Lapsed Insurance Policy
Lapsed Insurance Policy : రద్దయిన బీమా పాలసీని పునరుద్ధరించుకోవచ్చా ?
ఇంటర్నెట్ డెస్క్: కరోనా మహమ్మారి నేపథ్యంలో భారతీయులకు జీవిత బీమా ప్రాధాన్యం తెలిసొచ్చింది. చాలా మంది పాలసీలు తీసుకుంటున్నారు.
పాలసీలు ఎప్పుడు రద్దవుతాయి?
ప్రీమియంలు సకాలంలో చెల్లించకపోవడం వల్ల పాలసీ ద్వారా అందే ప్రయోజనాలన్నీ నిలిచిపోతాయి. ప్రీమియం చెల్లించాల్సిన తేదీ తర్వాత గ్రేస్ పీరియడ్ కింద మరికొంత అదనపు సమయాన్ని కూడా ఇస్తారు. సాధారణంగా గ్రేస్ పీరియడ్ 30 రోజులుగా ఉంటుంది. అయినా చెల్లించడంలో విఫలమైతే.. పాలసీని రద్దు చేస్తారు.
పునరుద్ధరణకు ఎంత సమయం ఉంటుంది?
చాలా కంపెనీలు పాలసీల పునరుద్ధరణకు రెండు నుంచి మూడేళ్ల వ్యవధి ఇస్తాయి. దీనికి సంబంధించిన వివరాలు మనకు పాలసీ తీసుకునే సమయంలో ఇచ్చే పత్రాల్లోనే ఉంటుంది. ఆ సమయంలోపే పునరుద్ధరించుకునే ప్రయత్నం చేయాలి. అప్పుడే పాలసీతో పాటు వచ్చిన ప్రయోజనాలన్నీ తిరిగి పొందగలుగుతారు.
ఎలా పునరుద్ధరించాలి?
రద్దయిన పాలసీని పునరుద్ధరించాలంటే బీమా సంస్థకు అర్జీ పెట్టుకోవాలి. కంపెనీ ఇచ్చే నిర్దేశిత నమూనాలోనే దరఖాస్తును సమర్పించాలి. అయితే, కొన్ని సంస్థలు వైద్య పరీక్షలు అడుగుతాయి. వైద్యపరీక్షల్లో మనం ఆరోగ్యంగా ఉన్నామని తేలితేనే పాలసీని పునరుద్ధరిస్తారు. మరికొన్ని సంస్థలు ఆరోగ్యంగా ఉన్నామంటూ ధ్రువీకరణ పత్రాన్ని కోరతాయి.
ఎంత చెల్లించాలి?
కాలం చెల్లిన పాలసీని పునరుద్ధరించడానికి అప్పటి వరకు బకాయి ఉన్న ప్రీమియంల మొత్తం చెల్లించాలి. దానిపై కొంత జరిమానా, రుసుములు కూడా ఉంటాయి. కొన్ని సంస్థలు బకాయి పడ్డ ప్రీమియంలపై 12-18 శాతం వడ్డీ వసూలు చేస్తాయి. అలాగే నిబంధనల ప్రకారం జరిమానా కూడా వేస్తారు. అయితే, వడ్డీ, జరిమానా పూర్తిగా కంపెనీ విచక్షణాధికారాలపై ఆధారపడి ఉంటుంది. అవసరమైతే తగ్గించనూ వచ్చు. పెంచనూ వచ్చు.
పాలసీల పునరుద్ధరణకు కొన్ని సార్లు సంస్థలు ప్రత్యేకంగా క్యాంపెయిన్‌లు నిర్వహిస్తుంటాయి. ఆ సమయంలో కొన్ని మినహాయింపులు ఇస్తుంటాయి. ఆ క్యాంపెయిన్‌లను వినియోగించుకుంటే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
0 Response to "Lapsed Insurance Policy"
Post a Comment