The Rameshwaram Cafe
The Rameshwaram Cafe: ఆ హోటల్ ఆదాయం నెలకి నాలుగున్నర కోట్లు
అది రోడ్డు పక్కన ఓ చిన్న హోటల్. కానీ ఎప్పుడు చూసినా జనాలతో కిక్కిరిసిపోయి ఉంటుంది. కొన్నిసార్లు క్యూలో గంటలకొద్దీ నిల్చోవాల్సిన పరిస్థితి. అలాగని అక్కడేమన్నా ప్రత్యేకమైన పదార్థాలు దొరుకుతాయా అంటే అదీ లేదు.
కేవలం ఇడ్లీ, ఉప్మా, పొంగల్, పూరీ, మైసూర్ బోండా వంటివే ఉంటాయి. రోజుకి ఏడు వేల మందికిపైగా అల్పాహారం వడ్డిస్తున్న ఆ హోటల్ ఆదాయం నెలకి నాలుగున్నర కోట్లపైమాటే. అదెలాగో తెలుసుకోవాలంటే బెంగళూరులోని 'రామేశ్వరం కెఫె'కి(The Rameshwaram Cafe) వెళ్లాల్సిందే.
ప్రముఖ ట్రేడ్ ప్లాట్‌ఫామ్ 'ఉడాన్' సహవ్యస్థాపకుడు సుజిత్‌కుమార్ ఈ మధ్య ఓ పాడ్‌కాస్ట్‌లో- జీరోగా మొదలై హీరోగా ఎదిగిన 'రామేశ్వరం కెఫె' గురించి మాట్లాడాడు. '10/10 చదరపు అడుగుల విస్తీర్ణంలోనే ఉండే రామేశ్వరం కెఫెలో రోజుకు ఏడున్నర వేల మందికి వడ్డిస్తూ... నెలకు నాలుగున్నర కోట్లకు పైగా వ్యాపారం చేస్తున్నారు. 70శాతం లాభాలు పొందుతున్నారు' అని సుజిత్ ఎంతో గొప్పగా చెప్పిన ఆ హోటల్ ప్రత్యేకతలు అన్నీ ఇన్నీ కావు.
జాతీయగీతంతో మొదలు
చిన్న కిరాణాకొట్టు సైజులో 2021లో ఈ హోటల్‌ను ప్రారంభించారు బెంగళూరుకు చెందిన దివ్య, రాఘవేంద్రరావు దంపతులు. వాళ్లకి అబ్దుల్ కలాం దైవంతో సమానం. అందుకే హోటల్‌కు ఆ మహనీయుడు పుట్టి పెరిగిన రామేశ్వరం పేరును ఎంచుకుని 'రామేశ్వరం కెఫె'గా నామకరణం చేశారు. సమయం ఎవరికైనా విలువైందే... అందుకే వినియోగదారుల సమయం వృథా చేయకుండా వీలైనంత త్వరగా వడ్డించే పద్ధతి పెట్టుకున్నారు దివ్య, రాఘవలు. రుచిలోనూ, నాణ్యతలోనూ రాజీ పడకూడదని ఫ్రిజ్ కూడా వాడరు. ఇడ్లీ- దోశ పిండి- చట్నీ లాంటి వాటిని ప్రతి అరగంటకోసారి రుబ్బే ఏర్పాటు ఉందక్కడ. ఆ హోటల్‌లో ప్లాస్టిక్ వస్తువు కనిపించదు. వడ్డించే ప్లేటు నుంచి పార్శిళ్ల వరకూ స్టీలువేే వాడతారు. పండుగ, ప్రత్యేక సందర్భాల్లో దక్షిణ భారతదేశ ప్రసాదాలను వడ్డిస్తారు. కాంబో రూపంలో దొరికే ఈ ప్రసాదాలకోసం అభిమానులు పెద్ద సంఖ్యలో వెళుతుంటారు. పైగా ప్రతిరోజూ జాతీయగీతం ఆలపించాకే సిబ్బంది వంటగదిలో అడుగుపెడతారు. రుచీ, శుచీ పాటిస్తామని ప్రమాణం చేశాకే పనులు మొదలుపెడతారు. తక్కువ ధరకే ఆహారం అందిస్తున్న రామేశ్వరం కెఫె రుచి గురించి ఏడాది తిరిగే సరికి కేవలం నోటి ప్రచారంతోనే నగరమంతా తెలిసింది. అందుకే ఉదయం, సాయంత్రం వేళ అయితే కస్టమర్లు బారులు తీరి ఉంటారు. అలానే నెట్‌లో వచ్చే రివ్యూలనూ చదువుతూ... కస్టమర్ల సలహాలూ సూచనలూ పాటించే ఈ దంపతులు- తాము సరిదిద్దుకోవాల్సినవి ఏమైనా ఉంటే వెంటనే సరి చేసుకుంటారు. ఈ మధ్యనే రెండుమూడు బ్రాంచీలను కూడా ఏర్పాటు చేసిన దివ్య రాఘవల కథ సినిమా స్టోరీని తలపిస్తుంది.
ఇద్దరివీ రెండు దారులు
దిగువ మధ్యతరగతి కుటుంబానికి చెందిన దివ్య సీఏ పూర్తి చేసి ఆడిటర్‌గా స్థిరపడింది. కొన్నాళ్లకు అహ్మదాబాద్ ఐఐఎంలో పీజీ చేయడానికి వెళ్లింది. అక్కడ ఒక ప్రొఫెసర్... మెక్‌డోనాల్డ్స్, స్టార్‌బక్స్, కేఎఫ్‌సీ విజయగాథలు చెబుతూ 'ఇండియన్స్ వేస్ట్.. ఇలాంటి ఇంటర్నేషనల్ ఫుడ్‌చైన్‌ను ఒక్కదాన్నీ సృష్టించలేకపోయారు' అన్నాడు. ఆ మాటలు దివ్యకు చివుక్కుమనిపించాయి. దక్షిణ భారత వంటకాలతో ఓ బ్రాండ్‌ను ఏర్పాటు చేయాలనే ఆలోచన కలిగింది. సరిగ్గా అదే సమయంలో కామన్ ఫ్రెండ్స్ ద్వారా పరిచయం అయ్యాడు రాఘవ. నిరుపేద కుటుంబానికి చెందిన రాఘవకు ఫుడ్ బిజినెస్ అంటే ఆసక్తి. మెకానికల్ ఇంజినీరింగ్ చదివినా అనుభవం కోసమని హోటళ్లలో కప్పులు కడగడం నుంచి కూరగాయలు కోయడం వరకూ చిన్నాచితకా పనులు చేశాడు. అక్కడే కౌంటర్ బాయ్‌గా, క్యాషియర్‌గా, మేనేజర్‌గానూ కొన్నాళ్లు ఉన్నాడు. కొంతకాలానికి స్నేహితులతో కలిసి రోడ్డు పక్కన ఫుడ్ కోర్ట్ నడిపించి నష్టపోయాడు. అందుకు సంబంధించి సలహాలకోసం దివ్యను కలిశాడు. ఆమెతో మాట్లాడాక 'ఈ అమ్మాయి వ్యాపార భాగస్వామి అయితే బాగుంటుంది' అనుకుని ఆమె ముందు అదే ప్రపోజల్ పెట్టాడు రాఘవ. దివ్య ఇంట్లో మాత్రం అందుకు ఒప్పుకోలేదు. కష్టపడి చదివిస్తే దోశలు అమ్ముకుంటావా అన్నారు. కానీ ఐఐఎంలో భారతీయుల్ని కించపరిచిన ప్రొఫెసర్ మాటలు గుర్తొచ్చి రాఘవతో కలిసి రామేశ్వరం కెఫె మొదలు పెట్టింది దివ్య. కలిసి వ్యాపారం చేస్తూ కోట్ల సంపాదనతో ముందుకెళ్లడమే కాదు... జీవితంలోనూ ఎందుకు కలిసి ఉండకూడదు అనుకున్న దివ్య- రాఘవలు గతేడాదే పెళ్లి చేసుకున్నారు.
0 Response to "The Rameshwaram Cafe"
Post a Comment