Unable to recognize English letters
ఆంగ్ల అక్షరాలను గుర్తించలేకపోతున్నారు
- ఒకటో తరగతి స్థాయి వాక్యాన్ని 8వ తరగతి వారిలో17% మందే చదువుతున్నారు
- అసర్ నివేదిక-22ను విడుదల చేసిన ప్రథమ్ సంస్థ
‘క్యాట్, రెడ్, సన్, న్యూ, ఫ్యాన్, బస్’ ఇలాంటి ఆంగ్ల పదాలను మూడో తరగతి చదువుతున్న 24.3% మంది విద్యార్థులు చదవలేకపోతున్నారు. 11.6% మంది పెద్ద ఆంగ్ల అక్షరాలను గుర్తించలేకపోతున్నారు. 11.4% మంది క్యాపిటల్ ఆంగ్ల అక్షరాలు చదవగా.. చిన్న అక్షరాలను గుర్తు పట్టలేకపోతున్నారు’ అని అసర్ సర్వే నివేదిక-2022 వెల్లడించింది. రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లోని 194 ప్రాథమిక, 104 ప్రాథమికోన్నత పాఠశాలల్లో తెలుగు, ఆంగ్లం, గణితాల్లో విద్యార్థుల సామర్థ్యాలు, బడుల్లో సదుపాయాల పరిస్థితిని అంచనా వేసేందుకు ప్రథమ్ సంస్థ సర్వే నిర్వహించింది. ఈ నివేదికను బుధవారం విడుదల చేసింది. ప్రభుత్వ పాఠశాలల్లో ఐదో తరగతి చదువుతున్న విద్యార్థుల్లో ఆంగ్ల వాక్యాలను 35.8%, ప్రైవేటులో 61% మంది చదవగలిగారు. అంటే ప్రభుత్వ బడుల్లో 64.2%, ప్రైవేటులో 39% మంది చిన్న వాక్యాలను చదవలేకపోయారు. వీటిని ప్రభుత్వ పాఠశాలల్లో ఎనిమిదో తరగతి చదువుతున్న 65.5%, ప్రైవేటులో 82.8% మంది చదవగలిగారు. ప్రభుత్వ, ప్రైవేటు కలిపితే ఇది 69.8%గా ఉంది.
తెలుగు వాక్యం చదవడమే కష్టమవుతోంది
‘బాల బాలికలారా రారండి.. ఆటలు, పాటలు పాడండి.. పలకా, బలపం తీసుకొని రారండి.. అ ఆ ఇ ఈ రాయండి’ ఒకటో తరగతిలో ఉండే ఈ తెలుగు వాక్యాన్ని మూడోతరగతి చదువుతున్నవారిలో 16.6%, ఐదో తరగతికి చెందిన వారిలో 28%, ఎనిమిదో తరగతి చదువుతున్న వారిలో 17.7% మంది మాత్రమే చదవగలుగుతున్నారు. మూడో తరగతి చదువుతున్న పిల్లల్లో 12.6% మంది కనీసం తెలుగు అక్షరాలు చదవలేకపోతున్నారు. 24.3%మంది అక్షరాలను గుర్తించినా పదాలు చదవలేని పరిస్థితుల్లో ఉన్నారు. 36.2%మంది ఒకటో తరగతి స్థాయిలోని వచనం (టెక్స్ట్) చదవలేకపోతుండగా.. 16.6% మంది రెండో స్థాయిలోని వచనాన్ని చూసి చదవలేకపోయారు. మూడో తరగతిలోని 10.4% మంది చదవగలుగుతున్నారు. రెండో తరగతి చదువుతున్న వారిలో 21%, మూడో తరగతిలో 12.6%, ఐదో తరగతిలో 3.8%, ఎనిమిదో తరగతిలో 2.7% మంది కనీసం పదాలను గుర్తించలేకపోయారు.
రాష్ట్రంలో ప్రైవేటు ట్యూషన్లకు 17.9% మంది
రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న వారిలో 16.5%, ప్రైవేటులో చదివేవారిలో 21.2% మంది ప్రైవేటు ట్యూషన్లకు వెళ్తున్నారు. ఒకటో తరగతిలో ప్రైవేటు వారికంటే ప్రభుత్వ బడుల్లో చదువుతున్నవారే ఎక్కువగా ట్యూషన్లకు వెళ్తున్నారు.
తాగునీటి సదుపాయం లేని పాఠశాలలు 14.1% ఉండగా.. సదుపాయమున్నా నీరు లేనివి 20.3% ఉన్నాయి. మరుగుదొడ్ల సదుపాయం లేనివి 2.7% కాగా.. మరుగుదొడ్లు ఉపయోగంలో లేనివి 14.5% ఉన్నట్లు నివేదిక వెల్లడించింది. 4.8% బడుల్లో బాలికలకు ప్రత్యేకంగా మరుగుదొడ్లు లేవు. 3.8% పాఠశాలల్లో ప్రత్యేక సదుపాయమున్నా వాటికి తాళాలు వేసి పెడుతున్నారు. 10.6% నిరుపయోగంగా ఉన్నాయి. 19.6% బడుల్లో గ్రంథాలయాల సదుపాయం లేదు.
0 Response to "Unable to recognize English letters"
Post a Comment