How did the Yadava dynasty perish after the Mahabharata war?
మహాభారత యుద్ధం తర్వాత యాదవ వంశ ఎలా నాశనమయింది?
కృష్ణుడు, బలరాముడు, రుక్మిణి, సత్యభామ వంటి వారు ఏమయ్యారు?
కురుక్షేత్రం ముగిసి, ధర్మరాజు రాజ్యాభిషిక్తుడైన 36 సంవత్సరాల తర్వాత యాదవ వినాశసనం సంభవించింది. తన నూరుగురు కుమారులు యుద్ధంలో మరణించిన దుఃఖం వల్ల గాంధారి కృష్ణునికిచ్చిన శాప ఫలమది, ఆమె అందుకు విధించిన గడువు 36 ఏళ్ళే.
యాదవ వంశ నాశనం
ఆ సంవత్సరంలో శ్రీకృష్ణుడిని చూడాలన్న కోరికతో కణ్వుడు, నారదుడు, విశ్వామిత్రుడు తమ తమ శిష్యపరివారంతో ద్వారకకు వచ్చారు. విధివశాత్తూ కృష్ణుడి పుత్రుడైన సాంబుడికి ఆడవేషం వేసి కొందరు యాదవ యువకులు సంతానం కలుగుతుందా? లేదా? అని చెప్పమని కపట వినయంతో అడిగారు. ఋషులు కోపగించి యాదవకులనాశన సమర్థమైన ఒక ముసలాన్ని (రోకలిని) కంటారని శపించడం, అలాగే తర్వాతిరోజు ముసలం పుట్టడం, దాన్ని వసుదేవుడు పొడిగా చేసి సముద్రంలో కలిపించడం జరిగాయి. ఆ తర్వాత శాపఫలితంగా ద్వారకలో నిత్యం ఏదోక ఉపద్రవం, అశుభసూచకమైన ఘటనలు జరుగుతూండడంతో గాంధారీ, ఋషులు ఇచ్చిన శాపాలు ఫలించి యాదవకుల నాశనం తప్పదని తెలిసిన కృష్ణుడు ఆ జరిగేదేదో పుణ్యక్షేత్రమూ, సముద్రతీరమూ అయిన ప్రదేశాన్ని నిర్ణయించి అక్కడే జరిగితే మంచిదని నిర్ణయించాడు. అందుకు అనుగుణంగా జాతర పేరిట అందరినీ అక్కడికి తీసుకుపోయాడు. యాదవులు మద్యపాన మత్తులయ్యారు. సాత్యకి, కృతవర్మ తగువులాడుకోవడం ప్రారంభించారు. సముద్రతీరంలో ఉన్న తుంగపరకలు శాపబలంతో ఆయుధాలు కాగా వాటితో అంతఃకలహాలతో ఒకరితో ఒకరు పోరి నాశనమయ్యారు.
కృష్ణ నిర్యాణం
అప్పటికే బలరాముడు తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోయాడు. తన కళ్ళముందే యాదవ వీరులంతా ఒకరినొకరు నరుక్కుని నాశనం కావడం చూసిన కృష్ణుడు దారుకునితో "యాదవవర్గ నాశనాన్ని తెలియజెప్పి, అర్జునుడిని ద్వారకకు తీసుకురమ్మని" పంపాడు. బభ్రుడనే మరొక యాదవుడూ మిగలగా "స్త్రీలను, గుర్రాలు, ఏనుగులు మొదలైనవాటితో సహా ద్వారకకు చేర్చమ"న్నాడు. అంతలో ఓ బోయవాడు కృష్ణుడు కనిపిస్తూండగానే బభ్రుడి మీదకు తుంగపరక విసిరి చంపాడు. ఇక ఆ పనికీ తానే పూనుకుని స్త్రీలను, గుర్రాలు, ఏనుగులు, రథాలను కృష్ణుడే వెళ్ళి ద్వారకలో వదిలాడు. వసుదేవునితో జరిగింది చెప్పి, అతను అచేతనుడైతే తెలివి తెప్పించేలా సపర్యలు చేసి, అన్నతో కలిసి శాంతంగా తపస్సు చేసుకుంటానని, ఇక అన్ని విషయాలు ఆయనే చూసుకోవాలని, అర్జునుడు వస్తాడని, మీ దుఃఖాలన్నీ పోగొడతాడని శాంతపరచి బయలుదేరాడు.
వెనుదిరిగి బలరాముడి దగ్గరకు వెళ్ళిన కృష్ణుడికి ఆయన ముఖంలోంచి ఒక మహాసర్పం వేయినోళ్ళతో ఎర్రని కాంతితో బయటికి వచ్చి తన స్వస్థానంలోకి చేరుకుంది. కృష్ణుడు తాను ఆ చోటు వదిలి అక్కడక్కడా తిరిగాడు. దేహత్యాగానికి దారి ఏదని ఆలోచిస్తే, దుర్వాసుడు గతంలో ఇచ్చిన శాపవశాన అరికాలి నుంచే తన ప్రాణాపాయం జరుగుతుందన్న మాట గుర్తొచ్చింది. కృష్ణుడు నేలపై గాఢ సమాధిలో ఉన్నాడు. ఆయన మృత్యుహేతువు కావాల్సిన జర అడవిలో జింకరూపంలో తిరుగాడుతూంటే వేటగాడు బలంకొద్దీ దాన్ని బాణంతో కొట్టాడు. ఆ బాణం కృష్ణుడి అరికాలిలో దిగింది. వేటగాడు ఇది గమనించి ఏడుస్తూ ఉంటే కృష్ణుడు ఏదార్చి, తన దేహాన్ని విడిచి స్వస్థానానికి వెళ్ళాడు.
ద్వారక మునక
యాదవ కుల నాశనాన్ని దారుకుని ద్వారా తెలుసుకున్న పాండవులు, ద్రౌపది, సుభద్ర మొదలైనవారు దుఃఖించారు. అర్జునుడు కృష్ణుని ఆజ్ఞ ప్రకారం బయలుదేరి ద్వారకా నగరానికి చేరుకుని బలరామ కృష్ణులు, యాదవ ముఖ్యులు లేని నగరాన్ని చూసి బాధపడ్డాడు. రుక్మిణీసత్యభామలు ఇద్దరూ అర్జునుడి దగ్గరకు పోయి ఎంతో దుఃఖించారు. కృష్ణుని ఇతర భార్యలూ రోదించారు. అర్జునుడు వారందరినీ ఓదార్చాడు. "ద్వారకా నగరం కొన్ని రోజుల్లో నీట మునిగిపోతుందనీ, ఈలోగా అర్జునుడు వచ్చి తమవారిని అందరినీ తీసుకుపోయి రక్షిస్తాడనీ, మరణించిన యదువీరులు అందరికీ పితృకార్యం చేస్తాడనీ" కృష్ణుడు తనకు చెప్పిన మాటలు వసుదేవుడు చెప్పాడు. వసుదేవుడు కూడా యోగనిష్ఠతో దేహాన్ని వదిలివేసాడు. అర్జునుడు ఆ ప్రకారమే అందరు యదువీరులకూ, వసుదేవునికీ సముచితంగా అగ్నిసంస్కారాలు చేశాడు.
మిగిలిన యాదవ జనులందరినీ ఇంద్రప్రస్థానికి తరలించడానికి తగిన సూచనలు, సన్నాహాలు చెప్పి తాను బలరామకృష్ణులను వెతికేందుకు అర్జునుడు బయలుదేరాడు. కొందరు ఆప్తుల సహాయంతో అడవుల్లో విపరీతంగా తిరిగి వెతికి వెతికి వేసారిపోగా చివరకు బోయవాడు దారిచూపాడు. కృష్ణుడి కళేబరం మనోహరంగా కాంతులీనుతూ పడివుంది. తర్వాతి రోజు తెల్లవారుతూనే ద్వారక మునిగిపోతుందన్న విషయం లెక్కిస్తే గుర్తుకువచ్చింది. కృష్ణుని నిర్యాణ వార్త చెప్తే యాదవ కాంతలు, ఇతరుల ప్రయాణం చేసే స్థితిలో ఉండరు. ద్వారకలో ఉండి వారంతా మునిగిపోతే తాను చేయాల్సిన కార్యాన్ని తప్పినవాడినవుతాను అనుకుని ఈ విషయాన్ని తాను, అనుసరించిన కొందరిలోనే ఉంచుకునేలా నిర్ణయించి కృష్ణుని శరీరానికి సంస్కారాలు చేసాడు.
రాత్రికి రాత్రే ద్వారకకు వెళ్ళి అక్కడ వారందరినీ బయలుదేరదీసాడు. తెల్లవారేలోగానే బయలుదేరగలిగారు. వారు బయలుదేరి కొద్ది దూరం వెళ్తూండగానే సూర్యోదయం కావచ్చింది, ఇంతలో ద్వారక వారి కళ్ళ ముందే మునిగిపోయింది. అర్జునుడు బయలుదేరదీసిన పరివారంలో సత్యభామా రుక్మిణులు కూడా ఉన్నారు. వారి ప్రాణనాధుడైన శ్రీకృష్ణుడు మరణించినట్లు వారికి అప్పటికి తెలియలేదు. ఈ స్త్రీలతో పాటు వజ్రుడు మొదలైన పురుషులు కొద్దిమంది కూడా ఉన్నారు.
దోపిడీ
పంచవటమనే చోట దారిలో విడిది చేసింది ఈ సమూహం. అర్జునుడు తప్పించి వేరే యోధులెవరూ లేని ఈ స్త్రీ బాల వృద్ధ సమూహం నగా నట్రాతో కనిపించగా ఒక దొంగల గుంపు ధైర్యం చేసి వీరిపై పడింది. స్త్రీల మీద పడి నగలు ఒలుచుకుంటూండగా అర్జునుడు ముందు హెచ్చరించి, వారు పెడచెవిన పెడితే గాండీవం ఎక్కుపెట్టి కిరాతుల మీద బాణాలు కురిపించాడు. ఒక్క బాణమూ వారి దళసరి శరీరాన్ని ఏమీ చేయలేదు. వారు చాలా తేలికపాటి బాణాలను, రాళ్ళను, కర్రలను పెట్టి మహాయోధుడైన గాండీవిపై దాడి చేశారు. మహాస్త్ర సంపన్నుడైన అర్జునుడికి చిత్రంగా ఒక్క అస్త్రానికి సంబంధించిన మంత్రమూ స్ఫురించలేదు. ఇక సాధారణమైన బాణాలను తీవ్రంగా ప్రయోగించగా, ఎప్పటికీ తరిగిపోవన్న పేరున్న అతని అమ్ములపొదిలో కాసేపటికి బాణాలు నిండుకున్నాయి.
దైవబలం లేదని తెలుసుకుని తన గాండీవ తిప్పి కిరాతులను కొడుతూ ఏదో రుక్మిణి సత్యభామ మొదలైన అష్టమహిషులను, బలరాముడి భార్యలను, ఇంకొందరు యాదవస్త్రీలను కాపాడగలిగాడు. తక్కిన స్త్రీలను కిరాతులు బాధించారు, ధనాన్ని కొల్లగొట్టారు. చేయగలిగిన నాశనం చేసి వెళ్ళిపోయారు.
తుది ఘట్టం
ఈ విపత్తు వల్ల క్షీణించిన జనాన్ని తీసుకుని, సాధారణ దారిదోపిడీగాళ్ళ చేతిలో చిత్తు అయిన అర్జునుడు కురుక్షేత్రానికి వెళ్ళాడు. అక్కడ ఆప్తులందరికీ జరిగింది చెప్పాడు. ఆపైన తన రాజ్యంలో వివిధ నగరాలను మిగిలిన యాదవ కుమారులకు పంచిపెట్టి, ఒక్కో కుటుంబపు బాధ్యత ఒక్కొక్కనికి అప్పగించి వారి పట్ల తన బాధ్యతను నెరవేర్చాడు.
చివరకు ఒకరోజు బలరామ కృష్ణుల నిర్యాణం గురించి, ఏ కారణంగా అప్పుడు ఈ సంగతి చెప్పలేదన్న విషయాన్ని గురించి వారి భార్యలకు చెప్పాడు. ఇంతకాలమూ చెప్పనందుకు తనకు పాపం చుట్టుకుందని బాధపడగా ఆ యాదవకాంతలు అర్జునుడిని ఓదార్చారు. రుక్మిణి, జాంబవతి, తదితర స్త్రీలు సహగమనం చేసారు. సత్యభామ, మరికొందరు తీవ్రమైన తపస్సు చేయడానికి అడవులకు వెళ్ళిపోయారు.
అలా ముగిసింది.
0 Response to "How did the Yadava dynasty perish after the Mahabharata war?"
Post a Comment