Teachers do not have that right
ఆ హక్కు టీచర్లకు లేదు
- విధాన నిర్ణయాలను ప్రశ్నించలేరు
- మీ పిల్లలను ఎక్కడ చదివిస్తున్నారు?
- యూనియన్ లీడర్లను నా ముందుకు రమ్మనండి
- నా దగ్గర అందరూ ఒప్పుకొని వెళ్లారు
- నా దగ్గర అందరూ ఒప్పుకుని వెళ్లారు. ఆ యూనియన్ లీడర్లను నా ముందుకు రమ్మనండి. ఆ ఎమ్మెల్సీలను పిలిచి మీటింగ్ పెడతాను. మేం కాదన్నామని వాళ్లను చెప్పమనండి
- రాష్ట్ర విద్యా శాఖా మంత్రి బొత్స సత్యనారాయణ
ఉపాధ్యాయులు, సంఘాలు ప్రభుత్వ విధానాలను అమలు చేయాలే తప్ప వ్యతిరేకంగా వ్యవహరించడం సరికాదని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ప్రభుత్వ విధానపరమైన నిర్ణయాలను ప్రశ్నించే హక్కు ఉపాధ్యాయులకు ఎక్కడిదని ప్రశ్నించారు. ఉద్యమాలు చేసే ఉపాధ్యాయులు వారి పిల్లలను ఎక్కడ చదివిస్తున్నారో చెప్పాలన్నారు. ‘‘ఉపాధ్యాయుల పిల్లలను ఎల్‌కేజీ, యూకేజీలో జాయిన్ చేస్తున్నారు. మన ఇంట్లో పిల్లలు బాగా చదువుకోవాలి. పునాదులు దిట్టంగా ఉండాలి. కానీ పేదవాడి పిల్లలు మళ్లీ పేదవాడిగా ఉండాలి. మనకు ఊడిగం చేయాలనే విధంగా వ్యవహరించడం కరెక్ట్ కాదు’’ అని అన్నారు. ప్రాథమిక స్థాయిలో గట్టి పునాది వేసేందుకే పాఠశాలల విలీనం చేశామన్నారు. విద్యను అందరికీ అందజేయాలనే లక్ష్యంతో జాతీయ విద్యా విధానంలో భాగంగానే పాఠశాలల విలీనాన్ని ప్రభుత్వం చేపట్టిందన్నారు. సోమవారం అమరావతి సచివాలయంలో మంత్రి విలేకరులతో మాట్లాడారు.
ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యత పెంచేందుకే సంస్కరణలు చేపట్టామని తెలిపారు. ఉపాధ్యాయులు, ఉద్యోగులు ప్రభుత్వంలో అంతర్భాగమన్నారు. ఎవరో కావాలనే కుట్రలు చేసి ఈ విధానాన్ని అడ్డుకోవాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ‘‘ఉపాధ్యాయ సంఘాలు అన్నింటినీ పిలిచి మాట్లాడాను. ఉద్యోగ రీత్యా వారికి ఏమైనా ఇబ్బందులు వస్తే వాటిపై పోరాడవచ్చు. వాటిపై సవరణలు కోరవచ్చు. మమ్మల్ని నిర్భందించవచ్చు. కానీ విధానాల మార్పు గురించి సంఘాలు మాట్లాడడం సమంజం కాదు. గతంలో 1 నుంచి 5వ తరగతి వరకు ఒకే క్లాస్ రూం, ఒకే టీచరు ఉన్న స్కూళ్లు రాష్ట్రంలో ఎన్ని ఉన్నాయో వారే చెప్పాలి. ఆ విధంగా ఉండకూడదనే మార్పులు తెచ్చాం. 3 నుంచే సబ్జెక్ట్ టీచర్లను తెచ్చాం. ఈ రోజు మొదలు పెడితే రేపటికల్లా ఫలాలు రావు. నాలుగైదేళ్లు పడుతుంది. ఉపాధ్యాయులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చదివించాలి. పిల్లలు ప్రైవేటు పాఠశాలలకు ఎందుకు వెళుతున్నారని పరిశీలిస్తే... అక్కడ పిల్లలపై ఫోకస్ పెడతారు.
ప్రభుత్వ పాఠశాలల్లోనూ ఇలాగే ఫోకస్ పెట్టాలని ఉపాధ్యాయ సంఘాలను కోరాను. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పిల్లలను మీ పిల్లల్లాగే చూడాలని కోరాను. ఉపాధ్యాయులు కొన్ని ఇబ్బందులు చెబితే వాటిని పరిష్కరించాం. ఉపాధ్యాయ సంఘాలతో మంచి వాతావరణంలో చర్చలు జరిగాయి. వాళ్లు సంతోషంగా రిసీవ్ చేసుకున్నారు. ఉద్యమాలు ఎందుకు చేస్తున్నారో అర్థం కావడం లేదు. నా దగ్గర అందరూ ఒప్పుకుని వెళ్లారు. ఆ యూనియన్ లీడర్లను నా ముందుకు రమ్మనండి. ఆ ఎమ్మెల్సీలను పిలిచి మీటింగ్ పెడతాను. మేం కాదన్నామని వాళ్లను చెప్పమనండి. పాఠశాలల విలీనంపై విద్యార్థుల తల్లిదండ్రులను ఎవరో కావాలనే తప్పుదోవ పట్టిస్తున్నారు. ఎన్ని ఉన్నా మా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని మేం నమ్ముతాం. 5800 స్కూళ్లు మ్యాపింగ్ చేస్తే 268 స్కూళ్లపై అభ్యంతరాలు వచ్చాయి. మేం అడిగితేనే ఎమ్మెల్యేలు అభ్యంతరాలు తెలియజేశారు. అంటే మిగతావన్నీ ఓకే కదా. అభ్యంతరాలు పరిశీలించి అవసరమైతే మార్పులు చేస్తాం’’ అని బొత్స అన్నారు. పాఠ్యపుస్తకాల జాప్యానికి ప్రైవేటు పాఠశాలల ఇండెంట్ లోపమే కారణమని చెప్పారు. 15 రోజుల్లో అన్ని ప్రైవేటు పాఠశాలలకు పాఠ్యపుస్తకాలు పంపిణీ చేస్తామన్నారు.
0 Response to "Teachers do not have that right"
Post a Comment