Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

A struggling school education experiment

బెడిసికొడుతున్న పాఠశాల విద్యా ప్రయోగాలు

A struggling school education experiment


బెడిసికొడుతున్న పాఠశాల విద్యా ప్రయోగాలు

 వి. బాల సుబ్రమణ్యం

పాఠశాలలు తెరిచి పది రోజులు కావస్తోంది.బడులు తెరిచీ తెరవక ముందే అమ్మ ఒడి సొమ్ము జమైంది. బడికొస్తున్న పిల్లలందరికీ విద్యా కానుక సంచి సిద్ధంగా ఉంది.నిజానికిదంతా చూచాక సీతాకోక చిలుకల్లా పిల్లలు రెక్కలు విప్పుకొని బడిలో వాలాల్సింది.బడి వేయి పూల తోటలా కన్నుల పండగ చెయ్యాల్సింది.కానీ జరుగుతున్నదేమిటి?

పదేళ్ళు కూడా నిండని పసివాళ్ళు ధర్నాలకు దిగుతున్నారు.వాళ్ళమ్మానాన్నలు బడులకు తాళాలు వేస్తున్నారు.పాఠశాల యాజమాన్య కమిటీలు 'బడి మూస్తే ఖబడ్దార్‌' అంటూ తీర్మానాలు చేస్తున్నాయి.టీచర్లు కన్నీళ్ళు గుక్కుకొంటున్నారు. కింది అధికార్లు బిక్క మొహం వేస్తున్నారు.పై అధికార్లు మాత్రం బింకం ప్రదర్శిస్తున్నారు. రెండు లక్షల మంది పిల్లల్ని వదులుకోలేక ఊరిబడులు ఉసూరుమంటున్నాయి.ఎప్పుడైనా ఎక్కడైనా ఇలా జరిగిందా?

ప్రాథమిక పాఠశాలల్ని రెండు ముక్కలు చేసి ఒక ముక్కను అంగన్‌వాడీల్లో,ఒకముక్కను హైస్కూళ్ళలో కలపాలన్న వితండ విధాన ఫలితమిది.మొండిగా, మొరటుగా,హడావుడిగా అమలు చేస్తున్న నూతన విద్యా విధాన పర్యవసానమిది.

నేల విడిచిన సాము

సర్కారు వారి ప్రణాళిక ప్రకారం 33,813 ప్రాథమిక పాఠశాలలు ముక్కలు కావాలి.మొత్తం 4158 ప్రాథమికోన్నత పాఠశాలలూ విలీనం కావాలి. దాదాపు 14 లక్షలమంది పసిపిల్లలు ఊరి బడి వదిలి హైస్కూళ్ళకు వెళ్ళిపోవాలి.7-8 లక్షల 1-2 తరగతుల పిల్లలు అంగన్‌వాడీల్లో అక్షరాభ్యాసం చెయ్యాలి. ఇక 6668 హైస్కూళ్ళు మాత్రమే నమ్మకంగా మిగలాలి.

రెండేళ్ళ నుంచి దీనికోసం చెయ్యని సర్వే,వెయ్యని లెక్కలు,పెట్టని మీటింగ్‌లు,ఇవ్వని సర్క్యులర్లు లేవు. అంతా ఆఘమేఘాల మీద జరిగిపోవాలని చెయ్యని హడావుడి లేదు.చివరకు జరిగిందేమిటి? గత సంవత్సరం రెండు వేల స్కూళ్ళను కాగితాలమీద మాత్రమే విలీనం చెయ్యగలిగారు.ఇప్పుడివి 5000 దాటితే అదే చాలునన్న దశకొచ్చారు.ఇదీ అమలయ్యేలా లేదు.'వసతులు లేకుంటే విలీనం చెయ్యం, జనం కాదంటే ఆ బడుల జోలికి వెళ్ళం' అంటూ కొత్త పల్లవి ఎత్తుకొన్నారు.బింకానికి మాత్రం 'కొత్త రూములు కడుతున్నాం.అవి పూర్తి కానీండి. అప్పుడంతా సర్దుకొంటుంది'' అంటున్నారు.కానీ కింద నుంచి సెగ మొదలు కావడంతో ఇదంతా కొరివితో తల గోక్కోవడమని వాపోతున్నారు

ఇక 1-2 తరగతులు మాత్రమే మిగిలిన పునాది పాఠశాలల స్థితి అగమ్యంగా మారింది.వాటిలో పట్టుమని పది మంది కూడా మిగలడం లేదు.అవి అనియత విద్యా కేంద్రాలకన్నా ఆధ్వానంగా మారుతున్నాయి.వాటిలో పిల్లల్ని చేర్చడానికే తల్లిదండ్రులు భయపడుతున్నారు.చిన్న చిన్న స్కూళ్ళలో చదువురాదని ఇంత రాద్ధాంతం చేసిన అధికార్లకు పది మంది కూడా లేని బడికి ప్రాణమే వుండదని తెలియదనుకొందామా?

నాడు-నేడు పేరుతో పాఠశాలలకు మంచి వసతులు కల్పించారు.చూడముచ్చటగా తీర్చిదిద్దారు. మిగతావీ అలా మారాలని పెద్ద డిమాండు వస్తోంది. ప్రభుత్వానికి దీనివల్ల మంచి పేరు వచ్చింది.అయితే ఇప్పుడు జరుగుతున్నదేమిటి? వీటి నుంచి పిల్లల్ని ఏ వసతులూ లేని హైస్కూళ్ళకు తరలిస్తున్నారు. ఎందుకింత ఖర్చు చేసినట్టు? ఎందుకు వీటిని పిల్లల్లేక బోసిపొయ్యేలా చేస్తున్నట్టు? ఇది ఊళ్ళో అతి సామాన్యులకు కూడా అర్ధం కావడం లేదు.

అసలుకే మోసం

కరోనా తెచ్చిన కష్టాలతో దేశమంతా ప్రైవేట్‌ స్కూళ్ళ నుంచి పిల్లలు ప్రభుత్వ పాఠశాలల బాటపట్టారు. దేశంలో 40 లక్షల పైగా పిల్లలు ఇలా బడులు మారారని యు-డైస్‌ చెబుతోంది.ప్రభుత్వ స్కూళ్ళ లోకి మారడమే గాదు బడా స్కూళ్ళ నుంచి బడ్జెట్‌ స్కూళ్ళకు కూడా ప్రైవేట్‌ రంగంలో పిల్లలు తరలి వెళ్ళారు.మన రాష్ట్రంలో 7 లక్షలకు పైగా సర్కారు స్కూళ్ళలోకి పిల్లలు అదనంగా వచ్చిన మాట వాస్తవం.ప్రభుత్వ విద్యార్ధులు 43 లక్షలకు పెరిగి 60 శాతం దాటడం చరిత్రలోనే మొదటిసారి.అమ్మ ఒడి, నాడు-నేడు వల్ల మన రాష్ట్రంలో ఈ పెరుగుదల కొంత ఎక్కువగా ఉండడాన్ని కూడా ఎవ్వరూ కాదనలేరు. 

కానీ సమస్య వీళ్ళని మన బడుల్లో నిలుపు కోవడ మెలా అనేది.దీనికి తగ్గట్టు వసతులు పెంచాలి. తగినంత మంది టీచర్లను నియమించాలి.ఒక నమ్మకం వాళ్ళకి కల్పించాలి.కానీ సర్కారు వద్ద ఈ ప్రణాళికేమీ లేదు.గత ఏడాదంతా సగానికి సగం ప్రాథమిక పాఠశాలలు ఏకోపాధ్యాయ పాఠశాలలు గానే నడిచాయి.హైస్కూళ్ళలో సబ్జెక్టు టీచర్లు లేరు.వేల పోస్టులు ఖాళీగా వుండటంతో అంతా బూడిదలో పోసిన పన్నీరైంది.

ఇప్పుడు 'తరలింపు' మొదలవ్వడంతో దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది.తమ బడి వుంటుందో లేదో, తాము వుంటామో వుండమో తెలియనప్పుడు టీచర్లు ఈ పిల్లలకు ఏ నమ్మకం కల్గించగలరు? నిర్బంధంగా టి.సి ఇమ్మన్న ఆదేశాలతో ఉపాధ్యాయులు కన్నీళ్ళు గుక్కుకొంటున్నారు.పూర్తి లెక్కలు ఇంకా రావాల్సి వుందిగానీ పిల్లలు ప్రైవేట్‌ బాట పట్టడం మాత్రం స్పష్టంగా కన్పిస్తోంది.మరి ప్రభుత్వం చివరకు ఏం సాధించినట్టు?

ఈసారి పదో తరగతి పరీక్షల్లో ప్రభుత్వ పాఠశాలల్లో ఉత్తీర్ణత బాగా పడిపోయింది.దీంతో నష్టపోయిందంతా పేద పిల్లలు.ప్రైవేట్‌ స్కూళ్ళ పిల్లలు తొంబై శాతం పాసయ్యారు.ఇలా ఎందుకు జరిగిదంటే 'మేం పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాం' అంటూ అధికార్లు బడాయికి పోతున్నారు.ఎంత మంది పేద పిల్లలు ఫెయిలయితే అంత బాగా పరీక్షలు ఒరిగినట్టా? అసలు సంగతి అదిగాదు. కరోనాలో వీళ్ళకు రెండేళ్ల చదువు పోయింది. 

బడికి బిక్కు బిక్కు వచ్చిన ఈ పిల్లల్ని చేరదీసిందెవరు? వీరికి తగట్టు ఏం బోధన జరిగింది? పరీక్షలకు వీళ్ళనేం సిద్ధం చెయ్యగలిగారు? బడిని ఎంత సన్నద్ధం చెయ్యగలిగాం? ఈ ప్రశ్నలకు జవాబు ల్లేవు.అసలు సబ్జెక్టు టీచర్లే లేరు.ఉన్నవారికి 'యాప్‌' లతో సరిపోయె.విద్యాశాఖకు నాడు-నేడు పనులు జరిగితే చాలు.అందంగా టాయిలెట్ల ఫోటోలు తీస్తే చాలు.పిల్లలకేమి చదువు వస్తోందో దానిని పట్టించు కొనే తీరికే లేదు.అవసరమూ లేదు.ఇదొక ఘోర వైఫల్యం.పదో తరగతి సంగతిలా వుంటే మిగిలిన తరగతుల పిల్లలెలా వున్నారు? కడుపు చించుకొంటే కాళ్ళ మీద పడుతుంది. ఇక పిల్లలు టి.సి ల బాట పట్టకేం చేస్తారు?

ఇక ఇంగ్లీషు మీడియం 'విప్లవం' హైకోర్టు తీర్పుతో ఆగిపోయినా ప్రభుత్వం ఈ మూడేళ్ళలో అడ్డదార్లు వెతుకుతూనే వుంది.దీనికోసం సిబిఎస్‌ఇ,బైజూస్‌లు తెరమీదికొచ్చాయి.ఇప్పుడు వున్నట్టుండి 6-8 తరగతుల తెలుగు మీడియం పిల్లల్ని బలవంతంగా ఇంగ్లీషు మీడియంలోకి మార్చేస్తున్నారు.ఎనిమిదేళ్ళు తెలుగు మీడియంలో చదివిన వాళ్ళు,కరోనాలో రెండేళ్ళ చదువు పోగొట్టుకొన్నవాళ్ళు ఒక్కసారి తొమ్మిదో తరగతిలో ఇంగ్లీషు మీడియంలోకి ఎలా వెళ్ళగలరు? వెళ్ళి ఏం చదవగలరు? ఆ పిల్లల ఇష్టాయిష్టాలతో,శక్తి సామర్ధ్యాలతో ఏ నిమిత్తం లేదు. ఇదెంత వికటిస్తుందో తొందర్లోనే తెలిసొస్తుంది.

సందట్లో సడేమియా అన్నట్టు ప్రైవేట్‌ యాజమాన్యాలు ఈ వైపరీత్యాన్ని సకలశక్తి యుక్తులూ వొడ్డి సొమ్ము చేసుకొంటున్నాయి.ప్రభుత్వ విద్యార్ధుల్ని వలేసి మరీ తన్నుకు పోతున్నాయి. సరిగ్గా జూన్‌ నెలలో అందిన ''అమ్మ ఒడి'' ప్రైవేట్‌ బడికి అప్పనంగా పెట్టుబడై పోయింది.

కొత్తగా 292 హైస్కూళ్లలో 11వ తరగతి ప్రారంభిస్తున్నామని ప్రభుత్వం వీలున్నంత లేటుగా ప్రకటించింది.బాలికల విద్య కోసమంటూ మండల కేంద్రాల్లోని జూనియర్‌ కళాశాలల నుంచి మగ పిల్లల్ని దూరంగా,కొత్త కాలేజీలకు తరలిస్తారట.చదువుతున్న కాలేజీ వదిలేసి 10-15 కి.మీ వీళ్ళు వెళ్ళాలి. ఇదెక్కడి చోద్యం.అసలు పిల్లల్ని ఎన్ని లక్షలమంది నైనా ఎక్కడి నుంచి ఎక్కడికైనా తరలించెయ్యాలను కోవడం ఎంత దుర్మార్గం? వాళ్ళ పాలిట ఇదెంత శాపం! విచిత్రంగా విద్యాశాఖకు ఈ బుల్‌డోజరు విధానం ఎలా వొంటబట్టిందోగానీ కింద మాత్రం దీన్ని అమలు చెయ్యడం కొండ మీదికి బండనెక్కిస్తున్న చందంగా మారింది.

టీచర్లపై యుద్ధం

పిల్లల్ని తరలించాక టీచర్లను తరలించక తప్పదు. స్కూళ్ళను కుదించాక ఉపాధ్యాయుల్ని తగ్గించకా తప్పదు.మొదటి నుంచీ విద్యా శాఖకు టీచర్లన్నా, వాళ్ళ సంఘాలన్నా మహా చిరాకు.పనిలో పనిగా వీళ్ళ భరతం పట్టడానికి కూడా ఈ సంస్కరణల్ని అది భేషుగ్గా వాడుకొంటోంది.దీనికి ఏడు సముద్రాల కవతలి శక్తి ఏదో సర్కారు వారికి దన్నుగా కూడా వుంది. 

ఒక లెక్కన కనీసం పాతిక వేల పోస్టులు ఖాళీగా వున్నాయి.వాటిని భర్తీ చెయ్యకుండానే ఈ మూడేళ్ళు స్కూళ్ళు నడిపిన ప్రభుత్వం ఈ 'అపారానుభవంతో' ఈ పోస్టులేగాదు మరో 10-15 వేల పోస్టులూ దండగ అనే తర్కాన్ని ముందుకు తెచ్చింది. దానికి తగ్గట్టు రేషనలైజేషన్‌ మొదలెట్టింది.

ఈ తర్కం ప్రకారం విద్యా హక్కుకు ఇక రాష్ట్రంలో చెల్లు చీటీ ఇవ్వబోతున్నారు.టీచర్ల పనిభారం ఎంత పెంచితే చదువులంత బాగుపడతాయంటున్నారు. అసలు హెడ్మాష్టర్లు,పిఇటీలూ ఎందుకంటున్నారు. ఇంకా విచిత్రం ఏమంటే ఓవైపు మూడవ తరగతి నుంచే సబ్జెక్టు టీచర్లుండాలంటున్న విద్యాశాఖ అప్పర్‌ ప్రైమరీల్లో మాత్రం ఎనిమిదో తరగతి దాకా సెకండరీ గ్రేడ్లు పాఠాలు చెపితే సరిపోతుందంటోంది.తరగతిని బట్టిగాదు పిల్లల సంఖ్యబట్టి ఏ స్థాయి టీచరు బోధించాలో నిర్ణయిస్తోంది! 

పునాది పాఠశాలల్ని 2008,1998 డిఎస్‌సి కాంట్రాక్టు టీచర్లకు అప్పగిస్తామంటున్నారు.ఇంకా దాని ఒరలో ఏ కత్తులున్నాయో త్వరలోనే తెలిసొస్తుంది గానీ దీనివల్ల ఒరిగేదేమిటి? ఏడు లక్షల మంది కొత్తగా పిల్లలు పెరిగితే దాదాపు 40 వేల టీచర్లను తగ్గించడం ఏ న్యాయానికి నిలబడుతుంది? అసలు టీచర్లు లేకుండా అంతా బైజూస్‌లతో సరిపెడితే పోతుందన్న మర్మమా ఇది? దీని పర్యవసానం కళ్ళ ముందే కన్పిస్తోంది.పిల్లల అభ్యసన ప్రమాణాలపై దీని ప్రభావం తీవ్రంగా పడుతోంది.

విద్యాశాఖే మొదట ముద్దాయి!

అమ్మ ఒడి,విద్యా కానుకా,గోరుముద్దా వీటన్నిటికంటే మించి నాడూ-నేడూ పాఠశాల విద్యారంగానికి కొత్త రూపాన్ని సంతరించి పెట్టాయి.రాష్ట్ర ప్రభుత్వ ఎజండాలో విద్యాశాఖ ప్రధానాంశంగా మారడం దీనికి మరింత తోడ్పడింది.కానీ దీన్నంతా అడవిగాసిన వెన్నెలగా మార్చిన ఘనత మాత్రం విద్యాశాఖకే దక్కుతుంది.ప్రభుత్వ రాజకీయంగా సైతం తీవ్ర నష్టం తేవడంలో విద్యాశాఖ చాలా గొప్ప పాత్ర పోషించింది. మొదటిది కనీస పారదర్శకతలేని దాని ఏకపక్షధోరణి. రెండోది పిల్లల చదువుల్ని గాలికొదిలేసి,బడిలో అసలు జరగాల్సిందేదో దాన్ని బుట్ట దాఖలు చెయ్యడం.ఇది పిల్లలకి తీవ్ర నష్టం తెచ్చింది.కరోనా దీనికి తోడైంది.పాపం పేద పిల్లలు అన్యాయమై పొయ్యారు.విద్యాశాఖ దీనికితగ్గట్టు కనీసం స్పందించ లేకపోయింది.అసలు దానికీ ధ్యాసే లేకపోయింది.

పోనీ బడులు తెరిచేప్పటికీ బదిలీలు,ప్రమోషన్లు పూర్తిచేసి టీచర్లను ఆయా స్కూళ్ళలోనైనా స్థిరంగా పెట్టగల్గిందా? అదీ లేదు.కనీసం మరో నెలపాటు ఇదే అనిశ్చితి కొనసాగుతుంది.బదిలీలకు రేషనలైజేషన్‌ తో ముడిపెట్టి,తాను ఎంచుకొన్న ఎజండా మేరకు ప్రతిదీ జరగాలన్న పట్టుదలతో కొత్త విద్యా సంవత్సరాన్ని ఆరంభంలోనే అస్తవ్యస్తం చేసింది విద్యాశాఖే.కింది అధికార్లని పరుగు లెత్తించడం తప్ప ఈ రెండు మూడేళ్ళు జరిగింది కూడా దాదాపు శూన్యం.


®️''ఇంత గొప్ప సంస్కరణల్లో ఇవన్నీ బాలారిష్టాలు. గోరంతల్ని మీరు కొండంతల్ని చేస్తున్నారు.తరగతి గదులు పూర్తి కానీండి.మరో మూడేళ్ళు ఆగండి. ఫలితాలు అప్పుడు కన్పిస్తాయి అనేది విద్యాశాఖ బడాయి.ఆ గదులేదో కట్టి,అన్ని హంగులూ కల్పించాకనే ఈ తరలింపులు మొదలెట్టి వుండొచ్చు గదా.ఢిల్లీ, కేరళలు సాధించిన గొప్ప విజయాలు మన ముందున్నాయి గదా అంటే దాన్నే మాత్రంఒప్పుకోరు. ఫలితమే ఈ గందరగోళం.ఇప్పుడీ వ్యవహారం జనం చేతుల్లోకి వెళ్ళిపోయింది.ఎప్పుడూ లేనట్టు బడి చుట్టూ సామాజిక సమీకరణ మొదలైంది.క్రమంగా ఇది రాజకీయ చర్యగా కూడా మారుతోంది. వాస్తవానికి ఎంతో గొప్పగా చెప్పుకోవలసిన ప్రభుత్వం ఆత్మరక్షణ లోకి వెళ్ళిపోయింది. ఇదీ ప్రస్తుతానికి విద్యారంగ సంస్కరణల ఫలితమూ పర్యవసానమూ.

వ్యాసకర్త : 

శ్రీ వి బాలసుబ్రహ్మణ్యం గారు

శాసన మండలిలో పిడిఎఫ్‌ పక్షనేత

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "A struggling school education experiment"

Post a Comment