Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

More clarity now on corona healing

కరోనా వైద్యంపై ఇప్పుడు మరింత స్పష్టత
More clarity now on corona healing


ఏ సమయంలో ఏ చికిత్స ఇస్తున్నామనేదే కీలకం1000 మందికి పైగా బాధితులను అధ్యయనం చేశాం వెంటిలేటర్‌ అవసరం లేకుండానే ‘హై ఫ్లో ఆక్సిజన్‌’ ద్వారా ప్రాణాలు కాపాడవచ్చు
ఏఐజీఈ ఛైర్మన్‌ డాక్టర్‌ నాగేశ్వరరెడ్డి

వైరస్‌ దాడి తీరు, శరీరంలో దుష్ప్రభావాలు తెలిశాయి కాబట్టి దానికి ఏ సమయంలో ఎటువంటి చికిత్స అందించాలనే విషయంలోనూ స్పష్టత ఏర్పడింది. సరైన సమయంలో చికిత్స అందించడం వల్ల మరణాల సంఖ్య కూడా తగ్గిపోతుంది

కరోనా కేసుల సంఖ్య పెరగడం,కొందరు మృతి చెందడం వంటివి చూసి ప్రజలు భయాందోళనలకు గురికావద్దని ఏషియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ గ్యాస్ట్రో ఎంటరాలజీ(ఏఐజీఈ) ఛైర్మన్‌ డాక్టర్‌ డి.నాగేశ్వరరెడ్డి సూచించారు. గత నాలుగు నెలలతో పోల్చితే.. ఇప్పుడు మన దేశంలో ఈ వైరస్‌ను ఎలా ఎదుర్కోవాలనే విషయంలో మరింత స్పష్టత వచ్చిందని చెప్పారు. వైరస్‌ తీవ్రతను ఎంత త్వరగా గుర్తించి, అందుకు తగ్గట్లుగా ఎటువంటి చికిత్స అందిస్తున్నామనేదే అత్యంత కీలకమైన అంశమని ఆయన స్పష్టం చేశారు. యాంటీ వైరల్‌, ప్లాస్మాథెరపీ వంటి చికిత్సలను ఆఖరి దశల్లో కాకుండా.. సాధ్యమైనంత త్వరగా ప్రారంభిస్తే మెరుగైన ఫలితాలు వస్తున్నాయని పేర్కొన్నారు. తమ ఆసుపత్రిలో దాదాపు 1000 మందికి పైగా కరోనా బాధితులకు అందించిన చికిత్సలపై వేర్వేరు దశల్లో అధ్యయనం చేశామన్నారు. అందుబాటులోని కొవిడ్‌ అధునాతన చికిత్సా విధానాలు లభిస్తున్న ఫలితాలు తదితర అంశాలపై డాక్టర్‌ నాగేశ్వరరెడ్డితో ‘ఈనాడు’ ప్రత్యేక ముఖాముఖి నిర్వహించింది.

కొవిడ్‌పై మీ గమనంలోకి వచ్చిన అంశాలు ఏమిటి?
మొదట్లో ఈ వైరస్‌ శ్వాసకోశాల్లోకి ప్రవేశిస్తుందని, వాటిలో సమస్యలు సృష్టిస్తుందని భావించేవాళ్లం. కానీ ఇది కేవలం శ్వాసకోశాల్లోనే కాకుండా రక్తంలోనూ ప్రవేశిస్తుందని ఇప్పుడు గ్రహించాం. ఈ వైరస్‌ గుండె, ఊపిరితిత్తులు, తదితర ప్రధాన అవయవాల్లోని రక్తనాళాల్లోకి వెళ్లి అతుక్కుపోతోంది.
ఇప్పుడున్న అవగాహన ప్రకారం ఈ వైరస్‌కు రెండు దశల ఇన్‌ఫెక్షన్లుంటాయి. మొదటిది వైరీమియా. దీనివల్ల వైరస్‌ సోకిన 4-5 రోజుల్లో లక్షణాలు కనిపిస్తాయి. కొన్నిసార్లు 11 రోజుల్లోనూ బయటపడతాయి. ఈ సమయంలో జ్వరం, ఒళ్లు నొప్పులు, దగ్గు, గొంతునొప్పి వంటివి ఉంటాయి. ఈ లక్షణాలు 90 శాతం మందిలో 3 రోజులే ఉంటాయి. కొంతమందిలో 5 రోజులుండి తగ్గిపోతాయి. ఈ వైరీమియా దశలో మన రోగ నిరోధక వ్యవస్థలోని సైనిక దళాలు ముందుగా కరోనా వైరస్‌కు వ్యతిరేకంగా పోరాడతాయి.
వైరస్‌ శరీరంలోకి ప్రవేశించిన రెండో వారంలో తదుపరి దశ మొదలవుతుంది. ఈ దశలో కొవిడ్‌ వైరస్‌ రోగ నిరోధక వ్యవస్థపై దాడిని మరింత పెంచుతుంది. ఎలాగంటే మొదటి దశలో మన రోగ నిరోధక వ్యవస్థలోని సైనిక దళాలు వైరస్‌పై తుపాకులతో ఎదురుదాడి చేస్తే..రెండోదశలో బాంబులతో ఎదురుదాడి చేయాల్సివచ్చినట్లు. అంత తీవ్రంగా సైటోకైన్స్‌ విరుచుకుపడతాయి. అయితే మరీ ఎక్కువగా బాంబు దాడి జరిగితే.. మన శరీరంలోని అంతర్గత రక్తనాళాలే దెబ్బతింటాయి. ఇది అత్యంత కీలకమైన పరిణామం.
రెండో దశలో తీవ్రతను గుర్తించడమెలా?
రక్తంలో ఆక్సిజన్‌ శాతం 95 కంటే తక్కువకు పడిపోతుంటుంది. శ్వాస తీసుకోవడం కష్టమై ఆయాసంగా ఉంటుంది. అందుకే పల్స్ ఆక్సీమీటర్‌తో రెండోవారంలో పరీక్షిస్తుండాలి. 90 శాతం కంటే తక్కువగా ఉంటే అత్యవసరంగా ఆసుపత్రిలో చేరాల్సి ఉంటుంది. ఈ విధంగా వైరస్‌ దాడి తీరు, శరీరంలో దుష్ప్రభావాలు తెలిశాయి కాబట్టి.. దానికి ఏ సమయంలో ఎటువంటి చికిత్స అందించాలనే విషయంలోనూ స్పష్టత ఏర్పడింది. సరైన సమయంలో చికిత్స అందించడం వల్ల మరణాల సంఖ్య కూడా తగ్గిపోయింది. ఎవరైతే ఆలస్యంగా వస్తున్నారో.. వారిలో అప్పటికే శరీరంలో అంతర్గత వ్యవస్థ దెబ్బతిని ఉండడంతో.. సమస్య తీవ్రమై ప్రాణాపాయ పరిస్థితులకు దారితీస్తుంది.
కొందరిలో ‘హ్యాపీ హైపాక్సియా’ ఉంటుంది. అంటే వీరిలో రక్తంలో ఆక్సిజన్‌ శాతం 80-85 ఉన్నా కూడా. పైకి మాత్రం మామూలుగానే కనిపిస్తారు. ఇటువంటప్పుడు ఉన్నట్టుండి పరిస్థితి విషమిస్తుంది. కొందరిలో నేరుగా గుండెపై వైరస్‌ ప్రభావం చూపుతుంది. అప్పుడు గుండె లయ తప్పడం వల్ల కూడా ప్రాణాపాయం ఉంటుంది. అయితే ఇది చాలా అరుదు.
కొవిడ్‌కు చికిత్స ప్రణాళిక ఎలా?
మొదటి వారంలో.. యాంటీ వైరల్‌ చికిత్స ఇవ్వడం ముఖ్యమైనది. ఇందులో రెండున్నాయి. ఒకటి ‘ఫావిపిరవిర్‌’.. ఇది ఎంత మేరకు పనిచేస్తుందనే విషయంలో మరిన్ని పరిశోధనలు జరగాలి. రెండోది ‘రెమిడెసివిర్‌’.. ఇది చాలా ప్రభావవంతంగా పనిచేస్తోంది. అయితే ఎక్కువమంది ఈ ఔషధాన్ని రెండోవారంలో వినియోగిస్తున్నారు. ఎందుకంటే.. ఖరీదు ఎక్కువ. మరొకటి ఏమిటంటే 90 శాతం మందిలో కొవిడ్‌ దానికదే తగ్గిపోతుంది కదా.. ఎందుకు వినియోగించడమనే భావన ఉండడం. మొదటి వారంలో మూణ్నాలుగు రోజులైనా జ్వరం తగ్గుముఖం పట్టకపోతే.. 60 ఏళ్లు పైబడినవారిలో.. లేదా అధిక రక్తపోటు, మధుమేహం, క్యాన్సర్‌ తదితర దీర్ఘకాలిక జబ్బులతో బాధపడుతున్నవారిలో రెమిడిసివిర్‌ వినియోగించడం మంచిదని మా అధ్యయనంలో గ్రహించాం.
ఊబకాయుల్లో కొవిడ్‌ తీవ్రత ఎక్కువగా ఉంటోంది. ఊపిరితిత్తుల్లో ఉండే కొవ్వు కణాల్లోకి ఈ వైరస్‌ వెళ్లి కూర్చొంటోంది. దానివల్ల మరింత ప్రమాదకరంగా మారుతోంది. అందుకే ఫిట్‌నెస్‌ చాలా ముఖ్యం. సరైన సమయంలో యాంటీ వైరల్‌ చికిత్స అందిస్తే 99 శాతం మందిలో నయమవుతోంది. వీటికి అదనంగా  అవసరం మేరకు యాంటీబయాటిక్స్‌ వాడాలి. విటమిన్‌ మాత్రలు ఇవ్వాల్సిందే.
రెండోవారంలో.. ‘డెక్సామిథాసోన్‌’* అనే స్టెరాయిడ్‌ వినియోగిస్తే వైరస్‌ 90 శాతం నియంత్రణలో ఉంటుంది. ఈ స్టెరాయిడ్‌ రక్తనాళాల్లో వాపు(ఇన్‌ఫ్లమేషన్‌)ను తగ్గిస్తుంది. ఇప్పుడు పరీక్షల పరంగానూ స్పష్టత వచ్చింది. సీఆర్‌పీ, ఐఎల్‌ 6, ఫెర్రిటిన్‌, డీ డైమర్‌, ఎల్‌డీహెచ్‌.. తదితర పరీక్షలు ఆధారంగా వైరస్‌ తీవ్రత తెలుస్తోంది. ఆక్సిజన్‌ ఇస్తూ స్టెరాయిడ్‌ చికిత్స అందించడం వల్ల 99 శాతం మందిలో మూడు రోజుల్లోనే మెరుగైన ఫలితాలు కనిపిస్తున్నాయి. ఒకవేళ ఈ ఔషధాల వల్ల కూడా పరిస్థితి మెరుగుపడకపోతే.. అప్పుడు ‘టోసిలిజుమాబ్‌’ ఔషధాన్ని ప్రయోగాత్మకంగా ఇవ్వాల్సి ఉంటుంది. ఈ ఔషధాన్ని చాలా జాగ్రత్తగా, అత్యవసరమైన సందర్భాల్లో మాత్రమే వినియోగించాలి.
ప్లాస్మాథెరపీ వల్ల ప్రయోజనమెంత?
కొవిడ్‌ వచ్చి తగ్గిన వారిలో యాంటీ బాడీస్‌ వృద్ధి చెందుతాయి. వారి నుంచి ప్లాస్మా తీసుకొని బాధితులకు ఇస్తే కోలుకుంటున్నారు. ఇవి అందరిలోనూ వృద్ధి చెందడం లేదని పరిశోధనల్లో వెల్లడైంది. 30-40 శాతం మందిలో మాత్రమే ఈ ‘న్యూట్రలైజింగ్‌ యాంటీబాడీస్‌’ అభివృద్ధి  చెందుతున్నాయి. బాధితులు వెంటిలేటర్‌పైకి వెళ్లిన తర్వాత ప్లాస్మా ఇవ్వడం వల్ల ఎక్కువగా ప్రయోజనం ఉండదు. రెండోవారంలో ఆక్సిజన్‌, స్టెరాయిడ్స్‌ ఇచ్చాక సాధారణంగా 48 గంటల్లో బాధితుల్లో సానుకూల స్పందన కనిపిస్తుంది. ఒకవేళ అప్పటికీ స్పందన లేకపోతే.. ఆ దశలోనే ప్లాస్మాథెరపీకి వెళ్లడం వల్ల ఉపయోగంగా ఉంటుంది.
ఇప్పుడు ‘మోనోక్లోనాల్‌ యాంటీబాడీస్‌’ అని కొన్ని సంస్థలు ఉత్పత్తి చేస్తున్నాయి. సాధారణంగా మన శరీరంలోని ‘న్యూట్రలైజింగ్‌ యాంటీబాడీస్‌’ కొన్ని కణాలను ఉత్పత్తి చేస్తాయి. ఈ కణాలను తీసి, కల్చర్‌ చేసి ‘హై కాన్సట్రేషన్‌ మోనోక్లోనాల్‌ యాంటీబాడీస్‌’ను ఉత్పత్తి చేస్తున్నారు. వీటిని వినియోగించడం వల్ల 100 శాతం కోలుకుంటారు. వ్యాక్సిన్‌ కంటే ముందు ఇవే రానున్నాయి.
కొవిడ్‌కు టీకాలు ఎప్పటికి రావచ్చు?
డిసెంబరు ఆఖరు నాటికి టీకా వస్తుందనే ఆశాభావంతో ఉన్నాను. మన దేశంలో జనవరిలో కొంతమందికి అందుబాటులో ఉంటుంది. సాధారణ ప్రజలకు వచ్చే ఏడాది ఏప్రిల్‌, మే మాసాల వరకూ రావచ్చు.
లాలాజలం ద్వారా కూడా కొవిడ్‌ను నిర్ధారించడంపై ప్రయోగాలు చేస్తున్నాం. త్వరలోనే ఫలితాలు వెల్లడిస్తాం. భారతీయుల్లో కరోనా వ్యాప్తి, తీవ్రత తక్కువ అనే అంశంపై పరిశోధన నిర్వహించాం. మన భారతీయుల జన్యువుల్లోనే కొవిడ్‌ను ఎదుర్కొనే సామర్థ్యముంది. ఈ అంశంపై పరిశోధన కథనం అంతర్జాతీయ వైద్య పత్రికలో ప్రచురణకు వెళ్లింది. త్వరలోనే ఈ విషయాలనూ వెల్లడిస్తాం. ప్రస్తుతమున్న కరోనా ఉద్ధృతి సెప్టెంబరు వరకూ కొనసాగే అవకాశాలున్నాయి. ప్రజలంతా ముందస్తు జాగ్రత్తల పట్ల నిర్లక్ష్యంగా ఉండొద్దు. మాస్కు ధరించడం... కనీసం 6 అడుగుల వ్యక్తిగత దూరం పాటించడం, చేతులను తరచూ శుభ్రపర్చుకోవడం తప్పనిసరి... తప్పనిసరి.
ఆక్సిజన్‌ పాత్ర కూడా చాలా ముఖ్యం
సాధారణంగా ముక్కు ద్వారా అందించే ఆక్సిజన్‌ వల్ల ఎక్కువ మందిలో నిమిషానికి 2-10 లీటర్ల ఆక్సిజన్‌ సరిపోతుంది. ఇది సరిపోకపోతే.. ‘నాన్‌ ఇన్‌వేజివ్‌ వెంటిలేటర్‌(ఎన్‌ఐవీ)’ విధానంలో ఆక్సిజన్‌ను అందిస్తారు. ఇటీవల ‘నాసల్‌ క్యాథటర్‌’ ద్వారా కొత్తగా ‘హై ఫ్లో ఆక్సిజన్‌’ ఇవ్వడం వల్ల కూడా ఎక్కువ ప్రయోజనాలు కనిపిస్తున్నాయి. ఇది ఇస్తే వెంటిలేటర్‌ చికిత్స అవసరం లేదు. దీని ద్వారా నిమిషానికి 40 లీటర్ల వరకూ కూడా ఇవ్వచ్చు. ఇంతకుముందు ప్రాణాలను కాపాడడానికి వెంటిలేటర్‌ పెట్టాలనుకునేవారు. కానీ ఇప్పుడు వెంటిలేటర్‌ అవసరం లేకుండానే ‘హై ఫ్లో ఆక్సిజన్‌’ ద్వారా ప్రాణాలను కాపాడవచ్చు. ఇది వినియోగిస్తే కేవలం 0.5 శాతం కంటే తక్కువ మందికి మాత్రమే వెంటిలేటర్‌ అవసరమవుతుంది.


SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "More clarity now on corona healing"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0