AP TET Exam 2024 Updates
AP TET 2024 : గుడ్ న్యూస్... ఏపీలో 'టెట్' నోటిఫికేషన్.? మారిన నిబంధనలు.
AP TET Exam 2024 Updates : టీచర్ ఉద్యోగ అభ్యర్థులకు గుడ్ న్యూస్ చెప్పింది ఏపీ విద్యాశాఖ. ఇప్పటికే డీఎస్పీపై స్పష్టమైన ప్రకటన చేయగా.. 'టెట్' నిర్వహణపై కీలక అప్డేట్ ఇచ్చింది.
ఏపీ టెట్ - 2024
AP TET Exam 2024 Updates : ఓవైపు డీఎస్పీ నోటిఫికేషన్ విడుదల చేసేందుకు ఏపీ విద్యాశాఖ కసరత్తు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే మంత్రి బొత్స సత్యనారాయణ పలుమార్లు కీలక ప్రకటనలు చేశారు. ఎన్నికలలోపే డీఎస్సీ నిర్వహించాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే…. టెట్ పరీక్షకు సంబంధించి కీలక అప్డేట్ వచ్చేసింది. డీఎస్సీకి ముందు టెట్ పరీక్షను నిర్వహించాలని విద్యాశాఖ యోచిస్తోంది. ఈ నేపథ్యంలో…. రేపోమాపో టెట్ నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.
2022లో టెట్ పరీక్షను నిర్వహించింది ఏపీ విద్యాశాఖ. ఆ తర్వాత నోటిఫికేషన్ రాలేదు. అయితే కీలకమైన డీఎస్సీ ప్రకటన రానున్న నేపథ్యంలో… చాలా మంది విద్యార్థులు టెట్ పరీక్షపై ఆశలు పెట్టుకున్నారు. ముఖ్యమంగా 2022, 2023 కాలంలో డీఈడీ, బీఈడీ పూర్తిచేసిన వారు ఇందులో ఉన్నారు. వీరే కాకుండా…గతంలో క్వాలిఫై కాని అభ్యర్థులు కూడా టెట్ నిర్వహించి డీఎస్సీకి అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. అయితే వీరికి కూడా ఛాన్స్ ఇవ్వాలనే ఉద్దేశ్యంతో… టెట్ పరీక్ష నిర్వహణపై దృష్టిపెట్టింది. టెట్ నిర్వహిస్తే… దాదాపు 5 లక్షల మందికిపైగా రాయవచ్చని విద్యాశాఖ అంచనా వేస్తోంది.
నిబంధనల మార్పు
మరోవైపు టెట్ రాసే అభ్యర్థుల అర్హతలపై కీలక ఉత్తర్వులను ఇచ్చింది ఏపీ సర్కార్. గతంలో ఉన్న పలు నిబంధనలను మార్పులు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 1వ తరగతి నుంచి 5 వరకు బోధించే సెకండరీ గ్రేడ్ టీచర్లకు నిర్వహించే టెట్-1 పేపర్‌కు రెండేళ్ల డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీఈఎల్‌ఈడీ), నాలుగేళ్ల బ్యాచిలర్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (బీఈఎల్‌ఈడీ) చేసిన వారే అర్హులని తెలిపింది. అంతేకాకుండా…. పేపర్ 1 రాసే అభ్యర్థులు ఇంటర్మిడియట్‌లో 50 శాతం మార్కులు సాధించి ఉండాలి. ఇప్పటివరకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులకు టెట్ పేపర్–2ఏ రాసేందుకు డిగ్రీలో 50 శాతం మార్కులు తప్పనిసరి అనే నిబంధన ఉంది. దీన్ని సవరించి ఆ మార్కులను 40 శాతానికి తగ్గించింది. వచ్చే టెట్ నోటిఫికేషన్ కు ఈ నిర్ణయాలను వర్తింపజేయనున్నారు.
గతంలో ఎస్జీటీ పోస్టులకు బీఈడీ చేసిన వాళ్లు కూడా అర్హులు అవుతారని జాతీయ ఉపాధ్యాయ విద్యామండలి చెప్పింది. అందుకు అనుగుణంగా చాలా రాష్ట్రాల్లో బీఈడీ పూర్తి చేసిన వాళ్లు కూడా ఎస్జీటీకి అర్హులయ్యారు. కానీ గతేడాది ఈ నోటిఫికేషన్‌ను సుప్రీంకోర్టు రద్దు చేసింది. ఫలితంగా బీఈడీ చేసినవాళ్లకు ఎస్జీటీ పోస్టులకు రాసే అవకాశం లేకుండా పోయింది. ఈ నేపథ్యంలోనే ఏపీ సర్కార్ కూడా ఈ సవరణ ఉత్తర్వులు ఇచ్చింది.
త్వరలోనే విడుదల చేయబోయే ఏపీ డీఎస్సీలో సుమారు 6 వేల నుంచి 10 వేల ఉపాధ్యాయ పోస్టుల భర్తీ చేయనున్నట్లు సమాచారం. వీటిలో ఎస్జీటీ పోస్టులు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. జిల్లాల వారీగా ఖాళీల వివరాలను అధికారులు సేకరిస్తున్నారు. అయితే గత అసెంబ్లీ సమావేశాల్లో విద్యాశాఖలో 18,500 ఖాళీలు ఉన్నట్లు ప్రభుత్వం తెలిపింది.
0 Response to "AP TET Exam 2024 Updates"
Post a Comment