"Do not stand between Rama and Anjaneya Swami"
రాముడు మైనస్ ఆంజనేయుడు
"రాముల వారికి, ఆంజనేయ స్వామికి మధ్య అడ్డంగా నిలబడకండి"
పూజారి గారు అన్న మాటలకు ఉలిక్కిపడ్డారు భక్తులందరూ. గర్భగృహంలో విగ్రహాలున్నాయి. అంతరాలయంలో భక్తులు గుమికూడి ఉన్నారు. రాములవారికి, ఆంజనేయుడికి మధ్య మనం అడ్డంగా ఉండటమేమిటి?
"మీరు కోరుకునే కోరికలన్నిటినీ రాముల వారికి నివేదించుకొండి. రాముల వారు ఆంజనేయ స్వామికి ఆదేశాలిస్తారు. మీ కోరికలను ఆంజనేయ స్వామి తీరుస్తారు. మీరు రాముడికి, ఆంజనేయుడికి మధ్య నిలుచుంటే స్వామివారు ఆదేశాలెలా ఇస్తారు. ఆంజనేయ స్వామి స్వామివారిని ఎలా చూడగలుగుతారు?"
పూజారి గారు అన్న మాటలకి ఉండబట్టలేక ఒక భక్తుడు "పంతులుగారూ .... రాముడికి, ఆంజనేయుడికి మేమెలా అడ్డం అవుతున్నాం?" అని అడిగేశాడు.
"ఇదిగో రాములవారు ఇక్కడున్నారు. అదిగో ఆంజనేయుడు అక్కడ ఉన్నాడు" అంటూ పూజారి గర్భాలయం వెలుపల మండపానికి అవతల ఉన్న ధ్వజస్తంభం దిగువ భాగం వైపు చూపించారు.
అవును .అక్కడ ఆంజనేయుడు చేతులు కట్టుకుని స్వామి ఆజ్ఞ కోసం ఎదురుచూస్తున్నట్టు విగ్రహం ఉంది.
అప్పుడు గర్భాలయంలోని మూల విరాట్టు వైపు భక్తులందరూ శ్రద్ధగా చూశారు. సీతమ్మవారు, లక్ష్మణ స్వామి కుడిఎడమల నిలుచున్నారు. నాలుగడుగుల ఎత్తు నల్లరాతి విగ్రహం రూపంలో రాముల వారు ధనుర్ధారియై ఉన్నారు. అన్ని రామాలయాల్లోనూ కనిపించే ఆంజనేయ స్వామి వీరాసనస్థితుడై కనిపించలేదు.
ఒక్క సారి భక్తులందరూ గర్భాలయంలోని రాముల వారికి, ధ్వజస్తంభం మొదట్లో ఉన్న మారుతికి మధ్య అడ్డం తొలిగారు.
ఇదే అమ్మపల్లి రామాలయం ప్రత్యేకత. అన్ని చోట్ల రాముడు, ఆంజనేయుడు కలిసి ఉంటారు. అమ్మపల్లి రామాలయంలో మాత్రం రాముడు, ఆంజనేయుడు కలిసి ఉండరు. "దేశం మొత్తం మీద ఇలాంటి రామాలయం ఇదొక్కటే" అన్నారు పూజారిగారు.
ఇలాంటి విలక్షణ రామాలయం హైదరాబాద్ మహానగరానికి కేవలం 35 కిలో మీటర్ల దూరంలో అంతర్జాతీయ విమానాశ్రయం రాకముందు భూగోళమనే మహాముగ్గులో ఒక ముగ్గుచుక్కంత చిన్న ఊరుగా ఉన్న శంషాబాద్ కి అతి చేరువలో ఉంది. శంషాబాద్ ప్రధాన రహదారి నుంచి 4.7 కి.మీ దూరంలో నర్కుడ గ్రామంలో ఉంది ఈ అమ్మపల్లి రామాలయం. పొలాల మధ్య తారురోడ్డుపై ప్రయాణం చేస్తుంటే బిడ్డని చూసి దూరం నుంచే చేతులు సాచే తల్లి వాత్సల్యంలా అల్లంత దూరం నుంచే అంతెత్తు గోపురం రా రమ్మంటుంది. కళ్లు ఇక మైలురాళ్లని, సైన్ బోర్డులను చూడవు. శతాబ్దాల ఎండా వానల్ని చూసిన 90 అడుగుల ఎత్తు గోపురం దృష్టిని కట్టిపడేస్తుంది.
రోడ్డు పక్కనే ఉన్న దేవాలయం సమీపానికి వెళ్తే సువిశాలమైన దేవాలయం, దాని విస్తృత ప్రాకారాలు, పెద్ద కంపౌండు, గుడికి ముందు పెద్దపెద్ద మంటపాటు, బాటసారుల గృహాలు, పెద్ద కోనేరు కనిపిస్తాయి. అత్యాధునిక అంతర్జాతీయ విమానాశ్రయానికి ఇంత చేరువలోనే మనం ఏడు వందల ఏళ్లు వెనక్కి వెళ్లేలా చేసేంత పెద్ద మందిరం అది. మందిరం చుట్టూ పొలాలు. దగ్గర్లో ఇళ్లు ఉండవు.
ఏడు వందల ఏళ్లంటే ఈ మందిరం భద్రాచలం కన్నా పాతదన్నమాట. ఎందుకంటే తానీషా కాలంలో రామదాసు కట్టిన మందిరం భద్రాచలం. దానికన్నా ముందు వేంగిరాజులు కట్టించిన మందిరం అమ్మపల్లి రామాలయం. వేంగి రాజులు, కాకతీయులు, కుతుబ్ షాహీలు, నిజాములు ... ఇలా తరతరాల రాజరికాల్ని చూపి ఇప్పటికీ నిలుచింది ఈ రామాలయం.
ఇక్కడి సీతారామలక్ష్మణ విగ్రహాలు, వాటి మకరతోరణాలు ఏకశిలా నిర్మితాలు. మకరతోరణాలపై దశావతారాలు దర్శనమిస్తాయి. గుడి గోపురం మహాద్భుతంగా ఉంటుంది. ఏడంతస్తుల గోపురం. ఎన్నెన్నో అద్భుత శిల్పాలు. మొత్తం గుడి శిలా నిర్మితమైతే, గోపురం మాత్రం సున్నపురాయి, ఇటుకలతో తయారైంది. ఈ మధ్యే కాస్త అక్కడక్కడా పెచ్చులూడింది. కానీ ఇప్పటికీ దాని అందం చెక్కుచెదరలేదు. వృద్ధ మహిళలోని మాతృసౌందర్యం లా ఉంటుంది గోపురపు పాతదనం .
ఇంతకీ ఇక్కడ రాముడు, ఆంజనేయుడు వేర్వేరుగా ఎందుకున్నారు? ఎందుకంటే ఇది రాములవారు సీతమ్మవారితో వనవాసం చేస్తూండగా నివసించిన ప్రదేశం. ఇక్కడనుంచే భద్రాచలం వెళ్లారు. అక్కడ పర్ణశాలలో ఉండగానే రాముల వారు మాయలేడిని వెతుకుతూ వెళ్లారు. దశకంఠుడు దొంగ జంగమ వేషంలో వచ్చాడు. నారచీరలు ఆరేసుకుంటున్న అమ్మవారిని లక్ష్మణ రేఖ దాటించి, అపహరించుకుపోయాడు. అశోకవాటికలో బందీ చేశాడు. ఆ తరువాతే రాముల వారిని ఆంజనేయుడు కలుస్తాడు. కాబట్టి శంషాబాద్ అమ్మపల్లి నాటికి కథలోకి ఆంజనేయుడు ప్రవేశించడు. కాబట్టి స్క్రీన్ ప్లే ప్రకారం ఆంజనేయుడి రంగ ప్రవేశం జరగలేదు. అందుకే ఇక్కడ ఆంజనేయుడు గర్భగృహంలో లేడు.
కథ, స్క్రీన్ ప్లే పకడ్బందీగా ఉంది కదూ!
కథ, స్క్రీన్ ప్లే అంటే గుర్తొచ్చింది. తొమ్మిదెకరాల్లో విస్తరించిన ఈ గుడి సినిమావాళ్లకి ఫేవరిట్ షూటింగ్ స్పాట్. శ్రీమద్ పోతులూరి వీరబ్రహేంద్రస్వామి సినిమాలో కనిపించే గుడి ఇదే. అప్పట్నుంచి ఇప్పటి దాకా దాదాపు 300 సినిమాల షూటింగ్ ఈ గుడి పరిసరాల్లోనే జరిగింది. శ్రీఆంజనేయం, అన్నమయ్య, మర్యాదరామన్న, మురారి, బృందావనం, బావ ఇలా ఈ గుడి కనిపించని సినిమా అంటూ ఉండదు. ఇక్కడ సినిమా తీస్తే బొమ్మ బాగా ఆడుతుందన్న నమ్మకం. అందుకే ఎప్పుడూ ఏదో ఒక షూటింగ్ ఇక్కడ జరుగుతూనే ఉంటుంది.
ఈ సినిమా వాళ్ల వల్లే గుడి బాగుపడింది. ప్రాకారాలు మెరుగయ్యాయి. దేవుడికి పూజాదికాల్లో లోటు లేకుండా జరుగుతోంది.
శంషాబాద్ వెళ్లినప్పుడు ఆకాశంలోకి దూసుకుపోయే విమానాల అంతర్జాతీయ ఆశ్రయం చూడండి.
అంతరిక్షాల ఎత్తు, అంతరాళాల లోతు ఉన్న అమ్మపల్లి ఆధ్యాత్మిక ఆశ్రయం చూడటం మరిచిపోకండి.
0 Response to ""Do not stand between Rama and Anjaneya Swami""
Post a Comment