Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

mother breastfeed her baby if she is infected with karona?

కరోనా సోకితే తల్లి బిడ్డకు పాలివ్వచ్చా? నిపుణులేమంటున్నారు?
mother breastfeed her baby if she is infected with karona?

కరోనా మహమ్మారి విజృంభిస్తోన్న ఈ సమయంలో తల్లులు కాబోతున్న వారికి, కొత్తగా తల్లులైన వారికి తమ బిడ్డల ఆరోగ్యం, వారికి అందించే చనుబాల విషయంలో ఇలాంటి ఎన్నో సందేహాలు తలెత్తుతున్నాయి. ఒకవేళ ప్రస్తుత ప్రతికూల పరిస్థితుల్లో తల్లికి లేదా బిడ్డకు వైరస్‌ సోకితే తల్లి పాలివ్వచ్చా? బిడ్డతో కలిసి ఒకే గదిలో ఉండచ్చా? బిడ్డను దగ్గరగా తీసుకొని గుండెలకు హత్తుకోవచ్చా?.. ఇలాంటి ఎన్నో ప్రశ్నలతో సతమతమైపోతోన్న తల్లులందరికీ పలు సూచనలు అందించారు ప్రముఖ గైనకాలజిస్ట్‌ డాక్టర్ సవితాదేవి.
 ‘ప్రపంచ తల్లిపాల వారోత్సవం’ (ఆగస్టు 1-7 వరకు) నేపథ్యంలో కరోనా సమయంలో తల్లిపాల ఆవశ్యకత, ఈ క్రమంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఆమె ఏమంటున్నారో తెలుసుకుందాం రండి..!

బిడ్డకు తల్లిపాలే అమృతం అన్న సంగతి మనందరికీ తెలిసిందే. అయితే కరోనా మహమ్మారి విజృంభిస్తోన్న ఈ సమయంలో వైరస్‌ తన చనుబాల నుంచి కానీ, తను దగ్గరగా తీసుకొని పాలిచ్చేటప్పుడు తుంపర్ల ద్వారా కానీ బిడ్డకు వ్యాపిస్తుందేమో అన్న అనుమానం వైరస్‌ పాజిటివ్‌ వచ్చిన ప్రతి తల్లికీ కలుగుతుంది. అయితే ప్రపంచ ఆరోగ్య సంస్థ, యునిసెఫ్‌, స్త్రీ-శిశు సంక్షేమ శాఖ.. జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం.. కొవిడ్-19 ఇన్ఫెక్షన్‌ తల్లికి ఉన్నా, బిడ్డకు ఉన్నా ఎట్టి పరిస్థితుల్లోనూ తల్లిపాలే బిడ్డకు శ్రేష్టం అని సూచించింది. అందుకని అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటూ తల్లి బిడ్డకు పాలివ్వడం అన్ని రకాలుగా శ్రేయస్కరం. అదేవిధంగా తల్లీబిడ్డలు ఒకే గదిలో ఉండడం, తల్లికీ-బిడ్డకు వీలైనంత స్కిన్‌ టు స్కిన్‌ టచ్‌ ఉండేలా చూసుకోవడం, కంగారూ కేర్‌ పద్ధతి పాటించడం అత్యంత ఆవశ్యకం. ఇక నెలలు నిండకుండా పుట్టిన పిల్లల విషయంలో ఈ ప్రక్రియలు ఎంతగానో దోహదం చేస్తాయి.

బిడ్డలకు మేలెంత?
తల్లిపాల వల్ల బిడ్డలకు ఎన్నో రకాల ప్రయోజనాలున్నాయి. బిడ్డ ఆరోగ్యంగా ఎదగడానికి, బిడ్డ రక్తంలో గ్లూకోజ్‌ స్థాయులు సమతులంగా ఉండడానికి, బిడ్డ శరీర ఉష్ణోగ్రత సక్రమంగా ఉండడానికి తల్లిపాలు ఎంతగానో దోహదం చేస్తాయి. కొవిడ్‌-19కి సంబంధించిన యాంటీబాడీస్‌ని తల్లిపాలల్లో గుర్తించారు. తద్వారా తల్లి అందించే చనుబాల ద్వారా బిడ్డల్లో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. అలాగే తల్లీబిడ్డల మధ్య అనుబంధం పెరగడం విషయంలోనూ చనుబాలది కీలక పాత్ర. ఎందుకంటే ఈ క్రమంలో తల్లి బిడ్డను దగ్గరగా తీసుకోవడమే అందుకు ప్రధాన కారణం. ఇలా తల్లి దగ్గర పాలు తాగిన పిల్లలు తల్లి పాలిచ్చినన్నాళ్లు మాత్రమే కాకుండా తర్వాత కూడా ఎక్కువ ఆరోగ్యంగా ఉంటారని, వారిలో ప్రవర్తనా లోపాలు తక్కువగా ఉంటాయని, అధిక తెలివితేటలు కలిగి ఉంటారని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇక తల్లిపాలు తాగని బిడ్డలు పుట్టిన కొద్ది రోజుల్లోనే మరణించే అవకాశం 14 రెట్లు ఎక్కువ అని గణాంకాలు తెలియజేస్తున్నాయి.
తల్లులకూ ఎన్నో ప్రయోజనాలు!
పాలివ్వడం వల్ల బిడ్డలకు మాత్రమే కాదు.. తల్లులకు కూడా ఎన్నో రకాల ప్రయోజనాలు చేకూరతాయి. బరువు తగ్గడానికి, టైప్‌-2 డయాబెటిస్‌ వంటి జబ్బులు రాకుండా ఉండడానికి, వక్షోజాల క్యాన్సర్లు, అండాశయ క్యాన్సర్లు వంటివి గణనీయంగా తగ్గడానికి పాలివ్వడం అనే ప్రక్రియ ఎంతగానో దోహదం చేస్తుంది. అయితే కరోనా పాజిటివ్‌ ఉన్న తల్లుల్లో ఈ వైరస్‌ చనుబాల ద్వారా బిడ్డకు చేరుతుందనేది మనకు కచ్చితమైన సమాచారమేమీ లేదు. కొన్ని అధ్యయనాల్లో వైరల్‌ RNA చనుబాలలో కనపడినా కూడా లైవ్‌ వైరస్‌ (బతికి ఉండి జబ్బు కలుగజేసే వైరస్‌) జాడ మాత్రం ఇంతవరకు తల్లిపాలల్లో కానరాలేదు.

పాలిచ్చేటప్పుడు ఈ జాగ్రత్తలు!
కరోనా పాజిటివ్‌ ఉన్న తల్లులు పిల్లలకు పాలిచ్చేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాల్సి ఉంటుంది.

  • తల్లి తప్పనిసరిగా మాస్క్‌ ధరించాలి.
  • చేతులు తరచుగా సబ్బు నీళ్లతో శుభ్రం చేసుకోవాలి.. లేదా ఆల్కహాల్‌ ఉన్న శానిటైజర్‌తో శుభ్రం చేసుకోవాలి.
  • బిడ్డను ముట్టుకునే ముందు, తర్వాత తల్లి చేతుల్ని శుభ్రం చేసుకోవడం చాలా ముఖ్యం.
  • తల్లి ముట్టుకున్న ఉపరితలాలన్నీ కూడా ఎప్పటికప్పుడు శానిటైజ్‌ చేయాలి.. లేదంటే బ్లీచ్‌తో శుభ్రం చేయాలి.
  • పాలిచ్చే ముందు మొదటిసారి చనుమొనలు, వక్షోజాలు శుభ్రపరిస్తే సరిపోతుంది. ఒకవేళ తల్లి దగ్గినప్పుడు తుంపరలు వక్షోజాల మీద పడితే తప్ప ప్రతిసారీ పాలిచ్చే ముందు వాటిని శుభ్రపరచుకోవాల్సిన అవసరం లేదు.?

తల్లుల్లో కొవిడ్‌ తీవ్రత ఎక్కువగా ఉంటే..!
కొవిడ్‌ తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు కాన్పు జరిగితే కనుక తల్లిని ఐసోలేషన్‌లో విడిగా ఉంచాల్సి వస్తుంది.. కాబట్టి ముందు వక్షోజాలను శుభ్రం చేసుకొని తర్వాత బ్రెస్ట్‌ పంప్‌ ద్వారా పాలను తీసి వాటిని బిడ్డకు పట్టించచ్చు. ఈ విధంగా పంప్‌ చేసి పట్టడం వల్ల బిడ్డకు సరైన పోషణ, చనుబాల వల్ల కలిగే ప్రయోజనాలన్నీ సమకూరుతాయి. అలాగే తల్లి తన ఆరోగ్యం మెరుగయ్యే వరకూ ఈ ప్రక్రియను పాటించడం వల్ల ఆమెలో పాలు నిలిచిపోకుండా జాగ్రత్తపడచ్చు. అయితే పంప్‌ చేసి బిడ్డకు పాలు పట్టే క్రమంలో ఆ పాలు పోసే సీసాలు, బ్రెస్ట్‌ పంప్‌లు, పాత్రలు.. వంటివన్నీ కూడా ఎప్పటికప్పుడు శుభ్రపరచాలి. వీటిని తిరిగి ఎవరూ తాకకుండా విడిగా, జాగ్రత్తగా పెట్టుకోవాలి.
కొవిడ్‌ ఉన్న చిన్నారుల్లో..!
కొవిడ్‌ వల్ల బిడ్డ అనారోగ్యంగా ఉన్నప్పుడు తల్లి పాలివ్వడం అనేది మరీ ముఖ్యం. ఎందుకంటే తల్లిపాలలో ఉండే యాంటీబాడీస్‌ బిడ్డకు వ్యాధినిరోధక శక్తిని పెంపొందించడం ద్వారా జబ్బును సమర్థంగా ఎదుర్కోవడానికి తోడ్పడతాయి.
ముఖ్యమైన సమాచారం
  • కొవిడ్‌ పాజిటివ్‌ ఉన్నంత మాత్రాన బిడ్డలకు పాలివ్వకూడదనుకోవడం కరక్ట్‌ కాదు.
  • ఇంత వరకు కరోనాతో మనకు ఎక్కువ అనుభవం లేకపోయినా ఇదే జాతికి చెందిన SARS, MERS వైరస్‌ల వల్ల మనకు ఎదురైన పూర్వానుభవం ఏం చెబుతుందంటే..
  •  తల్లి పాలివ్వడం వల్ల బిడ్డకు కొవిడ్ సోకే అవకాశం కంటే.. పాలు ఇవ్వకపోవడం వల్ల బిడ్డకు జరిగే హాని చాలా ఎక్కువ.
  •  ఒకవేళ బిడ్డకు ఇన్ఫెక్షన్‌ సోకినా అదంత ప్రమాదకరంగా ఏమీ పరిణమించట్లేదు.
  •  కాబట్టి తల్లులకు గానీ, పుట్టిన నవజాత శిశువులకు గానీ కొవిడ్‌ ఉన్నా కూడా తప్పనిసరిగా తల్లిపాలే ఇవ్వాలన్నది నిపుణుల అభిప్రాయం.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "mother breastfeed her baby if she is infected with karona?"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0