Weight Control Diet
Weight Control Diet: బరువు అత్యంత వేగంగా తగ్గించే మార్నింగ్ బనానా డైట్ గురించి తెలుసుకుందాం.
ప్రస్తుత బిజీ యుగంలో మనిషి ఆహారపు అలవాట్లు పూర్తిగా మారిపోయాయి. లైఫ్‌స్టైల్ గాడి తప్పేసింది. జంక్ ఫుడ్స్‌కు బాగా అలవాటు పడటంతో ఊబకాయం లేదా అధిక బరువు పెను సమస్యగా మారిపోయింది.
ఫలితంగా ఎన్నో రకాల వ్యాధులు చుట్టుముడుతుంటాయి. కొన్ని రకాల పద్ధతులు పాటిస్తే అధిక బరువు నుంచి ఇట్టే విముక్తి పొందవచ్చంటున్నారు డైటిషియన్లు.
మనిషి పిట్ అండ్ స్లిమ్‌గా ఉంటే వివిధ రకాల వ్యాధుల్నించి రక్షణ కల్పించుకోవచ్చు. కానీ వివిధ రకాల చెడు ఆహారపు అలవాట్లు, అస్తవ్యస్తమైన జీవనశైలి కారణంగా బరువు అదే పనిగా పెరిగిపోతోంది. స్థూలకాయం కారణంగా రక్తపోటు, కొలెస్ట్రాల్, డయాబెటిస్, గుండె పోటు వంటి వ్యాధులు చుట్టుముడుతుంటాయి. అధిక బరువు సమస్య నుంచి విముక్తి పొందేందుకు చాలామంది చాలారకాలుగా ప్రయత్నిస్తుంటారు. డైటింగ్ చేయడం, వ్యాయామం లేదా వాకింగ్ చేయడం చేస్తుంటారు. లేదా గంటల తరబడి జిమ్‌లో వర్కవుట్లు చేస్తుంటారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా సరైన ఫలితాలు దక్కవు ఒక్కోసారి. ఈ క్రమంలో జపాన్‌లో బహుళ ప్రాచుర్యంలో ఉన్న మార్నింగ్ బనానా డైట్ అద్భుతమైన ఫలితాల్ని ఇస్తుందంటున్నారు డైటిషియన్లు. ఈ డైట్ ఎలా ఉంటుందో తెలుసుకుందాం..
బరువు తగ్గించేందుకు మార్నింగ్ బనానా డైట్‌కు చాలా తక్కువ కాలంలో ప్రాచుర్యం లభించింది. ఈ డైట్‌తో విజయవంతంగా బరువు తగ్గించుకోవచ్చని చాలా సందర్భాల్లో నిరూపితమైందని డైటిషియన్లు అంటున్నారు. ఈ డైట్ ప్రకారం ఉదయం అల్పాహారం స్థానంలో కేవలం అరటి పండ్లు మాత్రమే తీసుకోవాలి. ఒకటి లేదా అంతకంటే ఎక్కువ అరటి పండ్లు తీసుకోవచ్చు. ఆ తరువాత లంచ్, డిన్నర్ సమయంలో కొన్ని నియమాలు పాటించాల్సి ఉంటుంది. బ్రేక్‌ఫాస్ట్‌లో అరటి పండ్లు తీసుకున్నప్పుడు ఇక కాఫీ , టీ తాగకూడదు.
ఇక భోజనం వేళలు కచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. మద్యాహ్నం భోజనం 2 గంటల్లోపు పూర్తి చేయాలి. ఇక రాత్రి భోజనం 8 గంటలకు పూర్తి కావాలి. రెండు గంటల విరామం తరువాత 10 గంటలకు నిద్రపోవాలి. రాత్రి నిద్ర కచ్చితంగా 7-8 గంటలుంటే చాలా మంచిది. అర్దరాత్రి ఎలాంటి ఆహారం తీసుకోకూడదు. అన్నింటికంటే ముఖ్యంగా మార్నింగ్ బనానా డైట్ పాటించేవాళ్లు రాత్రి వేళ స్వీట్స్ ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకోకూడదు.
సాధారణంగా బరువు తగ్గించేందుకు డైట్‌తో పాటు వ్యాయామం తప్పకుండా ఉండాలంటారు. కానీ మార్నింగ్ బనానా డైట్ విధానంలో వ్యాయామం తప్పనిసరి కాదు. అవసరమైతే మీ వీలుని బట్టి చేసుకోవచ్చు. జపాన్‌లో మొదలైన ఈ విధానానికి క్రేజ్ పెరుగుతోంది. చాలామంది ఫాలో అవుతున్నాయి. ఈ విధానానికి శాస్త్రీయ ఆధారాల్లేకపోయినా చాలామందికి పాజిటివ్ ఫలితాలు సాధిస్తుండటంతో ప్రాచుర్యంలో వచ్చింది.
అయితే మార్నింగ్ బనానా డైట్ విధానాన్ని మధుమేహం వ్యాధిగ్రస్థులు దూరంగా ఉండాలి. ఎందుకంటే మధుమేహం వ్యాధిగ్రస్థులు అరటి పండ్లకు దూరంగా ఉండాలని వైద్యులు పదే పదే సూచిస్తుంటారు. అందుకే మీ ఆరోగ్య పరిస్థితిని బట్టి ఈ డైట్ పాటించాల్సి ఉంటుంది.
0 Response to "Weight Control Diet"
Post a Comment