Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Inspiration,

 కాలే కడుపున ఉదయించిన ఉజ్వల కెరటం.

Inspiration,

జీవితం ఒక విశ్వవిద్యాలయం. నేర్చుకునే మనసుండాలే కానీ ప్రతి సంఘటన అమూల్యమైన జీవిత పాఠాలను నేర్పుతుంది. ఆ పాఠాలను మనిషి గమనించగలిగితే, గుర్తుంచుకోగలిగితే జీవితాంతం అవి విలువలు నేర్పి ముందడుగు వేసేలా చేస్తాయి. మన కళ్ళ ముందే ఎందరో అద్భుత విజయాలను సాధిస్తున్నారు. కానీ సగటు జనం వాటిని గమనించరు.  ఉబుసుపోని కబుర్లతో కాలక్షేపం చేయడం, మనస్ఫూర్తిగా కష్టించి పనిచేయక పోవడం, సులభంగా ఏదయినా లభిస్తుందా అని ఎదురు చూడడం,  చివరకు నిరాశా నిస్పృహలతో కొట్టుమిట్టాడడం ఏమి చేయలేక వ్యవస్థను నిందించడం - ఈ సమాజంలో  ఇలాంటి వారిని ఎంతమందిని  మనం చూడడం లేదు.

సామాన్యుడే అసామాన్యుడు అవుతాడని, కలలు కన్నవాడే తన కలల ప్రపంచానికి రారాజు అవుతాడని, మనిషి తలుచుకుంటే అసాధ్యమన్నది లేనేలేదని, ఆత్మవిశ్వాసం తోడుగా కృషి, దీక్ష, పట్టుదలతో ముందడుగు వేసిన వాడే విజేతగా నిలుస్తాడని, సంకల్ప బలంతో సప్తసముద్రాలు దాట వచ్చని నిరూపించిన మహనీయులు ఎందరో !  స్వయంకృషితో, అచంచల విశ్వాసంతో అడుగులు వేసి అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన వీరులెందరో !  సమాజానికి ముఖ్యంగా యువతరానికి ఆదర్శంగా నిలుస్తున్న మహానుభావులెందరో !

ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు! శతకోటి పాదాభివందనాలు!

సల సల కాగే రక్తం, ఉరకలెత్తే ఉత్సాహం, దూసుకుపోయే దుందుడుకుతనం,  వెనుదిరిగి చూడని ధీరత్వం - నేటి యువతరం తలుచుకుంటే సాధ్యం కానిది ఏముంది. పిడికిలి బిగించి ముందుకు సాగితే లోకం దాసోహం అంటుంది అని  మన కళ్ళ ముందే నిరూపించి  ఈ నాటి  యువతకు ఆదర్శంగా నిలిచిన ఒక విజేత కథ ఇప్పుడు తెలుసుకుందాం.  

అతను కేరళ లోని  వాయనాడ్ దగ్గర ఉన్న కల్పేట్ట సమీపంలోని చెన్నలోడే గ్రామంలో నిరుపేద ముస్లిం కుటుంబంలో జన్మించాడు. తండ్రి కూలి. రెక్కాడితే కానీ డొక్కాడని స్థితి. రోజుకు పది రూపాయల సంపాదన ఉండేది కాదు. మూడు పూటలా భోజనం అన్నది వారి కుటుంబానికి అందని ద్రాక్ష. ఇతనికి ముగ్గురు సోదరీమణులు. వారి గ్రామంలో విద్యుచ్ఛక్తి కానీ, రోడ్లు కానీ ఉండేవి కావు. 4 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్లి ప్రైమరీ స్కూల్ లో చదువుకోవాల్సిన పరిస్థితి. తండ్రి పడుతున్న కష్టాన్ని చూసి ఈ చిన్నవాడు చలించి పోయేవాడు. తనతో తానూ ఎప్పుడూ చెప్పుకునేవాడు " ఇప్పుడు ఉన్న పరిస్థితిలో చదువుకోవడం కంటే నాలుగు డబ్బులు పని చేసి సంపాదించడం చాలా ముఖ్యం" . పరిస్థుతుల ప్రభావం, ఎదో ఒకటి చేసి సంపాదించాలన్న ఆసక్తి ఈ అబ్బాయిలో కలిగింది. దానికి తోడు 6వ తరగతి ఫెయిల్ అయ్యాడు. ఇక లాభం లేదని చదవకూడదని నిర్ణయించుకుని తన తండ్రితో పనికి వెళ్ళడానికి సిద్ధం అయ్యాడు. తండ్రి దిగ్బ్రాంతి చెందాడు.

తన కొడుకు బాగా చదువుకుని గొప్ప వాడు కావాలని అతని ఆశ. అయితే అదృష్టవశాత్తూ ఒక టీచర్ ఈ అబ్బాయికి విద్య యొక్క ప్రాముఖ్యం తెలియ చేసి నచ్చచెప్పి  చివరకు ఎటువంటి రుసుము లేకుండా తానూ చదువు చెప్తానని చెప్పి ఈ అబ్బాయిని  చదువుకునేలా ప్రోత్సహించాడు. దీనితో ఆ అబ్బాయి తిరిగి స్కూల్ కు వెళ్లి చదువుకోవడం మొదలుపెట్టాడు. పదవ తరగతి తరువాత ఇతనిని చదివించడానికి ఇతని తండ్రి దగ్గర డబ్బు లేదు. దీనితో కోజ్హికోడ్ లోని ఫరూక్ కాలేజీలో చేరాడు. దీనికి కారణం ఇతనితో పాటు  15 మంది పేద విద్యార్థులకు ఫరూక్ కాలేజీ వారు  ఉచిత భోజనం, నివాసం వారు కలిపించడమే. అయితే దీని కారణంగా ఇతర విద్యార్థులు వీరిని చిన్న చూపు చూసే వారు. ఈ సంఘటన ఆ అబ్బాయిలో మరింత కసి పెంచింది. కష్టపడి చదివాడు. కాలేజీ చదువు అనంతరం ఇంజనీరింగ్ చేయాలని ఎంట్రన్స్ పరీక్షా రాసి రాష్ట్ర స్థాయిలో 63 వ రాంక్ సంపాదించి కాలికట్ లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ అఫ్ టెక్నాలజీ లో ఇంజనీరింగ్ అడ్మిషన్ పొందాడు. 


ప్రతిష్టాత్మక NIT Calicut లో ఇంజనీరింగ్ లో చేరిన ఈ అబ్బాయే  పి సి ముస్తఫా (PC Mustafa). 1995 లో ఇంజనీరింగ్ విద్య అనంతరం బెంగుళూరు లో ఉన్న ఒక స్టార్టుప్ కంపెనీ లో 6000 రూపాయలకు ఉద్యోగంలో చేరాడు. రెండు నెలల అనంతరం మోటోరోలా కంపెనీ లో ఉద్యోగం దొరికింది. ప్రాజెక్ట్ వర్క్ మీద ఐర్లాండ్ పంపారు. అక్కడ ఒక సంవత్సరం ఉద్యోగం చేసి సిటీబ్యాంక్ దుబాయ్ లో కొత్త ఉద్యోగం లో చేరాడు. ఇక్కడ అతని మొదటి నెల జీతం 1.3 లక్షలు.  తన మొదటి జీతం  తండ్రికి పంపినప్పుడు  ఆ తండ్రి కళ్ళల్లో ఆనందబాష్పాలు. ముస్తఫా తండ్రి అతనితో ఇలా అన్నాడు. నా జీవితాంతం సంపాదించిన డబ్బుకంటే ఇది ఎక్కువ. తదనంతరం తన తండ్రి అంత వరకు చేసిన రెండు లక్షల అప్పు పూర్తిగా తీర్చి వేసాడు. ఇంతటితో ముస్తఫా సంతృప్తి చెందలేదు. జీవితంలో బాగా ఎదగాలని తహతహలాడాడు. 7 సంవత్సరాలు దుబాయ్ లో పని చేసిన తరువాత MBA చదవాలన్న కోరికతో  2003 లో బెంగుళూరు తిరిగి వచ్చాడు. తన cousins కూడా బెంగుళూరు లో ఉండడంతో వారిని క్రమంగా కలిసి సమయం వెచ్చించేవాడు.

మన చుట్టూ అవకాశాలు అనంతం. మానవాళి అవసరాలను, ఆకాంక్షలను జాగ్రత్తగా గమనిస్తే మనకు ఆ అవసరాలను ఆకాంక్షలను తీర్చగలిగే ఒక చక్కటి వస్తువు రూపొందించగలిగితే,  అవసరమైన సేవను సక్రమంగా అందించగలిగితే అదే ఆ మనిషి జీవితాన్ని అనుకోని మలుపులు తిప్పి మహనీయునిగా మారుస్తుంది.

ఒకసారి ఇతని cousin షంషుద్దీను ఇడ్లి దోస పిండి ప్లాస్టిక్ కవర్లలో చుట్టి అమ్ముతున్న విషయం ముస్తఫా తో చర్చించాడు. ఇలాంటి వ్యాపారం చేస్తే ఎలా ఉంటుంది అని అలోచించి ఒక ప్రయత్నం చేయాలన్న ఆలోచనతో వెంటనే తన సొంత పెట్టుబడి 25000 రూపాయలతో ఒక చిన్న 50 స్క్వేర్ ఫీట్ షాపులో రెండు గ్రైండర్లు, ఒక మిక్సర్, ఒక సీలింగ్ మెషిన్ తో ఇడ్లి, దోస పిండి వ్యాపారం నలుగురు cousins తో కలిసి మొదలుపెట్టారు. ముస్తఫా 50% మిగితావారు 50%  భాగస్వామ్యంతో మొదలుపెట్టారు. బెంగుళూరు లో ఉన్న 20 దుకాణాలకు వీరు ID బ్రాండ్ పేరు మీద ఇడ్లీ దోస పిండి పంపిణీ చేసేవారు. వ్యాపారం మొదటి రోజు నుంచి కొంత లాభదాయకంగా ఉండడంతో ముస్తఫా  ఇంకొక 6 లక్షల రూపాయలు వ్యాపారంలో పెట్టుబడిగా పెట్టారు. కేవలం రెండు సంవత్సరాల కాలంలోనే రోజుకు 3500 కిలోల ఇడ్లి దోస పిండి తయారు చేస్తూ 300 దుకాణాలకు పంపిణి చేయగలిగారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మానేజ్మెంట్, బెంగళూరు (IIM, Bangalore ) నుంచి 2007 లో తన mba పూర్తి చేసుకున్న అనంతరం ముస్తఫా అధికారికంగా తాను స్థాపించిన ID Fresh  కంపెనీకి  సీఈఓ గా పదవి భాద్యతలు చేపట్టారు. అనంతరం 2008 లో హొసకోటె ఇండస్ట్రియల్ ఏరియాలో 2500 స్క్వేర్ ఫీట్ షెడ్ మరొక 40 లక్షల పెట్టుబడి పెట్టి వ్యాపారం విస్తరించారు. 2009లో తన ఇంటిని అమ్మి మరొక 30 లక్షల రూపాయల పెట్టుబడి పెట్టారు.

2013 లో విదేశాలకు తమ వ్యాపారం విస్తరించి దుబాయ్ లో కార్యకలాపాలు ప్రారంభించారు. 2018 లో ఫిల్టర్ డికాషన్ వ్యాపారం  ప్రారంభించి తదనంతరం తమ ప్రోడక్ట్ రేంజ్ ను విస్తృతపరిచారు. 2022 సంవత్సరానికి 500 కోట్ల టర్నోవర్ సాధించే దిశగా కంపెనీ అడుగులు వేస్తోంది.

హీలియోన్ వెంచర్స్ మరియు ప్రేమజీ ఇన్వెస్ట్ ద్వారా కంపెనీ విస్తరణ కోసం నిధులను సేకరించింది. ID Fresh Foods ఈ రోజు 2000 కోట్ల రూపాయల సంస్థ మరియు 1000 మందికి పైగా ఉపాధి కలిపిస్తోంది.

కాలే కడుపుతో 10 రూపాయలకు ఇబ్బంది పడిన కూలీ కొడుకుగా జీవితం గడిపిన PC Mustafa  ఈ రోజు 2000 కోట్ల రూపాయల సంస్థకు అధిపతి. జీవితంలో ఎదగాలి అనుకున్నపుడు కొంత comfort వదులుకోక తప్పదు. దుబాయ్ లో లక్షల రూపాయల ఉద్యోగం వదులుకుని  నిండైన కలలతో పి సి ముస్తఫా భారతదేశం తిరిగి రాక పోయిఉంటే అతని అభివృద్ధి ఎలా ఉండేదో మనకు తెలీదు. కానీ తాను నమ్మిన కలల కోసం ముస్తఫా  వేసిన అడుగులు మొత్తం భారతదేశ యువతరానికి ఒక ఉత్ప్రేరకంగా నిలిచిందనడంలో మాత్రం ఎటువంటి సందేహం లేదు.  మీలో ఒక కొత్త పని చేయాలన్న ఉత్సాహం ఉంటె ఆ పని ఈ రోజే ప్రారంభించండి. రేపటి కొరకు వేచి చూడవద్దు. ఇదే జీవన పయనంలో విజయం సాధించిన ముస్తఫా యువతకు అందిస్తున్న సందేశం.

కలలు కంటే  ఆ కలలను  నిజం చేసుకొనేందుకు నిరంతరం కృషి చేస్తే ఒక కూలీ కొడుకు కూడా వేలకోట్ల రూపాయల వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించగలడని నిరూపించిన పి సి ముస్తఫా నిజంగా యువతరానికి గొప్ప ఆదర్శం.  

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Inspiration,"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0