Omicron
Omicron : పిల్లలు , టీకా వేసుకోనివారికి ఎక్కువ ముప్పు .. డబ్ల్యూహెచ్ఎ హెచ్చరికలు
న్యూఢిల్లీ: కరోనా వైరస్(Coronavirus) కొత్త వేరియంట్ ఒమిక్రాన్(Omicron Variant) ప్రపంచాన్ని వణికిస్తున్నది. ఇప్పటికే సుమారు 40 దేశాల్లో ఈ కేసులు నమోదయ్యాయి.
డబ్ల్యూహెచ్‌వో చీఫ్ సైంటిస్టు సౌమ్య స్వామినాథన్ ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ పలు కీలక విషయాలు వెల్లడించారు. డెల్టా వేరియంట్‌తో పోల్చితే ఒమిక్రాన్ మూడు రెట్లు అధికంగా రీఇన్ఫెక్ట్ అయ్యే సామర్థ్యాన్ని కలిగి ఉన్నదని తెలిపారు. అయితే, ఈ వేరియంట్ గురించి సమగ్ర అభిప్రాయానికి ఇప్పుడే రాలేమని అన్నారు. కానీ, పెరుగుతున్న కేసులకు, హాస్పిటల్‌లో అడ్మిట్ అవుతున్న వారి సంఖ్యకు మధ్య తేడా ఎక్కువగా ఉన్నదని వివరించారు. అంటే, ఒమిక్రాన్ బారిన పడ్డవారిలో చాలా మంది హాస్పిటల్స్‌లో చేరాల్సిన ముప్పులోకి వెళ్లడం లేదని తెలిపారు. అయితే, ఈ వేరియంట్ తీవ్రతను అధ్యయనం చేయడానికి మరో రెండు లేదా మూడు వారాలు వేచి ఉండాల్సిందేనని అన్నారు.
ఒమిక్రాన్ వేరియంట్ తొలిసారిగా వెలుగు చూసిన దక్షిణాఫ్రికాలో కేసుల గురించి సైంటిస్టు సౌమ్య స్వామినాథన్ ప్రస్తావించారు. ఆ దేశంలో ఒమిక్రాన్ కారణంగా కేసులు భారీగా పెరుగుతున్నాయని అన్నారు. అయితే, అందులోనూ ఈ వేరియంట్ బారిన పిల్లలు ఎక్కువగా పడుతున్నట్టు రిపోర్టులు వచ్చాయని వివరించారు. ఆ దేశం టెస్టుల సంఖ్యనూ గణనీయంగా పెంచిందని చెప్పారు. ఈ సందర్భంలోనే ఒమిక్రాన్ వేరియంట్ కారణంగా చిన్న పిల్లలకు, ఒక్క డోసు కూడా వేసుకోని వారికి ముప్పు ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నదని తెలిపారు. అదే సమయంలో చిన్న పిల్లలకు ఇంకా వ్యాక్సిన్‌లు పెద్ద మొత్తంలో అందుబాటులో లేవనీ అన్నారు.
పిల్లలకు టీకా ఎక్కువగా అందుబాటులో లేవని, చాలా తక్కువ దేశాలు మాత్రమే పిల్లలకు టీకాలు వేస్తున్నాయని వివరించారు. ఒమిక్రాన్ కారణంగా కేసులు పెరిగినప్పుడు పిల్లలు, టీకా ఒక్క డోసు కూడా వేసుకోని వారికి ముప్పు ఎక్కువగా ఉండవచ్చని అన్నారు. అయితే, పిల్లలపై ఒమిక్రాన్ వేరియంట్ ప్రభావాన్ని ఇంకా అంచనా వేయాల్సి ఉన్నదని, అందుకు డేటా ఇంకా కావాల్సి ఉన్నదని చెప్పారు.
టీకా పంపిణీపైనా సైన్స్ ఆధారిత విధానాలను అవలంభించాల్సి ఉంటుందని ఆమె సూచించారు. ఇది వరకు మనం ఎదుర్కొన్న వైరస్‌నే ఎదుర్కొంటున్నామనే విషయాన్ని గుర్తుంచుకోవాలని, కాబట్టి, కట్టడి చర్యలు అవే ఉంటాయని తెలిపారు. అయితే, ఈ ఒమిక్రాన్ వేరియంట్ కోసం ప్రత్యేక టీకా కావాలని భావిస్తే.. దానికంటే ముందు మరో నిర్ధారణకు రావాల్సి ఉంటుందని చెప్పారు. ముందు ఈ వేరియంట్ వైరస్ సామర్థ్యాన్ని ఎంత వరకు తప్పించుకోగలుగుతున్నది అనే విషయాన్ని నిర్ధారించుకోవాలని చెప్పారు. ఆ తర్వాతే ప్రత్యేక టీకాను అభివృద్ధి చేయాల్సి ఉంటుందని అన్నారు.
0 Response to "Omicron"
Post a Comment