AP Cabinet
ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు
సీఎం చంద్రబాబు అధ్యక్షతన సమావేశమైన ఏపీ మంత్రి వర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.
అమరావతి: సీఎం చంద్రబాబు అధ్యక్షతన సమావేశమైన ఏపీ మంత్రి వర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. దీపావళి నుంచి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇచ్చేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. నగదు చెల్లించి సిలిండర్ కొనుగోలు చేస్తే.. 48 గంటల్లో తిరిగి అకౌంట్‌లో నగదు జమయ్యేలా చూడాలని నిర్ణయించారు. ఒకేసారి మూడు సిలిండర్లు తీసుకోకుండా ప్రతి నాలుగు నెలలకు ఒక సిలిండర్ ఇవ్వాలని నిర్ణయించారు. ఈ పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వంపై ఏడాదికి రూ.2700 కోట్ల భారం పడుతుందని మంత్రివర్గంలో చర్చ జరిగింది.
ఉచిత ఇసుక విధానంలో సీనరేజ్, జీఎస్టీ ఛార్జీల రద్దుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. సీనరేజ్ ఛార్జీల రద్దు వల్లే ప్రభుత్వంపై రూ.264 కోట్ల భారమని అంచనా వేశారు. ఉచిత ఇసుక లక్ష్యం నెరవేర్చేందుకు నష్టం భరిద్దామని సీఎం చెప్పినట్టు సమాచారం. పట్టా భూముల్లో ఎవరి ఇసుక వారు తీసుకునేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఉచిత ఇసుక సరిగా అమలయ్యేలా చూడాలని మంత్రులు, జిల్లా ఇన్‌ఛార్జి మంత్రులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. ఇసుక లేని జిల్లాల్లో మినరల్ డీలర్లను పెట్టి ధరల నియంత్రణ చేపట్టాలని నిర్ణయించారు. ఆలయ కమిటీల్లో బ్రాహ్మణులు, నాయీ బ్రాహ్మణులకు చోటు కల్పించేందుకు, సభ్యుల సంఖ్య పెంచే చట్ట సవరణకు కేబినెట్ ఆమోదం తెలిపింది.
విశాఖ శారదాపీఠానికి భూ కేటాయింపు రద్దు..
విశాఖకు చెందిన వివాదాస్పద పీఠాధిపతి స్వరూపానందేంద్రకు చెందిన శారదాపీఠానికి జగన్ ప్రభుత్వం అప్పనంగా కట్టబెట్టిన 15 ఎకరాల అత్యంత విలువైన భూమిని వెనక్కి తీసుకోవాలనే ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది. వైకాపా ప్రభుత్వ హయాంలో అప్పటి సీఎం జగన్ తన గురువు, అత్యంత సన్నిహితుడైన స్వరూపానందేంద్ర కోరిందే తడవుగా.. భీమిలి పట్టణాన్ని ఆనుకుని కొత్తవలస గ్రామ పరిధిలో, సముద్ర తీరానికి దగ్గర్లో రూ.కోట్ల విలువ చేసే భూమిని ఎకరం రూ.లక్ష చొప్పున అడ్డగోలుగా ఇచ్చేశారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమ భూ కేటాయింపులపై సమీక్షలో భాగంగా ఎన్డీయే ప్రభుత్వం దీన్ని గుర్తించింది. శారదాపీఠానికి భూముల కేటాయింపును రద్దు చేయాలని నిర్ణయించింది.
0 Response to "AP Cabinet"
Post a Comment