Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Bank sanctions ... are deposits safe?

బ్యాంకుపై ఆంక్షలు... డిపాజిట్‌లు భద్రమేనా..?
ఇటీవలే పీఎంసీ బ్యాంకుపై ఆర్‌బీఐ ఆంక్షలు
ఒక ఖాతా నుంచి పరిమితంగా నగదు ఉపసంహరణ
ఆరు నెలల పాటు ఇదే పరిస్థితి
ఈ తరహా సందర్భాలపై అవగాహన తక్కువే
బ్యాంకు దివాలా తీస్తేనే డిపాజిట్‌పై బీమా
ఒక్కో కస్టమర్‌కు గరిష్టంగా రూ.లక్ష
తగిన జాగ్రత్తలతోనే ఖాతాదారులకు రక్షణ
Bank sanctions ... are deposits safe?

బ్యాంకుల్లో మన నగదు భద్రంగా ఉంటుందన్న భరోసాయే... వడ్డీ రాబడి తక్కువైనా కానీ ఇప్పటికీ చాలా మంది ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌లు చేయడానికి కారణం. కావాలనుకున్నప్పుడు ఏ ఇబ్బంది లేకుండా డిపాజిట్‌ను వెనక్కి తీసుకోవచ్చు. లిక్విడిటీ విషయంలో ఎటువంటి ఢోకా ఉండదు. ఈ వెసులుబాట్లే ఎఫ్‌డీల ఆదరణకు కారణమని చెప్పొచ్చు. కానీ, బ్యాంకు సంక్షోభంలో పడితే, మీ డిపాజిట్‌ పరిస్థితి ఏంటి..? మీ ఇష్టానికి అనుగుణంగా దానిని వెంటనే వెనక్కి తీసుకోలేరు.! బ్యాంకు పరిస్థితులు చక్కబడిన తర్వాతే తీసుకునేందుకు అనుమతిస్తామంటే..? తలచుకుంటేనే భయమేస్తోంది కదూ..! డిపాజిట్‌దారులకు ఉన్న రక్షణ కవచం ఏంటి? ఆర్‌బీఐకి ఉన్న అధికారాలు, పరిమితులు... ఇలాంటి వివరాలన్నీ మీ కోసం...

తాజాగా ముంబైకి చెందిన పంజాబ్‌ అండ్‌ మహారాష్ట్ర  కోఆపరేటివ్‌ బ్యాంకు(పీఎంసీ)లో అవకతవకల గురించి వార్తల్లో చూసే ఉంటారు. మొండి బాకీలను ఈ బ్యాంకు తక్కువ చేసి చూపించింది. ఈ బ్యాంకు మొత్తం రుణ పోర్ట్‌ఫోలియో రూ.8,800 కోట్లలో రూ.6,500 కోట్లను ఒక్క హెచ్‌డీఐఎల్‌ ఖాతాకు ఇవ్వడమే కాదు... దాన్ని ఆర్‌బీఐకి తెలియకుండా దాచిపెట్టింది. దీంతో ఆర్‌బీఐ రంగంలోకి దిగి బ్యాంకుపై ఆరు నెలల పాటు ఆంక్షలు అమల్లో పెట్టింది. ఒక్కో ఖాతా నుంచి కేవలం రూ.1,000 మాత్రమే వెనక్కి తీసుకునేందుకు అనుమతించింది. రెండు రోజుల తర్వాత రూ.10,000కు పెం చింది.

వారం రోజుల తర్వాత తాజాగా రూ.25,000కు పెంచింది. దీంతో డిపాజిట్‌ దారుల్లో ఆందోళన పెరిగిపోయింది. బ్యాంకు శాఖల వద్దకు చేరుకుని తమ డిపాజిట్లు వెనక్కిచ్చేయాలంటూ వారు డిమాండ్‌ చేయడం కూడా చూశాం. ఈ తరహా సందర్భాలు ఎదురైతే ఏంటన్న విషయమై ఖాతాదారులు, డిపాజిట్‌ దారు ల్లో అవగాహన తక్కువే. రోజువారీ లావాదేవీలు నిర్వహించే వ్యాపారులు, స్వయం ఉపాధిలో ఉన్న వారికి ఈ తరహా పరిస్థితులు దిక్కుతోచనీయవు. కోఆపరేటివ్‌ బ్యాంకులతోపాటు వాణిజ్య బ్యాంకులపైనా ఆర్‌బీఐ ఈ విధమైన ఆంక్షలు విధించేందుకు అధికారాలు ఉంటాయి.

ఆర్‌బీఐ నిబంధనలు ఏం చెబుతున్నాయి?
ఆర్‌బీఐ నిబంధనల ప్రకారం.. అన్ని వాణిజ్య బ్యాంకులు, కోఆపరేటివ్‌ బ్యాంకులు డిపాజిట్‌ ఇన్సూరెన్స్‌ అండ్‌ క్రెడిట్‌ గ్యారంటీ కార్పొరేషన్‌ (డీఐసీజీసీ) బీమా కవరేజీ పరిధిలో ఉంటాయి. ప్రాథమిక సహకార సొసైటీలు మాత్రం దీని పరిధిలోకి రావు. ఆర్‌బీఐ నిబంధనల ప్రకారం అన్ని కోఆపరేటివ్‌ బ్యాంకులు, వాణిజ్య బ్యాంకులు తప్పనిసరిగా డీఐసీజీసీ కింద బీమా తీసుకోవాల్సి ఉంటుందని ‘మైమనీమంత్రా డాట్‌ ఇన్‌’ వ్యవస్థాపకుడు రాజ్‌ఖోస్లా తెలిపారు.

‘‘ప్రతీ డిపాజిట్‌ దారునికి గరిష్టంగా రూ. లక్ష బీమా ఉంటుంది. ఒకవేళ పీఎంసీ బ్యాంకు దివాలా తీస్తే అప్పుడు ఒక్కో డిపాజిట్‌ దారునికి గరిష్టంగా రూ.లక్ష లభిస్తుంది. సేవింగ్స్‌ బ్యాంకు ఖాతాదారులు తమ డిపాజిట్లు పొందేందుకు మాత్రం చాలా సమయం తీసుకుంటుంది’’ అని ఖోస్లా వివరించారు. అసలు డిపాజిట్, దానిపై వడ్డీ సహా మొత్తం రూ.లక్ష పరిహారమే డీఐసీజీసీ ద్వారా లభిస్తుంది. పైగా ఒక్కో ఖాతాదారునికి సేవింగ్స్‌ బ్యాంకు డిపాజిట్లు, ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు ఇలా పలు రూపాల్లో ఉన్నా కానీ దక్కే పరిహారం గరిష్టంగా రూ.లక్ష మాత్రమే.

ఏ తరహా డిపాజిట్లకు రక్షణ?

సేవింగ్స్, ఫిక్స్‌డ్, కరెంటు, రికరింగ్‌ డిపాజిట్లు అన్నీ కూడా డీఐసీజీసీ పరిధిలో బీమా కవరేజీ కిందకు వస్తాయి. కాకపోతే విదేశీ ప్రభుత్వాల డిపాజిట్లు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల డిపాజిట్లు, ఇంటర్‌బ్యాంక్‌ డిపాజిట్లు, విదేశాల నుంచి స్వీకరించిన డిపాజిట్లు డీఐసీజీసీ పరిధిలోకి రావు. ఒకే బ్యాంకుకు సంబంధించి ఒకటికి మించిన శాఖల్లో ఒకే వ్యక్తికి వేర్వేరు డిపాజిట్లు ఉంటే..? అప్పుడు కూడా గరిష్టంగా రూ.లక్ష వరకే డీఐసీజీసీ కింద దక్కుతుంది. అదే వివిధ బ్యాంకుల్లో ఒకే వ్యక్తికి డిపాజిట్లు ఉంటే మాత్రం అప్పుడు ప్రతీ బ్యాంకులోని డిపాజిట్లపై గరిష్టంగా రూ.లక్ష పొందొచ్చు. ఉదాహరణకు ఎస్‌బీఐలో, పీఎన్‌బీలో ఒక వ్యక్తికి డిపాజిట్లు ఉంటే, అప్పుడు రెండు బ్యాంకుల్లోనూ బీమా కవరేజీ కింద గరిష్టంగా ఒక్కో రూ.లక్ష చొప్పున లభిస్తుంది.

ఉమ్మడి ఖాతాలు అయితే...

ఒక్కరి పేరు మీద (సింగిల్‌) లేదా ఉమ్మడి ఖాతాల (జాయింట్‌) విషయంలో కవరేజీ వేర్వేరుగా ఉంటుంది. ఉదాహరణకు రవికి తన పేరుతో ఒక సేవింగ్స్‌ ఖాతా ఉంది. అలాగే, భార్య పేరుతోనూ రవికి జాయింట్‌ ఖాతా ఉందనుకోండి. బ్యాంకు దివాలా తీస్తే అప్పుడు డీఐసీజీసీ కింద రెండు ఖాతాలకూ బీమా కవరేజీ ఉంటుంది.

సిప్‌లు, ఈసీఎస్‌ల పరిస్థితి..?

బ్యాంకు సంక్షోభంలో పడి ఆర్‌బీఐ ఆంక్షలు అమల్లోకి వస్తే... అప్పటికే మీ ఖాతా నుంచి రిజిస్టర్‌ అయి ఉన్న ఈసీఎస్‌లు, సిప్‌లు ఆగిపోయినట్టే. వాటికి సంబంధించిన మొత్తాలను మీ ఖాతా నుంచి డెబిట్‌ కావని రాజ్‌ఖోస్లా తెలిపారు. కనుక మీరు మరో ఖాతా నుంచి సిప్, ఈఎంఐలకు సంబంధించి ఈసీఎస్‌ ఇన్‌స్ట్రక్షన్‌ ఇవ్వాల్సిన అవసరం ఏర్పడుతుంది.

ముందు జాగ్రత్తలే కాపాడతాయి...

పీఎంసీ బ్యాంకు అనుభవం నేపథ్యంలో ఇన్వెస్టర్లు ఒక విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంది. సాధారణంగా వాణిజ్య బ్యాంకులతో పోలిస్తే కోపరేటివ్‌ బ్యాంకులు అధిక వడ్డీని ఆఫర్‌ చేస్తుంటాయి. అంటే రిస్క్‌ కొంచెం ఎక్కువే ఉంటుందని అర్థం చేసుకోవాలి. వీటిని ఆర్‌బీఐతోపాటు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పర్యవేక్షిస్తుంటాయి. ‘‘కోఆపరేటివ్‌ బ్యాంకులతో పోలిస్తే ప్రభుత్వరంగ, ప్రైవేటు బ్యాంకుల విషయంలో నిబంధనల పరంగా ఆర్‌బీఐ మరింత కఠినంగా వ్యవహరిస్తుంటుంది. పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకులో మోసం వెలుగులోకి వచ్చినప్పుడు ఆర్‌బీఐ కఠినంగానే వ్యవహరించింది. కనుక వ్యక్తులు ఒకే బ్యాంకులో ఎక్కువ మొత్తం డిపాజిట్‌ చేయకుండా జాగ్రత్త తీసుకోవాలి.

లేదంటే ఆర్‌బీఐ ఆంక్షలతో నిధులు పొందలేని పరిస్థితి ఎదురవుతుంది’’అని ఖోస్లా సూచించారు. బ్యాంకు కస్టమర్లు తమ బ్యాంకుల ఆరోగ్య పరిస్థితులపై ఒక కన్నేసి ఉంచడం ఎంతో అవసరమని తాజా పరిస్థితులు తెలియజేస్తున్నాయి. ముఖ్యంగా కోపరేటివ్‌ బ్యాంకు కస్టమర్లు అయితే ఇది ఇంకా అవసరం. బ్యాంకుకు సంబంధించి ఆస్తులపై రాబడులు (ఆర్‌వోఏ), నికర ఎన్‌పీఏల రేషియోను గమనించడం ద్వారా ఆ బ్యాంకు ఆర్థిక పరిస్థితిని తెలుసుకోవచ్చు. ముఖ్యంగా సామాన్యులు అయినా కానీ, వ్యాపారులు అయినా కానీ ఒకే ఖాతాపై ఆధారపడకుండా, వేర్వేరు బ్యాంకుల్లో కనీసం రెండు ఖాతాల పరిధిలో తమ డిపాజిట్లను వేరు చేసుకోవడం ద్వారా ఈ తరహా సంక్షోభ పరిస్థితుల్లో ఇబ్బంది పడకుండా చూసుకోవచ్చు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Bank sanctions ... are deposits safe?"

Post a comment