How are proverbs born? Do all proverbs come true?
సామెతలు ఎలా పుట్టాయి ? సామెతలన్నీ నిజమవుతాయా ?
సామెతలు మన పూర్వీకుల నుండి మనకు వారసత్వ సంపదగా వచ్చాయి. 'లోకోక్తిముక్తావళి' అనే సంకలనం ఉపోద్ఘాతంలో రచయిత సంస్కృతంలో 'లోకోక్తులు', 'న్యాయములు' అనే వాటినే తెలుగులో 'సామెతలు' అంటారు. లోకోక్తి అంటే విశేష లోకానుభవం గల పెద్దల మాట. ఇవి తక్కువ పదాలలో విశేషార్థాన్ని కలిగి వుంటాయని నిర్వచించాడు. సామెతలను జాతీయాలు అని కూడా వ్యవహరిస్తారు. అయితే, సామెతలు మన ఆచార వ్యవహారాలూ, జీవన శైలీ, మన కుటుంబాల నడవడిక మొదలైన అంశాల నుండి పుట్టుకొచ్చినవే...! అందుకే, సామెతల్లో మన ఆచార వ్యవహారాలూ కూడా ప్రతిబింబిస్తాయి. అంతేగాదు, ప్రజల మనస్తత్వాలు కూడా సామెతల్లో కనిపిస్తాయి.
'లోకోక్తి' పదాన్ని తెలుగులో 'నానుడి' అనీ, తమిళంలో 'పళమొళి', పంళచొళ్లు' అనీ, కన్నడంలో 'నాన్నుది' అనీ అంటారు.
అయితే, సామెతలన్నీ ఆయా ప్రాంతాల్లోని జీవన శైలి నుండి పుట్టుకొచ్చేవే... ప్రతి సామెతకూ ఒక నేపథ్యం వుంటుంది. ప్రతి సామెతా జనం నోళ్లలో నానుతూ ప్రాచుర్యం పొందినవే తప్ప ప్రత్యేకంగా ఒక రచయిత రాసినవేవీ వుండవు. కొన్ని సందర్భాల్లో సామెతలకు భిన్నంగా జరిగే సంఘటనలు సైతం వుంటాయి.
ఉదాహరణకు 'స్మశాన వైరాగ్యం, ప్రసూతి వైరాగ్యం' అనే సామెతను మనమంతా వింటూనే వుంటాం. దీని ఉద్దేశమేంటంటే, స్మశానంలో అంతిమ సంస్కారాలకై వెళ్లినవారంతా 'ఏముంది జీవితం... ఎవ్వరమైనా ఇక్కడకు రావలసిందే...' అని మాట్టాడతారు. బయటకు రాగానే రాజకీయాలూ, కుట్రలూ, కుతంత్రాలూ, పగలూ, ప్రతీకారాలూ మామూలే... ఇక ప్రసూతి వైరాగ్యమంటే కాన్పు సమయంలో భరించరాని నొప్పులు పడుతున్నప్పుడు ఆ స్త్రీ అనుకుంటుందిట... 'ఇక జీవితంలో మళ్లీ ఇలాంటి పరిస్థితిని తెచ్చుకోవద్దు.' అని. అయినా, మళ్లీ పిల్లల్ని కంటుంది. అయితే, నిజానికి తమ ఆత్మీయులు చనిపోయినప్పుడు షాక్ కి గురై గుండె ఆగి చనిపోయినవారున్నారు, ఆత్మహత్యకు పాల్పడినవారున్నారు. వారికి స్మశాన వైరాగ్యమనే మాట వర్తించదుగా...! 'ఇంటిపేరు కస్తూరివారు, ఇల్లంతా గబ్బిలాల కంపు' అనే సామెత, 'పేరు గొప్ప ఊరు దిబ్బ' సామెతలు రెండూ సమానార్థకమైనవే... 'అంగట్లో అన్నీ వున్నా అల్లుడి నోట్లో శని వున్నట్టు' అనే సామెత కొత్తల్లుడు అత్తారింటికి వెళ్తే వారు తగు మర్యాదలు చేద్దామంటే ప్రతిదానికీ ఆటంకాలెదురవడం...!! ఇలా ప్రతి సామెతకూ ఓ నేపథ్యం వుంటుంది. సామెతలనేవి మన సంస్కృతిలో భాగం.
0 Response to "How are proverbs born? Do all proverbs come true?"
Post a Comment