AP Flash Floods
బలపడిన అల్పపీడనం.. ఏపీలోని ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్.. ఫ్లాష్ ఫ్లడ్స్ ముప్పు..!
ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం బలపడింది. తీవ్ర అల్పపీడనంగా మారిందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రానున్న 24 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందని చెప్పారు.
నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్ఆర్ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. ఈ జిల్లాల్లో ఫ్లాష్ ఫ్లడ్స్ కు అవకాశం ఉందని తెలిపారు. గంటకు 35 నుంచి 45 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే ఛాన్స్ ఉందని చెప్పారు.
దక్షిణ కోస్తాంధ్రకు భారీ నుంచి అతి భారీ వర్ష సూచన- విశాఖ తపాను హెచ్చరికల కేంద్రం వాతావరణ అధికారి శ్రీనివాస్..
”తీవ్ర అల్పపీడనం 24 గంటల్లో వాయు గుండంగా మారే అవకాశం ఉంది. నార్త్ తమిళనాడు, పుదుచ్చేరి, సౌత్ కోస్ట్ ఆంధ్రప్రదేశ్ తీరానికి చేరే అవకాశం ఉంది. రానున్న 24 గంటల్లో కోస్తాంధ్రలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు, మరికొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్ష పాతం పడొచ్చని అంచనా. ముఖ్యంగా నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు భారీ నుంచి అతి భారీ వర్షపాతం.
రాయలసీమ ప్రాంతంలోని వైఎస్ఆర్ జిల్లా, తిరుపతి, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య… ఈ జిల్లాలకు భారీ నుంచి అతి భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం. బాపట్ల, కృష్ణా, వెస్ట్ గోదావరి, కోనసీమ, కాకినాడ, సత్యసాయి జిల్లాలలో ఒకటి రెండు చోట్ల భారీ వర్షపాతం వచ్చే అవకాశం. నెల్లూరు, ప్రకాశం, తిరుపతి, చిత్తూరు, వైఎస్ఆర్, అన్నమయ్య జిల్లాలకు అతి భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం.
సౌత్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్ లో(దక్షిణ కోస్తా) 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం. లోతట్టు, తీర ప్రాంతాల్లో ఉండే ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. మత్స్యకారులు ఎవరూ కూడా సముద్రంలో వేటకు వెళ్లొద్దు. వేటకు వెళ్లిన వారంతా తిరిగి వచ్చేయాలి” అని వాతావరణ శాఖ అధికారి శ్రీనివాస్ చెప్పారు.
చెన్నైలో వర్ష బీభత్సం.. నీట మునిగిన సూపర్ స్టార్ రజినీకాంత్ ఇంటి పరిసరాలు..!
అటు చెన్నైలో కుండపోత వాన కురుస్తోంది. ఏకధాటిగా పడుతున్న వానకు లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. అప్రమత్తమైన తమిళనాడు ప్రభుత్వం సబ్ వేలను మూసివేసింది. మెట్రో రైల్ సేవలు తాత్కాలికంగా రద్దు చేశారు. మరోవైపు మద్రాస్ హైకోర్టు ఆవరణలో భారీగా వరద చేరింది. పోయస్ గార్డెన్ రజినీకాంత్ ఇంటి పరిసరాలు పూర్తిగా నీట మునిగాయి.
ప్రభుత్వం ముందు జాగ్రత్తగా 931 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసింది. తమిళనాడు వ్యాప్తంగా 65వేల మంది వాలంటీర్లు సిద్ధంగా ఉన్నారు. వర్షాల పరిస్థితిని కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ పర్యవేక్షిస్తున్నారు. చెన్నైలో దాదాపు మూడు రోజుల పాటు హోటల్ బుకింగ్స్ ఫుల్ అయ్యాయి. ప్రస్తుతం భారీ వాన కురుస్తుండటంతో ఒక్కసారిగా రేట్లు పెంచేశారని కస్టమర్లు కమాండ్ కంట్రోల్ సెంటర్ కు ఫిర్యాదులు చేస్తున్నారు.
0 Response to "AP Flash Floods"
Post a Comment