Suffering from kidney stones?`
`కిడ్నీ లో రాళ్ల బాధ?`
కిడ్నీ రాయి పోరు ఇంతింత కాదు. అతిశయోక్తిలా అనిపించినా మత్తుమందు ఇవ్వకుండా శస్త్రచికిత్స చేసినంత తీవ్ర నొప్పి కలిగిస్తుంది. ఒక చిన్న రాయి ఇంతలా బాధపెట్టగలదంటే నమ్మశక్యమూ కాదు. అందుకే కిడ్నీ రాళ్ల వేదనను అనుభవించిన వారెవరైనా మళ్లీ వీటి బారినపడకూడదనే కోరుకుంటారు. కానీ దురదృష్టవశాత్తూ రాళ్లు ఏర్పడే స్వభావం గలవారికివి మాటిమాటికీ వస్తుంటాయి. ఎండాకాలంలోనైతే మరింత ఎక్కువ. తీవ్రంగానూ వేధిస్తాయి. పర్యావరణ మార్పులతో కాలాలు విపరీతంగా మారిపోవటం.. ఈసారి వేసవి ముందుగానే రావొచ్చని, ఎండలు ఇంకాస్త ఎక్కువగానూ కాయొచ్చని హెచ్చరికలు వెలువడుతున్న తరుణంలో అప్రమత్తత అవసరం. కిడ్నీ రాళ్ల కారణాలు, నివారణ మార్గాలను తెలుసుకొని ఇప్పటి నుంచే జాగ్రత్తగా మసలు కోవటం మంచిది.
ఎక్కడి కిడ్నీ, ఎక్కడి రాళ్లు? వీటికి సంబంధమేంటి? అసలివి కిడ్నీల్లోకి ఎలా వస్తాయి? చాలామంది ఇలాగే విస్తుపోతుంటారు. భోజనం చేస్తున్నప్పుడు ఆహారం ద్వారా లోపలికి వెళ్లిన రాళ్లు కిడ్నీల్లోకి చేరుకుంటాయనీ భావిస్తుంటారు. ఇవి బయటి నుంచి వచ్చేవి కావు. శరీర స్వభావాన్ని బట్టి లోపలే తయారవుతాయి. పేరుకు రాళ్లుగా పిలుచుకున్నా నిజానికివి స్ఫటికాలు. ఒకరకంగా ఉప్పు గడ్డల్లాంటివని చెప్పుకోవచ్చు. ఉప్పు నీటిని పొయ్యి మీద పెట్టి మరిగిస్తే నీరంతా ఆవిరయ్యి, స్ఫటికాలు మిగులుతాయి కదా. కిడ్నీల్లోనూ సరిగ్గా ఇలాగే జరుగుతుంది. సాధారణంగా కిడ్నీలు రక్తాన్ని వడపోసి.. క్యాల్షియం ఆక్జలేట్, క్యాల్షియం ఫాస్ఫేట్, యూరిక్ ఆమ్లం, సిస్టీన్ వంటి వ్యర్థాలను వేరుచేసి.. వాటిని మూత్రం ద్వారా బయటకు పంపించేస్తాయి. మూత్రంలో వీటి మోతాదు మితిమీరినప్పుడో, వీటిని బయటకు వెళ్లగొట్టటానికి తగినన్ని ద్రవాలు లేనప్పుడో లోపల అక్కడే పోగు పడతాయి. ముందు చిన్న నలుసుల్లా.. ఇసుక రేణువుల్లా గూడుకట్టి.. క్రమంగా పెద్దగా అవుతాయి. చివరికి రాళ్ల మాదిరిగా ఏర్పడతాయి
ఎవరిలో ఏర్పడతాయి?
కిడ్నీ రాళ్లు ఎవరికి వస్తాయో చెప్పటం కష్టం. ఇది శరీర తత్వాన్ని బట్టి ఉంటుంది. కొన్ని కుటుంబాల్లో ఎక్కువగా వస్తుండటం చూస్తుంటాం. ఇలాంటివారిలో జన్యుపరమైన అంశాలు కారణం కావొచ్చు. దీర్ఘకాలం ఒంట్లో నీటిశాతం తగ్గటం, కొన్నిరకాల ఆహార అలవాట్లూ దోహదం చేస్తుండొచ్చు. అయితే రాళ్లు ఏర్పడే తత్వం ఎవరికి ఉందనేది ముందుగా తెలిసే అవకాశం లేదు. ఒకసారి వస్తే గానీ ఆ విషయం బయటపడదు
`ఎందుకు ఏర్పడతాయి?`
కిడ్నీలు, మూత్రనాళాలు, మూత్రాశయం.. ఇలా మొత్తం మూత్రకోశం మొత్తాన్ని పరిగణనలోకి తీసుకొని చూస్తే రెండు రకాల రాళ్లు కనిపిస్తాయి. ఒకటి- మూత్రాశయంలో తయారయ్యేవి. ఇవి చిన్న పిల్లల్లో, వృద్ధుల్లో ఎక్కువగా కనిపిస్తుంటాయి. దీనికి కారణం మూత్రాశయంలో మూత్రం నిల్వ ఉండటం. పిల్లల్లో రాళ్లు ఏర్పడటానికి పోషణలేమి, ఒంట్లో నీటిశాతం తగ్గటం (డీహైడ్రేషన్) దోహదం చేస్తుంటాయి. మనలాంటి అభివృద్ధి చెందుతున్న దేశాల పిల్లల్లో కిడ్నీ రాళ్లు ఎక్కువగా ఉండటానికి కారణమిదే. మలివయసులో మగవారిలో ప్రోస్టేట్ గ్రంథి ఉబ్బటం, విసర్జన సాఫీగా సాగకపోవటం వల్ల కొంత మూత్రం లోపల నిల్వ ఉండటం వల్ల రాళ్లు ఏర్పడుతుంటాయి. రెండు- కిడ్నీలో తయారై మూత్రనాళంలోకి వచ్చేవి. ఇవి చాలావరకు యువతీ యువకుల్లో, మధ్యవయసులో.. 25 నుంచి 40 ఏళ్ల వారిలో తలెత్తుతుంటాయి.
మూత్రకోశ ఇన్‌ఫెక్షన్‌తోనూ రాళ్లు ఏర్పడొచ్చు. తరచూ ఇన్‌ఫెక్షన్లు తలెత్తటం వల్ల మూత్రంలోని ఫాస్ఫేట్లు స్ఫటికాలుగా ఏర్పడి, రాళ్లుగా మారతాయి. ఇవి దుప్పి కొమ్ముల మాదిరిగా (స్టాగ్‌హార్న్), పెద్దగా ఉంటాయి.
మెడ వద్ద ఉండే పారాథైరాయిడ్ గ్రంథి కూడా కారణం కావొచ్చు. ఒంట్లో క్యాల్షియం మోతాదులను నియంత్రించే ఇది అతిగా పనిచేస్తే రక్తంలో క్యాల్షియం మోతాదులూ పెరుగుతాయి. ఫలితంగా రాళ్లు ఏర్పడే ముప్పూ ఎక్కువవుతుంది.
`అన్నీ ఒకటేనా?`
రసాయన మిశ్రమాలను బట్టి రకరకాల రాళ్లు ఏర్పడుతుంటాయి. అన్నింటికన్నా క్యాల్షియం ఆక్జలేట్, క్యాల్షియం ఫాస్ఫేట్ రాళ్లు ఎక్కువ. యూరిక్ ఆమ్లం, సిస్టీన్‌తోనూ రాళ్లు ఏర్పడొచ్చు. క్యాల్షియంతో కూడిన రాళ్లు మాత్రమే ఎక్స్‌రేలో కనిపిస్తాయి. అదే యూరిక్ ఆమ్లం రాళ్లయితే తెలియవు. అందువల్ల కిడ్నీ రాళ్లకు సంబంధించిన లక్షణాలు వేధిస్తున్నా ఎక్స్‌రేలో రాయి కనిపించనంతమాత్రాన సమస్యేమీ లేదనుకోవటానికి లేదు. సీటీ స్కాన్ చేసి నిర్ధరించాల్సి ఉంటుంది.
`లక్షణాలేంటి?`
- కిడ్నీ స్టోన్ యొక్క సంకేతాలు మరియు లక్షణాలు
- పక్కటెముకల క్రింద వైపు మరియు వెనుక భాగంలో తీవ్రమైన నొప్పి
- దిగువ కడుపు మరియు గజ్జలకు వ్యాపించే నొప్పి
- అలలుగా వచ్చి తీవ్రతలో హెచ్చుతగ్గులకు లోనయ్యే నొప్పి
- మూత్రవిసర్జనలో నొప్పి
- పింక్, ఎరుపు లేదా గోధుమ రంగు మూత్రం
- మేఘావృతమైన లేదా దుర్వాసనతో కూడిన మూత్రం
- వికారం మరియు వాంతులు
నొప్పి: ప్రధాన లక్షణమిదే. కిడ్నీలు రాళ్లను బయటకు నెట్టే క్రమంలో నొప్పి మొదలవుతుంది. మూత్రనాళ వ్యాసం సుమారు 5 మి.మీ. ఉంటుంది. దీని కన్నా చిన్న సైజు రాళ్లయితే నొప్పి పుడుతున్నా, మెల్లిగా కిందికి కదులుతూ వస్తాయి. మూత్రంతో పాటు బయటకూ వచ్చేస్తాయి. కొన్నిసార్లు 5 మి.మీ. కన్నా కాస్త పెద్ద రాళ్లూ బయటకొచ్చేయొచ్చు. కానీ 7-8 మి.మీ. కన్నా పెద్ద రాళ్లయితే మూత్రనాళం వంపుల్లో చిక్కుకొనే ప్రమాదముంది. అప్పుడు ఇన్‌ఫెక్షన్ తలెత్తి తీవ్రమైన నొప్పి పుడుతుంది. ఇది పక్కటెముకల కింద మొదలై వీపు వెనక వైపునకు విస్తరిస్తుంది.
చలి జ్వరం: ఇన్‌ఫెక్షన్ మూలంగా చలి జ్వరం రావొచ్చు. ఇది చాలా తీవ్రంగా 102, 103 డిగ్రీల ఫారన్‌హీట్ వరకూ ఉండొచ్చు.
మూత్రం తగ్గటం: రెండు కిడ్నీల్లోనూ రాళ్లుండి, రెండు మూత్రనాళాల్లో చిక్కుకుపోతే కిడ్నీ పనితీరు దెబ్బతింటుంది. మూత్రం పరిమాణం తగ్గుతుంది. రక్తంలో యూరియా, క్రియాటిన్ స్థాయులు పెరుగుతాయి. పరిస్థితి విషమిస్తే కిడ్నీ వైఫల్యం సంభవించొచ్చు.
మంట, రక్తం: మూత్రాశయంలో రాళ్లుంటే విసర్జనతో ముడిపడిన లక్షణాలు కనిపిస్తాయి. మూత్రమార్గానికి రాయి అడ్డుపడితే విసర్జన సాఫీగా సాగదు. మూత్రం పోస్తున్నప్పుడు మంట పుట్టొచ్చు. మూత్రాశయం పూర్తిగా ఖాళీ కాకపోవచ్చు. కొన్నిసార్లు మూత్రం పూర్తిగానూ ఆగిపోవచ్చు. మూత్రాశయం, మూత్రమార్గంలో రాయి గీసుకుపోయి రక్తం పడొచ్చు. ఒకచుక్క రక్తం స్రవించినా మూత్రం మొత్తం ఎర్రగా కనిపిస్తుంది.
కరుగుతాయా?
కిడ్నీ రాళ్లను కరిగిస్తామని కొందరు ప్రచారం చేసుకుంటుంటారు. ఇది నిజం కాదు. పూర్తిగా యూరిక్ ఆమ్లంతో తయారయ్యే రాళ్లు నీరు ఎక్కువగా తాగటం, మూత్రంలో ఆమ్ల గుణాన్ని తగ్గించటం ద్వారా కొంతవరకు కరిగే అవకాశముంది. కానీ క్యాల్షియంతో కూడిన రాళ్లు కరిగే ప్రసక్తే లేదు. చిన్నవి.. 4 మి.మీ. లోపు సైజు రాళ్లు నీరు ఎక్కువగా తాగితే వాటంతటవే బయటకు వచ్చేస్తాయి. ఇలాంటి సమయంలో ఏదైనా చికిత్స తీసుకుంటే దాని మూలంగానే బయటకు వచ్చాయని, కరిగాయని భావిస్తుంటారు. అంతే తప్ప రాళ్లు కరిగే అవకాశం లేదని గుర్తించాలి.
`అన్నింటికీ చికిత్స అవసరమా?`
*కిడ్నీలో మూలన ఉండేవి.. చిన్న (2-4 మి.మీ.) రాళ్లు ఇబ్బందేమీ కలిగించవు. చిన్నవైతే అవే బయటకొస్తాయి. వీటికి చికిత్స కూడా అవసరం లేదు. తగు జాగ్రత్తలు తీసుకుంటే చాలు. కానీ పెద్దవి, నొప్పితో వేధించే రాళ్లకు చికిత్స అవసరం. రాయి ఉన్నచోటు, రకాన్ని బట్టి చికిత్స ఆధారపడి ఉంటుంది.
మూత్రాశయంలో రాళ్లుంటే మూత్రమార్గం ద్వారా గొట్టాన్ని (యురెత్రోస్కోప్) పంపించి.. లిథోప్లాస్టీ లేదా లేజర్ పద్ధతితో విచ్ఛిన్నం చేస్తారు. అప్పుడవి ముక్కలయ్యి, బయటకు వచ్చేస్తాయి. మరీ పెద్ద రాళ్లుంటే ఒకప్పుడు బయటి నుంచి శస్త్రచికిత్స చేసి, తొలగించేవారు. ఇప్పుడు పొట్టమీద చిన్న రంధ్రంతోనే పూర్తిచేస్తున్నారు. దీని ద్వారా గొట్టాన్ని పంపించి, రాయిని విచ్ఛిన్నం చేయొచ్చు.
మూత్రనాళంలోని రాళ్లనైతే మూత్రమార్గం ద్వారా లోపలికి తిన్నని గొట్టాన్ని ప్రవేశపెట్టి రాయిని విచ్ఛిన్నం చేస్తారు. కిడ్నీలో చిన్న రాయి గలవారికీ ఈ పద్ధతి ఉపయోగపడుతుంది. కాకపోతే ఇందుకు వంగటానికి వీలైన గొట్టాన్ని ఉపయోగిస్తారు. దీన్ని రెట్రోగ్రేడ్ ఇంట్రా రీనల్ సర్జరీ (ఆర్‌ఐఆర్‌ఎస్) అంటారు. రాళ్లను విచ్ఛిన్నం చేశాక కిడ్నీ నుంచి మూత్రాశయంలోకి సన్నటి గొట్టాన్ని (స్టెంటు) అమరుస్తారు. దీంతో రాళ్ల ముక్కలు, పొడి తేలికగా బయటకు వస్తాయి. ఇన్‌ఫెక్షన్, వాపు తలెత్తవు. స్టెంటును నెలలోపు తీసేస్తారు. అవసరమైతే మూడు నెలల వరకూ ఉంచొచ్చు.
కిడ్నీలోన పెద్ద రాయి ఉంటే లోపలి నుంచి విచ్ఛిన్నం చేయటానికి చాలా సమయం పడుతుంది. పైగా కొన్ని రాళ్లను పట్టుకోలేకపోవచ్చు కూడా. ఇలాంటివారికి కీహోల్ సర్జరీ (పీసీఎల్‌ఎల్) ఉపయోగపడుతుంది. ఇందులో వెన్నుపూస పక్కన చర్మం మీద చిన్న గాటు పెట్టి.. ఎక్స్‌రే యంత్రంలో చూసుకుంటూ కిడ్నీ లోపలికి గొట్టాన్ని పంపిస్తారు. లేజర్ సాయంతో రాయిని విచ్ఛిన్నం చేసి.. పెద్ద ముక్కలను రంధ్రం నుంచే బయటకు తీస్తారు. సన్నగా, పొడిగా అయిన రాళ్లు బయటకు రావటానికి కిడ్నీ నుంచి మూత్రాశయంలోకి స్టెంటు అమరుస్తారు. దీంతో త్వరగా, తేలికగా రాళ్లు బయటకు వచ్చేస్తాయి.
రాళ్లతో పాటు ప్రోస్టేట్ గ్రంథి ఉబ్బూ గలవారికైతే రాళ్లనే కాకుండా గ్రంథి ఉబ్బును, మూత్రమార్గంలో అడ్డంకిని తొలగించటమూ ముఖ్యమే.
జాగ్రత్త: కిడ్నీ రాళ్లు ఏర్పడే స్వభావం గలవారు చికిత్స తీసుకున్న తర్వాత జాగ్రత్తలు తీసుకోవటం తప్పనిసరి. ఎందుకంటే చికిత్స అనంతరం ఎలాంటి జాగ్రత్తలూ తీసుకోకపోతే ఐదేళ్లలో 40% మందికి తిరిగి రాళ్లు ఏర్పడే ప్రమాదముంది. కాబట్టి తగినంత నీరు, ద్రవాలు తీసుకోవాలి. రాయి తీరును బట్టి ఆహారంలో మార్పులూ చేసుకోవాలి.
`స్టాగ్‌హార్న్ రాళ్లు నివారించుకోవచ్చా?`
కిడ్నీ రాళ్లు ఏర్పడే తత్వం గలవారు విధిగా కొన్ని జాగ్రత్తలు పాటించాలి. అన్నింటికన్నా ముఖ్యమైంది ఒంట్లో నీటి శాతం తగ్గకుండా చూసుకోవటం. సాధారణంగా ఒకసారి 300 నుంచి 400 ఎం.ఎల్. చొప్పున రోజుకు 2 నుంచి 2.5 లీటర్ల మూత్రం విసర్జిస్తుంటాం. దీనికి తగ్గట్టుగా.. కనీసం రెండు, మూడు లీటర్ల నీళ్లు, ద్రవాలు తీసుకోవాలి. ఎండాకాలమైతే మరో లీటరు ఎక్కువగా తాగాలి. బయట ఎండలో తిరిగేవారు, జిమ్‌లో వ్యాయామాలు చేసేవారికిది మరింత ముఖ్యం. మామూలు నీరు తాగితే కొన్నిసార్లు కడుపులో తిప్పినట్టు అనిపించొచ్చు. కాబట్టి నీటిలో నిమ్మరసం వంటివి కలిపి తీసుకోవచ్చు. బార్లీ నీరు, కొబ్బరి నీరు, పల్చటి మజ్జిగ వంటివి తాగొచ్చు. మొత్తమ్మీద తగినన్ని ద్రవాలు తీసుకోవటం ముఖ్యం. మూత్రం రంగు నీళ్ల మాదిరిగా, తెల్లగా వచ్చేలా చూసుకోవాలి. పసుపు పచ్చగా వస్తున్నట్టయితే ఒంట్లో నీరు తగ్గిందనే అర్థం. ఇది రాళ్లు ఏర్పడటానికి అవకాశం కల్పిస్తుంది.
ఆహారం: ఇప్పటికే రాయి ఉన్నవారు దాని స్వభావాన్ని బట్టి ఆహారంలో మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది. చాలావరకూ క్యాల్షియం ఆక్జలేట్ రకం రాళ్లే ఉంటాయి. ఇలాంటివారు పాలు, పెరుగు, మజ్జిగ వంటివి మితంగా తీసుకోవాలి. అలాగని పూర్తిగా మానెయ్యాల్సిన అవసరం లేదు. క్యాల్షియం లోపిస్తే ఎముకలు గుల్లబారే ప్రమాదముంది. అయితే క్యాల్షియం మాత్రల విషయంలో జాగ్రత్త అవసరం. కిడ్నీ రాళ్లు గలవారు, ఇవి తయారయ్యే స్వభావం గలవారు మాత్రలకు బదులు ఆహారం ద్వారా క్యాల్షియం లభించేలా చూసుకోవాలి. ఒకవేళ తప్పనిసరిగా మాత్రలు అవసరమైతే.. వీటిని వేసుకున్నాక రెండు, మూడు గంటల తర్వాత కొంచెం ఎక్కువగా నీటిని తాగాలి.
పాలకూర, టమోటా, క్యాబేజీ, గోబీపువ్వు, ఎండు ఫలాలు, గింజపప్పుల వంటి వాటిల్లో ఆక్జలేట్ మోతాదు ఎక్కువగా ఉంటుంది. రాళ్లు ఏర్పడే గుణం గలవారు వీటిని మానెయ్యటం మంచిది. ఒకవేళ తిన్నా కూడా నీరు ఎక్కువగా తాగితే ఇబ్బందేమీ ఉండదు.
యూరిక్ ఆమ్లం రాళ్లు గలవారు మాంసాహారం విషయంలో పరిమితి పాటించాలి. మాంసాహారంలోని ప్యూరిన్లు విడిపోయి యూరిక్ ఆమ్లంగా మారతాయి. మూత్రంలో ఆమ్లగుణం ఎక్కువగా ఉన్నప్పుడు ఇది పోగుపడి, రాళ్లుగా ఏర్పడుతుంది. కాబట్టి వీలైనంతవరకు మాంసం తినటం మానెయ్యాలి. రక్తంలో యూరిక్ ఆమ్లం మోతాదు ఎక్కువగా ఉన్నట్టయితే తగు మందులు వాడుకోవటం ద్వారానూ రాళ్లు ఏర్పడకుండా చూసుకోవచ్చు.
రక్తంలో సోడియం మోతాదు పెరిగితే కిడ్నీలు శుద్ధిచేసిన తర్వాత శరీరం తిరిగి క్యాల్షియాన్ని అంతగా గ్రహించుకోదు. అది మూత్రంలోకి వస్తూనే ఉంటుంది. కాబట్టి ఉప్పూ మితంగానే తినాలి.
తరచూ రాళ్లు ఏర్పడేవారు ఒకసారి పారాథైరాయిడ్ హార్మోన్ పరీక్ష చేయించుకోవాల్సి ఉంటుంది. ఇందులో ఏదైనా అనుమానం వస్తే స్కాన్ చేస్తారు. గ్రంథి ఉబ్బినట్టయితే సరిచేసుకోవాల్సి ఉంటుంది. తిరిగి రాళ్లు ఏర్పడకుండా చూసుకోవచ్చు.
స్టాగ్‌హార్న్ రాళ్లు గలవారు మూత్ర ఇన్‌ఫెక్షన్ రాకుండా చూసుకోవాలి. అవసరమైతే మూత్ర పరీక్ష చేసుకొని, తక్కువ మోతాదు యాంటీబయాటిక్ మందులు వాడుకోవాలి. ఇన్‌ఫెక్షన్ రాకుండా చూసుకుంటే రాళ్లను నివారించుకోవచ్చు.
0 Response to "Suffering from kidney stones?`"
Post a Comment