A house worth Rs 15 lakh in towns can be registered for as little as Rs 25,000: Botsa
పట్టణాల్లో రూ.15 లక్షల ఇంటిని రూ.25వేలకే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు: బొత్స.
అమరావతి: వన్‌టైమ్ సెటిల్‌మెంట్ పథకం (ఓటీఎస్) విషయంలో బలవంతం ఏమీ లేదని ఏపీ పురపాలకశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. అవగాహన కల్పించాలని క్షేత్రస్థాయి సిబ్బందికి సూచించామన్న బొత్స.. బలవంతం చేయమని ఎవరికీ చెప్పలేదన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తప్పుడు సర్క్యూలర్ జారీ చేసిన సంతబొమ్మాళి సచివాలయ కార్యదర్శిని సస్పెండ్ చేశామన్నారు. ఓటీఎస్ ద్వారా ఇళ్లపై సంపూర్ణ గృహ హక్కు కల్పిస్తామని సీఎం పాదయాత్రలో హామీ ఇచ్చినట్టు మంత్రి గుర్తు చేశారు. ఆ హామీని ప్రభుత్వం నిలబెట్టుకుంటోందన్నారు.
‘‘వన్‌టైమ్ సెటిల్‌మెంట్ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం మంచి కార్యక్రమాన్ని తీసుకొచ్చింది. ప్రణాళిక ప్రకారమే తెదేపా ఈ పథకంపై తప్పుడు ప్రచారం చేస్తోంది. రాష్ట్రంలో 55 లక్షల మంది పేదలు ఇళ్లు కట్టుకున్నారు. ఓటీఎస్ అనేది బలవంతపు పథకం కాదు. నిర్ణీత రుసుం చెల్లిస్తే ఇళ్లకు ఉచితంగా రిజిస్ట్రేషన్ చేయిస్తాం. పట్టణాల్లో రూ.15 లక్షల విలువైన ఇంటిని రూ.25వేలకే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. తెదేపా అధికారంలోకి వస్తే ఉచిత రిజిస్ట్రేషన్ అనేది తప్పుడు ప్రచారం. నిర్ణీత రుసుం కట్టి ఓటీఎస్ కింద రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ప్రజలు ఎక్కడా ఓటీఎస్‌ను వ్యతిరేకించడం లేదు. ఈ నెల 20వ తేదీ నుంచి రిజిస్ట్రేషన్లు ప్రారంభిస్తాం. ఓటీఎస్‌తో రిజిస్ట్రేషన్ చేస్తే ఇంటిపై పూర్తి హక్కులు వస్తాయి. రిజిస్ట్రేషన్ పూర్తయ్యాక ఇళ్లు అమ్ముకోవచ్చు. బ్యాంకుల్లో ఇళ్లు తాకట్టు పెట్టి రుణం తీసుకొనే అవకాశం ఉంటుంది’’ అని బొత్స సత్యనారాయణ వెల్లడించారు.
ఓటీఎస్‌పై దుష్ర్పచారం చేస్తే కఠిన చర్యలు: సీఎం
జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం ఓటీఎస్‌పై దుష్ర్పచారం చేస్తోన్న వారిపై కఠినంగా ఉండాలని సీఎం వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు. దుష్ర్పచారం చేసే అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. సీఎం కార్యాలయ అధికారులతో సమావేశమైన జగన్ ఈమేరకు ఆదేశాలిచ్చారు. ఓటీఎస్ పథకం ద్వారా లక్షల మంది పేదలకు లబ్ధి జరుగుతుందని, చట్టపరంగా హక్కులు దఖలుపడతాయన్నారు. ఇంతలా మేలు చేస్తున్న ఈ పథకం పట్ల దురుద్దేశ పూర్వకంగా చేస్తున్న ప్రచారంపై చర్యలు తీసుకోవాలన్నారు. లబ్ధిదారుల్లో సందేహాలు, అనుమానాలు ఉంటే అధికారులు ఒకటికి రెండు సార్లు అవగాహన కల్పించాలన్నారు. పథకం ద్వారా వచ్చే లబ్ధిని, రిజిస్టర్ పత్రాల ద్వారా వారికి మాఫీ అవుతున్న అసలు, వడ్డీ వివరాలను కూడా వివరించాలని అధికారులను సీఎం ఆదేశించారు.
0 Response to "A house worth Rs 15 lakh in towns can be registered for as little as Rs 25,000: Botsa"
Post a Comment