Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

World Mental Health Day


నేడు ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం

చదువుకు సంబంధించిన ఒత్తిళ్లు భరించలేక విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్న ఉదంతాలు తరచూ వెలుగుచూస్తున్నాయి. ఇంజినీరింగ్‌, వైద్యవిద్యార్థులు సైతం బలవన్మరణాలకు పాల్పడుతున్న ఘటనలు విద్యారంగంలోని లోపాలకు దృష్టాంతాలుగా నిలుస్తున్నాయి. గత డిసెంబరులో రాజస్థాన్‌లోని కోట నగరంలో నాలుగురోజుల వ్యవధిలో ముగ్గురు విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడటం సంచలనమైంది.

ఉసురు తీస్తున్న ఒత్తిడి

దేశంలో ప్రతి గంటకు సగటున ఓ విద్యార్థి ఆత్మహత్య నమోదవుతున్నట్లు జాతీయ నేర గణాంకాలు చాటుతున్నాయి.  మార్కులు, ర్యాంకుల సాధనలో తల్లిదండ్రులు తమపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోలేమన్న భావన విద్యార్థుల్లో విపరీతమైన మానసిక ఒత్తిడికి కారణమవుతోందని నిపుణులు చెబుతున్నారు. ఉద్యోగ సాధనలో వైఫల్యభయమూ కొందరిని ఆత్మహత్య వంటి తీవ్ర నిర్ణయం వైపు నడిపిస్తున్నాయనీ అంటున్నారు. జనాభాపరంగా చైనా తరవాత ద్వితీయ స్థానంలో ఉన్నప్పటికీ, 15-29 వయోపరిమితి యువత ఆత్మహత్యల విషయంలో భారత్‌దే అగ్రస్థానం కావడం విచారకరం. మహిళల ఆత్మహత్యల విషయంలో ప్రపంచంలో మూడోస్థానంలో ఉంది.

బాధాకరమవుతున్న బాల్యం

చదువుల్లో అంతో ఇంతో ఒత్తిడి సహజమే అయినా స్థామర్థ్యానికి  మించిన అంచనాలు పిల్లల్లో మానసిక సమస్యలకు కారణమవుతున్నాయి. ఐఐటీ వంటి ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల్లో సీటు తెచ్చుకోవడానికి ఆరో తరగతి నుంచే ప్రత్యేక శిక్షణ పేరిట పిల్లలపై అదనపు భారం మోపుతున్న దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. రోజంతా చదువుకు సంబంధించిన ప్రణాళికల మధ్యే ఉండటం వారిలో కుంగుబాటుకు కారణమవుతోంది. అనేక  విద్యాసంస్థలు అసాధారణంగా 14 గంటలపాటు పిల్లల్ని చదువులతో కట్టేస్తున్నాయి. విశ్రాంతి తీసుకోవాల్సిన ఆదివారాల్లోనూ పరీక్షలు రాయిస్తున్నారు. ఒకటి రెండు రోజులు సెలవులు ఇచ్చినా ఒత్తిళ్ల మధ్యే ఉండాల్సి వస్తుంది. ఈ పోరులో వెనకబాటు వల్ల తల్లిదండ్రులతో ఆహ్లాదకరంగా గడపలేని బాధాకరమైన పరిస్థితుల్లో అనేకమంది విద్యార్థులు కుమిలిపోతున్నారు. విద్యాసంస్థల్లో కుల దుర్విచక్షణ సైతం పలు సందర్భాల్లో విద్యార్థుల మనోవేదనకు కారణమవుతున్నట్లు తెలుస్తోంది. దాదాపు పుష్కర కాలం క్రితం దిల్లీలోని ఆలిండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెన్స్‌ (ఎయిమ్స్‌)లో వైద్య విద్యార్థుల ఆత్మహత్యల దరిమిలా ఏర్పాటైన థొరాట్‌ కమిటీ ముందు కొందరు ఇదే చేదు నిజాన్ని బయటపెట్టారు. అప్పటి నుంచి పరిస్థితుల్లో పెద్దగా మార్పు రాకపోవడమే అసలైన విషాదం.

ఆత్మహత్యలు

దేశంలో నమోదవుతున్న ప్రతి పది మంది విద్యార్థుల ఆత్మహత్యల్లో- నాలుగు తీవ్రమైన ఒత్తిడి, కుంగుబాటు కారణంగానే నమోదవుతున్నాయని ‘సెంటర్‌ ఫర్‌ స్టడీ అండ్‌ డెవలపింగ్‌ సొసైటీస్‌’ సర్వే బయటపెట్టింది. తమలోని నిరాశను అణచిపెట్టుకోవడం కన్నా బయటకు చెప్పుకోవడమే సరైన పద్ధతి అని యువతకు ప్రధాని మోదీ పిలుపిచ్చారు. భారతీయ  విద్యావిధానం పోటీ వాతావరణాన్ని విపరీతంగా పెంచుతోంది. ప్రతిష్ఠాత్మక విద్యాలయాల్లో ప్రవేశాలు పొందలేనప్పుడు అదొక వైఫల్యంగా ముద్ర వేస్తున్న జాడ్యం సమాజంలో ప్రబలింది. వాస్తవానికి ఆయా పరీక్షల్లో రాణించి ఐఐటీ, ఎయిమ్స్‌ వంటి సంస్థల్లో చేరిన విద్యార్థులు సైతం ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. అందువల్ల సమస్యకు అసలు మూలం ఎక్కడ ఉందో కనిపెట్టాల్సిన అవసరముంది.

నియామకాల్లో అధిక వేతనాలు,

విశ్వవిద్యాలయాల ప్రాంగణ నియామకాల్లో అధిక వేతనాలు, విద్యాసంస్థల ఆధిపత్యం వంటి పెడపోకడలపై నిషేధాలను ప్రభుత్వం విధించాలి. తక్కువ వేతనాలు పొందినవారు న్యూనత భావానికి లోనయ్యేలా ఈ ప్రచారాలు సాగుతున్నాయి. ప్రైవేటు రంగంలో ఉద్యోగాల కల్పనలో ఇప్పుడిస్తున్న ప్రాధాన్యతలపై పునరాలోచించాల్సిందిగా ప్రభుత్వం ఆయా సంస్థలకు సూచించాలి. ఎందుకంటే తమకు వచ్చిన తక్కువ గ్రేడ్ల వల్ల ఎందరో యువకులు ఉద్యోగాలు మారాలంటే వీలు పడటంలేదు. సంస్థలు గ్రేడ్లకు ఇస్తున్న ప్రాధాన్యతే అందుకు కారణం. గ్రేడ్ల ఆధారంగా ఉద్యోగాలివ్వడం, గతంలో పని చేసిన సంస్థల్లో జీతాల ఆధారంగా ఉపాధి కల్పించడాన్ని అమెరికాలోని కొన్ని రాష్ట్రాలు నేరంగా పరిగణిస్తాయి. విద్యార్థి ప్రతిభనే ఎంపికకు ప్రాతిపదికగా గుర్తించాలి. దీనివల్ల అభ్యర్థుల్లో ఆందోళన తగ్గుతుంది. దేశంలో ప్రస్తుతం నిరుద్యోగిత విస్తరిస్తోందని గణాంకాలు చెబుతున్నాయి. యువతలో ఇది మానసిక దౌర్బల్యానికి దారితీయకుండా ప్రభుత్వం మేలుకోవాలి. జాతీయ నమూనా సర్వే ప్రకారం ప్రస్తుతం దేశంలో  నిరుద్యోగిత రేటు 6.1 శాతం. గత 45 ఏళ్లలో ఇదే గరిష్ఠం.

పోటీ

దీన్ని ప్రభుత్వం అధికారికంగా ధ్రువీకరించకపోయినా, అధిక సంఖ్యలో యువ జనాభాగల దేశంలో ఇదొక విపరిణామం. విద్యారంగంలో తీవ్రమైన పోటీ, ఉద్యోగ విపణిలో అనిశ్చితి వల్ల ఆత్మహత్యలు పెచ్చరిల్లడానికి కారణమవుతాయన్న నిపుణుల హెచ్చరికలు జాతికి పమాద ఘంటికలు. ఉన్నత విద్యావ్యవస్థలో డొల్లతనం కారణంగా ఉద్యోగాలకు తగిన నైపుణ్యాలను  అందుకోలేకపోతున్న పరిస్థితి యువత కుంగుబాటుకు దారితీస్తోంది. అభ్యసన, ఆసక్తుల పరంగా విద్యార్థుల సహజ సామర్థ్యాలను అంచనావేసి అందుకు అనుగుణంగా వారిని ప్రోత్సహించి తీర్చిదిద్దే పరిస్థితి లేకపోవడం విద్యావ్యవస్థలోని పెద్దలోపం. విద్యాసంస్థలు, పిల్లల తల్లిదండ్రులు ఈ అంశానికి ప్రాధాన్యం ఇవ్వాలి.

ఆరంభం నుంచే అవగాహన

జీవితంలో ఎదురయ్యే ఒడుదొడుకులను సమర్థంగా ఎదుర్కొనేలా పిల్లలకు చిరుప్రాయం నుంచే తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు తగిన అవగాహన కల్పించడం ఎంతో అవసరం. ముఖ్యంగా పది, ఇంటర్‌ పరీక్షల వేళ విద్యార్థుల్లో మానసిక స్థైర్యం నింపాలి. పరీక్ష ఒక్కటే జీవితానికి పరమావధి కాదన్న సత్యాన్ని వారికి తెలియపరచాలి. మార్కులు, గ్రేడ్లు జీవిత పథాన్ని నిర్ణయించేవి కావన్న అంశంపై అవగాహన కలిగించడం అవసరం. మార్కుల సాధనకన్నా విషయ అవగాహన కీలకమన్న సంగతిని విద్యార్థులు, తల్లిదండ్రులు అర్థం చేసుకోవాలి. చదువుల పరంగా విద్యార్థులు ఎదుర్కొంటున్న ఒత్తిళ్లను ఉపాధ్యాయులు, అధ్యాపకులూ గ్రహించాలి. బోధనకు సంబంధించిన అంశాల్లో ఎప్పటికప్పుడు వారు రాటుతేలుతూ ఉండాలి. వారి వైఫల్యాలు విద్యార్థుల పాలిట శాపం కారాదు.  దురదృష్టవశాత్తూ అధ్యాపకులకు ఎలాంటి గ్రేడింగ్‌ లేకపోవడంతో వారి లోపాలు బయటపడటంలేదు. ప్రతి విద్యార్థి తన సహజ సామర్థ్యాలపై అవగాహన పెంచుకోవాలి. ఏ రంగంలో తాను రాణించగలనో తెలుసుకుని, వాటిపట్ల అనురక్తి పెంచుకోవాలి. ఈ విషయంలో తల్లిదండ్రులు,
ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకం. ఎవరి ఆసక్తులు, ఒత్తిళ్లకు ఇందులో తావు ఉండకూడదు. అప్పుడే విద్యార్థి మానసిక వికాసంతో నిర్ణయాలు తీసుకోగలుగుతాడు. చదువుల సారాన్ని గ్రహిస్తూ జయాపజయాలకు అతీతంగా ముందుకు సాగిపోగలడు. వైఫల్యాలను దీటుగా ఎదుర్కొనే శక్తి సామర్థ్యాలను సమకూర్చుకోగలడు. దేశ విద్యావిధానంలో ఈ దిశగా సత్వరం మార్పులు రావాలి!

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "World Mental Health Day"

Post a comment