుడు,  అసమర్థ పాలన కు వ్యతిరేకం గా  దేశం లో మొదటి ప్రధాని నెహ్రూ నే ఎదిరించిన ధీశాలి, కుల మతాలకు అతీతంగా సేవ చేసిన ఆంధ్ర రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి, ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం గారి జయంతి శుభాాంక్షలు

బాల్యం

టంగుటూరి ప్రకాశం 1872 ఆగష్టు 23 న ఇప్పటి ప్రకాశం జిల్లా లోని వినోదరయూనిపాలెం  లో నియోగి బ్రాహ్మణులైన సుబ్బమ్మ, గోపాల కృష్ణయ్య దంపతులకు జన్మించాడు.ఆరుగురు పిల్లల్లో ప్రకాశం ఒకడు. అప్పటి గుంటూరు జిల్లాలోని టంగుటూరి లో వారి కుటుంబం వంశపారంపర్యంగా గ్రామ కరణం వృత్తిలో ఉండేది. ఆయన ముత్తాత టంగుటూరులో కరణీకం చేస్తూ ఉండేవాడు. ఆయనకు అప్పాస్వామి, నరసరాజు అనే ఇద్దరు కుమారులు. ఆయన ముత్తాత అనంతరం అప్పాస్వామిలో టంగుటూరులో కరణీకం చేసేవిధంగా, ఆయన తమ్ముడు నరసరాజు టంగుటూరికి దగ్గర్లో ఉన్న వల్లూరులో కరణీకం చేసేట్లుగా నిర్ణయించారు. ఆయనే ప్రకాశం తాతగారు. ఆయనకు నలుగురు కొడుకులు, ఇద్దరు కుమార్తెలు. వారిలో ఆఖరి వాడైన గోపాలకృష్ణయ్యకు ప్రకాశం సంతానంగా జన్మించాడు. ఆయన పదకొండోయేట తండ్రి మరణించడంతో, పిల్లలను తీసుకుని తల్లి ఒంగోలు చేరింది. ఒంగోలులో ఆమె భోజనశాల నడపవలసి వచ్చింది. ఆ రోజుల్లో ఇలాంటి వృత్తి చేసే వారిని సమాజంలో చాలా తేలికగా చూసేవారు. పూటకూళ్ళ వ్యాపారం చేసే తల్లి సంపాదన చాలక, ప్రకాశం ధనికుల ఇళ్ళల్లో వారాలకు కుదిరాడు. పిన్న వయసులోనే ప్రకాశం నాటకాలు వేసేవాడు. తెల్లగా అందంగా ఉండడంతో ఆడ, మగ రెండు వేషాలు కూడా వేసేవాడు. ఆటల్లో కూడా చాలా చురుగ్గా ఉండేవాడు. క్రికెట్ చాలా చక్కగా ఆడేవాడు. ఆ వయసులో అల్లరిగా తిరిగేవాడు.

శాలువా నాకేందుకు ఆరటి పళ్ళు ఇస్తే ఓక పూట గడిచేదిగా అన్న మాజీ ముఖ్యమంత్రి

నాలుగో క్లాస్ చదువుతున్న ఓ కుఱ్ఱాడు తన పరీక్ష ఫీజు కు మూడు రూపాయలు లేక ,వాటికోసం తన ఊరుకు 25 మైళ్ళదూరంలో ఉన్న వాళ్ళ బావగారింటికి కాలినడకన బయల్దేరాడు.తీరాచేసి బావగారింటికి వెడితే 'నాదగ్గర మాత్రం ఎక్కుడున్నాయిరా'అన్నాడా బావ గారు.చేసేదేముందనుకుంటూ కాళ్ళీడ్చుకుంటూ 25 మైళ్ళు తిరిగి నడుచుకుంటూ ఇంటికొచ్చేశాడు ఆ కుఱ్ఱాడు. ఆ పరిస్థితి కి తల్లడిల్లిపోయిన ఆతని తల్లి తన పెళ్ళినాటి పట్టుచీరను అమ్మి ఆ మూడురూపాయల ఫీజు కట్టింది.ఆ తరువాత ఎన్నో ఎన్నెన్నో ఢక్కామొక్కీలు తిని తనకిష్టమైన ప్లీడరీ పరీక్షలో నెగ్గి,అక్కడితో తృప్తి పడక ఇంగ్లండ్ పోయి బారిష్టరయ్యి మద్రాస్ మైలాపూర్ అరవ మేధావులతో పోటీపడి ఆ రోజులలోనే(1917-18 నాటికే)రోజుకు వెయ్యి రూపాయల ఫీజు తీసుకునే స్థాయిలో , కోస్తా జిల్లాలన్నిటిలో భూములు బంగళాలు కొనుగోలు చేసేటంతగా ఎదిగిన మన కాలపు మేరునగధీరుడు టంగుటూరి ప్రకాశం పంతులు.

గాంధీజీ పిలుపుతో తన ప్లీడరు వృత్తిని వదిలి జాతీయోద్యమంలోకి ఉరికాడు.తన సర్వస్వాన్ని ప్రజాసేవకే అంకితం చేశాడు. లాయర్ గా ఎంతోమందిని జైళ్ళనుంచి బైటకు తెచ్చిన ఆయన ప్రజలకోసం తాను స్వచ్చందంగా జైలుశిక్షను అనుభవించాడు.గాంధీజీ ఆశయాల ప్రచారం కోసం 'స్వరాజ్య' పత్రికను స్థాపించి గాంధీజీ నిజమైన అనుచరునిగా ఆయన మెప్పును పొందాడు.అదే గాంధీజీ కొందరి చెప్పుడు మాటలు విని ఆయనను తప్పు పట్టుకుంటే గాంధీజీని సైతం నిలదీశాడు.సైమన్ కమీషన్ కు వ్యతిరేకంగా మద్రాస్ నగరంలో హర్తాళ్ జరిగినప్పుడు తెల్లవాడి తుపాకీకి తన గుండెనే ఎదురు పెట్టాడు.ఆనాటి ఉమ్మడి మద్రాస్ రాష్ట్రానికి రెవిన్యూ మంత్రిగా,ముఖ్యమంత్రి గా పనిచేశాడు. తెలుగు వారికి ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినప్పుడు(1953)తొలి తెలుగు ముఖ్యమంత్రి అయ్యాడు.
దురాశాపరుల మూలంగానూ,శాసన సభ స్పీకర్ తెలివి తక్కువ తనం మూలంగానూ ఒకే ఒక్క ఓటు తేడాతో ప్రభుత్వం పతనమైనప్పుడు , వ్యతిరేకంగా ఓటువేసిన వారు తమ తప్పు తెలుసుకుని మళ్ళీ ఓటింగ్ కు వెడదామని బ్రతిమాలుకున్నా వినకుండా శాసనసభ నుండి తిన్నగా గవర్నర్ వద్దకు వెళ్ళి తన రాజీనామాను సమర్పించాడు.కేవలం 13 నెలల తన ప్రభుత్వ కాలంలో ఆ రోజుల్లోనే14 నీటి పారుదల ప్రాజెక్టులు స్థాపించాడు.శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం స్థాపించాడు. తెలుగు వారికి ఓ హైకోర్టు స్థాపించాడు. తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహణకు కావలసిన మార్పులకు శాసనబద్దత కల్పించాడు.సహకార రంగంలో తెలుగు రాష్ట్రాన్ని ప్రధమ స్థానంలో నిలిపాడు.బెజవాడలో కాటన్ దొర కట్టిన బరాజ్ కొట్టుకుపోయే పరిస్థితి వస్తే ఆనాటి కేంద్ర ప్రభుత్వం పైసా కూడ ఇవ్వలేమని స్పష్టం చేస్తే,రాష్ట్ర నిధులనన్నీ మళ్ళించి యుద్ధ ప్రాతిపదికన బరాజ్ ను బాగుచేయించి నిలబెట్టాడు.ఆ భారాన్ని పన్నుల రూపంలో ప్రజలమీద వెయ్యకుండా ఆ లోటును సరిదిద్దాడు.అందుకే ప్రజలందరూ ఆ బరాజ్ ను ఆయన పేరునే ప్రకాశం బారేజ్ గా పిలుచుకుంటున్నారు.రాష్ట్ర ఏర్పాటు సందర్భంగా దేశంలోనే తొలిసారిగా ఖైదీలందరినీ విడుదల చేశాడు.
అంతటి మహనీయుడు తన చరమ దశలో కటిక దారిద్ర్యాన్ననుభవించాడు.తనను శాలువతో సత్కరిస్తే 'ఈ శాలువ నాకెందుకురా!ఆ డబ్బుతో అరటిపళ్ళు కొనితెస్తే ఓ పూట గడిచేది కదురా!!' అని తన అనుచరునితో అన్నారంటే ఆయన పరిస్థితి అర్థంచేసుకోవచ్చు.ఆయన మూలంగా అధికారంలోకి వచ్చిన మహానాయకులందరూ అధికారం కోసం ఆయనకు వెన్నుపోటు పొడిచినా అధికారం కోసం ప్రాకులాడలేదు. 85 సంవత్సరాల వయస్సులో రోహిణీ కార్తె మండుటెండలో వడదెబ్బకు మరణించిన ఇద్దరు ముదుసలుల కుటుంబ పరామర్శ కోసం వెళ్ళి తాను వడదెబ్బ తిని తెలుగు పౌరుషాన్ని పైలోకాలకు తీసుకుపోయిన "ఆంధ్రకేసరి"టంగుటూరి ప్రకాశం పంతులు గారి 148 వ జన్మదినోత్సవం సందర్భంగా వారి దివ్యస్మృతికి సజలనయనాలతో సహృదయ నివాళులు.

ప్రాథమిక విద్య

వల్లూరులో ప్రకాశం ప్రాథమిక విద్య సాగింది. అల్లరి చిల్లరి సావాసాల వల్లా, నాటకాల వ్యాపకం వల్లా, ప్రకాశానికి మెట్రిక్ పాస్ అవడం కష్టమయ్యింది. మిషను పాఠశాల ఉపాధ్యాయుడైన ఇమ్మానేని హనుమంతరావు నాయుడు చలవతో ప్రకాశం ఫీజు లేకుండా ప్రీ మెట్రిక్ లో చదివాడు. నాయుడు రాజమండ్రికి నివాసం మారుస్తూ, ప్రకాశాన్ని తనతో తీసుకువెళ్ళి, అక్కడ ఎఫ్.ఏ.లో చేర్పించాడు. తరువాత మద్రాసుకు పంపించి, న్యాయశాస్త్రం చదివించాడు. ప్రకాశం 1890లో తన అక్క కూతురైన హనుమాయమ్మను పెళ్ళి చేసుకున్నాడు. ఆ తరువాత కొద్దికాలంపాటు ఒంగోలులో న్యాయవాద వృత్తి చేసి, 1894లో మళ్ళీ రాజమండ్రి చేరాడు. వృత్తిలో బాగా పేరూ, పుష్కలంగా సంపద సంపాదించాడు. తన 35వ ఏట రాజమండ్రి పురపాలక సంఘానికి అధ్యక్షుడయ్యాడు.

ఇంగ్లాండులో విద్యాభ్యాసం

అప్పట్లో ప్రకాశం సెకండ్ గ్రేడ్ ప్లీడరు. కనుక పై స్థాయి కోర్టులలో వాదించడానికి అర్హత లేదు. బారిస్టరులకు మాత్రమే ఆ అర్హత ఉండేది. ఒకమారు ప్రకాశం ప్రతిభ గమనించిన ఒక బారిస్టరు ప్రకాశాన్ని కూడా బారిస్టరు అవమని ప్రోత్సహించాడు. ఆ సలహా నచ్చి, ప్రకాశం 1904లో ఇంగ్లాండు వెళ్ళాడు. వెళ్ళే ముందు మహాత్మా గాంధీ లాగానే మద్యం, మాంసం, పొగాకు ముట్టనని తల్లికి మాట ఇచ్చి ఒప్పించాడు. దీక్షగా చదివి బారిస్టరు అయ్యాడు. అక్కడ భారతీయ సొసైటీలో చేరి దాదాభాయి నౌరోజీ బ్రిటీషు పార్లమెంటుకు ఎన్నిక కావడానికి ప్రచారంలో పాలు పంచుకొన్నాడు. ఈ సమయంలో ప్రకాశానికి జాతీయ భావాలు, సాంఘిక కార్యక్రమాలపై ఆసక్తి పెరిగాయి.

1907లో, లండనులో ప్రశంసాపత్రంతో బారిష్టరు కోర్సు పూర్తిచేసుకొని భారతదేశం తిరిగివచ్చాక, ప్రకాశం మద్రాసు హైకోర్టులో ప్రాక్టీసు ప్రారంభించాడు. అప్పట్లో మద్రాసులో ప్రసిద్ధి చెందిన బారిష్టరులందరూ ఆంగ్లేయులు లేదా తమిళులు. పేరుపొందిన తెలుగు బారిష్టరులలో ఈయనే ప్రప్రథముడు. ప్రకాశం పౌర మరియు నేర వ్యాజ్యాలనన్నింటినీ చేపట్టేవాడు. ఈయన చేపట్టిన క్రిమినల్ కేసుల్లో ఆష్ హత్యకేసు ఒక ప్రసిద్ధిచెందిన కేసు. తిరునెల్వేలిలో కలెక్టరుగా పనిచేస్తున్న ఆష్, 1907లో కాల్చిచంపబడ్డాడు. ఈ సంఘటన బెంగాల్కు చెందిన జాతీయవాద నేత బిపిన్ చంద్ర పాల్ ఆ ప్రాంతాన్ని పర్యటిస్తూ దేశభక్తిపై ఉత్తేజపూరితమైన ప్రసంగాలు చేస్తున్న సమయములో జరిగింది. ప్రకాశం ఈ హత్య కేసులో, ఒక ముద్దాయి తరఫున వాదించి ఆయనకు స్వల్పశిక్ష పడేటట్టు చేశాడు.

ప్రకాశం, లా టైమ్స్ అనే న్యాయవాద పత్రికకు కూడా సంపాదకత్వం వహించేవాడు. అదే సంవత్సరం బ్రిటిషు ప్రభుత్వం పాల్ ప్రసంగాలు రాజద్రోహాన్ని ఉసిగొల్పేవిగా, ఉద్రేకపూరితముగా ఉన్నవని భావించటం వలన, ఇతరులు ముందుకు రావటానికి భయపడే సమయంలో, ఈయన బిపిన్ చంద్ర పాల్ ఇచ్చిన ప్రసంగాలకు హాజరయ్యేవాడు. లక్నో ఒడంబడిక తర్వాత ప్రకాశం కాంగ్రెసు పార్టీ మీటింగులకు తరచుగా హాజరు కావటం ప్రారంభించి, 1921 అక్టోబరులో సత్యాగ్రహ ప్రతినపై సంతకం చేశాడు. 1921లో స్వాతంత్ర్య సమరంలో అడుగుపెట్టి వృత్తిని వదలిపెట్టేనాటికి, లక్షల్లో సంపాదించాడు. ఆ యావదాస్తినీ, దేశసేవకే ఖర్చు చేసాడు

రాజకీయ జీవితం

  • 1921లో ఆంధ్ర ప్రాంతీయ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు.
  •  1921 అక్టోబర్ 29 న స్వరాజ్య అనే దినపత్రికను ప్రారంభించాడు. 
  • కొద్ది కాలంలోనే, ఈ పత్రిక మంచి ఆదరణ చూరగొన్నది. దీని తెలుగు, తమిళ సంచికలకు ప్రజలు ఎగబడ్డారు. 1928లో మద్రాసులో సైమన్‌ కమిషను బహిష్కరణ ఉద్యమంలో పాల్గొని, తుపాకికి ఎదురు నిలిచి, కాల్చమని సవాలు చేసాడు. 
  • ఆయన ధైర్యసాహసాలకు మెచ్చి ఆంధ్ర ప్రజలు ఆయనకు ఆంధ్ర కేసరి అనే బిరుదునిచ్చి గౌరవించారు.

  • 1937లో కాంగ్రెసు అధికారంలోకి వచ్చినపుడు, రాజాజీ మంత్రివర్గంలో ఆయన రెవిన్యూమంత్రి అయ్యాడు.
  •  ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాడు. 
  • 1946లో మద్రాసు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఎన్నికై, 13 నెలలపాటు ఆ పదవిలో కొనసాగాడు. ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టాడు. 
  • స్వంతపార్టీలోని అంతర్గత రాజకీయాలకు ఆయన ప్రభుత్వం బలయ్యాక, పార్టీ నుండి బయటకు వచ్చి, స్వంతంగా ప్రజాపార్టీని స్థాపించాడు.
  • సైమన్ కమీషను, వెళ్లినచోటల్లా నల్లజెండాలతో నిరసన ప్రదర్శనలు స్వాగతం పలికాయి. 
  • 1928, మార్చి 2న కమీషన్ బొంబాయిలో అడుగుపెట్టినపుడు పోలీసులు మద్రాసు వంటి సున్నిత ప్రదేశాలలో నిరసన ప్రదర్శనలను అనుమతించలేదు. 
  • అయితే, ప్యారీస్ కార్నర్ వద్ద మద్రాసు హైకోర్టు సమీపములో మూక విపరీతముగా పెరిగిపోయింది. 
  • వాళ్లను చెల్లాచెదురు చేయటానికి పోలీసులు కాల్పులు జరిపారు.
  •  పార్థ సారథి అనే యువకుడు కాల్పులకు గురై అక్కడికక్కడే మరణించాడు.
  •  ఆ యువకుని మృతదేహాన్ని సమీపించిన వారెవరినైనా కాల్చుతామని పోలీసులు హెచ్చరించారు.
  •  దీనిపై కోపోద్రిక్తుడైన ప్రకాశం, తన చొక్కా చించి ధైర్యంగా రొమ్ము చూపింవేశాడు. 1935లో మరలా దీన్ని పునరుద్ధరించటానికి విఫలయత్నాలు సాగాయి.
  • 1937లో కాంగ్రెసు పార్టీ ప్రాంతీయ ఎన్నికలలో పోటీ చేసి ఇతర ప్రాంతాలతో పాటు మద్రాసు ప్రెసిడెన్సీలో కూడా ఆధిక్యత తెచ్చుకున్నది.
  •  ముఖ్యమంత్రి పదవికి అభ్యర్థిగా ప్రకాశం ముందున్నప్పటికీ, క్రియాశీల రాజకీయాలకు తిరిగివచ్చిన రాజాజీ ముఖ్యమంత్రి అయ్యేందుకు అనువుగా, కాంగ్రెసు అధిష్టానవర్గం కోరిక మేరకు తప్పుకున్నాడు. 
ANDHRAKESARI TANGUTURI PRAKASAM PANTULUGARU

  • రాజాజీ మంత్రివర్గములో ప్రకాశం రెవిన్యూ శాఖామంత్రిగా పనిచేశాడు. 
  • మంత్రిగా ఈయన చేసిన పనులలో ముఖ్యమైనది, బ్రిటీషు ప్రభుత్వము పాటించే జమిందారీ వ్యవస్థ వలన వ్యవసాయరంగములో జరుగుతున్న అవకతవకలను పరిశీలించటానికి ఒక విచారణా సంఘాన్ని ఏర్పాటు చేసి, దానికి అధ్యక్షత వహించటం. 
  • రెండవ ప్రపంచ యుద్ధం రావడంతో కాంగ్రెసు మంత్రివర్గాలు, యుద్ధంలో భారతదేశం పాల్గొనటం గురించి తమను సంప్రదించలేదని రాజీనామా చేశాయి. 
  • 1941లో యుద్ధ ప్రయత్నాలకు వ్యతిరేకముగా వ్యక్తిగత సత్యాగ్రహం చేసిన ప్రముఖ దక్షిణ భారతదేశ నాయకులలో ప్రకాశం ప్రథముడు.
  • 1942లో క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నందుకు ప్రకాశాన్ని అరెస్టు చేసి మూడు సంవత్సరాలు జైల్లో పెట్టారు. 
  • 1945లో జైలునుండి విడుదలైన తర్వాత, ప్రజలకు చేరువకావటానికి దక్షిణ భారతదేశమంతా పర్యటించాడు. 
  • 1946లో కాంగ్రెసు పార్టీ తిరిగి మద్రాసు ప్రెసిడెన్సీలో పోటీచేసి గెలిచింది.
  •  ఈ తరుణంలో 1946 ఏప్రిల్ 30న ప్రకాశం మద్రాసుముఖ్యమంత్రిగా ఎన్నికైనాడు.
  • ఈయనతో పాటు తమిళ నాయకుడైన కె.కామరాజ్, జాతీయ నాయకులైన గాంధీ మరియు నెహ్రూల అభ్యర్థి అయిన రాజాజీ ముఖ్యమంత్రి అవటాన్ని వ్యతిరేకించారు.
  •  అయితే, పార్టీలోని వివిధ వర్గాల విభిన్న అభిమతాలకు అనుగుణంగా పనిచేయలేక ప్రకాశం ప్రభుత్వం కేవలం 11 నెలలే మనగలిగింది.

ఆత్మకథ

ఆయన ఆత్మకథ "నా జీవిత యాత్ర"పేరిట నాలుగు భాగాల పుస్తకంగా  విడుదల అయింది. ఇందులో మూడు భాగాలను ఆయన వ్రాయగా, నాలుగో భాగం మాత్రం తెన్నేటి విశ్వనాథం వ్రాసాడు. దీనిలో స్వాతంత్ర్యోద్యమ నాయకుల మనస్తత్వాలు, అప్పటి ప్రజల స్థితిగతులు వివరించబడినవి. తెలుగు సమితి హైదరాబాదు ఆగష్టు 2006 లో ప్రచురించింది. ఈ పుస్తకం హిందీ లోకి కూడా అనువదింపబడింది.

ప్రకాశం జిల్లా ఏర్పాటు

స్వాతంత్ర్య సమరయోధునిగా ప్రకాశం యొక్క ఉత్తరదాయిత్వం నేటికీ ఆంధ్ర దేశములో వెలుగొందుతూ ఉంటుంది. టంగుటూరి ప్రకాశం పంతులు జాతికి చేసిన సేవలకు గుర్తుగా 1972 డిసెంబర్ 5న ఒంగోలు జిల్లా పేరును ప్రకాశం జిల్లాగా మార్చారు. గుంటూరు జిల్లాలో మూడు తాలూకాలు (అద్దంకి, చీరాల, ఒంగోలు), నెల్లూరు జిల్లాలో నాలుగు తాలూకాలు (కందుకూరు, కనిగిరి, పొదిలి, దర్శి), కర్నూలు జిల్లాలో రెండు తాలూకాలు (మార్కాపురం, గిద్దలూరు) కలిపి ప్రకాశం జిల్లాను ఏర్పాటు చేశారు.

జ్ఞాపకార్థాలు

ప్రకాశం ప్రభుత్వ జూనియర్ కళాశాల ‍మరియు ఉన్నత పాఠశాల (1974) - అద్దంకి, ప్రకాశం జిల్లా .
ఆంధ్ర కేసరి యువజన సమితి, సాంస్కృతిక కళా సంఘం 30-04-1962న రాజమండ్రి లో ఆంధ్ర కేసరి యువజన సమితి,పక్షాన ప్రారంభించబడింది.
ఆంధ్ర కేసరి శత జయంతుత్సవ జూనియర్ కళాశాల 23-08-1972, పంతులు గారి శత జయంతి సందర్భంగా రాజమండ్రి లో ప్రారంభించబడింది.
ఆంధ్ర కేసరి పట్టభద్ర కళాశాల 23.08.1994 లో వావిలాల గోపాలకృష్ణయ్య ద్వారా రాజమండ్రి లో ఆంధ్ర కేసరి యువజన సమితి,పక్షాన ప్రారంభించబడింది.
ప్రకాశం నగర్,కర్నూలు
ప్రకాశం నగర్ గుండ్రం పార్కు.
సత్యనారాయణపురం(విజయవాడ)లో ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు ఉన్నత పాఠశాల ఉంది. ఈ ప్రాథమిక పాఠశాలనందు 1వ తరగతి నుండి 10వతరగతి వరకు గలవు. ఈ పాఠశాల 1955-60 మధ్య కాలంలో మొదలుపెట్టబడింది.
ఆంధ్రకేసరి (సినిమా) విజయచందర్ ప్రకాశం పాత్రధారణలో నిర్మితమైంది.
ప్రకాశం పంతులుగారి గురించి వీడియో లు

VIEW THE VIDEO-1

VIEW THE VIDEO-2

ప్రకాశం పంతులుగారి స్మృతులు




SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "ANDHRAKESARI TANGUTURI PRAKASAM PANTULUGARU"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0