AP News: Salary payment as per new PRC in AP.
AP News : ఏపీలో కొత్త పీఆర్సీ ప్రకారమే జీతాల చెల్లింపు .
ఏపీలో ఇటీవల ప్రకటించిన పీఆర్సీపై ఓ వైపు ఉద్యోగ సంఘాలు ఆందోళన బాట పడుతున్నా రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తగ్గేలా కనిపించడం లేదు. కొత్త పీఆర్సీ ప్రకారమే జీతాల చెల్లింపునకు కార్యాచరణ సిద్ధం చేస్తోంది. ఈ మేరకు ట్రెజరీ కార్యాలయాలకు ఆదేశాలు జారీ చేసింది. సవరించిన పే స్కేల్స్ ఆధారంగా జీతాల్లో మార్పులు చేయాలని స్పష్టం చేసింది. మరోవైపు జీతాల చెల్లింపునకు ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను సీఎఫ్‌ఎంఎస్ సిద్ధం చేసింది.
దీంతో వచ్చే నెల ఉద్యోగులకు కొత్త పే స్కేల్ ప్రకారమే జీతాలు అందనున్నాయి. ఓ వైపు ఉద్యోగులు కొత్త పీఆర్సీని వెంటనే రద్దు చేయాలని ఉద్ధృతంగా నిరసనలు చేస్తున్నారు. మరోవైపు ఉద్యోగుల నిరసనలు ఏ మాత్రం పట్టించుకోకుండా ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. దీంతో ఉద్యోగ సంఘాలు ఎలా స్పందిస్తాయనేది చూడాలి.
అటు ప్రభుత్వ పీఆర్సీ ఉత్తర్వులకు వ్యతిరేకంగా ఏపీ వ్యాప్తంగా ఉపాధ్యాయుల కలెక్టరేట్ల ముట్టడి ఉద్రిక్తంగా మారుతోంది. సర్కారుకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఉపాధ్యాయులు ర్యాలీగా కలెక్టరేట్ల వద్దకు బయల్దేరారు. దీంతో వారిని పోలీసులు ఎక్కడికక్కడ అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లకు తరలిస్తున్నారు. మరోవైపు కలెక్టరేట్ల ముట్టడిపై పోలీసులు ఉపాధ్యాయ సంఘాల నేతలకు నోటీసులు జారీ చేశారు.
0 Response to "AP News: Salary payment as per new PRC in AP."
Post a Comment