The 'WhatsApp administration' from today
WhatsApp: నేటి నుంచి 'వాట్సాప్ పరిపాలన'
- దేశంలోనే తొలిగా రాష్ట్రంలోనే అమలు
- దీని కోసం అధికారికంగా నంబర్ ఏర్పాటు
- దానిని ధ్రువీకరించేలా వెరిఫైడ్ ట్యాగ్
- తొలిదశలో అందుబాటులోకి 161 సేవలు
- భవిష్యత్‌లో మరిన్ని ప్రభుత్వ సేవలకు విస్తరణ
- వాట్సాప్ ద్వారా పలు రకాల సర్టిఫికెట్లు జారీ
- ప్రభుత్వ సమాచారం కూడా చేరవేత
- ఆర్టీజీఎస్ సమీక్షలో సీఎం చంద్రబాబు వెల్లడి
ఉదయం లేచిన వెంటనే ఫోన్ చూడనిదే మనకు రోజు మొదలవ్వదు. వాట్సా్‌పలో ఎన్ని మెసేజ్‌లున్నాయో చూస్తాం. స్టేటస్ ఏం పెట్టాలో అని ఆలోచిస్తాం. స్మార్ట్‌ఫోన్ వినియోగించే వారందరి దైనందిన జీవితంలో వాట్సాప్ కూడా ఓ భాగమైపోయింది. అలాంటి మాధ్యమాన్ని వినియోగించుకుంటూ ప్రజలకు సులువుగా, సౌకర్యవంతంగా సేవలు అందించాలని రాష్ట్ర ప్రభుత్వం వినూత్న ఆలోచన చేసింది. పాలనలో సరికొత్త ఆవిష్కారానికి శ్రీకారం చుడుతూ వాట్సాప్ పాలనను గురువారం నుంచి అందుబాటులోకి తెస్తోంది. దీని ద్వారా తొలి దశలో 161 ప్రభుత్వ సేవలు అందించనున్నారు. వెలగపూడి సచివాలయంలో బుధవారం రియల్ టైమ్ గవర్నెన్స్‌పై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్, ఐటీ శాఖ కార్యదర్శి కాటమనేని భాస్కర్, ఆర్టీజీఎస్ సీఈవో దినేశ్‌కుమార్ తదితరులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. దేశంలోనే మొదటిసారిగా మన రాష్ట్రంలో వాట్సాప్ పాలనను అమలు చేస్తున్నామని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వెల్లడించారు. దీనిని మానవ వనరులు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖల మంత్రి నారా లోకేశ్ గురువారం అధికారికంగా ప్రారంభిస్తారని తెలిపారు. వాట్సాప్ ద్వారా పౌరులకు సేవలు అందించడంతో పాటు ప్రభుత్వ సమాచారం కూడా చేరవేస్తామని సీఎం చెప్పారు. ఈ సేవల కోసం ప్రభుత్వం అధికారికంగా వాట్సాప్ నంబరును ప్రజలకు అందుబాటులో ఉంచుతుందని తెలిపారు ఆ నంబరుకు వెరిఫైడ్ ట్యాగ్ (టిక్ మార్క్) కూడా ఉంటుందన్నారు. ఈ నంబరు వన్‌స్టా్‌ప సెంటర్‌లా పనిచేస్తుందని అన్నారు. తొలి దశలో 161 సేవలు అందుబాటులోనికి వస్తాయని, క్రమేపీ ఈ సేవలు పెరుగుతాయని వెల్లడించారు. భవిష్యత్తులో ప్రభుత్వ సేవలు విస్తరిస్తూ.. పాలనలో మరింత సౌలభ్యాన్ని తీసుకువస్తామని చంద్రబాబు చెప్పారు.
మెటాతో ఒప్పందం
కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా వినతిపత్రాలు పట్టుకు తిరిగినా ఫలితం ఉండటంలేదంటూ ప్రజల్లో అసహనం పెరుగుతోంది. ముఖ్యంగా రెవెన్యూ, మునిసిపల్, ఎండోమెంట్ సర్వీసులలో ఎదురయ్యే ఇబ్బందులతో ప్రజలు విసుగెత్తిపోతున్నారు. ఇప్పటికే పలు ప్రభుత్వ సేవలు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్నా వాటిని మెజారిటీ ప్రజలు నేరుగా వినియోగించుకోలేక పోతున్నారు. గతంలో ఆర్టీజీఎస్ సర్వేలో ప్రభుత్వ శాఖల సేవలపై ప్రజల్లో ఉన్న అసంతృప్తి వెల్లడైంది. ఇది గుర్తించిన ప్రభుత్వం నేరుగా ప్రజల ఫోన్ ద్వారానే సమస్యలు పరిష్కరించుకునే మార్గాన్ని గుర్తించింది. వాట్సాప్ ద్వారా సేవలు అందించాలని నిర్ణయించింది. దీని కోసం గతేడాది అక్టోబరు 22న వాట్సాప్ మాతృసంస్థ 'మెటా'తో ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందాన్ని కుదుర్చుకోవడంలో మంత్రి లోకేశ్ కీలకపాత్రను పోషించారు. ప్రజల నుంచి వచ్చే వినతులను వెంటనే సంబంధిత కార్యాలయాల అధిపతులకు వాట్సాప్ చేరుస్తుంది. దాని స్టేటస్ ఏమిటో కూడా అర్జీదారులకు తెలియజేస్తుంది. దీనివల్ల రోజుల కొద్దీ ఫైళ్లు బూజుపట్టే పరిస్థితి లేకుండా వెనువెంటనే సమస్యలు పరిష్కారమవుతాయి. వాట్సప్ ద్వారా సేవలందిస్తే పాలనపై చాలా వరకు సంతృప్తి వస్తుందని ప్రభుత్వం భావిస్తోంది.
ప్రభుత్వ పథకాల అమలుపైనా..
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలపైనా ప్రజలు వాట్సాప్ ద్వారా ఫీడ్‌బ్యాక్ ఇవ్వవచ్చు. అర్హులైనవారికి పథకాలు అందకపోయినా ఫిర్యాదులు చేయవచ్చు. పథకాల లబ్ధి సమాచారం మెసేజ్ చేసి తెలుసుకోవచ్చు. ప్రాంతాల వారీగా జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాల సమాచారాన్ని పౌరులకు ఎప్పటికప్పుడు వాట్సాప్ ద్వారా పంపుతారు. అలాగే ప్రజలకు కావాల్సిన సర్టిఫికెట్లను కూడా వాట్సాప్ ద్వారా అందించనున్నారు.
టూరిజం, విద్యుత్ బిల్లులు, పన్నుల చెల్లింపు కూడా
రాష్ట్రంలోని పర్యాటక ప్రదేశాల సమాచారాన్ని వాట్సాప్ ద్వారా తెలుసుకుని అక్కడి టికెట్లు, వసతి సహా అన్ని సౌకర్యాలూ బుక్ చేసుకోవచ్చు. ఇక విద్యుత్తు బిల్లులు, ఆస్తి పన్నులను అధికారిక వాట్సాప్ నంబర్ ద్వారా చెల్లించవచ్చు. ట్రేడ్ లైసెన్సులు పొందవచ్చు. దేవాలయాల్లో దర్శనాల కోసం స్లాట్‌లను బుక్ చేసుకోవచ్చు. విరాళాలు పంపవచ్చు. రెవెన్యూ శాఖకు సంబంధించి ల్యాండ్ రికార్డులు, వివిధ సర్టిఫికెట్లు పొందవచ్చు. ఇలా తొలి దశలో 161 సేవలు అందుబాటులోకి వస్తాయి. ఇక భూ రికార్డులు, ధ్రువీకరణ పత్రాల సమస్యలపై అధికారిక వాట్సాప్ నంబరు ద్వారా ఫిర్యాదు చేస్తే సత్వర పరిష్కారం లభిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. మునిసిపల్ శాఖకు సంబంధించి ఆస్తిపన్ను చెల్లింపులు, ట్రేడ్ లైసెన్సులు వంటివి ఆన్‌లైన్‌లోనే అందుబాటులో ఉన్నాయి. వాటిలోనూ ఎదురవుతున్న సాంకేతిక సమస్యలకు వాట్సాప్ పాలన పరిష్కారాన్ని చూపుతుందని ప్రభుత్వం విశ్వసిస్తోంది.
సమాచారం సులువుగా ప్రజలకు
ముఖ్యమైన సమాచారాన్ని వాట్సాప్ ద్వారా ప్రభుత్వం ప్రజలకు చేరవేస్తుంది. వాతావరణ పరిస్థితులు, భారీ వర్షాలు, వరదలు, పిడుగులు పడే అవకాశం, అధిక ఎండవేడి వంటి వాటి సమాచారాన్ని వాట్సాప్ సందేశాల ద్వారా ప్రజలకు వేగంగా చేరుస్తుంది. విద్యాసంస్థలు ముందస్తుగా జాగ్రత్త చర్యలు తీసుకునేందుకు వీలుగా వాట్సాప్ సందేశాలను పంపుతుంది. విద్యుత్తు సరఫరాలో అంతరాయం ఉంటే కూడా ఆ ప్రాంత వినియోగదారులకు సమాచారం చేరవేస్తారు. ఏదైనా ప్రాంతంలో అంటు వ్యాధులు ప్రబలుతుంటే ఆ ప్రాంత ప్రజలకు ముందస్తు హెచ్చరికలు జారీ చేస్తారు. అలాగే ఆ వ్యాధుల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తపై సూచనలు కూడా పంపుతారు.
వినతుల స్వీకరణ కూడా..
ప్రజల నుంచి వాట్సాప్‌ద్వారా ప్రభుత్వం వినతులు స్వీకరిస్తుంది. అధికారికంగా ప్రకటించిన వాట్సాప్ నంబరుకు మెసేజ్ చేస్తే.. వారికి ఒక లింక్ వస్తుంది. అందులో సంబంధిత వ్యక్తి పేరు, చిరునామా, ఫోన్ నంబరు ఎంటర్ చేసి వినతి ఏమిటో మెసేజ్ చేస్తే దానిని గుర్తిస్తూ ఒక రిఫరెన్సు నంబరు వస్తుంది. దాని ఆధారంగా ఆ వినతి ఎంత వరకూ పరిశీలన పూర్తయిందో.. ఎవరి పరిశీలనలో ఉందో.. ఎప్పుడు పరిష్కారమవుతుందో మెసేజ్ వస్తుంది. సమస్య పరిష్కారమఅయ్యాక కూడా దరఖాస్తుదారుకు ఆ సమాచారం చేరుతుంది. మురుగు కాలువలు, పారిశుద్ధ్యం, రోడ్ల గుంతలు, వీధి దీపాలు, వాతావరణ కాలుష్యం తదితర అంశాలపై వాట్సా్‌పలో ఫిర్యాదులు చేయవచ్చు.
0 Response to "The 'WhatsApp administration' from today"
Post a Comment