Maha Kumbh 2025
Maha Kumbh 2025: ముగిసిన మహా వేడుక... పెట్టిన ఖర్చు ఎంత? వచ్చిన ఆదాయం ఎంత?
Things to know about Maha Kumbh 2025: మహా కుంభమేళా ముగిసింది. జనవరి 13న మకర సంక్రాంతితో మొదలైన మహా కుంభమేళా ఉత్సవాలు ఫిబ్రవరి 26న మహా శివరాత్రితో పూర్తయ్యాయి.
ప్రతీ రోజు సగటున 1 కోటి 19 లక్షల మంది భక్తులు త్రివేణి సంగమంలో స్నానం చేసినట్లు రికార్డ్స్ చెబుతున్నాయి. గత 45 రోజుల పాటు జరిగిన ఈ వేడుకల్లో మొత్తం సుమారు 66 కోట్ల మంది భక్తులు పాల్గొన్నట్లు యూపీ సర్కారు లెక్కలు చెబుతున్నాయి.
ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, వ్యాపార ప్రముఖులు ముకేష్ అంబానీ, గౌతం అదానీ, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్.. ఇలా చెప్పుకుంటూపోతే మహా కుంభమేళాలో స్నానం చేసిన ప్రముఖుల జాబితా చాలా పెద్దదే ఉంది.
కుంభమేళాలో మెరిసిన సినీ తారలు
సినీ ప్రముఖులు కూడా త్రివేణి సంగమంలో స్నానాలు చేసి మహా కుంభమేళాపై తమకున్న భక్తి భావాన్ని చాటుకున్నారు. అక్షయ్ కుమార్, కత్రినా కైఫ్, హేమా మాలిని, అనుపమ్ ఖేర్, రాజ్ కుమార్ రావ్, తమన్నా, అదా శర్మ ఇక్కడ పుణ్య స్నానాలు చేశారు. అంతేకాదు.. రెమొ డిసౌజ, ప్రీతి జింటా, జుహీ చావ్లా నుండి టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ వరకు అనేక మంది సినీ ప్రముఖులు మహా కుంభమేళాలో సందడి చేశారు.
అమెరికా నుండి యాపిల్ సహ వ్యవస్థాపకుడు స్టీవ్ జాబ్స్ భార్య లారెన్స్ పావెల్ కూడా మహా కుంభమేళాకు వచ్చారు. ఇలా దేశ, విదేశాల నుండి ఎంతోమంది మహా కుంభమేళాకు రావడంతో ఇదొక ఇంటర్నేషనల్ ఈవెంట్ అయిపోయింది.
2024 లోక్ సభ ఎన్నికల్లో ఓటింగ్ కంటే ఎక్కువ
2024 లోక్ సభ ఎన్నికల్లో ఓటేసిన జనం కంటే మహా కుంభమేళాకు వచ్చిన జనం సంఖ్యనే ఎక్కువగా ఉంది. లోక్ సభ ఎన్నికల కోసం 97 కోట్ల 97 లక్షల 51 వేల 847 మంది ఓటు హక్కు కోసం నమోదు చేసుకున్నారు. వారిలో 64 కోట్ల 64 లక్షల మంది మాత్రమే ఓటు హక్కు వినియోగించుకున్నారు. కానీ మహా కుంభమేళాకు మాత్రం ఫిబ్రవరి 25న రాత్రి 8 గంటల సమయానికే 64 కోట్ల 60 లక్షల మంది స్నానాలు ఆచరించారు. ఫిబ్రవరి 26న మహా కుంభమేళా ముగిసే సమయానికి ఆ సంఖ్య మరో కోటికి పైనే దాటింది.
పెట్టిన ఖర్చు, వచ్చిన ఆదాయం
మహా కుంభమేళా కోసం ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం 7,500 కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేళాకు కనీసం 45 కోట్ల మంది భక్తులు వస్తారని యూపీ సర్కార్ అంచనా వేసింది. తద్వారా రూ. 2 లక్షల కోట్ల ఆదాయం వస్తుందని యూపీ సర్కారు ఆశించింది.
అయితే, యూపీ సర్కారు ఆశించిన దానికన్నా మరో 20 కోట్ల మంది భక్తులు ఎక్కువే వచ్చారు. దీంతో తమ రాష్ట్ర ఆదాయం కూడా 3 లక్షల కోట్లు దాటే అవకాశం ఉందని భావిస్తున్నట్లు తాజాగా యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ అన్నారు. యూపీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా మాట్లాడుతూ యోగి ఈ వ్యాఖ్యలు చేశారు.
రెండు పెద్ద విషాదాలు
జనవరి 29న సాయంత్రం మహా కుంభమేళాలో తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ తొక్కిసలాటలో 30 మంది వరకు చనిపోగా మరో 60 మందికిపైగా భక్తులు గాయపడ్డారు. ఫిబ్రవరి 15న న్యూ ఢిల్లీ రైల్వే స్టేషన్ లో ప్రయాగ్ రాజ్ వచ్చే రైళ్లు నిలిచే ప్లాట్ ఫామ్ పై తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో 18 మంది ప్రాణాలు కోల్పోయారు. పదుల సంఖ్యలో జనం గాయపడ్డారు.
ఇవే కాకుండా మహా కుంభమేళాకు వచ్చిపోయే క్రమంలోనూ రెండు మూడు రోడ్డు ప్రమాదాలు జరిగాయి. మధ్యప్రదేశ్‌లో ఫిబ్రవరి 11న అలా జరిగిన ఒక రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్‌కు చెందిన చెందిన ఏడుగురు భక్తులు చనిపోయారు.
ఆసక్తికరమైన విషయాలు
ప్రపంచంలోనే అతిపెద్ద మతపరమైన సమ్మేళనంగా మహా కుంభమేళా రికార్డుకెక్కింది.
2013 నాటి మహా కుంభమేళాకు 10 కోట్ల మంది జనం వస్తే ఈ కుంభమేళాకు దానికి 60 కోట్లకుపైగా భక్తులు వచ్చారు.
ప్రయాగ్ రాజ్ వచ్చే భక్తుల రద్దీని తట్టుకునేందుకు కొత్తగా 14 ఫ్లైఓవర్ బ్రిడ్జిలు, 7 బస్ స్టేషన్స్, 12 కిమీ పొడవున తాత్కాలిక ఘాట్లు నిర్మించారు.
మహా కుంభమేళాలో ఎప్పటికప్పుడు భద్రతను సమీక్షించడం కోసం 2700 పైగా ఏఐ కెమెరాలను ఇన్‌స్టాల్ చేశారు.
మొత్తం 37 వేల మందికిపైగా పోలీసులు, ఇతర భద్రతా బలగాలు 24 గంటలపాటు త్రివేణి సంగమాన్ని డేగ కళ్లతో గస్తీ కాస్తున్నాయి.
భక్తుల సౌకర్యం కోసం లక్షన్నర తాత్కాలిక టెంట్స్ ఏర్పాటు చేశారు. మరో లక్షన్నర టాయిలెట్స్ కూడా నిర్మించారు.
15,000 మంది పారిశుద్ధ్య కార్మికులు 24 గంటల పాటు త్రివేణి సంగమం పరిసరాలను క్లీన్ చేయడంలో నిమగ్నమయ్యారు.
డిజిటల్ స్నానం
కాదేదీ కవితకు అనర్హం అన్నట్లు మహా కుంభమేళాపై భక్తులకు ఉన్న విశ్వాసాన్ని సొమ్ము చేసుకునేందుకు కొత్త కొత్త కాన్సెప్ట్స్ పుట్టుకొచ్చాయి. అందులో డిజిటల్ స్నానం కూడా ఒకటి. కుంభమేళాకు స్వయంగా రాలేకపోయిన వారు వారి ఫోటోను వాట్సాప్ చేస్తే 24 గంటల్లో ఆ ఫోటోకు త్రివేణి సంగమంలో డిజిటల్ స్నానం చేయిస్తామంటూ కొంతమంది సోషల్ మీడియాలో ప్రకటనలు ఇచ్చారు. అందుకోసం 500 రూపాయల నుండి 1100 రూపాయల వరకు చార్జ్ చేశారు.
ఫోన్‌ను నీళ్లలో ముంచిన మహిళ
ఈ డిజిటల్ స్నానం ఒకెత్తయితే... ఒక మహిళ ఏకంగా తన ఫోన్‌ను కూడా నీళ్లలో ముంచి సోషల్ మీడియాలో వైరల్ అయ్యారు. భర్తకు వీడియో కాల్ చేసి తన ఫోన్‌ను నీళ్లలో ముంచడం ద్వారా ఆయనకు కూడా పుణ్య స్నానం అయిపోయిందని ఆ మహిళ భావించడం కుంభమేళాకు క్రేజ్ ఏ రేంజులో ఉందో చెబుతోంది.
ఐఐటి బాబా అభయ్ సింగ్
మహా కుంభమేళా ఆరంభంలోనే త్రివేణి సంగమంలో స్నానం చేసిన అభయ్ సింగ్ వార్తల్లో వ్యక్తిగా నిలిచారు. ఐఐటిలో చదువుకుని, ఏరోస్పేస్ ఇంజనీర్ గా పనిచేసిన అభయ్ సింగ్ ఆ తరువాత ఆ ఉద్యోగాన్ని వదిలేసి బాబా అవతారమెత్తారు. మహా కుంభమేళాలో ఐఐటి బాబా అంటూ ఆయన ఫోటోలు, వీడియోలు కూడా వైరల్ అయ్యాయి.
మళ్లీ 144 ఏళ్లకు మరో మహా కుంభమేళా
కుంభమేళా ప్రతీ 1 ఏళ్లకు ఒకసారి జరుగుతుంది. అలా ప్రతి 12 కుంభమేళాలకు ఒకసారి 144 ఏళ్లకు మహా కుంభమేళా జరుగుతుంది. ఈ సంప్రదాయంలో ఎలాంటి మార్పులు లేకుండా ఇలాగే కొనసాగితే, 2025 తరువాత మళ్లీ 2169 లో మరో మహా కుంభమేళా జరగనుంది.
0 Response to "Maha Kumbh 2025"
Post a Comment