The process of transfer of teachers will begin in ten days: Minister Botsa Satyanarayana
పది రోజుల్లో టీచర్ల బదిలీల ప్రక్రియ ప్రారంభం: మంత్రి బొత్స సత్యనారాయణ
పది రోజుల్లో రాష్ట్రంలో టీచర్ల బదిలీ ప్రక్రియ ప్రారంభిస్తామని ఏపీ రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. రాష్ట్రంలోని అన్ని ఉపాధ్యాయ సంఘాలతో ఇవాళ మంత్రి బొత్స సమావేశం అయ్యారు.
విజయవాడ: రాష్ట్రంలో పది రోజుల్లో ఉపాధ్యాయ బదిలీ ప్రక్రియ ప్రారంభిస్తామని ఏపీ విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. రాష్ట్రంలోని అన్ని ఉపాధ్యాయ సంఘాలతో శుక్రవారం మంత్రి సమావేశం అయ్యారు. కొత్త విద్యా సంవత్సరంలో తీసుకోవాల్సిన చర్యలపై ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులతో చర్చించారు. బదిలీలు, పదోన్నతులపై ప్రభుత్వ ఆలోచనను ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులకు వివరించామని తెలిపారు. ప్రభుత్వ ప్రతిపాదనలు ఉపాధ్యాయ సంఘాలు ఆమోదించాయని బొత్స వెల్లడించారు.
యాప్ వల్ల సమయం వృథా అవుతోందని ఉపాధ్యాయ సంఘాలు అంటున్నాయని.. అయితే దీని ద్వారా పని ఒత్తిడి తగ్గిస్తున్నామని బొత్స తెలిపారు. టీచర్లను బోధనపైనే దృష్టి పెట్టాలని సూచించినట్లు చెప్పారు. డిజిటలైజేషన్ చేసేలా అన్ని జిల్లాల్లో బైజూస్ కంటెంట్ పెడుతున్నామని తెలిపారు. అందుకు కావాల్సిన చర్యలు తీసుకుంటున్నామన్నారు. పాఠశాల మొదలైన 3 రోజుల్లోనే విద్యా కానుక అందిస్తామన్నారు. విద్యా కానుకను ఒకే కిట్గా చేసి స్కూల్ పాయింట్లకు పంపించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు. పిల్లలకు మెరుగైన విద్య అందించడం కోసం ప్రభుత్వం కొత్త విధానాలు అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. ఈ ఏడాది కేవలం 18 రోజుల్లోనే పదో తరగతి ఫలితాలు విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు. ఎలాంటి లీకేజీ లేకుండా పారదర్శకంగా ఫలితాలు విడుదల చేయబోతున్నమన్నారు.
మంత్రి బొత్సతో సమావేశం అనంతరం ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు మీడియాతో మాట్లాడారు.
"బదిలీలకు సంబంధించి పాత సర్వీసులనే పరిగణనలోకి తీసుకుంటామని మంత్రి చెప్పారు. అవసరమైతే బదిలీ కోడ్ తీసుకొస్తామన్నారు. పాత జీవోను యథాతథంగా అమలు చేస్తామని తెలిపారు. 1,752 జూనియర్ లెక్చరర్ పోస్టుల భర్తీని చేపడతామన్నారు. విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే భర్తీ ప్రక్రియను మొదలు పెడతామని మంత్రి చెప్పారు. జీవో 117 వల్ల ఉపాధ్యాయులు ఇబ్బందులు పడ్డారు. అయితే, బదిలీల ప్రక్రియలో అక్రమాలు జరిగితే అడ్డుకుంటాం" అని ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు తెలిపారు.
0 Response to "The process of transfer of teachers will begin in ten days: Minister Botsa Satyanarayana"
Post a Comment