DA of employees is not received grapes
ఉద్యోగుల డీఏ అందని ద్రాక్ష
- సంక్రాంతి, ఉగాది అంటూ ప్రభుత్వం జాప్యం
- బకాయిలు రూ.5,350 కోట్లు
డీఏ ప్రకటనకు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు నిరీక్షణతోనే కాలం గడుపుతున్నారు. కేంద్రం తాజాగా తమ ఉద్యోగులకు ఈ ఏడాది జనవరికి సంబంధించి 4% డీఏ, డీఆర్ ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఉద్యోగ సంఘాలతో చర్చలతోనే కాలం వెళ్లదీస్తోంది. గతేడాది జనవరి, జులై, ఈ ఏడాది జనవరికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన మూడు డీఏల ఊసెత్తడం లేదు. ఈ ఏడాది జనవరిలో సీఎం జగన్‌ను ఉద్యోగసంఘాల నాయకులు కలిసినప్పుడు డీఏల్లో ఒకటి సంక్రాంతి కానుకగా ఇస్తారనే లీకులు వెలువడ్డాయి. ఆ వెంటనే కొన్ని ఉద్యోగ సంఘాలు ప్రకటనలూ చేసేశాయి. సంక్రాంతి వచ్చి వెళ్లినా డీఏ ఉత్తర్వులు మాత్రం విడుదల కాలేదు. మంత్రుల కమిటీ ఇటీవల నిర్వహించిన సమావేశంలో ఉగాది పండగకైనా ఒక డీఏ ఇవ్వాలని ఉద్యోగ సంఘాల నాయకులు కోరారు. ఈ విన్నపంపై మంత్రుల కమిటీ సానుకూలంగా స్పందించిందని.. ఉగాది సమయంలో ఉత్తర్వులు వస్తాయని నాయకులు మరోసారి ప్రకటించారు. ఉగాది వెళ్లిపోయినప్పటికీ ఉత్తర్వులు రాలేదు. తాజాగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన జరిగిన సమావేశంలోనూ డీఏ ఉత్తర్వులివ్వాలని నాయకులు కోరగా, సీఎంతో మాట్లాడి వీలైనంత త్వరగా మంజూరు చేస్తామని అన్నారు. ప్రతిసారి డీఏ ఉత్తర్వులు వస్తాయంటూ సంఘాల నాయకులు ప్రకటించడం, ఉద్యోగుల్లో ఆశలు కల్పించి ఆ తర్వాత దాని గురించి పట్టించుకోకపోవడం కొనసాగుతూనే ఉంది.
బకాయిలు మిగిలాయి
ఉద్యోగులకు పీఆర్సీ అమలు చేసిన తేదీకి ముందు చెల్లించాల్సిన డీఏ బకాయిలు రూ.2,200 కోట్లున్నాయి. జులై 2018, జనవరి 2019కి చెందిన డీఏలకు సంబంధించి 30నెలల బకాయిలు ఉన్నాయి. వీటిని ఇవ్వకుండానే ఇచ్చినట్లు చూపి ఉద్యోగులనుంచి ఆదాయపు పన్ను సైతం మినహాయించేశారు. బకాయిలు రాకపోగా ఉద్యోగులు ఎదురు డబ్బులు చెల్లించాల్సి వచ్చింది.
కేంద్రమిచ్చే డీఏలను ప్రామాణికంగా తీసుకొని రాష్ట్ర ఉద్యోగులకు డీఏను ప్రభుత్వం ప్రకటిస్తుంది. ఈ లెక్కన జనవరి, జులై 2022, జనవరి 23కు సంబంధించి వరుసగా 2.73%, 3.64%, 3.64% డీఏలు రావాల్సి ఉంది.
ప్రభుత్వం డీఏలను మంజూరుచేస్తే గతేడాది జనవరి డీఏకు సంబంధించి రూ.1,800 కోట్లు, జులైకి రూ.1,050 కోట్లు, ప్రస్తుత జనవరికి రూ.300 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. ఈ లెక్కన మొత్తం రూ.3,150 కోట్లు ఉద్యోగులకు వస్తాయి.
పీఆర్సీకి ముందు, ప్రస్తుత డీఏ బకాయిలు కలిపి మొత్తం రూ.5,350 కోట్లను ప్రభుత్వం బకాయిపడింది.
0 Response to "DA of employees is not received grapes"
Post a Comment