A big test of question papers moving!
ప్రశ్నపత్రాల తరలింపే పెద్ద పరీక్ష!
- మండల కేంద్రానికి వెళ్లి తీసుకురావడం ఎలా?
- అర్ధగంటలో పరీక్ష కేంద్రానికి తేవడం సాధ్యమేనా?
సమ్మెటివ్-1 పరీక్షల ప్రశ్నపత్రాలను తీసుకువెళ్లడంపై అధికారులు ఇచ్చిన ఆదేశాలు ఉపాధ్యాయులకు ఇబ్బందిగా మారాయి. 6-10 తరగతులకు సంబంధించిన ప్రశ్నపత్రాలను ఏ రోజుకారోజు ఉదయం మండల విద్యా కార్యాలయానికి వచ్చి తీసుకువెళ్లాలని అధికారులు ఆదేశించారు. ఉపాధ్యాయులు ఉదయం 9 గంటలకే ముఖ గుర్తింపు ఆధారిత హాజరు నమోదు చేయాల్సి ఉంటుంది. ఇది పాఠశాల ఆవరణలో వేస్తే హాజరు నమోదవుతుంది. లేదంటే సెలవు పెట్టాల్సి వస్తుంది. ఉదయం ఉపాధ్యాయులు పాఠశాలకు వచ్చి 9 గంటలకు హాజరు వేసి, మండల కార్యాలయానికి వెళ్లి ఎప్పుడు ప్రశ్నపత్రాలు తీసుకురాగలుగుతారు? కొన్ని పాఠశాలలు మండల కేంద్రానికి 25 కిలోమీటర్లకు పైగా దూరంలో ఉన్నాయి. ఇంత దూరం వెళ్లి ప్రశ్నపత్రాలు తీసుకురావాల్సి ఉంటుంది. ఉదయం 9.30 గంటల నుంచే 6, 8, 10 విద్యార్థులకు పరీక్ష ప్రారంభమవుతుంది. అర్ధగంటలో బడికి వచ్చి, మండల కేంద్రానికి వెళ్లి ప్రశ్నపత్రాలు తీసుకురావడం ఎలా సాధ్యమని ఉపాధ్యాయులు ప్రశ్నిస్తున్నారు. కొన్నిచోట్ల ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు సైతం ఏరోజుకారోజు ప్రశ్నపత్రాలను మండల కార్యాలయం నుంచి తీసుకువెళ్లాలని జిల్లావిద్యాధికారులు ఆదేశాలు ఇచ్చారు. ఏకోపాధ్యాయ పాఠశాలల్లో ప్రశ్నపత్రాలు తీసుకొని వచ్చి, పరీక్ష నిర్వహించేందుకే సమయం సరిపోని పరిస్థితి ఏర్పడుతుంది. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు 6, 8, 10 తరగతులకు.. మధ్యాహ్నం 1.30 గంటల నుంచి సాయంత్రం 4.45 గంటల వరకు 7, 9 తరగతులకు పరీక్షలు నిర్వహించాల్సి ఉంటుంది. 3, 4, 5 తరగతులకు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్షలు ఉంటాయి. మండల కార్యాలయాల్లో రిసోర్సు పర్సన్లు ఉంటారు. వీరికి ప్రశ్నపత్రాల పంపిణీ బాధ్యతలు అప్పగిస్తే తమకు శ్రమ తప్పుతుందని టీచర్లు వెల్లడిస్తున్నారు. అలాగే విద్యార్థుల హాజరును ఆన్‌లైన్‌లో ఉదయం, మధ్యాహ్నం నమోదు చేయాలని ఆదేశాలు ఇచ్చారు. విద్యార్థులు రెండు విడతలుగా రావడంతో మధ్యాహ్న భోజనం పెట్టడంలో ఇబ్బందులు రానున్నాయి. ఉదయం వచ్చిన వారికి పరీక్ష అనంతరం మధ్యాహ్న భోజనం పెట్టేందుకు అవకాశం ఉంటుంది. మధ్యాహ్నం 1.30 గంటలకు వచ్చేవారి కోసం ఆహార పదార్థాలను నిల్వ చేయడం కష్టమవుతుందని, విద్యార్థులు తక్కువమంది భోజనం చేస్తే ఆహారం వృథా అవుతుందని ఉపాధ్యాయులు పేర్కొంటున్నారు.
0 Response to "A big test of question papers moving!"
Post a Comment