Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

  • AP Teachers Latest InfoIMP
  • More

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Pashupatinath Temple in Kathmandu

 ఖాట్మాండులోని పశుపతినాథ్ ఆలయం

ప్రభుం ప్రాణనాథం విభుం విశ్వనాథం జగన్నాథనాథం సదానందభాజం.. భవద్భువ్యతేశ్వరం భూతనాథం శివం శంకరం శంభు మీశాన మీడే..అని కొలుస్తారాయనని  భక్తులు. అసలే బోళా శంకరుడు ఆ పైన భక్తుల కోసమే వెలసిన మహాదేవుడు. అలాంటి శివదేవుడి ప్రపంచ ప్రఖ్యాత క్షేత్రాల్లో.. నేపాల్లోని పశుపతి నాథ్ ఆలయం అత్యంత ప్రముఖమైంది. ఇంతకీ ఈ నేపాల్ దేవుడి విశిష్టతలేమిటి? ఇక్కడీ శివుడెలా వెలిసాడు? శివుడంటే పిలిస్తే పలికే దైవం. శివుడంటే అభయంకరుడు. భక్తజన ప్రియంకరుడు. ఆపత్కాలంలో శంభోశంకర అని అర్చించిన వెంటనే ఆదుకునే అపర భక్తవ శంకరుడు,ఉండేది లింగాకారం,మహత్యం చూపడంలో అనంతాకారం. శివుడ్ని కొలిస్తే ఆపదలు మటుమాయం. శివుడి గురించి విన్నా.. కొలిచినా.. స్మరించుకున్నా పుణ్యమే. శివుడంటే మాటలకందని మహిమాన్విత దేవుడు. శివుడంటే కొలిచేకొద్దీ కొంగుబంగారమయ్యే శక్తి స్వరూపుడు, ఖాట్మండులోని పశుపతి నాథ్ దేవాలయం ప్రపంచ ప్రఖ్యాత శైవక్షేత్రం.

ఇక్కడి శివుడు నేపాల్ జాతీయ దైవంగా కొలవబడుతున్నాడు. తూర్పు ఖాట్మండులోని భాగమతి నదీ తీరాన వెలిశాడు పశుపతి నాథుడు. యునెస్కో వారి వాల్డ్ హెరిటేజ్ సైట్స్ లో ఒకటైన ఈ దేవాలయానికి నిత్యం దేశ విదేశాలనుంచీ కొన్ని వేల మంది భక్తులు వస్తుంటారు. పశుపతిని దర్శించి జన్మధన్యమైందని భావిస్తుంటారు. సుప్రసిద్ధ 275 శైవక్షేత్రాల్లో పశుపతినాథ్ ఆలయం కూడా ఒకటి. ఈ దేవాలయంలోకి హిందువులకు మాత్రమే అనుమతి. ఇతర మతస్థులు పశుపతిని దర్శించాలంటే భాగమతి నదీ తీరం నుంచి చూసి తరించాల్సిందే. ప్రపంచంలో హైందవ దేశం ఏదైనా వుందంటే అది నేపాల్ అన్న పేరుంది. నేపాళీయులకు పశుపతి అంటే ఎంతో భక్తి. అనివార్యకారణాల వల్ల తమ దేవదేవుడికి ఎక్కడ నిత్య పూజలు తప్పుతాయో అని దక్షిణ భారతదేశపు పూజారులను నియమించారు.

పరమేశ్వర అంశతో భువిపై జన్మించిన ఆదిశంకరుడు ప్రారంభించిన సంప్రదాయం ప్రకారం.. పశుపతి పూజలు జరుగుతాయి. దక్షిణభారతదేశం నుంచి వచ్చిన పూజారులు ఈ ఆలయంలో నిత్య పూజలు చేస్తుంటారు. ఎందుకంటే నేపాల్ సంప్రదాయం ప్రకారం రాజు మరణించినప్పుడు ఇక్కడి ప్రజలకు శివ పూజలు చేసే అర్హత వుండదు. ఎందుకంటే రాజును తండ్రిగా భావించడం ఇక్కడి వారి ఆచారం. దాని ప్రకారం పశుపతి నిత్య పూజలకు ఆటంకం ఏర్పడుతుంది. తమకెంతటి కష్టం కలిగినా.. పరమేశ్వరుడి నిత్యకైంకర్యాలకు లోపం రానివ్వకుండా ఉండేందుకు ఈ ఏర్పాట్లు చేసారు నేపాలీయులు. ఆదిశంకరుడు కొలిచిన పశుపతినాథ తత్త్వం.. అనన్య సామాన్యం. ఎందుకంటే మనిషిలోని పశుత్వాన్ని జయించి ఆధ్యాత్మికత వైపు అడుగులు వేయడానికి.. దివ్యత్వపు వెలుగులు పొందడానికి అర్హత సాధించాలంటే పశుపతిని కొలవాలి. మోక్షానికి దగ్గరి దారి చూపడం పశుపతినాథుడికి మాత్రమే సాధ్యం. అందుకే దూరా భారం లెక్కించకుండా ఆయన దర్శనం కోరి వస్తుంటారు దేశ విదేశీ భక్తులు.

పశుపతినాథ్ ఆలయం ఇక్కడ ఎప్పుడు వెలిసిందో స్పష్టమైన కాలం తెలీదు. కానీ కొన్ని శాసనాల ప్రాకారం ఆలయనిర్మాణం గురించిన వివరాలు దొరుకుతాయి. గోపాల రాజ్ వంశవలి అనే చారత్రిక పత్రికను అనుసరించి చెబితే.. క్రీస్తు శకం 753వ సంవత్సరంలో ఈ ఆలయ నిర్మాణం జరిగిందని తెలుస్తోంది. శుశూపదేవ మహారాజు అధ్వర్యంలో ఈ నిర్మాణం సాగినట్టు 11జయదేవ ఆలయంలో వేయించిన శిలాశాసనం ద్వారా తెలుస్తోంది. 1416వ సంవత్సరంలో.. రాజా జ్యోతిమల్ల ఈ దేవాలయానికి పునరుద్ధరణ పనులు జరిపించాడని అంటారు. 1697వ సంవత్సరంలో రాజాభూపేంద్ర ఈ దేవాలయాన్ని పునర్నించాడని తెలుస్తోంది. ఖాట్మండులో పశుపతినాథుడు లింగాకారంలో దర్శనమివ్వడానికి కొన్ని ఇతిహాస కథనాలు ప్రచారంలో వున్నాయి. గో ఇతిహాసం ప్రకారం ఒకప్పుడు శివుడు జింక వేషం ధరించి భాగమతీ తీరాన విహరిస్తుండగా దేవతలు ఆ కొమ్ము పట్టుకున్నారు. అప్పుడా కొమ్ము విరిగింది. దాన్నిక్కడ పూడ్చి పెట్టారు. తర్వాతికాలంలో ఆ కొమ్ము లింగాకారంలోకి రూపాంతరం చెందింది. అక్కడి భూమిలోపలున్న లింగాన్ని గుర్తించి ఒక ఆవు తన పాలనక్కడ కురిపించింది. ఆ వింత చూసిన పశువుల కాపరి అక్కడి ప్రదేశాన్ని తవ్వగా ఒక శివలింగం బయట పడిందట. అదే పశుపతినాథ లింగమని చెబుతారు.

గో ఇతిహాసంలాంటిదే మరో ఇతిహాసకథనం ప్రచారంలో వుంది. దీని ప్రకారం ఒక రోజు శివుడు కాశీ నుంచి భాగమతి నదీ తీరంలోని మ్రుగస్థలి అనే ప్రదేశంలో పార్వతీ సమేతంగా వచ్చి.. జింక అవతారంలో నిద్రిస్తాడు. ఆయన్ను తిరిగి కాశీ తరలించాలని భావిస్తారు దేవతలు. అలా శివుడు జింక రూపంలో నిద్రిస్తుండగా దేవతలు కొమ్ములు పట్టుకుని లాగుతారు. ఆ ఒత్తిడికి జింక కొమ్ము నాలుగు ముక్కలుగా విరిగి అక్కడి నేల మీద పడతాయి. ఆ నాలుగు కొమ్ములే చతుర్ముఖ లింగంగా ఏర్పడిందట. ఇది నేపాల మహత్యం హిమవత్ ఖండం ప్రకారం చెబుతున్న కథనం.

ఈ దేవాలయ నిర్మాణం ప్రత్యేక శైలిలో వుంటుంది. రెండు పై కప్పులు రాగి, బంగారాలతో తాపడం చేసి ఉంటాయి. నాలుగు ప్రధాన ద్వారాలకు వెండి తాపడం చేసి వుంటారు. పశ్చిమ ద్వారం దగ్గర.. పెద్ద నంది బంగారు కవచం తో వుంటుంది. ఈ నంది విగ్రహం ఎత్తు ఆరు అడుగులు. నేపాల్ ప్రజలు తాము చల్లగా ఉండటానికి పశుపతినాథుడే కారణమని భావిస్తుంటారు. ఇక్కడ ఆలయ అర్చకులు నేరుగా నేపాల్ రాజుకు జవాబుదారీగా వుంటారు. దీన్ని బట్టీ ఈ ఆలయం అంటే నేపాల్ కి ఎంత ప్రత్యేకమైందో తెలుస్తుంది. పశుపతినాథ్ ఆలయంలో పూజలు చేసే పూజారులను భట్ అని , ప్రధాన అర్చకుడిని మూల భట్ట లేదా రావల్ అని పిలుస్తారు.

ఇక్కడి ప్రధాన అర్చకుడు నేపాల్ రాజుకు మాత్రమే జవాబుదారీ. దీనిని బట్టి ఈ ఆలయ ప్రాముఖ్యత, ప్రధాన అర్చకుల అధికారాలు తెలుస్తాయి. ప్రధాన అర్చకులు అప్పుడప్పుడు ఆలయ విశేషాలను నేపాల్ రాజుకి తెలియజేస్తుంటారు. ఇక్కడ పని చేసిన రావెల్ పద్మనాభ శాస్త్రి అడిగ.. ఎంతో ప్రఖ్యాతి చెందిన ప్రధాన అర్చకులు. 1955 సంవత్సరంలో అర్చకత్వం ప్రారంభించి 1967 సంవత్సరంలో ప్రధాన అర్చక హోదాకి పదోన్నతి పొందారీయన.1993 సంవత్సరంలో అర్చకత్వం నుండి విరామం తీసుకొని తన స్వగ్రామం ఉడిపి వెళ్ళి పోయారు. పశుపతినాథుడు సర్వశక్తిమంతుడు. ఆయన ముందు ఎవరైనా సరే నిజం చెప్పి తీరాలి. అబద్ధం చెప్పడానికి వీలు లేదు. ఏదైనా సమస్య తలెత్తినప్పుడు ఆలయంలోని ధర్మశాల ముందు ప్రమాణం చేయించడం ఒక ఆచారం.

అలాగే పశుపతినాథ్ ఆలయంలో ఇంకా ఎన్నో దర్శనీయ స్థలాలున్నాయి. బంగారు తాపడం చేసిన దేవతామూర్తులు, చతుర్ముఖ విగ్రహం, ఏడవ శతాబ్ధికి చెందిన చండకేశ్వరుడు, బ్రహ్మదేవాలయం, ఆర్యఘాట్. గౌరీ ఘాట్ లు ఎంతో ప్రముఖమైనవి. శివుడు స్మశాన సంచారి. ఆర్యఘాట్ లో స్మశానం కూడా వుంది.

కొన్ని ప్రత్యేక దినాల్లో పశుపతినాథ్ దేవాలయాన్ని వేలాది భక్తులు దర్శిస్తారు. సంక్రాంతి, మహాశివరాత్రి, రాఖీ పౌర్ణమి రోజుల్లో పశుపతినాథుని దర్శనం కోసం.. భక్తులు అపరమిత సంఖ్యలో వస్తారు. ముఖ్యంగా గ్రహణం రోజున ఇక్కడి పరమేశ్వరుడికి ప్రత్యేక పూజలు చేస్తారు. ముఖ్యంగా మహాశివరాత్రి రోజున పశుపతినాథ్ ఆలయం నేతిదీపాలతో దేదీప్యమానంగా వెలిగిపోతూ కనిపిస్తుంది. మహాశివరాత్రి వంటి పర్వదినాల్లో ఇక్కడి భాగమతిలో స్నానం చేసి పశుపతినాథుడ్ని దర్శించుకుంటే పుణ్యమని భావిస్తారు


                       

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Pashupatinath Temple in Kathmandu"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0