Somnath Jytorilinga Temple In Gujarat.
Somnath Jytorilinga Temple In Gujarat.
సోమనాథ్ జ్యోతిర్లింగం
సోమనాథ్ గుజరాత్ రాష్ట్రంలోని సౌరాష్ట్రాలోని వెరావల్ రేవు పట్టణానికి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉన్న హిందూ పుణ్య క్షేత్రము. ఇది అతి ప్రాచీనమైనది, పురాణప్రాశస్త్యం కలది. మహాశివుని ద్వాదశ జ్యోతిర్లింగాలలో సోమనాథ్ మొదటిది. దీనిని "ప్రభాస తీర్థం" అని కూడా పిలుస్తారు
అరేబియా సముద్రతీరాన వెలసిన పుణ్యక్షేత్రం. సముద్రపు అలల తాకిడిని తట్టుకునే విధంగా 25 అడుగుల ఎత్తున్న బండరాళ్ళతో నిర్మించిన మట్టం మీద రూపుదిద్దుకుంది ఈ ఆలయం. ఈ ఆలయ గర్భగుడిలో శివలింగం 4 అడుగుల ఎత్తుండి, ఓం కారంతో అమర్చివుంటుంది. ఈ ఆలయానికున్న చరిత్ర చెప్పనలవికాదు. చారిత్రక ఆధారాలద్వారా ఇక్కడ నిర్మించిన మొదటి ఆలయం 1వ శతాబ్ధానికి చెందినది. ఇది ఒకనాడు శిథిలమైపోగా తిరిగి క్రీస్తు.శ. 649లో అదే శిథిలాల మీద రెండవ ఆలయ నిర్మాణం జరిగింది. ఆ తరువాత క్రీస్తు. శ. 722లో అరబ్బులు సింధు ప్రాంతంలో బలపడి, భారతదేశం మీద దృష్టి సారించారు. అప్పటి గవర్నరుగా ఉన్న జునాయద్ ఆ చుట్టు ప్రక్కల ప్రాంతాలైన మార్వార్, బ్రోచ్, ఉజ్జయినీ, గుజరాత్ మొదలైన వాటిమీద యుద్ధానికి బయలుదేరారు. ఈ విధంగా జరిగిన దాడుల్లో రెండవ సారి నిర్మించిన సోమనాథ దేవాలయం ధ్వంసమయ్యింది.
ఆ తరువాత చాళుక్యుల కాలంలో దీనిని పునర్నిమించారు. వారి ఏలుబడిలో ప్రభాస నగరం మంచి ఓడరేవు కేంద్రంగా భాసిల్లడంతో, కనౌజ్ పాలకులైన ప్రతీహారుల కాలంలో ఈ క్షేత్రం కాశీతో సమానంగా విలసిల్లింది. ఆ కాలంలో ఇక్కడ వున్న అపార ధనరాసులే దండయాత్రలకి కారణాలని చెప్పవచ్చు. ఇదే కోవలో మాండలీకుల పాలనలో ఉండగా 6-1-1026న మహమ్మద్ ఘజనీ దండెత్తడం జరిగింది. ఈ పోరులో 50 వేలమంది నేలకూలారు. యుద్ధం మొదలైన ఏడు రోజులకి మాండలీకులు ఇక ఘజనీతో నిలబడలేక రాజ్యాన్ని విడిచి పారిపోయారు. ఈ యుద్ధంలో హమీర్‌గోపాల్ అనే రాజకుమారుడు శత్రుసేనలతో తలబడి ఎందరినో మట్టికరిపించాడు. ఈ రాజ్యాన్ని రక్షించడంలో తన ప్రాణాలు కోల్పోయాడు. అందుకు చిహ్నంగా ఇక్కడొక వీరశిలని నిర్మించారు. ఈ యుద్ధంలో విజయం సాధించిన ఘజనీ పోమనాథ్ ఆలయ గర్భగుడిలో ప్రవేశించి శివలింగాన్ని ముక్కలు చేయడానికి ప్రయత్నించాడు. కానీ ఆ ప్రయత్నం సాధ్యపడక ఆలయ అర్చకుల్ని హింసించి, ఆలయాన్ని ధ్వంసం చేసి పోయాడు. అ సమయంలో పటాన్ ప్రభువైన పరమదేవ్, ఈ మూకలపై విరుచుకు పడ్డాడు. ఆతని దాటికి తట్టుకోలేక ఘజనీ సేనలు పారిపోయాయి. ఆ తరువాత 12-13 శతాబ్దంలో తిరిగి ఆలయ నిర్మాణం చేసాడు. ఇది నాల్గవ సారి జరిగిన ఆలయ నిర్మాణం. కాలగమనంలో ఇదికూడా శిథిలావస్థకు చేరుకోగా 1114 సంవత్సరంలో కుమారపాలుడు అనే రాజు ఈ ప్రాంతాన్ని తన ఏలుబడిలోకి తీసుకుని, ఈ ఆలయాన్నీ, పట్టణాన్నీ పూర్తిగా పునరుద్ధరించాడు. ఆ కాలంలోనే అర్చకులకి వసతి గృహాలు, దేవాలయానికి బంగారు కలశాలు, ముఖమండపంతో శోభిల్లజేసాడు.
ఇక 1296లో అల్లావుద్దీన్ ఖిల్జీ, తన మామని చంపి, రాజ్యవిస్తీర్ణ చేసుకునే నేపథ్యంలో దండయాత్రలు సాగించాడు. దారిపొడవునా ఎంతో బీభత్సాన్ని సృష్టించుకుంటూ సాగాడు. అలా బయలుదేరినవాడు 1299లో సామనాథ్ మీద పడి, ఉలుంఖాన్ అనే సేనాని శివలింగాన్ని ముక్కలు ముక్కలుగా బద్దలుకొట్టి, ఆ శకలాల్ని ఖిల్జీకి కానుకగా సమర్పించాడు. ఆ తరువాత 1325-1331 ప్రాంతంలో జునాఘడ్ రాజకుమారుడు తిరిగి ఇక్కడ లింగప్రతిష్ఠ చేసాడు. ఆ తరువాతి కాలంలో 1459లో మహమ్మద్ బేగ్దా ఇక్కడున్న శివలింగాన్ని తీసివేసి, ఈ మందిరాన్ని మసీదుగా మార్చివేసాడు. ఆ తరువాత అక్భర్ పరమతసహనం కలిగివుండటం వల్ల ఇక్కడ ఏ విధమైన గొడవలూ లేకుండా కొంతకాలం ప్రశాంతత నెలకొంది. ఔరంగజేబు కాలంలో 1783లో ఇండోర్ మహారాణి అహల్యాభాయి సోమనాథ్ మందిరాన్ని పునర్నిర్మించడం జరిగింది. అయితే లింగప్రతిష్ఠ భూగర్భంలో చేసి శత్రువుల బారిన పడకుండా ఉండే ఏర్పాట్లు గావించింది. నాటినుండి తిరిగి కాల ప్రవాహంలో శిథిలావస్థకు చేరుకున్న ఈ పురాతన క్షేత్రాన్ని స్వాతంత్య్రం వచ్చిన తరువాత డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు 11-5-1951న లింగప్రతిష్ఠ గావించి పునర్నిర్మాణ కార్యక్రమాలు సాగించారు. ఈ దేవాలయానికి ముందు భాగంలో నవనగర్ మహారాణి భర్త దిగ్విజయసింగ్ జ్ఞాపకార్థం నిర్మించింది. దీనిని 19-5-1970 సంవత్సరంలో శ్రీ సత్యసాయిబాబా ప్రారంభోత్సవం చేశారు. ఇప్పుడు అన్ని వసతులతోటీ, అన్ని దేశాలవారినీ ఆకర్షిస్తూ ఆధ్యాత్మిక భావతరంగాలను వెదజల్లుతోంది.సోమనాధ్ దేవాలయం పాలి మార్కెట్ లో ఉంది.
స్థలపురాణం
స్థల పురాణం ప్రకారం సోమనాథ్ దేవాలయాన్ని చంద్రుడు నిర్మించాడని భావిస్తారు. సోముడు అనగా చంద్రుడు అని అర్ధం. చంద్రుడిని దక్షుడి శాపం నుండి విముక్తిడిని చేసిన శివుడి ఆలయం కనుక ఇది సోమనాధ ఆలయం. ఇక్కడి శివుడు సోమనాధుడు అయ్యాడు. శివుడు ఈ ఆలయంలో చంద్రుడి తపః ఫలంగా స్వయంగా ప్రత్యక్షమై స్వయంగా వెలిసాడు. ఆరు మార్లు ధ్వంసం చేయబడి తిరిగి పునర్మించబడినందు వలన ఈ ఆలయాన్ని అక్షరమైన ఆలయంగా వర్ణిస్తారు. చివరిసారిగా ఈ ఆలయ పునర్నిర్మాణం జరిగింది. జునాగర్ భారతదేశంలో విలీనమైన సందర్భంలో ఇక్కడకు విచ్చేసిన సర్దార్ వల్లభాయి పటేల్ ఈ ఆలయాన్ని దర్శించడంతో పాటు ఈ ఆలయాభివృద్ధికి ప్రణాళికను ప్రతిపాదించారు. పటేల్ మరణానంతరం భారతదేశపు మరియొక మంత్రి అయిన కే ఎమ్ మున్షి ఆధ్వర్యంలో ఈ పునర్నిర్మాణపు కార్యక్రమాలు కొనసాగించబడ్డాయి.
పురాణ కథనం అనుసరించి ఈ ఆలయాన్ని చంద్రుడు బంగారంతో నిర్మించాడని, ఆ తరువాత రావణుడు వెండితోను, కృష్ణుడు దీనిని కొయ్యతోనూ నిర్మించారని ప్రతీతి. భీముడు రాతితో పునర్నిర్మించారని చెబుతారు. చంద్రుడు దక్షుడి కుమార్తెలు, తన భార్యలు, అయిన 27 నక్షత్రాలలో రోహిణితో మాత్రమే సన్నిహితంగా ఉన్న కారణంగా మిగిలిన వారు తమ తండ్రితో మొరపెట్టుకోగా మామ అయిన దక్షుడు ఆగ్రహించి చంద్రుడిని శపించిన కారణంగా తనకు ప్రాప్తించిన క్షయ వ్యాధి నివారణార్ధం చంద్రుడు శివలింగ ప్రతిష్ఠ చేసి తపస్సు చేసిన ప్రదేశమే ఈ ప్రభాసతీర్ధము. ఇక్కడ శివుడు చంద్రుడికి ప్రత్యక్షమై భార్యలు అందరిని సమానంగా చూసుకొమ్మని చంద్రుడికి సలహా ఇచ్చి శాపాన్ని పాక్షికంగా ఉపసంహరించి చంద్ర ఉపస్థిత లింగంలో తాను శాశ్వతంగా ఉంటానని చంద్రుడికి మాట ఇచ్చాడు.
స్వాతంత్రం అనంతరం ఆలయ పునర్నిర్మాణం
స్వాతంత్ర్యం రాక ముందు జునాగఢ్ రాజ సంస్థానం ప్రభాస్ పటాన్ అధీనంలో ఉంది. సమైక్య భారతదేశంలో జునాగఢ్ విలీనం అయిన తరువాత అప్పటి ఉపప్రధాని అయిన సర్ధార్ వల్లభాయ్ పటేల్ 1947 నవంబరు 12న భారతీయ సైన్యాలను క్రమపరిచే నిమిత్తం ఇక్కడకు వచ్చి అదే సమయంలో ఈ ఆలయ పునర్నిర్మాణానికి ఆదేశాలను జారీ చేసాడు. ఎప్పుడైతే సర్ధార్ పటేలు, కే ఎమ్ మున్షి, ఇతర నాయకులతో గాంధీని దర్శించి ఈ ప్రస్తావన తీసుకు వచ్చినప్పుడు గాంధీ ఆ ప్రస్తావనకు ఆనందంతో అంగీకరించి ఆలయ పునరుద్ధరణకు కావలసిన నిధులను ప్రభుత్వము నుండి మంజూరు చేయకుండా ప్రజల నుండి చందాలను గ్రహించి చేయవలసినదిగా సలహా ఇచ్చాడు. అయినా త్వరలోనే పటేల్, గాంధీ మరణించారు. ఆలయ పునరుద్ధరణ కార్యక్రమాలను కే ఎమ్ మున్షీ నిర్వహణలో జరిగింది. కే ఎమ్ మున్షి అప్పుడు నెహ్రూ ప్రభుత్వంలో ఫుడ్ అండ్ సివిల్ సప్లై మంత్రిగా పనిచేస్తున్నాడు. 1950 అక్టోబరు మాసంలో శిథిలాలు తొలగించబడి ప్రస్తుత మసీదు కొన్ని మైళ్ళ దూరానికి తీసుకు పోబడింది. 1951లో భారతప్రభుత్వ ప్రథమ రాష్ట్రపతి అయిన రాజేంద్రప్రసాదు ఆలయ కుంభాభిషేకానికి కే ఎమ్ మున్షి చేత అహ్వానించబడ్డాడు. ఆయన తన ప్రసంగంలో " నా దృష్టిలో ఈ పునాదుల నుండి అద్భుతమైన ఈ బృహత్తర ఆలయం పునర్నిర్మించబడడమే కాక పురాతన సోమనాధ ఆలయ పునరుద్ధణ వలన భారతీయ శిల్పకళావైభవానికి ఈ ఆలయం ఒక తార్కాణంగా నిలిచింది. అయన సన ప్రసంగం పొడిగిస్తూ " పునర్నిర్మించే శక్తి యొక్క గొప్పతనం పడగొట్టే శక్తికంటే ఘనమైనది అనడానికి సోమనాధ ఆలయ పునర్నిర్మణం ఒక ఉదాహరణ " అని ఉద్ఘాటించాడు. ఈ పూర్తి సంఘటన అప్పటి ప్రధాన మంత్రి అయిన జవహర్లాల్ నెహ్రూ రాష్ట్రపతుల మధ్య పెద్ద అఘాతాన్ని సృష్టించింది. జవహర్లా నెహ్రు దీనిని హిందువుల ప్రతి ఘటనగా భావించగా రాష్ట్రపతి రాజేంద్రప్రసాదు , కె ఎమ్ మున్షీ ఈ ఆలయ పునరుద్ధరణ స్వాతంత్ర ఫలంగా , తమకు జరిగిన అన్యాయానికి హిందువుల ప్రతిస్పందనగా భావించబడినది. రాజేంద్రప్రసాదు , కె ఎమ్ మున్షీల చేత పునరుద్దరించబడి దేశానికి సమర్పించిన ఈ సోమనాధ ఆలయం ఇప్పుడు సోమనాధ ఆలయ ట్రస్ట్ చేత నిర్వహించబడుతుంది.
భారత దేశంలో ద్వాదశ జ్యోతిర్లింగాలు 12 వరకు ఉన్నాయి. వాటిలో మొట్టమొదటి జ్యోతిర్లింగ క్షేత్రం గుజరాత్ రాష్ట్రంలోని వెరావల్ లో ఉన్న సోమనాథ్. ఇక్కడున్న సోమనాథ ఆలయం అదేనండి ... పురాతన శివుని ఆలయం భారతదేశంలో ఉన్న శివ భక్తులచేత గౌరవించబడుతూ, పూజించబడుతున్నది. సోమనాథ్ క్షేత్రం గురించి పురాణాల్లో కూడా పేర్కొనటం జరిగింది. ఎన్నో అద్భుతమైన చారిత్రక నేపథ్యం ఉన్న ఈ సోమనాథ్ క్షేత్ర విశేషాలను గమనిస్తే ...
ఉత్తర భారతదేశాన ఎక్కువ మంది హిందువులు శివాలయాల్లో దీపాలు వెలుగిస్తూ కనిపిస్తారు ముఖ్యంగా జ్యోతిర్లింగ క్షేత్రాలలో అయితే చెప్పనవసరం లేదు ..! కిక్కిరిసిన భక్తజన సందోహంతో, కాలు కింద పెట్టడానికి కూడా స్థలం ఉండని విధంగా ఉంటుంది.
చంద్రుడు, దక్షుని శాపం నుండి విముక్తిడిని చేసిన శివునికి ఆలయాన్ని నిర్మిస్తాడు. అదే సోమనాథ ఆలయం. దీనిని మొదట చంద్రుడు బంగారంతో నిర్మిస్తాడు. ఆతరువాత రావణుడు వెండితోను, కృష్ణుడు కొయ్యతోను నిర్మించారని ప్రతీతి.
సోమనాథ్ ఆలయం ప్రముఖ జ్యోతిర్లింగ క్షేత్రాలలో మొదటిది. ఇక్కడ శివ భగవానుడు కొలువై ఉంటాడు. నిర్మించినప్పటి నుండి ఇప్పటివరకు సుమారు ఏడు సార్లు నాశనం చేయబడి పునర్నిర్మించబడింది. చివరిగా వల్లభాయ్ పటేల్ 1951 లో పునర్నిర్మించడం జరిగింది.
సోమనాథ్ ఆలయం లో ఎవ్వరికీ అంతపట్టని విచిత్రం ఒకటుంది. అది చంద్రుడు ప్రతిష్టించిన శివలింగం. ఆలయం మధ్యలో, భూమి లోపల ఎటువంటి ఆధారం లేకుండా శివలింగం నిలిచింటుంది. గాలిలో తేలినట్లుండే ఈ శివలింగం ఎవ్వరికైనా వర్ణించలేని ఒక అద్భుత దృశ్యం.
సోమనాథ ఆలయం లోపల విశాలమైన మంటపం, ఎత్తైన గుండ్రటి గోపురం కనిపిస్తాయి. గర్భగుడి లోని శివలింగం పెద్దది. శివలింగం వెనకాల పార్వతి దేవి విగ్రహం కనిపిస్తుంది. ద్వారానికి కుడిపక్క, వెనకపక్క వినాయకుని విగ్రహం, ఆంజనేయుని విగ్రహాలు ఉన్నాయి.
సోమనాథ్ ఆలయం దాని అద్భుతమైన చెక్కడం, వెండి తలుపులు, నంది విగ్రహం మరియు దాని కేంద్ర శివలింగానికి ప్రసిద్ధి చెందింది. భక్తులు కార్తీక పూర్ణిమ పండుగ సమయంలో ఈ ఆలయాన్ని విశేషంగా సందర్శిస్తారు. మహా శివరాత్రి, చంద్ర గ్రహణ సమయాల్లో లక్షల్లో భక్తులు సోమనాథ్ ఆలయాన్ని దర్శించుకుంటారు.
దైత్యుసుదన్ మందిరం సోమనాథ్ క్షేత్రంలో ఉన్నది. ఈ ఆలయంలో క్రీ. శ . 7 వ శతాబ్ధానికి చెందిన విష్ణుమూర్తి చిత్రం ఉన్నది. కార్తీక మాసంలో అధిక సంఖ్యలో భక్తులు ఇక్కడికి వచ్చి దర్శిస్తారు.
సోమనాథ్ ఆలయం తర్వాత, ఆ ప్రాంతంలో అంత పేరు సంపాదించుకున్న మరో ఆలయం సూర్య దేవాలయం. క్రీ. శ. 14 వ శతాబ్ధంలో నిర్మించిన ఈ ఆలయంలో ప్రధాన విగ్రహం సూర్య భగవానుడు. ఆది దేవుని ఇద్దరు సేవకుల విగ్రహాలు కూడా ఈ ఆలయంలో ఉన్నాయి.
శశిభూషణ్ కూడా ఒక పుణ్య క్షేత్రమే..! ఇది గుజరాత్ రాష్ట్రంలోని సోమనాథ్ - భల్క తీర్థం వెళ్లే మార్గంలో ఉన్నది. ఇక్కడే చంద్ర దేవుడు, సోమ, తన పాపాల నివృతి కోసం యజ్ఞం చేశారు. సోమనాథ్ క్షేత్రాన్ని సందర్శించే ప్రతి యాత్రికుడు శశి భూషణ్ ని తప్పక దర్శించవలసిందే ..!
చిత్ర కృప : telugu native planet
మహాకాళి ఆలయం, పవిత్ర సోమనాథ ఆలయానికి సమీపంలో ఉన్నది. దీనిని క్రీ. శ. 1783 వ సంవత్సరంలో ఇండోర్ మాహారాణి ఆహల్యాబాయి హోల్కర్ నిర్మించినారు. ఈ ఆలయాన్ని కూడా భక్తులు తప్పకుండా సందర్శిస్తుంటారు.
సోమనాథ్ నుండి కేవలం 6 కి. మీ. ల దూరంలో ఉన్న వేరవాల్ , చేపలకై ప్రసిద్ధి చెందిన స్థలం. సంప్రదాయ పద్ధతులలో పడవ నిర్మాణం మరియు జాలవాహినౌకలను ఉపయోగించి చేసే చేపల వేట ఇక్కడ చూడవచ్చు. ఇక్కడి నుండి భారీ మొత్తంలో సముద్ర ఆహారం విదేశాలకు ఎగుమతి అవుతుంది.
సోమనాథ్ లో గల భల్కా తీర్థానికి ఒక ప్రత్యేకమైన విశిష్టత దాగి ఉన్నది. ఈ ఉర్లో శ్రీకృష్ణుని నిర్వాణం చెందాడు. ఈ స్థలంలో శ్రీకృష్ణుడు వేటగాని బాణం తగిలి అవతారాన్ని చాలించాడని చెబుతారు. ఇక్కడికి కూడా యాత్రికులు తరచూ వస్తుంటారు.
మై పూరీ మసీదు జూనాగడ్ ద్వారం నుండి కిలోమీటరు దూరంలో ఉండి, వేరవాల్ కు ప్రధాన ద్వారంగా పని చేస్తుంది. నీలం మరియు తెలుపు రంగు పెంకులతో చాలా అందంగా దీన్ని తీర్చిదిద్దారు. మహమ్మదీయులు దీన్ని, సోమనాథ్ లో ఇతర మసీదులతో పాటు ఒక ముఖ్యమైన యాత్రాస్థలం గా భావిస్తారు.
సనా గుహలు సోమనాథ్ లోని ఒక కొండ పైన ఉన్న గుహల సముదాయంగా చెప్పుకోవచ్చు. చరిత్రకారుల అభిప్రాయం మేరకు, ఈ గుహలు క్రీ.పూ. 2 వ శతాబ్దం లో నిర్మించినట్లు తెలుస్తుంది. అందమైన బొమ్మలు, స్థూపాలు, రాతి దిండ్లు మరియు చైత్యాలు పర్యాటకులకు గుహలను మరింత ఆసక్తికరంగా చూపుతాయి.
సోమనాథ్ లో ఉన్న పురావస్తు సంగ్రహాలయం లో ధ్వంసమైన పాత సోమనాథ్ దేవాలయాల అవశేషాలను తెలియ పరుస్తుంది. ఎలా కొల్ల గొట్టారు , ఎలా పునర్నిర్మించినారు అన్న వాటిని సైతం మీకు తెలియజేస్తుంది. వివిధ కాలాలకు సంబంధించిన రాతి శిల్పాలు, కూడ్యాలు మరియు విగ్రహాలు ఇక్కడ భద్రపరిచారు.
సోమనాథ్ సాగర తీరం గర్జించే తరంగాలకు ప్రసిద్ధి. ఇక్కడ పర్యాటకులు అరేబియా సముద్ర తీర అందాలను చూడటంవరకైతే బాగుంటుంది కానీ ఈతకి అంత అనువైన స్థలం కాదు. ఒంటె మీద కూర్చొని సవారీలు చేయవచ్చు మరియు తినుబండారాలను సైతం ఆరగించవచ్చు.
గుజరాత్ రాష్ట్రంలో ఎక్కువగా సందర్శించే తీర ప్రాంతం అహ్మద్పూర్ మాండ్వీ సాగర తీరం. ఇది గుజరాత్ మరియు కేంద్రపాలిత ప్రాంతం డయ్యు కలిసే ప్రదేశంలో ఉన్నది. డాల్ఫీన్ వీక్షణలకి, జల క్రీడలకీ ఈ ప్రాంతం సురక్షితం.
సోమనాథ్ లో త్రివేణీ సంగమంగా ప్రసిద్ధిచెందిన హిరణ్, సరస్వతి, కపిల నదులు సముద్రంలో కలిసే తీరు మనోహరంగా ఉంటుంది. ఇక్కడ సూర్యోదయం, సూర్యాస్తమం సన్నివేశాలు అద్భుతంగా ఉంటాయి.
విమాన మార్గం
సోమనాథ్ కి 90 కి.మీ. దూరంలో ఉన్న డయ్యు విమానాశ్రయం సమీప విమానాశ్రయం. ఈ విమానాశ్రయం ముంబై విమానాశ్రయంచే అనుసంధానించబడింది. డయ్యు నుండి క్యాబ్, ఇతర రవాణా సాధనాలను ఉపయోగించి చేరుకోవచ్చు.
రైలు మార్గం
సోమనాథ్ కి 5 కి.మీ. దూరంలో ఉన్న వేరవాల్ వద్ద రైల్వే స్టేషన్ ఉన్నది. వేరవాల్ నుండి ముంబై వరకు రైళ్లు అనుసంధానించడం జరిగింది. ముంబై నుండి దేశంలోని అన్ని నగరాలకు, పట్టణాలకు ప్రయాణించవచ్చు.
రోడ్డు మార్గం
సోమనాథ్ కు రోడ్డు వ్యవస్థ బాగానే ఉంది. డయ్యు నుండి మరియు దగ్గరలోని ఇతర ప్రాంతాల నుండి బస్సులు అందుబాటులో ఉన్నాయి. ప్రవేట్ మరియు ప్రభుత్వ రవాణా సాధనాల మీద సోమనాథ్ కు చేరుకోవచ్చు.
0 Response to "Somnath Jytorilinga Temple In Gujarat."
Post a Comment