Don't do a job for timepass
టైంపాస్ కోసం ఉద్యోగం చేయొద్దు
- నాకు బీపీ తెప్పించకండి
- ఉపాధ్యాయులు, అధికారులపై
- పాఠశాల విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ ఆగ్రహం
- విశాఖలోని నాలుగు పాఠశాలలు ఆకస్మిక తనిఖీ
- లోపాలు గుర్తించి నిలదీత
- బుర్ర పెట్టి పనిచేయడం లేదంటూ అధికారులపై అసహనం
- ఆర్జేడీ, డీఈవో, డిప్యూటీ డీఈవో, అర్బన్ డీఐల పనితీరుపై తీవ్ర అసంతృప్తి
- క్వీన్ మేరీస్ టెన్షన్ కుప్పకూలిన గణితం టీచరు
'అనవసరంగా నాకు బీపీ తెప్పించకండి. ప్రతి ఒక్కరూ బాధ్యతగా పనిచేయాలి. టైమ్పస్ కోసం ఉద్యోగం చేయొద్దు'.. అంటూ ఉపాధ్యాయులు, అధికారుల తీరుపై పాఠశాల విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ తీవ్ర అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తంచేశారు. బుధవారం నగరంలోని నాలుగు పాఠశాలలను తనిఖీ చేసిన ఆయన ఈ సందర్భంగా పలు లోపాలను గుర్తించి అందుకు బాధ్యులైన టీచర్లు, అధికారులపై అసహనం వ్యక్తంచేశారు.
పాత నగరంలో హైస్కూలులో
జిల్లా పర్యటనకు వచ్చిన ప్రవీణ్ ప్రకాష్ ఉదయం 10.30 గంటల సమయంలో మొదట జడ్జి కోర్టు సమీపంలోని ప్రకాశరావు జీవీఎంసీ ఉన్నత పాఠశాలను సందర్శించారు. ఆయన వెంట ఆర్జేడీ జ్యోతికుమారి, డీఈవో ఎల్.చంద్రకళ, డిప్యూటీ డీఈవో గౌరీశ్వరరావు, అర్బన్ డీఐ సువర్ణ, సమగ్రశిక్ష అభియాన్ ఏపీసీ శ్రీనివాసరావు, డైట్ ప్రిన్సిపాల్ మాణిక్యనాయుడు తదితరులు ఉన్నారు. పాఠశాల పరిసరాలు పరిశీలించిన ఆయన పాత నగరంలో ఎన్ని ఉన్నత పాఠశాలలు ఉన్నాయని ప్రశ్నించడంతో అధికారులు ఎవరికి తోచిన సంఖ్య వారు చెప్పారు. దీంతో ఆయన అసహనం వ్యక్తంచేస్తూ అధికారులకు క్లాస్ తీసుకున్నారు. తరువాత నాలుగో తరగతి గదిని సందర్శించారు. ఆ సమయంలో తెలుగు టీచరు బోధన చేస్తున్నారు. ఇంగ్లీష్ టీచర్ ఎక్కడా అని ప్రశ్నించడంతో ఇంటర్మీడియట్ ఇన్విజిలేషన్ డ్యూటీకి వెళ్లారని పాఠశాల హెచ్ఎం భారతి చెప్పారు. దాంతో పక్కనే వున్న ఆర్జేడీ, డీఈవో, ఇతర అధికారుల వైపు చూస్తూ...ఇన్విజిలేషన్ విధుల ఫైలు ఎవరు పంపారని నిలదీశారు. అందుకు ఎవరికి తోచిన విధంగా వారు సమాధానం చెప్పడంతో అసహనం వ్యక్తంచేస్తూ... అనవసరంగా తనకు బీపీ తెప్పించవద్దన్నారు. ఎవరికి వారు తప్పించుకునే యత్నం చేయవద్దని, టైమ్పస్ కోసం పనిచేయకండంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. అధికారులంతా ఫైళ్లు ఫార్వడ్ చేస్తున్నారు తప్ప బుర్ర పెట్టి పనిచేయడం లేదన్నారు. సబ్జక్టు టీచర్ల కొరత నేపథ్యంలో రెండు నెలల క్రితం అర్హులైన ఎస్జీటీలకు స్కూలు అసిస్టెంట్లుగా పదోన్నతులు ఇచ్చామని వారికి అలవెన్స్లు ఇచ్చారా?, ఏ పద్దు కింద బిల్లు పెట్టాలని ప్రశ్నించడంతో... ఎవరూ సమాదానం చెప్పలేకపోయారు. చివరకు విజయవాడలో గల కమిషనరేట్లో వుండే అధికారికి ఫోన్ చేసి తక్షణమే బిల్లులు మంజూరుచేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇన్విజిలేషన్ కు సబ్జెక్టు టీచర్లను నియమించవద్దని ఆదేశించారు.
క్వీన్ మేరీస్ లో టీచర్ల పనితీరుపై అసంతృప్తి
అనంతరం వన్ టౌన్ ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలను సందర్శించి పిల్లల వివరాలను ప్రధానోపాధ్యాయుడు ధర్మేంద్రరెడ్డిని అడిగి తెలుసుకున్నారు. ఎనిమిదో తరగతి 'డి' సెక్షన్కు వెళ్లారు. క్లాస్లో 38 మంది బాలికలు ఉండగా 22 మంది గణితం పాఠ్య పుస్తకం తీసుకురాకపోవడం, ఐదుగురు మినహా మిగిలినవారు వర్క్ బుక్ రాయకపోవడం గుర్తించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కష్టపడేతత్వం, అంకితభావం ఉంటేనే ఉన్నత శిఖరాలు అధిరోహించగలమన్నారు. అనంతరం పిల్లలకు బయటకు పంపి ఆర్జేడీ, డీఈవో, క్లాస్ టీచర్లను ఉద్దేశించి మాట్లాడుతూ ఒక క్లాస్లో 90 శాతం మంది పిల్లలు వర్క్ బుక్ రాసినప్పుడు విద్యా బోధన బాగా జరుగుతున్నట్లుగా భావించాలన్నారు. తరగతిలో 38 మంది ఉంటే ఐదుగురు మినహా మిగిలినవారు వర్క్ బుక్ రాయడం లేదని... ఈ విషయంలో టీచర్ల నుంచి అధికారుల వరకు ప్రతి ఒక్కరి తప్పు ఉందన్నారు. జిల్లాలో ఎన్ని పాఠశాలలు తనిఖీ చేసి ఎంతమందిపై చర్యలు తీసుకున్నారని అధికారులను ప్రశ్నించారు. అధికారులు ఇచ్చిన సమాధానంపై ఆయన సంతృప్తి చెందలేదు సరికదా చర్యలు తీసుకున్న టీచర్లకు సంబంధించి ఫైళ్లు తనకు చూపించాలని ఆదేశించారు. ఆర్జేడీ స్థాయి అధికారి గుమస్తా విధులు నిర్వహిస్తే ఎలాగని జ్యోతికుమారిని ప్రశ్నించారు. మండలాల వారీగా ఎంఈవోల పనితీరును పర్యవేక్షించడం లేదని డీఈవో చంద్రకళను, పాఠశాలల తనిఖీలకు వెళ్లడం లేదని డిప్యూటీ డీఈవో గౌరీశంకరరావు, అర్బన్ డీఐ సువర్ణలను నిలదీస్తూ పనితీరుపై అసంతృప్తి వ్యక్తంచేశారు. ఈలోగా అక్కడే వున్న గణితం టీచరు చింతా ఉమ టెన్షన్కు గురై కుప్పకూలిపోవడంతో సహోద్యోగులు ఆమెకు సపర్యలు చేసి పక్కగదికి తీసుకువెళ్లారు.
తరువాత క్వీన్ మేరీస్ ఉన్నత పాఠశాలకు ఆనుకుని ఉన్న పోర్టు బేసిక్ ప్రాథమిక పాఠశాలకు వెళ్లగా అక్కడ నలుగురిలో ఒక్కరే విధులు నిర్వహిస్తున్నట్టు తెలుసుకున్నారు. ఇద్దరు మహిళా టీచర్లు మెటర్నటీ లీవ్లో వెళ్లగా ఒకరు వర్క్ అడ్జస్ట్మెంట్పై మరోచోటకు వెళ్లినట్టు అక్కడ ఉన్న టీచరు చెప్పారు. మొత్తం 80 మంది పిల్లలకు ఒక టీచరే పనిచేస్తే ఎలా ప్రశ్నించడంతో...తమకు తెలియదని అధికారులు చెప్పడంతో ఆయన ఆశ్చర్యపోయారు. దీనిపై వివరణ ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. చివరగా వన్ టౌన్ శివాలయం సమీపాన జీవీ ఎంపీ ప్రాథమిక పాఠశాలను సందర్శించారు. ఐదో తరగతిలో 12 మంది పిల్లలుండగా. గణితం వర్క్ బుక్ లో ఒక ప్రాబ్లమ్ కు ఇద్దరు పిల్లలే సరిగ్గా సమాధానం రాయగా మిగిలిన పది మంది తప్పుగా రాయడాన్ని గుర్తించి ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇందుకు బాధ్యుడైన టీచరుకు మెమో ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. తరువాత మొత్తం అధికారులకు అరగంట క్లాస్ తీసుకున్నారు. పనితీరు, పర్యవేక్షణ సంతృప్తికరంగా లేవని మండిపడినట్టు తెలిసింది. ఇందుకు ఇందుకు బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆయన నిర్ణయించినట్టు తెలిసింది.
0 Response to "Don't do a job for timepass"
Post a Comment