Corona vaccine for children from January ..!
జనవరి నుంచి పిల్లలకు కరోనా టీకా..!
బూస్టర్ డోసుపైనా రెండు వారాల్లో ప్రణాళిక రూపొందించే అవకాశం
దేశంలో కరోనా టీకా పంపిణీ నిర్విరామంగా కొనసాగుతున్నప్పటికీ.. పిల్లలకు ఇంకా కొవిడ్ వ్యాక్సిన్ అందుబాటులోకి రాలేదు. అయితే దీనిపై కేంద్రం నిపుణులతో విస్తృత స్థాయిలో చర్చలు జరుపుతోంది. త్వరలోనే నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ ఆన్ ఇమ్యునైజేషన్(ఎన్‌టీఏజీఐ) కూడా దీనిపై ఓ నిర్ణయానికి రానున్నట్లు తెలుస్తోంది. మరో రెండు వారాల్లో ఎన్‌టీఏజీఐ సమావేశం కానుంది. ఆ భేటీలో చిన్నారులకు టీకాతో పాటు పెద్దలకు బూస్టర్ డోసులపైనా సమగ్ర ప్రణాళిక రూపొందించనున్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.
♦ఇదిలా ఉండగా.. వచ్చే ఏడాది జనవరి నుంచి పిల్లలకు టీకా పంపిణీ ప్రారంభించే అవకాశాలున్నట్లు సదరు వర్గాలు పేర్కొన్నాయి. తొలుత ఇతర వ్యాధులతో బాధపడుతున్న పిల్లలకు ప్రాధాన్యమిస్తూ వారికి టీకాలు వేసే అవకాశమున్నట్లు తెలిపాయి. ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో స్కూళ్లు తిరిగి ప్రారంభమైన నేపథ్యంలో పిల్లలకు టీకా పంపిణీపై కేంద్రం దృష్టిపెట్టింది. మరోవైపు జైడస్ క్యాడిలా సంస్థ అభివృద్ధి చేసిన జైకోవ్-డి టీకాను 12-18 ఏళ్ల వయసు వారికి కూడా ఇవ్వొచ్చని ఆ సంస్థ వెల్లడించింది. ఈ టీకాకు కేంద్రం అత్యవసర అనుమతులిచ్చినప్పటికీ ఇంకా పంపిణీ ప్రారంభించలేదు.
ఇక దేశంలో బూస్టర్ డోసుల పంపిణీపై పెద్ద ఎత్తునే చర్చ జరుగుతోంది. ఇప్పటికే అమెరికా లాంటి దేశాలు బూస్టర్ డోసు పంపిణీ ప్రారంభించాయి. అయితే కేంద్రం మాత్రం దీనిపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. మరోవైపు ప్రస్తుతానికి బూస్టర్ డోసు అవసరం అంతగా లేదని నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే దీనిపై మరింత లోతుగా అధ్యయనం చేసి నిర్ణయం తీసుకోవాలని కేంద్రం భావిస్తోంది.
0 Response to "Corona vaccine for children from January ..!"
Post a Comment