Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Perceptions and beliefs

గ్రహణాలూ - నమ్మకాలూ

Perceptions and beliefs

మన దేశంలో గ్రహణ సమయంలో బయటకు రాకూడదని, బయటకు వస్తే దుష్ప్రభావం కలుగుతుందనీ, పుష్యమి, అశ్లేష మొదలైన నక్షత్రాల వారికి, కర్కాటక మొదలైన రాశుల వారికి దోషాలు ఉంటాయని, వాటికి పరిహారాలు, శాంతులు చేయించుకోవాలని ప్రచారాలు జరిగాయి. గ్రహణం సమయంలో రేడియేషన్ వెలువడుతుందని, కాస్మిక్ కిరణాలు వస్తాయని అందుకే గర్భిణులు బయటకు రాకూడదని, గ్రహణం మొర్రి పిల్లలు పుడుతారని కూడా ప్రచారం చేశారు. గ్రహణం పట్టే సమయంలో ఆహారం తీసుకోకూడదని, తీసుకొంటే జీర్ణకోశంపై చెడు ప్రభావం కలుగుతుందని కూడా చెప్పారు. ఇలాంటివే రకరకాల నమ్మకాలు వివిధ దేశాల్లో అనేకం ఉన్నాయి. ఈ నమ్మకాలకు మూలం రాహు, కేతువులనే అసురులు సూర్య, చంద్రులను మింగడం వల్ల గ్రహణాలు ఏర్పడుతాయని ప్రచారంలో ఉండడమే. పాము మింగుతుందని, చైనాలో అయితే డ్రాగన్ మింగుతుందని నమ్మకాలు ఉన్నాయి. కొన్ని ఆఫ్రికా తెగలవాళ్లు గ్రహణం సమయంలో సూర్యుడి శక్తి తగ్గిపోతుందని, బాణాలకు గుడ్డలు కట్టి మంటపెట్టి ఆకాశంలోకి వేస్తారు. దానితో సూర్యుడికి శక్తివచ్చి మళ్లీ మామూలైపోతాడని వారి నమ్మకం. మన దగ్గర భద్రాచలం, చత్తీస్‌గఢ్ అడవుల్లోని గిరిజనులు గ్రహణాల వలన మంచి జరుగుతుందని సంబరాలు చేసుకొంటారు. ఇంతకీ గ్రహణానికి సంబంధించి ఏది నిజం? ఏది అబద్ధం? ఈ ప్రచారాల వెనుక ఉన్న వైజ్ఞానిక అంశాలను పరిశీలిద్దాం.

నమ్మకం :- గర్భిణులు కదలకూడదు. వారిపై, గర్భస్థ శిశువుపై చెడు ప్రభావం పడుతుంది.

 నిజం :- గ్రహణ సమయంలో ప్రత్యేకంగా వెలువడే కిరణాలు ఏమీ ఉండవు. కనుక ఏ ప్రభావమూ ఉండదు. ఇందులో భయపడాల్సిందేమీ లేదు. ఇది ఏదో ఊహాజనితమైన సమాధానం కాదు. వైజ్ఞానికంగా నిరూపితమైన అంశం. గర్భంతో ఉన్నప్పుడు కొన్ని పనులు చేయొద్దనీ, కదలకుండా పడుకోవాలని చెప్తుంటారు. గర్భిణులు బయటకు వస్తే గ్రహణ మొర్రితో పిల్లలు పుడుతారనేది అపోహ మాత్రమే. నేతి బీరకాయకు నెయ్యికి ఎలా సంబంధం ఉండదో, గ్రహణానికి, గ్రహణ మొర్రికి కూడా ఎలాంటి సంబంధం ఉండదు. మొర్రి అనేది జన్యు సంబంధమైన లోపాల వలన వస్తుంది. ముఖ్యంగా మేనరికపు పెళ్లి చేసుకొన్నవారి సంతానంలో ఎక్కువగా కనిపిస్తుంది. ఇది గ్రహణం వల్ల వస్తుందనే అపోహతోనే గ్రహణ మొర్రిగా నేటికీ మూఢనమ్మకంగా కొనసాగుతున్నది. ఆ సమయంలో కూరగాయలు కోయకూడదని, లోహపు వస్తువులు వాడొద్దని, ఇంట్లోనే పడుకొని ఉండాలని చెప్పడం మూఢాచారాలే. వీటికి వైజ్ఞానికంగా ఎలాంటి ఆధారం లేదు. ప్రతీ గ్రహణానికి ప్రకృతి సత్యాలు తెలుసుకొనేందుకు శాస్త్రవేత్తలు అనేక ప్రయోగాలు చేస్తున్నారు. కాబట్టి గ్రహణం సమయంలో దాన్ని పరిశీలించడం ద్వారా మేలే తప్ప నష్టమేం లేదు. అనేక గ్రహణాల సమయంలో వైజ్ఞానికవేత్తలు వేలాది పరిశోధనలు జరిపారు. ఇంకా జరుపుతూనే ఉన్నారు. ఇలాంటి అనేక పరిశోధనలు, ప్రయోగాలు జరిపిన నాసా, గ్రహణ సమయంలో ఎలాంటి దుష్ఫ్రభావాలు ఉండవని తేల్చి చెప్పింది.

నమ్మకం:- మనుషుల కన్నా జంతువులకు గ్రహణ శక్తి ఎక్కువ. అందుకే గ్రహణ సమయంలో చెబు ప్రభావం వల్లనే జంతువులు వింతగా ప్రవర్తిస్తాయి.

 నిజం:- గ్రహణం పట్టే సమయంలో కొన్ని జంతువులు వింతగా ప్రవర్తిస్తాయి కదా అనే అనుమానం రావొచ్చు. దీనిపై కూడా పరిశోధనలు జరిగాయి. 1991లో శాస్త్రవేత్తలు తిమింగలం వంటి సముద్ర జీవులు, పులులు, పలురకాల పక్షులు గ్రహణం సమయంలో వింతగా ప్రవర్తించడంపై పరిశోధన చేశారు. ఔల్ మంకీ అనేక ఒకరకమైన కోతులు సూర్యగ్రహణ సమయంలో వింత వింతగా ప్రవర్తించడం గమనించారు శాస్త్రవేత్తలు. వీటి విపరీత ప్రవర్తనకు కారణమేమిటో కనుగొనేందుకు 2010లో పరిశోధనలు జరిపారు. అయితే ఒక్కసారిగా వాతావరణంలో మార్పు సంభవించడం, పగటి పూట కూడా సూర్యుడు కనిపించకపోవడం వల్లే అవి ఆందోళనకు గురై వింతగా ప్రవర్తిస్తున్నాయి తప్ప ఇతరత్రా కారణాలేమీ లేవని తేల్చారు.   

 నమ్మకం:- గ్రహణ సమయంలో ఆహారపదార్థాలు పాడవుతాయి. అందుకే వాటి మూతల పైన దర్భ పెట్టాలి.

నిజం:- గ్రహణం సమయంలో ఆహార పదార్థాలు పాడైపోతాయన్నది పూర్తిగా అపోహే. వండి ఉంచిన ఆహారంలో గ్రహణం పట్టేటప్పుడు దర్బ వేయడం ద్వారా.. అవి చెడిపోకుండా ఉంటాయనే ప్రచారమూ ఉన్నది. గ్రహణ సమయంలో వాటిపై సూక్ష్మక్రిముల ప్రభావం ఎక్కువగా ఉంటుందని, అందుకే ఆ సమయంలో ఆహారం తీసుకోకూడదని చెబుతారు. వండిపెట్టిన ఆహారంలో దర్భను వేస్తే.. అది సూక్ష్మక్రిముల ప్రభావాన్ని తగ్గిస్తుందని చెబుతారు. అయితే అది శాస్త్రీయంగా నిరూపితం కాలేదు. -సాధారణంగా ఎండాకాలంలో వండుకొన్న ఆహారం త్వరగా పాడైపోతుంది. కానీ ఉష్ణోగ్రత తక్కువగా ఉన్నప్పుడు మాత్రం అలా జరుగదు. గ్రహణాల సమయంలో నీడల వలన ఉష్ణోగ్రత తగ్గుతుందే కాని, పెరుగదు. పరిశోధనల్లో తేలిందేమిటంటే సాధారణంగా 35-40 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతల్లో బాక్టీరియా పెరుగుదల ఎక్కువగాను, ఐదు డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రతలో సూక్ష్మక్రిముల ప్రభావం తక్కువగా ఉంటుంది. గ్రహణ సమయాల్లో కూడా ఉష్ణోగ్రతలు పెరుగడమంటూ ప్రత్యేకంగా ఏమీ ఉండదు. కాబట్టి ఆహారం పాడైపోయే అవకాశం ఉండదు. ఆహారం చెడిపోవడానికి , గ్రహణాలకు ఎటువంటి సంబంధం లేదనేది నిరూపిత సత్యమే.  

 నమ్మకం:- గ్రహణాలు మనపై చెడు ప్రభావం చూపుతాయి. కాబట్టి ఆ సమయంలో బయట తిరుగకూడదు.  

నిజం:- గ్రహణాల సమయంలో గురుత్వ బలాల్లో మార్పు వస్తుందని, దాని ప్రభావం మనుషుల మీద ఉంటుందని చెబుతారు కొంతమంది. గ్రహణ సమయంలో కాంతి వలన గానీ, గురుత్వ బలాల వల్లగానీ ఎలాంటి ప్రభావం మనుషుల మీద ఉండదని వైజ్ఞానికంగా నిరూపితమైంది. మామూలుగా భూమి, చంద్రుల పరిభ్రమణాల్లో ఎప్పుడో అరుదుగా సూర్యుడు, భూమి, చంద్రుడు ఒకే సరళరేఖలోకి వస్తారు. అలా వచ్చినప్పుడే గ్రహణాలు సంభవిస్తాయి. కనుక ఆ రోజు గురుత్వబలాలు మనుషుల మీద ఎక్కువగా ఉంటాయని, ఈ వాదం చేసేవారు చెబుతుంటారు. నిజమే గ్రహణాల సమయంలో ఈ మూడు ఒకే సరళరేఖలో ఉంటే 180 డిగ్రీల కోణంలో ఉంటాయి. ఇంకా సరిగ్గా చెప్పాలంటే ఈ మూడు 180 డిగ్రీల కోణంలో ఉన్నప్పుడే గ్రహణాలు ఏర్పడుతాయి. అయితే వాటి ప్రభావం వల్ల ప్రతీ పౌర్ణమి రోజు గురుత్వబలాల వల్ల సముద్రంలో ఆటుపోట్లు వస్తాయి. అదేవిధంగా మన శరీరంలో కూడా 70 శాతం నీరు ఉంటుంది. కాబట్టి మనమీద కూడా గురుత్వ బలాల ప్రభావం ఉంటుందని వాదిస్తున్నారు. దీని గురించి తెలియాలంటే గురుత్వబలాల ప్రభావం ఎందుకుంటుంది? ఎంత ఉంటుందనేది తెలుసుకోవాలి.

గురుత్వ బలాల్లో మార్పు ఆకర్షణ!

ఏదైనా వస్తువు పెద్దదవుతున్న కొద్దీ, దాని ద్రవ్యరాశి ఎక్కువ అవుతున్నకొద్దీ, దాని ఆకర్షణ బలం ఎక్కువవుతుంది. అందుకే గ్రహాలన్నీ ఎంతో భారమైన సూర్యుడి చుట్టూ తిరుగుతాయి. అంతేకాని ఒకదాని చుట్టూ ఇంకొకటి తిరుగవు. అలాగే రెండు వస్తువుల మధ్యదూరం పెరుగుతున్న కొద్ది, వాటి మధ్య ఆకర్షణ తక్కువ అవుతుంది. అందుకే చందమామ సూర్యుని జోలికి వెళ్లకుండా దగ్గరగా ఉన్న భూమి చుట్టూ తిరుగుతుంది. దూరం పెరుగుతున్న కొద్దీ గురుత్వం ఎందుకు తగ్గుతుంది? దూరానికి గురుత్వానికి ఉన్న సంబంధం ఏమిటి? న్యూటన్ దీని గురించి పరిశోధించి ఒక సత్యాన్ని తెలిపాడు. ఏ రెండు వస్తువుల మధ్య అయినా గురుత్వాకర్షణ బలం (F) వాటి ద్రవ్యరాశుల (M1, M2) లబ్దానికి అనులోమానుపాతంలోనూ, వాటి మధ్య దూరపు వర్గానికి (R2) విలోమానుపాతంలో ఉంటుంది. దూరం పదింతలు ఉంటే బలం పదో వంతుకు తగ్గుతుంది. ఇది నేడు విశ్వవ్యాప్తంగా నిరూపితమైన సత్యం. దీని ప్రభావం మన మీద ఎంత ఉంటుందనేది తెలియాలంటే న్యూటన్ సూత్రం F=G(M1,M2/D2) ను అర్థం చేసుకోవాలి. భూమి నుంచి సూర్యుడి దూరం గరిష్టంగా 15,20,98,155 కి.మీ, కనిష్టంగా 14,71,01,455 కి.మీలుగా ఉన్నాయి. అదే చంద్రుడి దూరం గరిష్టంగా 4,06,282 కి.మీ, కనిష్టంగా 356749 కి.మీలుగా ఉన్నాయి. సూర్యుని చుట్టూ భూమి, భూమి చుట్టూ చంద్రుడు తిరిగే కక్ష్యలు దీర్ఘవృత్తాకారంలో ఉంటాయి. కనుక ఈ గరిష్ట, కనిష్ట దూరాలు ఉంటాయి. అయితే పైన తెలిపిన సూత్రాల ప్రకారం లెక్కగడితే సూర్య చంద్రుల గురుత్వ బలాలు భూమి మీద ఎలా ఉంటాయో తెలుస్తుంది. సూర్యగ్రహణం రోజున సూర్యుడు, చంద్రుడు భూమికి ఒకేవైపున ఉండడం వల్ల భూమిపై వీరిద్దరి గురుత్వబలాలు ఒకేవైపు ఉంటాయి. భూమిని ఈ రెండూ ఒకేవైపునకు లాగుతాయి. అయినా భూమి గురుత్వబలం కూడా ఈ రెండింటినీ తన వైపు లాగుతుంది. చంద్రగ్రహణం సమయంలో సూర్యుని గురుత్వబలం ఒకవైపు, చంద్రుని గురుత్వబలం ఇంకోవైపు భూమిని లాగుతాయి.

ఆటుపోట్ల సంగతేమిటి?

మరి పౌర్ణమి రోజున సముద్రంలో ఆటుపోట్లకు కారణమైన గురుత్వ బలాలు మన మీద ఎలా ఉంటాయనే విషయాన్నీ తెలుసుకోవాలి. గురుత్వబలాలు దూరం, బరువుపైన ఆధారపడి ఉంటాయనే విశ్వ గురుత్వ బలసూత్రం ప్రకారం చంద్రుడి గురుత్వబలం మనపైన మన బరువులో 0.0003 వంతు ఉంటుంది. ఇది పరిగణనలోకి తీసుకోదగినది కాదు. అంటే మనమీద బలం ఏమీ ఉండదని అర్థం. అందుకే ఆటుపోట్లు అత్యధిక నీరు ఉండి, బరువు కలిగిన సముద్రంలో వస్తాయికాని, తక్కువ నీరు ఉండి బరువు తక్కువగా ఉండే చెరువు, కుంటల్లో, కుండల్లో రావు. అందువల్ల చంద్రుని గురుత్వ బలం మనమీద పెద్దగా ఉండదు. ఉదాహరణకు తుఫాన్ సమయంలో పెద్దపెద్దచెట్లు విరిగిపడినా గడ్డిపోచలు అలాగే ఉంటాయి. అటువంటిదే ఇది కూడా. అందుకే నమ్మకాలను నమ్మకాలుగానే చూడాలి. సైన్స్ మాత్రం సత్యాలను కనుగొంటుంది. అనేక పరిశోధనలతో నిరూపిస్తుంది. నిరూపణకు నిలబడనిది సైన్స్ కాదు. సత్యాలు నిరూపితమైనా నమ్ముతామనడాన్ని మూఢనమ్మకం అంటాం. గ్రహణాల గురించిన వాస్తవాలను నాసా, ఇస్రో, అంతర్జాతీయ అస్ట్రానామికల్ యూనియన్‌తో పాటు అనేక ఖగోళ పరిశోధనా సంస్థలు పరిశోధనాత్మకంగా తెలుసుకొన్నాయి. వాటిని అందరం అధ్యయనం చేయాలి. మూఢనమ్మకాలకు దూరంగా ఉండాలి.

ఆకాశంలో_నీడలాట

ఆకాశంలో భూమి, చంద్రుల నీడలాటే గ్రహణాలు. సూర్యుడు ఒక నక్షత్రం. సూర్యుని చుట్టూ గ్రహాలు తిరుగుతుంటాయి. అలాగే భూమి సూర్యుని చుట్టూ తిరుగుతున్నది. భూమి చుట్టూ తిరిగే ఉపగ్రహం చంద్రుడు. ఇలా ఇవి ఒకదాని చుట్టూ ఒకటి పరిభ్రమించేటప్పుడు సూర్యునికి భూమికి మధ్యలో చంద్రుడు వస్తే.. చంద్రుని నీడ భూమిమీద పడుతుంది. సూర్యుడికి, చంద్రునికి మధ్యలో భూమి వస్తే భూమి నీడ చంద్రుని మీద పడుతుంది. ఈ నీడలు ఇలా పడడం వల్లనే గ్రహణాలు ఏర్పడుతాయి. ఎండలో మనం వెళుతున్నప్పుడు గొడుగు పట్టుకొంటే గొడుగు నీడ మనమీద పడినట్టన్నమాట. అంటే మనకు గొడుగు గ్రహణకారకం అన్నమాట.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Perceptions and beliefs"

Post a Comment