Salary Hike: Alert to Government Employees Salaries to be increased soon?
Salary Hike: ప్రభుత్వ ఉద్యోగులకు అలర్ట్. త్వరలో భారీగా పెరగనున్న జీతాలు?
ప్రభుత్వ ఉద్యోగులు శాలరీ హైక్ న్యూస్ కోసం ఎదురు చూస్తున్నారు. చాలా కాలంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘాలు 8వ వేతన సంఘం (8th Pay Commission) ఏర్పాటు కోసం డిమాండ్ చేస్తున్నాయి.
2025 ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టనున్న 2025-26 బడ్జెట్‌లో 8వ వేతన సంఘం ప్రకటిస్తారని భావిస్తున్నారు. అదే జరిగితే 1.2 కోట్లకు పైగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతం, పదవీ విరమణ పొందినవారి పెన్షన్ భారీగా పెరిగే అవకాశాలు ఉన్నాయి.
* 8వ వేతన సంఘం అంటే ఏంటి?
భారత ప్రభుత్వం ఉద్యోగుల జీతాలు, అలవెన్సులు, పెన్షన్లను అంచనా వేయడానికి లేదా సవరించడానికి ప్రతి 10 సంవత్సరాలకు ఒక కొత్త పే కమిషన్‌ను ఏర్పాటు చేస్తుంది. మొదటి వేతన సంఘం 1946లో ఏర్పాటైంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏడు వేతన సంఘాలు ఏర్పాటయ్యాయి. ఈ కమిషన్ సిఫార్సులు అనేక ఆర్థిక సూచికలు ముఖ్యంగా ద్రవ్యోల్బణంపై ఆధారపడి ఉంటాయి. 2014 ఫిబ్రవరిలో ఏర్పాటైన 7వ వేతన సంఘం సిఫార్సులు 2016 జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చాయి. 2014లో ఏర్పాటైన 7వ వేతన సంఘం సిఫార్సుల మేరకు 2016లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు 23% పెరిగాయి.
ఈ సిఫార్సుల అమలు కాలం 2025 డిసెంబర్ 31తో ముగుస్తుంది. అంటే కొత్త 8వ వేతన సంఘం ఏర్పాటుకు సమయం ఆసన్నమైంది. దీని సిఫార్సులు 2026 జనవరిలో అమల్లోకి రావచ్చు. మెరుగైన వేతనం, ప్రయోజనాలకు సంబంధించిన తమ డిమాండ్లను పరిష్కరించడానికి ప్రభుత్వం రాబోయే బడ్జెట్‌లో 8వ వేతన సంఘాన్ని ప్రకటిస్తుందని ఉద్యోగులు, పెన్షనర్లు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు
ఉద్యోగ సంఘాల డిమాండ్లు
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో జరిగిన ప్రీ-బడ్జెట్ సమావేశంలో, పది కేంద్ర కార్మిక సంఘాలు, భారతీయ మజ్దూర్ సంఘ్ వంటివి 8వ వేతన సంఘం ఆలస్యం చేయకుండా ఏర్పాటు చేయాలని కోరాయి. వారి డిమాండ్ నెరవేరితే దాదాపు 50 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 67 లక్షల మంది పదవీ విరమణ పొందిన వారికి ప్రయోజనం చేకూరుతుంది.
* జీతం ఎంత పెరిగే అవకాశం ఉంది?
ప్రతిపాదిత 8వ వేతన సంఘం ఏర్పడితే ప్రధానంగా ఉద్యోగుల జీతం 186% పెరిగే అవకాశం ఉంది. ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌ను 2.57 నుంచి 2.86కి పెంచితే, ప్రస్తుతం ఉన్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల మినిమం బేసిక్ శాలరీ రూ.18,000 నుంచి రూ.51,480కి పెరుగుతుంది. ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ అనేది ఉద్యోగుల బేసిక్ శాలరీ లెక్కించడానికి ఉపయోగించే మల్టిప్లైయర్. ఇది ద్రవ్యోల్బణం, జీవన వ్యయ మార్పులకు అనుగుణంగా జీతాలు ఉండేలా చూస్తుంది. ఎక్కువగా ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ ఉంటే జీతాలు భారీగా పెరుగుతాయి.
కొత్త వేతన సంఘం ఏర్పాటుకు సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. అయితే రాబోయే బడ్జెట్ సెషన్‌లో ప్రభుత్వం 8వ పే కమిషన్‌ను ప్రకటించవచ్చని నివేదికలు సూచిస్తున్నాయి. ఈ నిర్ణయం దేశవ్యాప్తంగా లక్షలాది మంది ఉద్యోగులకు ఆర్థిక ఉపశమనం కలిగిస్తుంది.
0 Response to "Salary Hike: Alert to Government Employees Salaries to be increased soon?"
Post a Comment