Is it profitable to invest in gold deposit scheme?
గోల్డ్ డిపాజిట్ స్కీమ్‌లో ఇన్వెస్ట్ చేస్తే లాభమేనా?
బంగారానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న గుర్తింపు మనందరికీ తెలిసిందే. ముఖ్యంగా బంగారమంటే భారతీయులకు మరింత ప్రీతి, ఇంకా వీరికి బంగారంపై సెంటిమెంట్ కూడా ఎక్కువే.
బంగారం ధర ఎక్కువగా ఉన్నప్పటికీ, నగదు ఇబ్బంది లేనివారు దీన్ని ఒకేసారి కొనుగోలు చేస్తారు. ఒకేసారి బంగారంపై పెట్టుబడి పెట్టలేని వారు మాత్రం వాయిదా పద్ధతి (గోల్డ్ స్కీం)లో చేరి బంగారు ఆభరణాలను తీసుకోవాలని ఆశిస్తారు. ముఖ్యంగా ఇలాంటివారే గోల్డ్ జ్యువెలరీ స్కీంలకు ఎక్కువగా ఆకర్షితులవుతారు. ఇలాంటి బంగారు ఆభరణాల స్కీంల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
బంగారు ఆభరణాల స్కీంలు
సాధారణంగా గోల్డ్ సేవింగ్/డిపాజిట్ స్కీంలు.. 12 నెలల వ్యవధిలో ప్రతి నెల వాయిదా చెల్లించి ఆభరణాలను కొనుగోలు చేయడానికి వినియోగదారులకు అవకాశాన్నిస్తాయి. ప్రస్తుతం మార్కెట్‌లో సాధారణ బంగారం షాపులు కూడా బంగారం ఆభరణాల స్కీంలను ఆఫర్ చేస్తున్నాయి. చాలా దుకాణాలు ఈ స్కీంలో 12 నెలల వరకు నగదును డిపాజిట్ చేసే అవకాశాన్ని కల్పిస్తున్నాయి. 12 నెలల తర్వాత మీరు జమ చేసిన నగదు మొత్తానికి సరిపడా బంగారు ఆభరణాలను కొనుగోలు చేసే అవకాశం ఈ స్కీం కల్పిస్తుంది. ఈ 12 నెలలు వాయిదాలు చెల్లించినందుకు కొనుగోలు చేసిన ఆభరణాలపై తరుగును లేదా తయారీ ఛార్జీలను తీసివేయొచ్చు/తగ్గించొచ్చు.
కొన్ని షాపులు 11 వాయిదాలు మనం చెల్లిస్తే.. 12వ వాయిదా మొత్తాన్ని వారే చెల్లిస్తారు. తర్వాత 12 నెలల మొత్తానికి సరిపడా ఆభరణం ఆ షాపు వద్ద తీసుకోవాల్సి ఉంటుంది. కొన్ని దుకాణాలు వినియోగదారులు చెల్లించే నగదుకు ఆ రోజు నాటికి ఎంత బంగారం లభిస్తుందో దాన్ని విలువగట్టి దాన్ని పరిమాణం (గ్రాము)లో రికార్డ్ చేస్తారు. వాయిదాలు పూర్తయిన ఏడాది తర్వాత అప్పటివరకు ఎంత పరిమాణం బంగారం కొన్నారో లెక్కించి అన్ని గ్రాముల గల బంగారు ఆభరణాలను డిపాజిట్‌దారునికి అందిస్తారు. బంగారం ధర చాలా ఏళ్ల నుంచి క్రమంగా పెరుగుతుంది కాబట్టి, ఇలాంటి స్కీంలు కూడా వినియోగదారులను ఆకర్షిస్తుంటాయి.
స్కీంతో లాభమేనా?
సాధారణంగా రోజువారీ బంగారం ధరను తెలుసుకోవడం వినియోగదారుడికి పెద్ద కష్టం కాదు. షాపులు కూడా ప్రతిరోజూ బంగారం ధరను తెలియజేసే బోర్డును పెడతాయి. ఇండియన్ బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్‌కు చెందిన 89556 64433 నంబర్‌కు మిస్డ్ కాల్ చేస్తే చాలు.. ఆ రోజు బంగారం ధర తెలుస్తుంది. https://www.ibja.co వెబ్‌సైట్‌లో కూడా ధరలు తెలుసుకోవచ్చు. అయితే, బంగారం ధర ఇంత బహిరంగంగా ఉన్నప్పుడు షాపు యజమానికి ఈ స్కీం వల్ల ప్రయోజనం ఏంటి అని వినియోగదారులకు అనుమానం రావచ్చు. కానీ, బంగారం ధరతో పాటు తయారీ ఛార్జీలు, తరుగు వంటి అదనపు ఖర్చులు వినియోగదారులకు వర్తిస్తాయి. తయారీ ఛార్జీ, తరుగు ప్రతి ఆభరణానికీ ఒకేలా ఉండదు. మారుతుంది. గరిష్ఠంగా షాపు యజమానికి లాభం కలిగేది కూడా ఇక్కడే అని వినియోగదారులు తప్పక గుర్తించాలి. స్కీంలో జీరో వేస్టేజీ/మేకింగ్ ఛార్జీలు కూడా కొన్ని డిజైన్లు, మోడల్స్‌కు మాత్రమే ఉండొచ్చు. మీరు స్కీంలో భాగంగా అవి కొనేందుకు ఇష్టపడకపోతే ఇలాంటి ఛార్జీలను చెల్లించాల్సి ఉంటుంది. ఇవన్నీ కలిపితే మీరు చెల్లించిన స్కీంలో కొంత వరకు రాబడి తగ్గే అవకాశం ఉంటుంది.
తెలుసుకోవాల్సినవి.
వినియోగదారులు ఈ స్కీం అందించే అదే షాపు వద్ద ఆభరణాలను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. డిపాజిట్‌ను డబ్బు రూపంలో తిరిగి ఇవ్వరు, ఆభరణాల రూపంలో మాత్రమే దక్కుతుంది. వినియోగదారులకు బంగారం కొనుగోలు చేసేటప్పుడు స్వచ్ఛత, తరుగు, తయారీ రుసుములు వంటి వాటిపై స్పష్టమైన అవగాహన ఉండాలి. ఆభరణాన్ని తీసుకునేటప్పుడు 'బీఐఎస్' హాల్‌మార్కింగ్ గల బంగారు ఆభరణాన్ని మాత్రమే పొందాలి. బంగారు ఆభరణం సాధారణంగా 22 క్యారెట్లది అయి ఉంటుంది. ఒక గ్రాము బంగారంపై 2 క్యారెట్లు తగ్గినా ధరలో చాలా వ్యత్యాసం వస్తుంది. కాబట్టి, మీరు పొందుతున్న బంగారం ఎన్ని క్యారెట్లు అనేది స్పష్టంగా తెలుసుకోవాలి. ఇది తెలియకుంటే భారీగా నష్టపోతారు.
అంతేకాకుండా, స్కీం మధ్యలో తప్పుకుంటే వచ్చే మొత్తంపై కూడా వినియోగదారులకు ముందే స్పష్టత ఉండాలి. లేకపోతే వినియోగదారుడు ఆర్థికంగా ఎక్కువ నష్టపోయే అవకాశముంటుంది. ముఖ్యంగా ఇలాంటి స్కీంల్లో చేరేటప్పుడు ఆ షాపు యజమాని ఆర్థిక స్థిరత్వాన్ని, ట్రాక్ రికార్డును తప్పకుండా తెలుసుకోవాలి. ప్రతి స్కీం ఒప్పందంలో నిబంధనలు వర్తిస్తాయి. కానీ వినియోగదారులు దాన్ని పెద్దగా పట్టించుకోరు. అవే షాపు యాజమానికి అనుకూలంగా ఉంటాయి. ముఖ్యంగా, ఇంతకు ముందు ఇలాంటి స్కీంల్లో చేరినవారిని సంప్రదించడం మంచిది. దీనివల్ల వినియోగదారులకు మంచి అవగాహన ఏర్పడుతుంది.
చివరిగా: బంగారాన్ని ధరించాలనుకుంటే ఆభరణాన్ని కొనుగోలు చేయాలి. బంగారంపై పెట్టుబడి మాత్రమే పెట్టాలని అనుకుంటే గోల్డ్ ఈటీఎఫ్‌లు, గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్, సావరిన్ గోల్డ్ బాండ్లపై పెట్టుబడి పెట్టొచ్చు.
0 Response to "Is it profitable to invest in gold deposit scheme?"
Post a Comment