40 year olds explain how to set up a financial plan.
40 సంవత్సరాలు నిండిన వారు ఆర్ధిక ప్రణాళిక ఎలా ఏర్పాటు చేసుకోవాలి వివరణ.
జీవితంలో నడి వయసు అంటే.. 40 ఏళ్లు ఎంతో కీలకమైన సంధి దశ. పదవీ విరమణ దగ్గరకు వస్తూ ఉంటుంది. పిల్లల చదువులు, ఇతర ఖర్చులు పెరుగుతుంటాయి. తల్లిదండ్రుల బాధ్యతా ఉంటుంది.
మరోవైపు ఆరోగ్యంపైనా మరింత శ్రద్ధ పెట్టాలి. ఈ నేపథ్యంలో ఈ వయసు వారి ఆర్థిక ప్రణాళికలు ఎలా ఉండాలో తెలుసుకుందామా...
ఇప్పటి వరకూ ఒక లెక్క.. ఇప్పటి నుంచీ మరో లెక్క అన్నట్లు ఉంటుంది.. 40 ఏళ్లకు వచ్చేనాటికి. జీవితంపై ఒక స్పష్టత వస్తుంది. ఉద్యోగంలో స్థిరత్వం ఉంటుంది. ఆర్థిక బాధ్యతలూ పెరుగుతాయి. ఇల్లు కొనాలనే ఆలోచన ఉంటుంది. భవిష్యత్తుకు భరోసా కల్పించేలా పెట్టుబడులనూ పెట్టాలి. పదవీ విరమణ ప్రణాళికలూ వేసుకోవాలి.
ఖర్చులు తగ్గించుకోండి.
స్థిరమైన ఆర్థిక భవిష్యత్తు కోసం 40 ఏళ్లు దాటిన తర్వాత ఖర్చులను నియంత్రణలోకి తీసుకురావడం చాలా ముఖ్యం. మీ ఆదాయం, ఖర్చుల ఆధారంగా బడ్జెట్‌ను రూపొందించుకోవాలి. అంతగా అవసరం లేని వాటి కోసం ఒక్క రూపాయీ వెచ్చించకూడదు. పొదుపు ఆలోచన పెంచుకోవడం ఇప్పుడు చాలా విలువైనది. అప్పుడే భవిష్యత్తుపై దృష్టి పెట్టేందుకు వీలవుతుంది.
ధీమాగా ఉండాలి.
అనుకోని సంఘటనలు కుటుంబానికి ఆర్థిక ఇబ్బందులను సృష్టిస్తాయి. దీన్ని నివారించేందుకు మీ పేరుమీద కచ్చితంగా బీమా పాలసీ తీసుకోవాలి. ఆర్జించే వ్యక్తి లేని దురదృష్టకర సందర్భంలో జీవిత బీమా పాలసీ కుటుంబానికి ఆర్థిక అనిశ్చితి ఏర్పడకుండా చూస్తుంది. అప్పులను తీరుస్తుంది. కుటుంబం తన లక్ష్యాలను సాధించేందుకు ఉపయోగపడుతుంది. పిల్లల చదువులు ఆగిపోవు. వార్షికాదాయానికి కనీసం 12 రెట్ల వరకూ జీవిత బీమా పాలసీ ఉండేలా చూసుకోవడం అవసరం.
పొదుపు.. పెట్టుబడులు..
డబ్బు కోసం మీరు ఎంతో కష్టపడుతుంటారు. మరి ఆ డబ్బును ఆదా చేయడంతోపాటు, సరైన పథకాల్లో మదుపు చేసినప్పుడే మెరుగైన ఆర్థిక వృద్ధిని సాధించగలరు. మార్కెట్ ఆధారిత పెట్టుబడులను ఎంచుకోవచ్చు. మీ డబ్బును పెట్టుబడి పెట్టేటప్పుడు మీ నష్టభయ సామర్థ్యాన్ని అంచనా వేసుకోవడం చాలా ముఖ్యం. ఎంత మేరకు నష్టం వచ్చినా తట్టుకోగలరు అనేది అర్థం చేసుకోవాలి. దీని ఆధారంగానే పెట్టుబడులు ఎంచుకోవాలి. ఈక్విటీ పెట్టుబడుల్లో స్వల్పకాలంలో హెచ్చుతగ్గులు ఉంటాయి. దీర్ఘకాలంలో ద్రవ్యోల్బణానికి మించిన రాబడిని అందించడంతోపాటు, సంపదను పెంచేందుకూ ఉపకరిస్తాయి. తక్కువ నష్టభయం ఉండే పథకాల్లోనూ కొంత శాతం మదుపు చేయడం మంచిది.
పిల్లల అవసరాలు తీర్చేలా...
పిల్లల భవిష్యత్తు కోసం ఆర్థిక ప్రణాళికలు రూపొందించాల్సిన వయసు ఇది. ఉన్నత చదువుల కోసం ప్రత్యేక పెట్టుబడులు, వివాహానికి సంబంధించిన ఖర్చుల్లాంటివన్నీ లెక్క వేసుకోవాలి. వీటన్నింటికీ అవసరమైనప్పుడు, సరిపోయేంత నిధిని కూడబెట్టాలి. ఊహించని ఖర్చులకూ సిద్ధంగా ఉండాలి. చదువుల ఖర్చు ఏటా 8-10 శాతం పెరుగుతోంది. దీనికి తగ్గట్లుగా ఆలోచించి, సరైన నిర్ణయం తీసుకోవాలి. పిల్లల భవిష్యత్తు రక్షణ కోసం ప్రత్యేక బీమా పాలసీలు, మ్యూచువల్ ఫండ్ పథకాలు అందుబాటులో ఉన్నాయి. వీటిని పరిశీలించవచ్చు.
ఆరోగ్య బీమాతో.
వైద్య ఖర్చులు పెరుగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో మీ ఆర్థిక శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని, ఆరోగ్య బీమా పాలసీ తీసుకోవడం ఎంతో అవసరం. సంస్థ అందించే బృంద బీమా ఉన్నప్పటికీ సొంతంగా ఒక పాలసీ తీసుకునే ప్రయత్నం చేయండి. ఇప్పుడున్న పరిస్థితుల్లో కుటుంబానికి అంతటికీ కలిసి రూ.10 లక్షల వరకూ ఆరోగ్య బీమా, దీనిపై మరో రూ.20 లక్షల వరకూ సూపర్ టాపప్ ఉండాలి. ఆరోగ్య బీమా పాలసీకి చెల్లించిన ప్రీమియానికి సెక్షన్ 80డీ ప్రకారం నిబంధనల మేరకు పన్ను మినహాయింపూ (పాత పన్ను విధానంలో) లభిస్తుంది
విశ్రాంత జీవితంలో
పదవీ విరమణకు ఇంకా 18-20 ఏళ్ల వయసు ఉంటుంది. కాబట్టి, దీనికోసం దీర్ఘకాలిక ప్రణాళికతో సిద్ధం కావాలి. విశ్రాంత జీవితం ప్రశాంతంగా సాగించేందుకు ఇప్పటికైనా ఆలస్యం చేయకుండా ప్రత్యేకంగా పెట్టుబడులు ప్రారంభించాలి. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మీ పొదుపు, పెట్టుబడుల వ్యూహాన్ని సమీక్షిస్తూ సర్దుబాటు చేసుకోవాలి. ప్రస్తుత లక్ష్యాలను సాధిస్తూ.. దీర్ఘకాలిక వూహ్యంతో ముందడుగు వేయాలి.
0 Response to "40 year olds explain how to set up a financial plan."
Post a Comment