Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Inspiration,

 విజ్ఞానానికి దార్శనికత తోడైతే అద్భుతం సాధ్యమని చెప్పడానికి ఆయన జీవితం ఓ ఉదాహరణ. 


పరిశోధనలకు పెద్దపీట వేస్తే తయారీరంగంలో విజయం తథ్యమనడానికి ఆయన కథ ఓ స్ఫూర్తి. సాధారణ రైతు కుటుంబంలో పుట్టిన ఆయన 150కిపైగా పేటెంట్లు సొంతం చేసుకున్నారు. ఇన్ని ప్రత్యేకతలున్న ఆ వ్యక్తి 'లారస్‌ ల్యాబ్స్‌' వ్యవస్థాపకుడు, సీఈఓ చావ సత్యనారాయణ. తన కంపెనీతో వేలమందికి ఉపాధి కల్పిస్తూ, తమ ఔషధాలతో కోట్లమంది ఆరోగ్యాన్ని కాపాడుతున్నారీ తెలుగు తేజం.


జీ వితం ఇలా ఉండాలనీ, ఫలానా సాధించాలనీ చిన్నపుడు లక్ష్యం పెట్టుకోలేదు.


బాగా చదువుకోవాలని మాత్రమే అనుకునేవాణ్ని. ఈరోజు ఫార్మా రంగంలో ఓ పెద్ద కంపెనీని నెలకొల్పడం వెనక చిన్న మలుపు ఉంది. నేను బిఎస్సీ(ఎంపీసీ) చదివా. అప్పట్లో ఒక సబ్జెక్టుని ప్రధానంగా ఎంచుకోవాల్సి ఉంటే, ఫిజిక్స్‌ తీసుకోవాలనుకున్నా. కాలేజీలో చేరడానికి వెళ్లినపుడు ఆఫీసు రూమ్‌ ముందు మా అక్క స్నేహితురాలు కనిపించి ఫిజిక్స్‌కంటే కెమిస్ట్రీ లెక్చరర్లు బాగా పాఠాలు చెబుతారనీ, కెమిస్ట్రీ తీసుకోమనీ సలహా ఇచ్చింది. ఆ సలహా నా జీవితాన్ని మొత్తంగా మార్చేసిందని చెప్పాలి. ఆ వివరాలు చెప్పేముందు ఓసారి నా బాల్యంలోకి వెళ్తే...


మాది కృష్ణాజిల్లాలోని మున్నలూరు. నాన్న రామారావు, అమ్మ తులసమ్మ. అమ్మానాన్నలకు మేం అయిదుగురం. నాకు ఇద్దరు అక్కలూ, తమ్ముడూ, చెల్లి. అయిదో తరగతి వరకూ ఊళ్లోనే చదువుకున్నా. ఆరో తరగతికి మోగులూరు హైస్కూల్‌కి వెళ్లాం. వర్షాకాలంలో పొలం గట్లమీద నడుచుకుని, కాలువల్ని దాటుకుని వెళ్లేవాళ్లం. వర్షాలు బాగా పడితే స్కూల్‌కి వెళ్లే పరిస్థితి ఉండేది కాదు. ఊళ్లో చదువుల వాతావరణం ఉండేది. అందరూ వ్యవసాయదారులే అయినా చదువుకోసం ఎంతైనా ఖర్చు చేసేవారు.

పెళ్లి తర్వాతే ఉద్యోగం...

విజయవాడ 'సిద్ధార్థ'లో ఇంటర్మీడియెట్‌, అమరావతి ఆర్‌వీవీఎన్‌ కాలేజీలో డిగ్రీ చదివా. అక్క స్నేహితురాలు చెప్పినట్టే కాలేజీలో కెమిస్ట్రీ బాగా చెప్పేవారు. కెమిస్ట్రీ వరకూ ఆంధ్రా యూనివర్సిటీకి ఫస్ట్‌ వచ్చా. తర్వాత ఏయూలో ఎమ్మెస్సీ ఆర్గానిక్‌ కెమిస్ట్రీ పూర్తిచేసి ఉద్యోగ ప్రయత్నాలు మొదలుపెట్టా. గుంటూరులోని విజ్ఞాన్‌ కాలేజీలో ఎంసెట్‌కి సిద్ధమయ్యేవాళ్లకి ఆరు నెలలు పాఠాలు చెప్పాక పీహెచ్‌డీ సీటు రావడంతో తిరిగి ఏయూలో అడుగుపెట్టా. అప్పుడే గీతమ్‌లోనూ లెక్చరర్‌గా అవకాశం వచ్చింది. ఫ్రెండ్‌ కోసం ఆ ఉద్యోగం త్యాగం చేసి పీహెచ్‌డీ కొనసాగించా. ఎమ్మెస్సీ పూర్తవగానే నాకు పెళ్లయింది. నా శ్రీమతి నాగరాణి. వాళ్లది కూడా మా ఊరే. పీహెచ్‌డీ సమయంలోనే అమ్మాయి, అబ్బాయి పుట్టారు. పీహెచ్‌డీ తర్వాత ఫార్మా కంపెనీ 'ర్యాన్‌బాక్సీ'లో మేనేజ్‌మెంట్‌ ట్రైనీ(సైంటిస్ట్‌)గా చేరా. 'పిల్లలున్నవాడివి... దిల్లీలో ఈ జీతానికి పనిచేయగలవా' అని ఇంటర్వ్యూలో బాస్‌ అడిగారు. కెరీర్‌ కోసం సర్దుకుపోతానని చెప్పా. అక్కడ 'ఆర్‌అండ్‌డీ' విభాగంలో చేరా. ఏడాది పూర్తయ్యాక పనితీరు బావుంటే పదోన్నతి ఉంటుందన్నారు. కానీ ఆ టైమ్‌ తర్వాత ప్రమోషన్‌ ఇవ్వలేదు. 'నా పనితీరులో లోపాలుంటే చెప్పండి. మార్చుకుంటా' అని బాస్‌ని అడిగాను. 'లేదు నువ్వు బాగా పనిచేస్తున్నావు. కానీ ఏడాదిలోనే ప్రమోషన్‌ అంటే పైవాళ్లకి ప్రత్యేకించి చెప్పాల్సి వస్తుంద'న్నారు. బాగా పనిచేస్తున్నపుడు ఆ విషయమే చెప్పొచ్చు కదా అన్నా. తర్వాత ప్రమోషన్‌ ఇచ్చారు. అక్కడ రెండేళ్లు పనిచేశాక హైదరాబాద్‌లో 'వీరా లాబోరేటరీస్‌' అనే ఫార్మా సంస్థ ప్రారంభమవడంతో 1995లో వచ్చి చేరా. ఇక్కడ ఆర్‌అండ్‌డీ విభాగాన్ని నేనే నడిపేవాణ్ని. తర్వాత వొరిన్‌ ల్యాబ్స్‌కి మారాను. ఆ సంస్థ 2001లో మ్యాట్రిక్స్‌లో కలిసింది. తర్వాత 'వీరా' కూడా. దాంతో స్నేహితులందరం ఒకేచోట చేరినట్లయింది. 2004లో మ్యాట్రిక్స్‌కు చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌నయ్యా. అక్కడ రోజుకి 12 గంటలకుపైనే పనిచేసేవాణ్ని.

సొంత కంపెనీ...

మ్యాట్రిక్స్‌ ఛైర్మన్‌ నిమ్మగడ్డ ప్రసాద్‌తో అభిప్రాయ బేధాలు రావడంతో బయటకు వచ్చేశా. ఫార్మాలో రీసర్చ్‌, క్వాలిటీ కంట్రోల్‌, మాన్యుఫాక్చరింగ్‌, బిజినెస్‌ డవలప్‌మెంట్‌... ఇలా అన్ని విభాగాల్లోనూ అనుభవం ఉంది. ఆ సమయంలో సొంత కంపెనీ పెట్టడమే ఉత్తమమనిపించింది. మ్యాట్రిక్స్‌లో రీసర్చ్‌ వర్క్‌ బాగా చేయడంతో ఎన్నో పేటెంట్‌లు వచ్చాయి. ఆ ఉత్పత్తులద్వారా బాగా లాభాలు వచ్చాయి. ఈ రంగంలో పరిశోధక విజ్ఞానానికి డిమాండ్‌ ఉందన్న ధైర్యంతో 2005లో లారస్‌ ల్యాబ్స్‌ ప్రారంభించా.

65 దేశాలకు ఎగుమతులు

కంపెనీ ప్రారంభంలో నాతోపాటు కుటుంబ సభ్యులూ, స్నేహితులే పెట్టుబడి పెట్టారు. ఇదివరకటి సహోద్యోగులూ, పీజీలో క్లాస్‌మేట్స్‌ కంపెనీలో చేరారు. విలువల్లో రాజీ ఉండకూడదనే మొదటి నియమాన్ని అందరికీ చెప్పా. చాలావరకూ ఫార్మా కంపెనీలు ముందు తయారీ యూనిట్లు పెట్టి తర్వాత పరిశోధనలవైపు వెళ్తాయి. మేం మాత్రం పరిశోధనలతో మొదలుపెట్టాం. పెట్టుబడి కోసం బ్యాంకుల్ని సంప్రదించినపుడు మొదటి అయిదేళ్లలో రూ.80 కోట్లు నష్టం వస్తుందని చెప్పాం. వాళ్లు మొదట ఆశ్చర్యపోయినా, మేం రీసర్చ్‌ మీద ఖర్చు పెడుతున్నందువల్ల అలా జరుగుతుందని చెప్పేసరికి అంగీకరించారు. మూడేళ్లలో 300 మందితో రీసర్చ్‌ టీమ్‌ని సిద్ధం చేశాం. మమ్మల్ని చూసి 'వీళ్లది అయ్యే పనేనా' అన్నవాళ్లూ ఉన్నారు. నాలుగో సంవత్సరంలో పేటెంట్‌ ఉన్న మందుని కనిపెట్టిన తర్వాత అత్యున్నత ప్రమాణాలతో విశాఖలో తయారీ యూనిట్‌ని నిర్మించాం. కంపెనీ ప్రారంభించిన అయిదేళ్లకు లాభాలు వచ్చాయి. మా మందులు కూడా సమాజానికి ఉపయోగపడాలని మొదట హెచ్‌ఐవీ రోగులు వాడే మందుల్ని తయారుచేశాం. ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా హెచ్‌ఐవీ బాధితుల్లో మూడింట ఒక వంతు మా మందుల్నే వాడతారు. వీరి సంఖ్య దాదాపు 70 లక్షలు ఉంటుంది. ప్రారంభంలో 80 శాతం ఆదాయం మాకు ఆ ఒక్క ఉత్పత్తి నుంచే వచ్చేది. ఇప్పుడది ఏడు శాతానికి తగ్గింది. కారణం... ఈ పదేళ్లలో మరిన్ని విభాగాల్లోకి విస్తరించడమే. ప్రస్తుతం మా ఉత్పత్తుల్ని 65 దేశాలకు ఎగుమతి చేస్తున్నాం. యూకే, అమెరికా, దక్షిణాఫ్రికా, జర్మనీ లాంటి దేశాల్లో లారస్‌ బ్రాండ్‌తో ట్యాబ్లెట్లు మార్కెట్‌ చేస్తున్నాం. ఈ దేశాల్లో మాకు ఆఫీసులూ ఉన్నాయి. మనదేశంలో మాత్రం ఇప్పటికే ఉన్న కంపెనీలకు మా ఉత్పత్తుల్ని అమ్ముతున్నాం.

ఉద్యోగి బావుండాలని...

మంచి దార్శనికత, అంతే మంచి బృందం ఉండటంవల్ల మార్కెట్‌లో మిగిలినవాళ్లకంటే చాలా వేగంగా ఎదిగామని చెప్పాలి. 2016లో ఐపీఓకి వెళ్లాం. ప్రస్తుత మార్కెట్‌ విలువ సుమారు రూ.18వేల కోట్లు. వార్షిక ఆదాయం రూ.వెయ్యి కోట్లు. ఇదంతా నా ఒక్కడివల్ల జరగలేదు. దీన్లో ఉద్యోగుల శ్రమ ఉంది. అందుకే వాళ్లకి ఏ ఇబ్బందీ లేకుండా చూసుకోవాలనేది మా పాలసీ. 2006 మొదలు ఇప్పటికీ ఉద్యోగులకు పనివేళల్లో టిఫిన్‌, భోజనం, స్నాక్స్‌ ఉచితంగా అందిస్తాం. వైజాగ్‌ ప్లాంట్‌లో ఒకే రోజు ఏడు వేలమందికి భోజనం తయారుచేసే కిచెన్‌ని ఏర్పాటుచేశాం. షిఫ్టు డ్యూటీవల్ల ఉద్యోగులకు వంట ఇబ్బంది ఉండకూడదనీ, తాజా ఆహారం అందివ్వాలనీ క్యాంటీన్‌ ఏర్పాటుచేశాం. కంపెనీకి ఏదైనా పనిమీద వచ్చిన వాళ్లైనా క్యాంటీన్‌లో ఉచితంగా తినొచ్చు. ఆఫీసూ, పరిశోధక కేంద్రంలోనూ ఈ సదుపాయాలు ఉంటాయి. ఉద్యోగులకు ఉచిత మెడికల్‌ ఇన్సూరెన్స్‌ సదుపాయమూ కల్పిస్తున్నాం. సాధారణంగా ఫార్మా కంపెనీల్లో రసాయనాల వాసన ఎక్కువ వస్తుంది. కానీ మా ప్లాంట్‌లో అలా రాకుండా ఎప్పటికప్పుడు తాజా గాలి వీచేలా ఏర్పాటుచేశాం. ఇవన్నీ చూసి 'మీరు ఉద్యోగుల్ని అతిగారాబం చేస్తున్నా'రన్న వాళ్లూ ఉన్నారు. కానీ ఇది బాధ్యత. 'గ్రేట్‌ ప్లేస్‌ టు వర్క్‌' సర్వేలో మా కంపెనీకి తరచూ స్థానం దక్కుతుండటం మాకెంతో గర్వకారణం. కొవిడ్‌ బారినపడ్డ ఉద్యోగులకీ, కుటుంబ సభ్యులకీ కంపెనీయే క్వారెంటైన్‌ను ఏర్పాటుచేసి చికిత్స అందించింది.


విస్తరణలో భాగంగా బెంగళూరు కేంద్రంగా పనిచేసే 'రిచ్‌కోర్‌' అనే బయోటెక్‌ కంపెనీలో గతేడాది రూ.250 కోట్లతో 72 శాతం వాటా కొన్నాం. దాని వ్యవస్థాపకులే నిర్వహణనీ చూస్తున్నారు. వాళ్లకి అవసరమైన నిధులు, వ్యూహరచనలో సాయంగా ఉంటున్నాం.


మా ఎదుగుదల కేవలం మావరకే పరిమితం కాలేదు. నావైపు, నా శ్రీమతివైపు కుటుంబాలకూ కంపెనీలో వాటాలు ఇచ్చాం. అయిదు శాతం వాటా ఉద్యోగులకూ ఇచ్చాం. ప్రస్తుతం కంపెనీలో నా వాటా 25 శాతం. సగానికిపైగా వాటా నా పేరనే ఉండాలనుకుంటే కంపెనీ ఈ స్థాయికి ఎదిగేది కాదేమో. కంపెనీ సీఎఫ్‌ఓ రవికుమార్‌ 25 ఏళ్లుగా నా సహోద్యోగి. క్వాలిటీ కంట్రోల్‌ చూసే డాక్టర్‌ లక్ష్మణ్‌ పీజీలో నా రూమ్మేట్‌. ఇంకా చాలామంది సీనియర్లు నా స్నేహితులూ, సహోద్యోగులే. ఒకళ్లనుంచి మిగతావాళ్లం ఎన్నో విషయాలు నేర్చుకుంటాం. ఆఫీసులో పనిచేస్తుంటే కాలేజీకి వచ్చి స్నేహితులతో కలసి చదువుకుంటున్నట్టే ఉంటుంది. ప్రస్తుతం కంపెనీలో అయిదువేల మంది పనిచేస్తున్నారు. రిటైరయ్యేలోపు ఈ సంఖ్యని రెట్టింపు చేయాలనేది నా లక్ష్యం.

సేవలోనూ ముందంజ...

  • కార్పొరేట్‌ సామాజిక బాధ్యతలో భాగంగా విద్య, ఆరోగ్య రంగాలకు ఎక్కువగా నిధులు కేటాయిస్తుంటారు. సొంతూరులో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు.
  • 'సైన్స్‌ ఆన్‌ వీల్స్‌' పేరుతో మొబైల్‌ సైన్స్‌ ల్యాబ్‌ని విశాఖలో ప్రారంభించారు. ఇది 20 వరకూ ప్రభుత్వ పాఠశాలలు చుట్టివస్తుంది. ఏటా సైన్స్‌ ఫెయిర్‌నూ ఏర్పాటుచేస్తుంటారు.
  • గీతమ్‌ యూనివర్సిటీ సహకారంతో గత అయిదేళ్లలో 250 మంది విద్యార్థులకు ఇంటిగ్రేటెడ్‌ ఎమ్మెస్సీ కోర్సుని ఉచితంగా అందించారు. నెలకు రూ.5వేలు స్టైపెండ్‌ ఇచ్చారు. ఐఎస్‌బీకి రూ.1.5కోట్లు విరాళం ఇచ్చారు.
  • కొవిడ్‌ సమయంలో ఉద్యోగులకు భద్రత కల్పించడంతోపాటు విరాళాలూ, వలస కూలీలకు ఉచిత రేషన్‌, వైద్య సిబ్బందికి పీపీఈ కిట్లు అందించడం కోసం రూ.25 కోట్లు ఖర్చుచేశారు.

వారాంతాల్లో సాగు...

  • నా ఎదుగుదలలో శ్రీమతి పాత్ర ఎంతో ఉంది. వృత్తి జీవితంలో పడి ఎక్కువగా పిల్లల చదువులూ, కుటుంబం గురించి తగినంతగా పట్టించుకోలేదు. ఆ బాధ్యతల్ని తను చక్కగా నిర్వర్తించింది. ఇద్దరమూ వారాంతాల్లో ఫామ్‌కు వెళ్లి సేంద్రియ సాగు చేస్తాం.
  • అమ్మాయి సౌమ్య క్లినికల్‌ రీసర్చ్‌లో ఎం.ఎస్‌, ఎంబీఏ చేసింది. అల్లుడు చంద్రకాంత్‌ ఎం.ఎస్‌, ఎంబీఏ(ఐఎస్‌బీ) చేశాడు. మెకన్సీలో పనిచేసిన అనుభవం ఉంది. ప్రస్తుతం లారస్‌లోనే పనిచేస్తున్నాడు. వీరికో అమ్మాయి.
  • అబ్బాయి కృష్ణకాంత్‌. ఎం.ఎస్‌, ఎంబీఏ(ఐఎస్‌బీ) చేశాడు. 'డాక్టర్‌ రెడ్డీస్‌'లో మూడేళ్లపాటు పనిచేశాడు. ప్రస్తుతం లారస్‌లో పనిచేస్తున్నాడు. కోడలు రోజారవళి, గైనకాలజిస్టు.
  • అల్లుడూ, అబ్బాయి స్ఫూర్తితో నేనూ ఐఎస్‌బీలో ఎగ్జిక్యూటివ్‌ ఎంబీఏ చేశా.
  • హైదరాబాద్‌లో ఫార్మా సంస్థల్ని ప్రారంభించిన వాళ్లమంతా నెలకోరోజు ఒకరింట్లో కుటుంబాలతో కలుస్తుంటాం. అప్పుడు వ్యాపార విషయాలు మాట్లాడం.
  • ఆటవిడుపు కోసం గరిటె తిప్పడమూ అలవాటు.


SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Inspiration,"

Post a Comment