CM Jagan's decision today on PRC - Review with executives: Tension among employees.
PRC పై నేడు సీఎం జగన్ నిర్ణయం - అధికారులతో రివ్యూ : ఉద్యోగుల్లో ఉత్కంఠ .
ప్రభుత్వ ఉద్యోగులు..పెన్షనర్లకు ముఖ్యమంత్రి జగన్ గుడ్ న్యూస్ చెప్పబోతున్నారా. ఈ రోజు ఆ నిర్ణయం వెలువడే అవకాశం ఉందా. తాజాగా, తిరుపతి పర్యటనలో ముఖ్యమంత్రి జగన్ వారం - పది రోజుల్లో పీఆర్సీ పైన నిర్ణయం ఉంటుందని వెల్లడించారు. ఇదే అంశం పైన ఉద్యోగ సంఘాల నేతలు ఇప్పటికే నిరసనలకు దిగారు. మూడు రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కొనసాగిస్తున్నారు. ఈ సమయంలో ఈ రోజున ముఖ్యమంత్రి జగన్ ఆర్దిక శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. పీఆర్సీ నివేదిక..ప్రభుత్వ పరంగా ఆర్దికంగా ఉన్న వెసులుబాటు గురించి చర్చించనున్నారు.
ఇప్పటికే సీఎం జగన్ హామీ
ఉద్యోగుల నుంచి పీఆర్సీ అమలు కోసం ఉద్యోగ సంఘాల నేతల పైన ఒత్తిడి పెరుగుతోంది. ఇదే సమయంలో ఉద్యోగ సంఘాల నుంచి ప్రభుత్వం పైన ప్రెషర్ వస్తోంది. తెలంగాణ ప్రభుత్వం 30 శాతం పీఆర్సీ అమలు చేస్తోంది. జగన్ తాను అధికారంలోకి రాగానే 27 శాతం ఐఆర్ ప్రకటిస్తానని చెప్పారు. చెప్పిన విధంగానే సీఎంగా బాధ్యతలు తీసుకున్న తరువాత తొలి సారి సచివాలయానికి వచ్చిన సీఎం 27 శాతం మధ్యంతర భృతి ప్రకటించారు. అప్పటి నుంచి అమలు చేస్తున్నారు. దీంతో..తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అప్పటి వరకు అన్ని కేటగిరీల్లోని ఉద్యోగులకు చెల్లిస్తున్న వేతనాల మొత్తం 18 వేల కోట్ల రూపాయాల మేర పెరిగాయని ప్రభుత్వంలోని ముఖ్యులు చెబుతున్నారు.
పీఆర్సీ నివేదిక.. సిఫార్సుల పైన సమీక్ష
అయితే, అశుతోష్ మిశ్ర కమిటీ ప్రభుత్వానికి సమర్పించిన నివేదికలో ఉద్యోగులకు కొత్త ఫిట్ మెంట్ తో పాటుగా హెచ్ఆర్ఏ, కనీస వేతనం, సౌకర్యాల పైన పలు సిఫార్సులు చేసినట్లు తెలుస్తోంది. ఈ నివేదికను తమకు అందచేయాలని ఉద్యోగ సంఘాల నేతలు కోరుతూ వచ్చారు. కానీ, ప్రభుత్వం నుంచి ఇంకా ఆ నివేదిక ఉద్యోగ సంఘాల నేతలకు అందలేదు. దీంతో..ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్ గత ప్రభుత్వం సమయంలో అమలు చేసిన పీఆర్సీ..ప్రకటించిన ఫిట్ మెంట్... ప్రస్తుతం అమలు చేస్తున్న 27 శాతం మధ్యంతర భృతి కి అదనంగా ఎంత మేర ఇవ్వాల్సి ఉంటుందీ... పెండింగ్ డీఏల పైన ఏ రకమైన నిర్ణయం తీసుకోవాలనే వాటి పైన ఒక అంచనాకు వచ్చే అవకాశం కనిపిస్తోంది.
ఇప్పటికే 27 శాతం ఐఆర్ అమలు
ప్రస్తుతం రాష్ట్రంలో ఆర్దిక పరిస్థితులు ఇబ్బంది కరంగా మారటంతో.. ప్రభుత్వం భారీ స్థాయిలో వేతనాలు పెంచే అవకాశం లేదని తెలుస్తోంది. దీంతో..పెండింగ్ డీఏల శాతం.. 27 శాతం మధ్యంతర భృతి కలిపి ఫిట్ మెంట్ గా ఖరారు చేస్తారా .. లేక, డీఏలను పక్కన పెట్టి.. మొత్తంగా కలిసి ఫిట్ మెంట్ గా ముందుగా ప్రభుత్వం నుంచి ఎంత శాతం ఇచ్చేది ఉద్యోగ సంఘాల ముందు ప్రతిపాదిస్తారా అనేది తేలాల్సి ఉంది. ప్రభుత్వం చేసిన ప్రతిపాదన పైన ఉద్యోగ సంఘాలతో చర్చలు జరగటం.. చివరగా సీఎం వద్ద పీఆర్సీ పైన తుది నిర్ణయం తీసుకోవటం సాధారణంగా జరిగే ప్రక్రియ. అయితే, ఇప్పుడు సీఎం ఈ రోజున నిర్వహిస్తున్న సమీక్షలో వీటన్నింటికీ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
సీఎం నిర్ణయం వైపు ఉద్యోగుల చూపు
ఉద్యోగులు ఆందోళన బాట పడుతుండటంతో... పీఆర్సీ పైన వేగంగా నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. అందులో భాగంగా.. ముఖ్యమంత్రి ఈ రోజున సమీక్షలో అన్ని డిమాండ్లు... ప్రభుత్వ పరంగా చర్యల పైన అధికారులకు దిశా నిర్దేశం చేసే అవకాశం ఉంది. ఈ సమీక్ష ముగిసిన తరువాత మరోసారి ఉద్యోగ సంఘాలతో అధికారులు చర్చించే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. దీంతో..ముఖ్యమంత్రి సమీక్షలో ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారనే ఉత్కంఠ ప్రభుత్వ ఉద్యోగుల్లో..పెన్షనర్లలో కనిపిస్తోంది. పీఆర్సీతో పాటుగా సీపీఎస్ ఉద్యోగుల విషయంలో ఇచ్చిన హామీ.. ఇప్పటికే నియమించిన కమిటీ అధ్యయనం పైనా చర్చించే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో.. మరి కొద్ది రోజుల్లోనే ప్రభుత్వ ఉద్యోగులు.. పెన్షనర్లకు సంబంధించిన పీఆర్సీ అంశం ఒక కొలిక్కి వచ్చే ఛాన్స్ కనిపిస్తోంది.
0 Response to "CM Jagan's decision today on PRC - Review with executives: Tension among employees."
Post a Comment