Chandrayan-2
Chandrayan-2
- నెలవంక అందే వేళ!
- ‘చంద్రయాన్-2’లో అత్యంత కీలక ఘట్టానికి సర్వం సిద్ధం
- నేడు అర్ధరాత్రి దాటాక జాబిల్లిపై దిగనున్న ల్యాండర్
- ఆ వెంటనే రంగంలోకి ‘ప్రజ్ఞాన్’ రోవర్
- ఉత్కంఠగా ఎదురుచూస్తున్న భారతావని
- యావత్ ప్రపంచం దృష్టి ఇటువైపే
ఈనాడు డిజిటల్, బెంగళూరు: భారత అంతరిక్ష రంగ చరిత్రలో అత్యంత కీలకమైన రోజు రానే వచ్చేసింది. ఏళ్ల తరబడి వందల మంది శాస్త్రవేత్తలు, ఇంజినీర్లు అహోరాత్రులు పడ్డ శ్రమకు ఫలితం దక్కే మధుర క్షణాలు సమీపిస్తున్నాయి. విశ్వ గ్రామంలో భూమికి చెలికాడిగా ఉన్న చందమామపై కోట్ల మంది భారతీయుల దూతగా మన వ్యోమనౌక ‘చంద్రయాన్-2’ మరికొన్ని గంటల్లో కాలుమోపబోతోంది. అందులో నుంచి ఓ బుల్లి రోవర్ బయటకు వచ్చి అటూఇటూ కలియతిరగబోతోంది. అధునాతన సాంకేతిక పరిజ్ఞానంలో అగ్రరాజ్యాలకు భారత్ కూడా సరిజోడేనని ఈ చరిత్రాత్మక ఘట్టంతో మరోసారి రుజువు కానుంది. రాత్రివేళ ఆకాశంలో ముగ్ధమనోహర చంద్రబింబాన్ని చూసే ప్రతి భారతీయుడు.. ‘అక్కడ నా దేశ పాద ముద్ర ఉంది’ అని ఇక గర్వంగా చెప్పుకోవచ్చు. చంద్రయాన్-2 ల్యాండింగ్ విజయవంతమైతే ఇతర గ్రహాలు, ఖగోళ వస్తువులపై మన వ్యోమనౌకలను దించడానికి మార్గం సుగమమవుతుంది.
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) ప్రతిష్ఠాత్మకంగా ప్రయోగించిన ‘చంద్రయాన్-2’లోని ‘విక్రమ్’ ల్యాండర్ శుక్రవారం అర్ధరాత్రి దాటాక జాబిల్లి ఉపరితలంపై అడుగుపెట్టనుంది. ఈ వ్యోమనౌక చేయబోయే ఆవిష్కరణలు, చెప్పబోయే కొత్త సంగతుల కోసం భారతదేశంతోపాటు ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఈ ఏడాది జులై 22న మధ్యాహ్నం 2.43 గంటలకు శ్రీహరికోటలోని సతీష్ ధవన్ అంతరిక్ష కేంద్రం నుంచి ‘చంద్రయాన్-2’ నింగిలోకి దూసుకెళ్లింది. నాటి నుంచి చంద్రుడివైపు అలుపెరుగకుండా ప్రయాణం కొనసాగించింది. తొలుత భూ కక్ష్యలోకి చేరి.. క్రమంగా కక్ష్యను పెంచుకొని చంద్రుడికి చేరువైంది. ఈ సుదీర్ఘ ప్రయాణంలో ఎక్కడా వ్యోమనౌక తడబడలేదు. ప్రతి విన్యాసాన్నీ అత్యంత కచ్చితత్వంతో పూర్తిచేసింది. ఇక మిగిలింది జాబిల్లి ఉపరితలంపై సురక్షితంగా దిగడమే. శుక్రవారం అర్ధరాత్రి దాటాక ఉద్విగ్నభరిత ఘట్టం ఆవిష్కృతం కానుంది
విద్యార్థులతో కలిసి వీక్షించనున్న ప్రధాని
‘చంద్రయాన్-2’ జాబిల్లిపై దిగే ఘట్టాన్ని ప్రధాని నరేంద్ర మోదీ దాదాపు 60-70 మంది విద్యార్థులతో కలిసి ప్రత్యక్షంగా వీక్షించనున్నారు. ల్యాండింగ్ ప్రక్రియను మనం isro.gov.in లో ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించొచ్చు. ప్రెస్ ఇన్‌ఫర్మేషన్ బ్యూరో ఆఫ్ ఇండియాకు చెందిన యూట్యూబ్ ఛానల్‌లో కూడా చూడొచ్చు
0 Response to "Chandrayan-2"
Post a Comment