How to determine the Varalakshmi Vratam?
వరలక్ష్మీ వ్రతం ఎలా నిర్ణయిస్తారు ?
వరలక్ష్మీ వ్రతం పూర్ణిమ ముందు శుక్రవారం చేసుకోవాలన్నది సంప్రదాయం కనుక ఆగస్టు 1, శుక్రవారం చేసుకోవాలా ? లేక 08.08.25 శుక్రవారం చేసుకోవాలా ? అన్న సందేహం చాలామందికి కలుగుతోంది. దానికి పరిష్కారం చాలామంది పంచాంగ కర్తలు ఆగష్ట్ 8వ తేదీని పూర్ణిమ అయినా ఆవేళే చేసుకోవాలని నిర్ణయించారు. అయినా మనకు గ్రంథ ప్రమాణమూ, సంప్రదాయ వేత్తల ఉపదేశ ప్రమాణమూ కావాలి కనుక బ్రహ్మశ్రీ "భారతాత్మ" గుల్లపల్లి సీతారామచంద్ర ఘనపాఠీ మహోదయ ప్రభృతులు ఈక్రింది ప్రమాణాన్ని సూచించారు. కావున 08.08.25 శుక్రవారం నాడే వరలక్ష్మీ వ్రతం చేసుకోవాలన్నది నిర్ణయం అవుతోంది.*
వ్రతనిర్ణయ కల్పవల్లి అన్న గ్రంథంలో
శ్రావణస్య సితేపక్షే పూర్ణిమోపాంత భార్గవే
వరలక్ష్మీ వ్రతం కార్యం మోక్షసంపత్ ఫలప్రదమ్
అని భవిష్యోత్తర పురాణోక్తిని ఉట్టంకిస్తూ చెప్పబడింది, కావున మంచి సంపదా, మోక్షమూ కలిగించే వరలక్ష్మీవ్రతం శ్రావణ మాస శుక్లపక్షంలోని పూర్ణిమకి దగ్గరగా ఉన్న శుక్రవారం నాడు చేసుకోవాలన్నదే నిర్ణయంగా చెప్పబడింది.
వివరణ వాక్యం
యది పూర్ణమాయామేవ భృగువార*
స్సంభవతి తస్మిన్నేవ దినే వరలక్ష్మీ వ్రతం కార్యమ్
అని వివరణ కూడా వ్రతకల్పవల్లీ గ్రంథంలో చెప్పబడింది. అనగా ఒకవేళ పూర్ణిమ రోజునే శుక్రవారం వస్తే ఏంచెయ్యాలి ? అన్నప్రశ్న వస్తే ఆరోజే వరలక్ష్మీ వ్రతం చేసుకోవాలి అని అర్థం.
పూర్ణిమోపాంత భార్గవే ఇత్యస్య అర్థః.
పూర్ణిమా + ఉపాంత భార్గవే = పూర్ణిమకి అతి సమీపంలో ఉన్న శుక్రవారంనాడు వ్రతం చేసుకోవాలి. అనగా ఆగష్టు 1 కాక ఆగష్టు 8నే వ్రతం చేసుకోవాలి.
ధూళిపాళ మహాదేవమణి
గమనిక :- 8 వతేదీ ఆటంకం కలుగుతుంది అనుకొనే వారూ, అధికస్య అధికం ఫలమ్ అని భావించేవారూ 01.08.25 శుక్రవారం కూడా వ్రతం చేసుకోవచ్చు.
మరో సిద్ధాంతం కూడా చూడగలరు
శ్రీ రస్తు శుభమస్తు అవిఘ్నమస్తు
శ్రీ గురుభ్యోనమః
వరలక్ష్మీ వ్రత నిర్ణయము భవిష్యోత్తర పురాణాంతర్గత వరలక్ష్మీ వ్రతకల్పమున శ్రీ పార్వతీ పరమేశ్వర సంవాద రూపమున
(1) శుక్లే శ్రావణికే మాసే పూర్ణిమోపాంత్య భార్గవే..
(2) నభోమాసే పూర్ణిమాయాం
నాతి క్రాంతే భృగోర్దినే... అనియు భవిష్యత్ పురాణమున
(3) శ్రావణ స్య సితేపక్షే పూర్ణిమోపాంత భార్గవే
వరలక్ష్మీ వ్రతం కార్యం మోక్ష సంపత్ఫల ప్రదం
అను ప్రమాణముల రీత్యా శ్రావణ పూర్ణిమకు ముందు శుక్రవారం నాడు వ్రతం ఆచరించవలెను. పూర్ణిమ రోజునే శుక్రవారం వచ్చినట్లైతే
(4) యస్మిన్ వై శ్రావణే మాసి శుక్లాంతేతు భృగోర్దినే
ప్రారభ్య తద్ర్వతం తత్ర వరలక్ష్మ్యా యతాత్మభిః
అని కౌముదీ శాస్త్ర గ్రంధమున చెప్పబడిన విధముగా శుక్రవారం పూర్ణిమ వచ్చిన ఆరోజే వ్రతం ఆచరించవలెను కానీ ముందు శుక్రవారం చేయరాదు.*
పూర్ణిమ నాడు పూర్ణిమకు ముందు రోజులలో సంపూర్ణముగా చంద్రబలము ఉండును. చంద్రుడు మనఃకారకుడు మరియు లక్ష్మీసోదరుడగుటచే వాని దృగ్బలముండునని భావం.
0 Response to "How to determine the Varalakshmi Vratam?"
Post a Comment