Fake Potatoes
Fake Potatoes కస్టమర్లూ తస్మాత్ జాగ్రత్త.. మార్కెట్లో విరివిగా నకిలీ ఆలుగడ్డలు.
ఈ మధ్య కాలంలో కల్తీల బెడద బాగా పెరిగిపోతోంది. దాంతో వినియోగదారులు ఏది కల్తీనో, ఏది స్వచ్ఛమైనదో తేల్చుకోలేక తీవ్ర అయోమయానికి లోనవుతున్నారు.
వ్యాపారులు కస్టమర్ల ఆరోగ్యం కంటే వారు వెనకేసుకునే కాసులకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. ఉప్పు కల్తీ, పప్పు కల్తీ, వంటనూనె కల్తీ, పాలు కల్తీ, బియ్యం కల్తీ, మాంసం కల్తీ, ఆఖరికి తాగే మంచినీళ్లు కూడా కల్తీ. ఇలా అన్నీ కల్తీ మయం అవుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా మరో కల్తీ వెలుగులోకి వచ్చింది. కొత్తగా ఆలుగడ్డలను కూడా కల్తీ చేస్తున్నట్లు అధికారుల తనిఖీల్లో వెల్లడైంది.
ఉత్తరప్రదేశ్‌లోని బల్లియాలో ఇటీవల జరిగిన ఫుడ్ సేఫ్టీ అధికారుల రైడింగ్‌లో పెద్ద సంఖ్యలో నకిలీ బంగాళాదుంపలు బయటపడ్డాయి. వాడిపోయిన బంగాళాదుంపలు తాజాగా కనిపించడం కోసం వ్యాపారులు వాటికి కెమికల్స్ పూస్తున్నారు. లాభాల కోసం కక్కుర్తితో వినియోగదారుల ఆరోగ్యాలను ఫణంగా పెడుతున్నారు. కాబట్టి కస్టమర్లు ఆలుగడ్డలు కొనేటప్పుడు కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఏవి నకిలీవో, ఏవీ అసలువో పరిశీలించి కొనుగోలు చేయాలి. అదృష్టవశాత్తు నకిలీ ఆలుగడ్డలను గుర్తించడానికి కొన్ని సులువైన మార్గాలు ఉన్నాయి.
నకిలీని ఎలా గుర్తించాలి..?
వాసన : నిజమైన ఆలుగడ్డలు సహజమైన మట్టి వాసన కలిగి ఉంటాయి. అందుకు విరుద్ధంగా నకిలీ ఆలుగడ్డలు కృత్రిమమైన రసాయనాల వాసన కలిగి ఉంటాయి.
రంగు : ఆలుగడ్డను కత్తిరించి చూడాలి. నకిలీ ఆలుగడ్డ అయితే లోపల, బయట వేర్వేరు రంగులో కనిపిస్తుంది. స్వచ్ఛమైన ఆలుగడ్డ రంగు లోపల, బయట ఒకేలా ఉంటుంది.
నీటి పరీక్ష : ఆలుగడ్డలను నీటిలో వేయడం ద్వారా కూడా ఏది నకిలీనో, ఏది స్వచ్ఛమైనదో గుర్తించవచ్చు. నకిలీ ఆలుగడ్డలు రసాయనాల కారణంగా నీళ్లలో తేలుతూ ఉంటాయి. కానీ స్వచ్ఛమైన, తాజా ఆలుగడ్డలు నీళ్లలో మునిగిపోతాయి.
మట్టి : నకిలీ బంగాళాదుంపలపై ఉన్న పూత మట్టి నీళ్లలో వేయగానే సులువుగా కరిగిపోతోంది. కానీ స్వచ్ఛమైన ఆలుగడ్డలపై ఉండే సహజమైన మట్టి అంత సులువుగా పోదు. అదిపోవాలంటే గట్టిగా రుద్ది కడగాల్సి వస్తుంది.
తొక్క : ఆలుగడ్డలను కడిగేటప్పుడు స్వచ్ఛమైన ఆలుగడ్డలపై ఉండే పొట్టు సులువుగా ఊడిపోతుంది. కానీ నకిలీ ఆలుగడ్డలపై ఉండే పొట్టు వాడిపోవడంవల్ల అంత సులువుగా ఊడదు.
గమనిక : పైన పేర్కొన్న మెలుకువలను పాటించడం ద్వారా మనం మార్కెట్లో దొరికే ఆలుగడ్డల్లో నకిలీవి ఏవో, స్వచ్ఛమైనవి ఏవో గుర్తించవచ్చు.
నకిలీ ఆలుగడ్డలతో నష్టాలు
నకిలీ ఆలుగడ్డలు ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం. రసాయనాలు, కృత్రిమ రంగులు కలిపిన ఆ ఆలుగడ్డలు తినడంవల్ల కాలేయం, మూత్రపిండాలు లాంటి సున్నితమైన అవయవాలు దెబ్బతింటాయి. కడుపు ఉబ్బరం, మలబద్ధకం, ఆకలిని కోల్పోవడం లాంటి జీర్ణ సంబంధ సమస్యలు కూడా వస్తాయి. కాబట్టి అలుగడ్డలే కాదు, ఏ ఆహార ఉత్పత్తులనైనా గుడ్డిగా కాకుండా, కొంచెం పరిశీలించి కొనుగోలు చేయడం ఉత్తమం.
0 Response to "Fake Potatoes"
Post a Comment