PM poshan
PM పోషణ్
మధ్యాహ్న భోజన పథకానికి కొత్త రూపు..
ప్రభుత్వ పాఠశాల్లో అమలు చేస్తున్న మధ్యాహ్న భోజన పథకానికి కేంద్ర ప్రభుత్వం కొత్త రూపాన్ని తీసుకొచ్చింది. మరింత మంది చిన్నారులకు పోషకాహారాన్ని అందించేందుకు బుధవారం పీఎం పోషణ్ పథకంలో మార్పులు చేసింది. చిన్న పిల్లలకు సైతం పోషక విలువలున్న ఆహారాన్ని అందించాలనే ఉద్దేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పేర్కొన్నారు. ఇప్పటివరకు ఉన్న జాతీయ మధ్యాహ్న భోజన పథకం పేరును ‘పీఎం పోషణ్ శతి నిర్మాణ్ పథకం’గా మారుస్తూ.. ప్రీ-ప్రైమరీ విద్యార్థులను కూడా ఈ స్కీమ్‌లో భాగం చేస్తున్నట్లు వెల్లడించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ (CCEA) సమావేశంలో ఈ నిర్ణయం తీసుకుంది.
ఇకపై ప్రభుత్వ, ప్రభుత్వ ఎయిడెడ్ ప్రాథమిక పాఠశాలల్లో నడుస్తున్న ప్రీ-ప్రైమరీ విద్యార్థులకు (3-5 ఏళ్ల పిల్లలకు) కూడా ఈ పథకం వర్తించనున్నట్లు కేంద్రమంత్రి తెలిపారు. గతంలో 1వ తరగతి నుంచి 8వ తరగతి విద్యార్థులు మాత్రమే ఈ పథకానికి అర్హులు. ఈ స్కీమ్‌లో భాగంగా మరికొన్ని అంశాలపైనా కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. స్థానిక మహిళలను ఇందులో భాగం చేస్తూ వారికి తోట పనితోపాటు.. భోజనం రుచిగా వండేందుకు వంటల పోటీలు నిర్వహించనుంది.
పీఎం పోషణ్ శతి నిర్మాణ్ పథకం కింద దేశవ్యాప్తంగా ఉన్న 11.2 లక్షల పాఠశాలల్లోని 11.80 కోట్ల మంది విద్యార్థులు లబ్ధి పొందనున్నారు. 2021-22 నుంచి 2025-26 విద్యాసంవత్సరాలకు గాను కేంద్రం రూ.54,061.73 కోట్లు.. రాష్ట్ర, కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వాలు రూ.31,733.17 కోట్లు వెచ్చించనున్నాయి. ఆహార ధాన్యాల కోసం అదనంగా కేంద్రం మరో రూ.45,000 కోట్లు భరించనుంది. రానున్న ఐదేళ్లలో ఈ స్కీమ్‌కు సంబంధించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మొత్తంగా రూ.1,30,795 కోట్లు ఖర్చు చేయనున్నాయి. అయితే ఈ పథకం కింద అందించే ఆహార పదార్థాలను ప్రభుత్వం ఇంకా నిర్ణయించలేదని, రాష్ట్రాలు సొంతంగా నిర్ణయించుకునే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణతోపాటు మరికొన్ని రాష్ట్రాలు ఇది వరకే 9, 10వ తరగతుల విద్యార్థులకు ఈ పథకాన్ని అమలుచేస్తున్నాయి.
0 Response to "PM poshan"
Post a Comment