Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

The new education system has some challenges

కొత్త విద్యావిధానం కొన్ని సవాళ్లు


The new education system has some challenges

విద్యా వ్యవస్థలో సమూల ప్రక్షాళన దిశగా నూతన విద్యా విధానాన్ని (ఎన్‌ఈపీ) తీసుకువచ్చింది కేంద్రం. బుద్ధికుశలతను, సృజనశీలతను ఆవిష్కరించడమే పరమార్థంగా విద్యావ్యవస్థలో సమూల మార్పులు చేసేందుకు కేంద్రం ఈ ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. అయితే నూతన విద్యావిధానం అమలులో కొన్ని సవాళ్లను అధిగమించక తప్పదంటున్నారు నిపుణులు.



తప్పదంటున్నారు నిపుణులు.



కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన నూతన విద్యావిధానం (ఎన్‌ఈపీ) దేశ విద్యావ్యవస్థను ఆసాంతం ప్రక్షాళన చేయతలపెట్టింది. ప్రాథమిక, ఉన్నత విద్య తీరుతెన్నులను వ్యవస్థాగతంగా, శిక్షణాపరంగా సమూలంగా మార్చేయాలన్న లక్ష్యంతో ఈ విధానాన్ని తీసుకువచ్చారు. ఇందులో ప్రధానంగా ఎనిమిది అంశాలకు ప్రాధాన్యం ఇచ్చారు. 1. పాఠశాల విద్య, ప్రాథమిక విద్య 2. బడుల్లో మౌలిక వసతులు, వనరులు 3. విద్యార్థి సమగ్రాభివృద్ధి 4. సమ్మిళిత తత్వం 5. మదింపు పద్ధతులు 6. పాఠ్యప్రణాళిక, బోధన చట్రం 7. ఉపాధ్యాయ నియామకాలు/బోధన విద్య 8. ప్రభుత్వ విభాగాలు/వ్యవస్థలు/సంస్థలు. ఈ కీలకాంశాల్లో సమూల పరివర్తన తెచ్చేందుకు వీలుగా విద్యపై గణనీయంగా నిధులు వెచ్చించి, తద్వారా స్థూల నమోదు నిష్పత్తి (గ్రాస్‌ ఎన్‌రోల్మెంట్‌ రేషియో)ని 2035నాటికి 50శాతానికి పెంచాలన్నది ఎన్‌ఈపీ ధ్యేయం. నూతనాంశాలను ఆవిష్కరించగల బుద్ధికుశలతను, సృజనశీలతను ఆవిష్కరించడమే పరమార్థంగా విద్యావ్యవస్థలో సమూల మార్పులు తీసుకురావాల్సి ఉంటుంది. కనీసం అయిదో తరగతి వరకు మాతృభాషలోనే చదువు చెప్పాలన్న ప్రతిపాదన ఉద్దేశం ఇదే. సామాజిక అంశాలకు, శాస్త్రీయ విద్యకు సముచిత ప్రాధాన్యం కల్పించడం మరో ముఖ్యాంశం. విద్యాబోధనతో వృత్తివిద్య శిక్షణను అనుసంధానించడం ఆ దిశగా చేసిన ప్రతిపాదనే.



ప్రమాణాలకు పెద్దపీట!



మానవ వనరుల విభాగాన్ని విద్యాశాఖలో విలీనం చేయడం- ఉన్నతవిద్యా సంస్థల సమగ్ర పునర్‌వ్యవస్థీకరణ దిశగా పడుతున్న తొలి అడుగు. ప్రధానమంత్రి నేతృత్వంలో ఏర్పడే కేంద్రస్థాయి రాష్ట్రీయ శిక్షక్‌ ఆయోగ్‌ (ఆర్‌ఎస్‌ఏ)- విద్యా వనరులు, నైపుణ్యాల కల్పన, విస్తరణకు సంబంధించిన సర్వ విషయాలనూ నిర్ణయించే, పర్యవేక్షించే, నియంత్రించే అత్యున్నత సంస్థగా ఉంటుంది. విశ్వవిద్యాలయాలు ప్రభుత్వ, ప్రైవేటు ఉన్నత విద్యాసంస్థ(హెచ్‌ఈఏ)లకు సార్వత్రిక నియంత్రణ, పనితీరు ప్రమాణాలు దీని ద్వారా రూపొందిస్తారు. అనుబంధ తరహా విశ్వవిద్యాలయాలను మూసివేసి- బహుళాంశ పరిశోధన విశ్వవిద్యాలయాలను (టైప్‌-1), బహుళాంశ బోధన విశ్వవిద్యాలయాలను (టైప్‌2), స్వతంత్ర ప్రతిపత్తిగల బహుళాంశ కళాశాలల(టైప్‌-3)ను ఏర్పాటు చేస్తారు. వాటిలో బోధన సిబ్బంది నియామకాల్లో ప్రతిభకు పెద్ద పీట వేస్తారు.



ఉన్నత విద్య రంగం



బృహత్తరమైన ఈ సంస్కరణను అమలులోకి తీసుకురావడం ఎలాంటి బాలారిష్టాలూ లేకుండా జరిగేది కాదు. ఎన్‌ఈపీ-2020కి నమూనా అయిన 'బలోనా కన్వెన్షన్‌' ఎదుర్కొన్న పురిటి నొప్పులను మనం గుర్తు చేసుకోవాలి. 'బలోనా కన్వెన్షన్' అనేది ఐరోపా దేశాలు తమ ఉన్నత విద్యను ప్రామాణీకరించుకోవడానికి కుదుర్చుకున్న ఏర్పాటు. 1998-99నాటి ఈ సమ్మేళనం సభ్యదేశాల విద్యావ్యవస్థల సంస్కరణకు, వాటి విద్యావిధానాల ప్రామాణీకరణకు ఉద్దేశించినది. మూడంచెల సార్వత్రిక డిగ్రీ వ్యవస్థ (బ్యాచిలర్‌, మాస్టర్‌, డాక్టరేట్‌), యూరోపియన్‌ క్రెడిట్స్‌ ట్రాన్స్‌ఫర్‌ అండ్‌ ఎక్యూమ్యులేషన్‌ సిస్టమ్‌, ఐరోపా ఉన్నత విద్య రంగంలో నాణ్యతకు అనుసరించాల్సిన ప్రమాణాలు, మార్గదర్శకాలు వంటి పలు ప్రతిపాదనలను ఇది రూపొందించింది.



బలోనా కన్వెన్షన్



'బలోనా కన్వెన్షన్‌'లో చేసుకొన్న బాసలను అమలు చేసినప్పుడు ఐరోపా విద్యార్థుల నుంచి, జర్మన్‌ మాట్లాడే దేశాలనుంచి విమర్శలు వెల్లువెత్తాయి. నిర్ణాయక ప్రక్రియలో తమకు భాగస్వామ్యం కల్పించలేదని విద్యార్థి సంఘాలు ఆందోళన వ్యక్తంచేశాయి. శ్రామిక విపణి ఒత్తిళ్లకు లొంగిన విద్యాసంస్కర్తలు విశ్వవిద్యాలయాల విలువను తగ్గించి, ఉపాధి యోగ్యతకే ప్రాధాన్యం ఇచ్చారంటూ నిరసన వ్యక్తమైంది. తమ సంప్రదాయాలకు తిలోదకాలిచ్చారని జర్మన్లు మండిపడ్డారు. ‘గతంలో నేను కవిని, నేను తత్వవేత్తను... ఇప్పుడు ఒక బ్యాచిలర్‌’ స్థాయికి దిగజారానన్న విద్యార్థి నినాదం బలోనా సంస్కరణలపై వ్యక్తమైన వ్యతిరేకతకు అద్దం పట్టింది. సంస్కరణ అసలు లక్ష్యాలు నీరుగారి, విద్యార్థులపై భారం పెరిగిందన్నది అప్పట్లో గట్టిగా వినిపించిన మరో అభ్యంతరం. విద్యార్థి ఉన్నతిని దెబ్బతీసేలా నూతన విద్యా ప్రణాళికలు రూపొందాయన్న అభిప్రాయమూ బలంగానే వినిపించింది. మరో విషాదమేమిటంటే- అప్పట్లో బలోనా విధానం ప్రకారం సృష్టించిన డిగ్రీకి ఉపాధి యోగ్యత లేదు అన్న అభిప్రాయం వినిపించింది. కార్మిక మార్కెట్లలోనూ ఆ డిగ్రీకి చెల్లుబాటు దక్కలేదు.



భారీ లక్ష్యసాధన



నూతన విద్యా విధానం-2020 ఇలాంటి లోపాలను సవాళ్లను అధిగమిస్తుందా అన్నది ప్రశ్న. మొట్టమొదటి సవాలు, 2035 నాటి స్థూల నమోదు నిష్పత్తి (గ్రాస్‌ ఎన్‌రోల్మెంట్‌ రేషియో)ని 50 శాతానికి చేర్చడం. ఇంతటి భారీ లక్ష్యసాధనకు అపారమైన వనరులు అవసరం అవుతాయి. ఈ స్థాయిలో ప్రాథమిక విద్యకు మౌలికవసతులు కల్పించడం తలకు మించిన భారం కాదా? అన్ని నిధులను ఎక్కడ నుంచి సమీకరిస్తారు? దీనికి స్పష్టమైన వ్యూహం ఉన్నట్లుగా అనిపించడం లేదు. ప్రైవేటు రంగం మీద, దాతల మీద ప్రభుత్వం ఆశలు పెట్టుకున్నట్లు కనిపిస్తోంది. గ్రామీణ ప్రాథమిక విద్యకు ఈ స్థాయి విరాళాలు సమకూరడం అరుదని చరిత్ర చెబుతోంది. ఆన్‌లైన్‌ దూర విద్య (ఓడీఎల్‌), మూకన్‌ (మాసివ్‌ ఓపెన్‌ ఆన్‌లైన్‌ కోర్సెస్‌) తరహా పద్ధతులు జీఈఆర్‌ను 50శాతానికి చేర్చడంలో కీలకమని విధాన పత్రంలో పేర్కొన్నారు.



అంతర్గత సమస్యలు



కొవిడ్‌ పర్యవసానంగా ప్రాచుర్యంలోకి వచ్చిన ఆన్‌లైన్‌ బోధన తరగతులను ఈ సందర్భంగా ప్రస్తావించాలి. ఇవి బీద బడుగు వర్గాల పిల్లలకు తీవ్ర నిరాశను మిగిల్చాయి. ఆన్‌లైన్‌ విద్య అందిపుచ్చుకోవడానికి అవసరమైన ఖరీదైన అంతర్జాల డిజిటల్‌ సాధనాలను కొనే స్థోమత వారికి లేదని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. విపణికి అనువైన కోర్సుల వైపే మొగ్గు చూపే గుణం జాతీయ నూతన విద్యా విధానంలో అంతర్లీనంగా ఉన్న మరో బలహీనత. మన ఉన్నత విద్యలో ఇప్పటికే అంతంత మాత్రంగా ఉన్న పరిశోధన అభివృద్ధి అవకాశాలను ఈ పరిణామం దెబ్బతీసే ప్రమాదం ఉంది. ఇక నాలుగేళ్ల డిగ్రీ కోర్సు గురించి చెప్పాలి. ఒక ఏడాది పొడిగింపువల్ల విద్యావ్యయం మరింత పెరుగుతుంది. మధ్యతరగతి ప్రజలకు ఇది అశనిపాతం. మధ్య, దిగువ మధ్యతరగతుల్లోని ప్రతిభావంతులైన విద్యార్థులు ఆర్థిక ఒత్తిళ్ల కారణంగా పరిశోధన రంగంలోకి ప్రవేశించలేక- అధికారిక ఎగ్జిట్‌ పాయింట్ల వద్ద అర్ధాంతరంగా చదువునుంచి వైదొలగవలసి రావడం మనకు ఎదురు కానున్న మరో చేదు వాస్తవం. ఫీజుల భారాన్ని విద్యారుణాల రూపంలో సమకూర్చుకోవచ్చని ఎన్‌ఈపీలో చేసిన ప్రతిపాదన ఈ విషయం చెప్పకనే చెబుతోంది. ఉన్నత విద్యాసంస్థల్లో పరిశోధన సామర్థ్యాలు పరిశ్రమల వాణిజ్య సంస్థల పరిశోధన అభివృద్ధి (ఆర్‌అండ్‌డి) అవసరాలకు అనుగుణంగా ఉండాలని నూతన విద్యావిధానం పిలుపిచ్చింది. విజ్ఞాన, సామాజిక శాస్త్రాలు రెండింటిలో సిద్ధాంతపరమైన ఉన్నత పరిశోధనను హరించివేసేందుకు ఈ ధోరణి బాటలు పరిచే ప్రమాదం ఉంది. దేశ విద్యా వ్యవస్థను నూతన అవసరాలు, సవాళ్లకు అనుగుణంగా సంస్కరించాలన్న విషయంలో మరో మాట లేదు. ఈ తొందరపాటులో కొత్త సమస్యలు తలకెత్తుకోకుండా జాగ్రత్తపడటం చాలా అవసరం. కొత్త పద్ధతిని అమలులోకి తీసుకువస్తే తలెత్తే సమస్యలు, సవాళ్లపై విస్తృతంగా చర్చ జరగాలి. అవసరానుగుణంగా మార్పులకు సదా సిద్ధంగా ఉంటూ ఈ విద్యావిధానంపై ముందడుగు వేయాలి.


SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "The new education system has some challenges"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0