Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

About Rammohan Naidu

 26 ఏళ్లకే ఎంపీ, 36 ఏళ్లకు కేంద్రమంత్రి.. కింజరాపు రామ్మోహన్ నాయుడు గురించి  విషయాలు తెలుసుకుందాం.


నరేంద్ర మోదీ నేతృత్వంలో ఏర్పడనున్న కొత్త కేంద్ర మంత్రి వర్గంలో శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడుకు స్థానం ఖరారైంది.

శ్రీకాకుళం నుంచి వరుసగా మూడోసారి ఎంపీగా గెలిచిన కింజరాపు రామ్మోహన్ నాయుడుకు క్యాబినెట్ పదవి దక్కింది. టీడీపీ గెలిచిన 16 ఎంపీ స్థానాల్లో పార్లమెంట్ సభ్యుడిగా అనుభవం రీత్యా రామ్మోహన్ నాయుడు సీనియర్ కూడా.

కేంద్ర మాజీ మంత్రి, దివంగత ఎర్రన్నాయుడి కుమారుడిగా రామ్మోహన్ నాయుడు రాజకీయాల్లోకి వచ్చారు. ఆయన వయసు 36 ఏళ్లు.

ఎర్రన్నాయుడు 2012లో రోడ్డు ప్రమాదంలో మరణించడంతో రాజకీయాల్లోకి వచ్చిన రామ్మోహన్ నాయుడు 2014, 2019, 2024 ఎన్నికల్లో శ్రీకాకుళం నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీచేసి మూడుసార్లు గెలిచారు.

రామ్మోహన్ నాయుడు ఎవరిపై గెలిచారంటే?

ఎర్రన్నాయుడు వరుసగా నాలుగుసార్లు ఒకే పార్టీ నుంచి ఒకే పార్లమెంట్ స్థానానికి పోటీ చేసి గెలిచారు. రామ్మోహన్ కూడా ఇదే వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు.

టీడీపీ తరఫున శ్రీకాకుళం నియోజకవర్గం నుంచి వరుసగా మూడుసార్లు ఆయన గెలుపొందారు. ఈ మూడుసార్లు వైసీపీ నేతలపైనే ఆయన గెలిచారు.

2014లో రెడ్డి శాంతిపై, 2019లో దువ్వాడ శ్రీనివాస్‌పై, 2024లో పేరాడ తిలక్‌పై గెలిచారు. ఈసారి 3.27 లక్షల ఓట్ల మెజార్టీని అందుకున్నారు.

నిమ్మాడ నుంచి పార్లమెంట్‌కు

కేంద్ర మాజీ మంత్రి కింజరాపు ఎర్రన్నాయుడు, విజయకుమారి దంపతులకు శ్రీకాకుళం జిల్లా నిమ్మాడలో 1987 డిసెంబర్ 18న రామ్మోహన్ నాయుడు జన్మించారు.

ఎర్రన్నాయుడు టీడీపీలో కీలక నేతగా, ఉత్తరాంధ్ర గళాన్ని దిల్లీలో బలంగా వినిపించిన నాయకుడిగా ఎంతో పేరు పొందారు. ఇదే వారసత్వాన్ని ప్రస్తుతం రామ్మోహన్ నాయుడు కొనసాగిస్తున్నారనే పేరు పొందారు.

రామ్మోహన్ నాయుడు ఒకటి నుంచి 3వ తరగతి వరకు శ్రీకాకుళంలోని గురజాడ ఎడ్యుకేషనల్ సొసైటీ హాస్టల్లో ఉంటూ చదువుకున్నారు.

1994లో ఎర్రన్నాయుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ చీఫ్ విప్‌గా ఎన్నికయ్యారు. దీంతో ఆయన తన కుటుంబాన్ని శ్రీకాకుళం నుంచి హైదరాబాద్‌కు మార్చారు. దీంతో రామ్మోహన్ నాయుడు హైదరాబాద్‌లోని భారతీయ విద్యా భవన్‌లో 4, 5వ తరగతి చదివారు.

1996 ఎన్నికల్లో లోక్ సభ సభ్యుడిగా ఎర్రన్నాయుడు గెలుపొందారు. అలాగే కేంద్ర మంత్రిగా కూడా అవకాశం రావడంతో హైదరాబాద్ నుంచి దిల్లీకి మకాం మార్చారు. దీంతో రామ్మెహన్ నాయుడు ఆరో తరగతి నుంచి ఇంటర్ వరకు దిల్లీలోని దిల్లీ పబ్లిక్ స్కూల్లో చదివారు. ఆ తర్వాత ఉన్నత చదువుల కోసం ఆమెరికా వెళ్లి అక్కడ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసి, ఆ తర్వాత ఎంబీఏ కూడా చేశారు. సింగపూర్‌లో ఏడాది పాటు ఉద్యోగం చేశారు. ఆ తర్వాత దిల్లీకి వచ్చేశారు.

ఎర్రన్నాయుడి మరణంతో 2012లో 26 ఏళ్ల వయస్సులో రామ్మోహన్ రాజకీయాల్లోకి అడుగు పెట్టాల్సి వచ్చింది. తన బాబాయి కింజరాపు అచ్చెంనాయుడు ప్రొత్సాహంతో శ్రీకాకుళం ఎంపీగా 2014లో పోటీ చేసి తొలిసారి పార్లమెంట్‌లో అడుగు పెట్టారు.

కేంద్ర ప్రభుత్వాల్లో 1952 నుంచే శ్రీకాకుళం జిల్లాకు ప్రాధాన్యత ఉంది. శ్రీకాకుళం జిల్లా నుంచి వీవీ గిరి 1952 కేంద్ర కార్మిక శాఖ మంత్రిగా, 1996లో ఎర్రన్నాయుడు కేంద్ర గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రిగా పని చేయగా, 2011లో కిల్లి కృపారాణి ఐటీ, కమ్యూనికేషన్స్ శాఖ సహయ మంత్రిగా పని చేశారు.

పార్లమెంట్‌లో ప్రసంగాలతో..

లోక్‌సభలో హోమ్‌ అఫైర్స్ స్టాండింగ్ కమిటీ, కన్సల్టేటివ్ కమిటీ, పర్యాటక, సాంస్కృతిక శాఖ, అధికార భాష, వెనుకబడిన తరగతుల సంక్షేమం కమిటీలలో రామ్మోహన్ నాయుడు సభ్యులుగా ఉన్నారు. లోక్‌సభలో తన ప్రసంగాలతో ఆకట్టుకున్నారు.

పార్లమెంట్ చర్చలో హిందీ, ఇంగ్లిష్‌లో అనర్గళంగా మాట్లాడుతూ రాష్ట్ర సమస్యలను ప్రస్తావిస్తారని రామ్మోహన్ నాయుడుకు పేరుంది. ఆయన స్పీచ్‌లకు సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ కూడా ఉంది. ఉత్తరాంధ్ర అభివృద్ధికి అవసరమైన అంశాలపై రామ్మోహన్ నాయుడు పార్లమెంట్‌లో చేసిన ప్రసంగాలు ఆయనకు ఎంతో పేరు తెచ్చాయి.

2019 ఎన్నికలకు ముందు ఎన్డీయే నుంచి టీడీపీ బయటకు వచ్చిన తర్వాత లోక్‌సభలో ఏపీకి ప్రత్యేక హోదా సహా విభజన హామీలపై ఆయన మాట్లాడారు. ప్రత్యేక హోదా, విశాఖ రైల్వే జోన్, విభజన హామీలను నెరవేర్చాలంటూ టీడీపీ ఆధ్వర్యంలో పార్లమెంట్ ఆవరణలో నిరసనలు చేశారు.

వ్యక్తిగత జీవితం

రామ్మోహన్ నాయుడు 2017లో టీడీపీ నేత బండారు సత్యనారాయణ మూర్తి చిన్న కుమార్తె శ్రావ్యను పెళ్లి చేసుకున్నారు. వీరికి ఒక కుమార్తె. రామ్మోహన్ నాయుడు మామ బండారు సత్యనారాయణ మూర్తి 2024 ఎన్నికల్లో అనకాపల్లి జిల్లా మాడుగుల ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.

రామ్మోహన్ సోదరి ఆదిరెడ్డి భవానీ కూడా 2019లో రాజమండ్రి అర్బన్ ఎమ్యెల్యేగా గెలిచారు. ఆమె రాజమండ్రికి చెందిన ఆదిరెడ్డి శ్రీనివాస్‌ను వివాహం చేసుకున్నారు.

2024లో ఆదిరెడ్డి భవానీ భర్త, ఆదిరెడ్డి వాసు రాజమండ్రి ఎమ్మేల్యేగా పోటీ చేసి గెలుపొందారు. అలాగే రామ్మోహన్ నాయుడు బాబాయి, కింజరాపు అచ్చెన్నాయుడు టెక్కలి శాసనసభ్యుడిగా గెలిచారు.

పొందూరు ఖద్దరుకు జియో ట్యాంగింగ్..

కింజరాపు రామ్మోహన్ నాయుడు ఎంపీగా మూడు సార్లు గెలవడానికి ఆయన కుటుంబ నేపథ్యంతో పాటు, ఎంపీగా ఆయన చేసిన పనులే సహాయపడ్డాయని శ్రీకాకుళం జిల్లా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ జర్నలిజం విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ జి. లీలా వరప్రసాద్ అన్నారు.

"పొందూరు ఖాదీకి జియో ట్యాగింగ్ రావడంలో ఆయన కృషి చేశారు. పొందూరు ఖాదీకి 2021లో జియో ట్యాంగింగ్ లభించింది.

శ్రీకాకుళం నుంచి తిరుపతి వెళ్లేందుకు చిత్తూరుకు 2022 ఆగస్టులో ప్రత్యేక రైలుని తీసుకుని వచ్చారు. ఉత్తరాంధ్ర వాసులు ఎంతో కాలంగా ఎదురు చూసిన ఉత్తరాంధ్ర విశాఖ, వారణాసి ఎక్స్ ప్రెస్ రైలు కూడా 2023లో తీసుకొచ్చారు. ముఖ్యంగా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) నిర్వహించే స్టాఫ్ సెలక్షన్ కమిటీ, ఆర్‌ఆర్‌బీ, నీట్ ఎగ్జామ్ వంటి పరీక్ష కేంద్రాలను శ్రీకాకుళంలో కూడా ఏర్పాటు చేయించడంలో ఆయన విజయం సాధించారు" అని లీలా ప్రసాద్ తెలిపారు.

శ్రీకాకుళం జిల్లాకు చెందినవారే కాకుండా తెలుగువారు ఎవరైనా ఇతర దేశాల్లో చిక్కుకున్నప్పుడు వారిని సురక్షితంగా సొంత ప్రాంతాలకు తెచ్చేందుకు ఆయన అనేక సందర్భాలలో కృషి చేశారు.

విదేశీ వ్యవహారాల శాఖ మంత్రిని కలిసి బాధితులను వీలైనంత వేగంగా స్వదేశానికి రప్పించేలా చొరవ చూపేవారు.

ఇటీవల కిర్గిజిస్థాన్‌లో తెలుగు విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొన్నప్పుడు కూడా రామ్మోహన్ నాయుడు విదేశీ వ్యవహారాల మంత్రి జయశంకర్‌తో మాట్లాడి తెలుగు విద్యార్థులు సురక్షితంగా ఉండేలా చూశారు.

అంతకుముందు ఆఫ్రికా దేశాల్లో శ్రీకాకుళం జిల్లాకు చెందినవారు ఇబ్బందులు పడినప్పుడు కూడా ఆయన ఆదుకున్నారు.

'హామీలు ఇచ్చింది తక్కువే, నెరవేర్చింది తక్కువే'

శ్రీకాకుళం జిల్లా ప్రజలు సుదీర్ఘకాలంగా ఎదుర్కొంటున్న కొన్ని సమస్యలను పరిష్కరించలేదనే విమర్శలు కూడా రామ్మోహన్ నాయుడిపై ఉన్నాయి.

"ఉద్దానం ప్రాంత రైతులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న కొబ్బరి బోర్డును రామ్మోహన్ నాయుడు తీసుకురాలేకపోయారు. అలాగే శ్రీకాకుళం జిల్లాలోని యువత ఉపాధి కోసం వేరే రాష్ట్రాలకు, విదేశాలకు వెళ్తుంటారు. ఈ వలసలను నిలురించలేకపోయారు. అలాగే జిల్లాలోని మత్స్యకారులు ప్రాణాలకు తెగించి బంగ్లాదేశ్, పాకిస్తాన్ సరిహద్దుల వరకు చేపల వేటకు వెళ్తారు. ఉత్తరాంధ్ర తీరంలో జెట్టీలు నిర్మాణం చేసి ఈ సమస్యకు పరిష్కారం చూపవచ్చు. కానీ అందుకు ఎంపీ రామ్మోహన్ నాయుడు పెద్దగా కృషి చేసినట్టు కనిపించదు. నిజానికి ఆయన పెద్దగా హామీలు ఇవ్వరు, పార్టీ హామీలనే ప్రచారం చేస్తారు. కాబట్టి ఆయన హామీలు ఇచ్చింది తక్కువే, నెరవేర్చింది తక్కువే అని చెప్పాలి" అని రాజకీయ విశ్లేషకులు ఏ.శివ ప్రసాద్ అన్నారు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "About Rammohan Naidu"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0