August 9 is Quit India Day
ఆగస్టు 9న క్విట్ ఇండియా డే
ప్రతి ఏడాది ఆగస్టు 9న క్విట్ ఇండియా డే గురించి భావితరాలకు ఒక స్ఫూర్తిగా ఈ ఉద్యమ సంగతులు గురించి తెలియజేయడమే ముఖ్యద్దేశంగా ఈ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు.
క్విట్ ఇండియా ఉద్యమం, బ్రిటిషు పాలనను అంతం చేయాలని డిమాండ్ చేస్తూ, రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో 1942 ఆగస్టు 8న మహాత్మా గాంధీ అఖిల భారత కాంగ్రెస్ కమిటీ బాంబే సమావేశంలో ప్రారంభించిన ఉద్యమం. దీన్ని ఆగస్టు ఉద్యమం అని కూడా అంటారు.
తెల్లదొరలు దేశాన్ని వీడి వెళ్లిపోవాల్సిందిగా కోరుతూ 'క్విట్ ఇండియా' నినాదంతో నాటి భారత జాతీయ కాంగ్రెస్ ఓ ఉద్యమాన్ని చేపట్టింది. ఆ చారిత్రక దిన ఫలితమే మనం అనుభవిస్తున్న భారత స్వాతంత్ర్య స్వేచ్ఛా ఫలాలు. స్వతంత్ర పోరాటం కోసం జాతిపిత మహాత్మాగాంధీ నేతృత్వంలో అనేక ఉద్యమాలు సాగినా క్విట్ ఇండియా ఉద్యమం ఆంగ్లేయుల పాలనలో సంచలనం సృష్టించింది. అహింసామార్గంలో సాగిన ఈ ఉద్యమానికి మహాత్మాగాంధి ఇచ్చిన పిలుపుకు మేల్కొన్న జాతి యావత్తు ముందుకు తరలివచ్చింది.
ఈ ఉద్యమంలో పాల్గొన్న సమరయోధులపై బ్రిటిష్ ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. ఆరంభంలో సాత్త్వికంగా కొనసాగిన ఈ ఉద్యమం బ్రిటిష్ ప్రభుత్వం చేపట్టిన అణచివేత చర్యలతో తీవ్రరూపందాల్చింది. ఆంగ్లేయుల చర్యలను ఏమాత్రం లెక్కచేయక పలు స్వతంత్ర్య సమరయోధులు ఉద్యమాన్ని నిరవధికంగా కొనసాగించడంతో బ్రిటిష్ ఏకాధిపత్యానికి భారత్ తెరదించినట్లైంది. ఈ క్విట్ ఇండియా ఉద్యమాన్ని ప్రకటించడానికి ఒక నెలకు ముందుగానే 1942 జూలై 14వ తేదీ నుంచి అఖిల భారత కాంగ్రెస్ సమావేశం పూర్తి స్వాతంత్ర్యం లభించాలని తీర్మానం చేసింది.
ఈ తీర్మానం ప్రకారం ఓ కమిటీని మహాత్మాగాంధీ నియమించారు. గాంధీ ప్రకటించిన ఈ కమిటీని రాజాజీ వంటి ప్రముఖ నేతలు అంగీకరించలేదు. మహమ్మద్ అలీ జిన్నా, భారత్ కమ్యూనిస్టు పార్టీ, హిందూ మహాసభలు కూడా ఈ కమిటీ ఏర్పాటుకు సమ్మతించలేదు. 1942 ఆగస్టు ఎనిమిదో తేదీ ముంబైలో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ క్విట్ ఇండియా ఉద్యమాన్ని చేపట్టాలని తీర్మానించింది. ఇదే రోజు సాయంత్రం ముంబైలోని కోవాలియా ట్యాంక్ ప్రాంతంలో జరిగిన బహిరంగ సభలో మహాత్మాగాంధి, అహింసామార్గంలో ఈ ఉద్యమాన్నిజరపాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ ఉద్యమానికి బయటి మద్దతు అమెరికన్ల నుండి మాత్రమే వచ్చింది. కొన్ని భారతీయ డిమాండ్లను అంగీకరించమని అమెరికా ప్రెసిడెంట్ ఫ్రాంక్లిన్ డి. రూజ్‌వెల్ట్ ప్రధానమంత్రి విన్స్టన్ చర్చిల్‌ను వత్తిడి చేసాడు. క్విట్ ఇండియా ఉద్యమాన్ని బ్రిటిషు ప్రభుత్వం సమర్థవంతంగా అణిచివేసింది. వెంటనే స్వాతంత్ర్యం ఇవ్వడానికి బ్రిటిషు వారు నిరాకరించారు. యుద్ధం ముగిసాక చూద్దాం లెమ్మన్నారు.
దేశవ్యాప్తంగా చిన్న తరహా హింస జరిగింది. బ్రిటిషు వారు పదివేల మంది నాయకులను అరెస్టు చేసి, వారిని 1945 వరకు జైల్లోనే ఉంచారు. భారీగా అణచివేయడం వలన, బలహీనమైన సమన్వయం వలన, స్పష్టమైన చర్య లేకపోవడం వల్లా తక్షణ లక్ష్యాల పరంగా క్విట్ ఇండియా ఉద్యమం విఫలమైంది. అయితే, రెండవ ప్రపంచ యుద్ధంలో జరిగిన ఖర్చు కారణంగా భారతదేశాన్ని ఇక నియంత్రణలో పెట్టలేమని బ్రిటిషు ప్రభుత్వం గ్రహించింది. క్విట్ ఇండియా ఉద్యమం స్వర్ణోత్సవానికి గుర్తుగా 1992 లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 1 రూపాయి స్మారక నాణెం జారీ చేసింది.
0 Response to "August 9 is Quit India Day"
Post a Comment